రచనల్లో జీవించే ఉంటారు | Telugu Poet and Writer Indraganti Srikanth Sharma passed away | Sakshi
Sakshi News home page

రచనల్లో జీవించే ఉంటారు

Published Fri, Jul 26 2019 12:25 AM | Last Updated on Fri, Jul 26 2019 8:13 AM

Telugu Poet and Writer Indraganti Srikanth Sharma passed away - Sakshi

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

రొమాంటిక్‌ సాంగ్‌ రాయాలంటే మంచి వయసులో ఉండాలా? ఉంటేనే రాయగలుగుతారా? అలాంటిదేం లేదు. మనసులో భావాలు మెండుగా ఉండాలే కానీ ఏ వయసులోనైనా ప్రేమ పాటలు రాయొచ్చు. అందుకు ఉదాహరణగా నిలిచినవాళ్లల్లో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఒకరు. 74 ఏళ్ల వయసులో ఆయన కలం నుంచి ‘మనసైనదేదో..’ అనే ప్రేమ పాట కాగితం మీదకు వచ్చింది. ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలోనూ ‘సమ్మోహనం’ కోసం ఆయన ఈ పాట రాయడం విశేషం. ఇదే శ్రీకాంత శర్మ రాసిన చివరిపాట.

ఎన్నో అద్భుతమైన రచనలను మిగిల్చి, ఎప్పటికీ రచనల్లో గుర్తుండిపోయే ప్రముఖ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గురువారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీకాంత శర్మ తన స్వగృహంలోనే నిద్రలో కన్ను మూశారు. 1944, మే 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారాయన. శ్రీకాంతశర్మ తండ్రి ఇంద్రగంటి హనమచ్ఛాస్త్రి మహా పండితులు. తండ్రి బాటలోనే సాహిత్య రంగంపై తనదైన ముద్రవేశారు.

కవిత్వం, లలిత గీతం, చలన చిత్రం, యక్షగానం, కథ, నవల, నాటిక, వ్యాసం, పత్రికా రచన ఇలా బహు రూపాలుగా శ్రీకాంత శర్మ ప్రతిభ వికసించింది. జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన శ్రీకాంత శర్మ 1976లో ఆలిండియా రేడియో విజయవాడలో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా చేరారు. ఆ తర్వాత సినీ కవిగా మారారు. ‘కృష్ణావతారం’ సినీ రచయితగా ఆయన తొలి సినిమా. అలాగే జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నెలవంక, రావు – గోపాలరావు, రెండు జళ్ల సీత, పుత్తడి బొమ్మ వంటì సినిమాల్లో పాటలను రాశారు శ్రీకాంత శర్మ.

ఆయన సతీమణి ఇంద్రగంటి జానకీబాల ప్రముఖ రచయిత్రి. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈయన తనయుడే. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘గోల్కొండ హైస్కూల్, ‘అంతకుముందు ఆ తర్వాత’, సమ్మోహనం’ సినిమాల్లోనూ పాటలు రాశారాయన. ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరుతో తన ఆత్మకథను 2018లో విడుదల చేశారు. తన సాహిత్య జీవితం, కుటుంబ విశేషాలు, రచయితగా తన అనుభవాలు ఇందులో పొందుపరిచారు. శ్రీకాంత శర్మ మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

బంగారు పూలతో అభిషేకం చేశాను
– తనికెళ్ల భరణి
అనుభూతి కవిత్వం అనేది ఒక ప్రక్రియ. ‘అనుభూతి గీతాలు’ టైటిల్‌తో శ్రీకాంత శర్మగారు రాశారు. కవి, పండితుడు, సంస్కృతం బాగా చదువుకున్నవాడు. ఆయనది ఒక శకం. సాహిత్యంలో ఏ డౌట్‌ వచ్చినా ఆయన్నే అడిగేవాణ్ణి. ‘కవికి కనకాభిషేకం’ పేరుతో నేను ఆయనకు బంగారు పూలతో అభిషేకించుకునే అవకాశం లభించింది. 50 వేల రూపాయిల బంగారం పూలతోటి వారికి అభిషేకం చేయడం ఒక పండగ. అక్కినేని నాగేశ్వరరావు కూడా వచ్చారు. నా జీవితంలో అది బెస్ట్‌ మూమెంట్‌. మర్చిపోలేనిది. ఆయన అర్హుడు.

ఇవాళ ఉదయం (గురువారం) వాళ్ల ఇంటికి వెళ్లి నమస్కరించుకొని వచ్చాను. వాళ్ల కుటుంబమంతా పండితుల సమూహం. వాళ్ల తండ్రి, భార్య, కుమారుడు అందరూ సాహితీవేత్తలే. తెలుగు సాహిత్యం గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పగలరో సంస్కృత సాహిత్యం గురించీ అంతే గొప్పగా చెప్పగలరు. సంస్కృత కావ్యాలు కొన్ని తెలుగులోకి అనువదించారు. సంస్కృత కావ్యాల మీద నాకు ఆసక్తి కలగడానికి కారణం పరోక్షంగా ఆయనే. తెలుగు కావ్యాలనుంచి గొప్ప సాహిత్య సంపదను పరిచయం చేశారు. శ్రీకాంత శర్మగారు ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement