Indraganti Srikanth Sharma
-
సాహిత్య మరమరాలు
పూర్వం రచయితలు మరో రచయితకి తమ రచనల్ని కూర్చోపెట్టి మరీ వినిపించే ధోరణి బాగా చలామణిలో ఉండేది.ఒకసారి మల్లాది రామకృష్ణశాస్త్రి దగ్గరకొక కథా రచయిత బొత్తెడు కథలు పట్టుకువెళ్లి, తొలుత ఒకటి వినిపించాడు. శాస్త్రిగారు విన్నారు. రెండో రచన రచయిత తీయబోతుంటే మరి తట్టుకోలేక ఇలా అన్నారు: ‘‘మీరు వినిపించిన కథతో మనస్సు నిండిపోయింది. ఈ రోజుకీ అనుభూతి ఇలా మిగిలి పోనివ్వండి.’’ (సౌజన్యం: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సమాలోచన) -
పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం
‘నా వ్యక్తిగత విశ్వాసాలు– నేను నా పఠనం ద్వారా, అనుభవాల ద్వారా, తర్కించుకొని ఏర్పరచుకొన్నవి. ఈ ప్రపంచంలో సర్వవిశ్వాసాలకి, చర్యలకి, ‘వ్యక్తి’ కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు; సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం. అయితే– ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యమే’ అంటారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ(29 మే 1944 – 25 జూలై 2019). శ్రీకాంత శర్మ ప్రధానంగా కవి. అనుభూతి గీతాలు, సుపర్ణ, శిలామురళి, ఏకాంత కోకిల ఆయన కవితా సంపుటాలు. లలిత గీతాలు, యక్షగానాలు రాశారు. తూర్పున వాలిన సూర్యుడు, ఉపాసన, క్షణికం ఆయన నవలలు. కథలు, నాటకాలు, నాటికలు, సాహిత్య వ్యాసాలు, ఇట్లా అన్ని ప్రక్రియల్లోనూ కృషి చేశారు. ఆధునిక, ప్రాచీన సాహిత్యాల వారధి. పాత కావ్యాలకు నవలారూపం ఇచ్చారు. సినీ కవిగానూ పరిచితులే. పాత్రికేయుడిగానూ, ఆకాశవాణిలోనూ పనిచేశారు. ఆయన సాహిత్య సర్వస్వం 2014లో వెలువడింది. గతేడాది ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరుతో ఆత్మకథ వెలువరించారు. ఇంద్రగంటి వారిది సాహిత్య కుటుంబం. శ్రీకాంతశర్మ తండ్రి హనుమచ్ఛాస్త్రి, భార్య జానకీబాల ఇరువురూ రచయితలే. కొడుకు మోహనకృష్ణ సినిమా దర్శకుడు. కూతురు కిరణ్మయి డాక్యుమెంటరీ మేకర్. పై కథ ‘పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం’కు సంక్షిప్త రూపం. దీని ప్రచురణ 1967. మనుషులు కదులుతూ– మనుషుల ఆవేదనలూ, ఆనందాలూ, అశ్రువులూ, కడుపున భరిస్తూ, గబగబా మలుపులు తిరిగిపోయే రైలుబండి, మానవ ప్రకృతి అనే పెద్ద ‘గ్రంథం’ తాలూకు సంక్షిప్త సంకలనంలాగ కనిపిస్తుంది. సమాజంలో ఉన్న అంతస్తులూ, ఎడం ఎడంగా బతికే ఆ లక్షణం– పేలవమైన ఆలోచనా తత్వం, ఆ ప్రయాణంలో ఎంత స్పష్టంగా కనిపిస్తాయని! రాజమండ్రి స్టేషన్లో, హౌరా నుండి మద్రాసు పోయే ఎక్స్‌ప్రెస్ ఆగింది. హరగోపాల్ భీమవరం దాకా కలిసివస్తా– స్టేషన్లో చూడమని ఉత్తరం రాశాడు. కంపార్ట్మెంట్లోంచి బయటకు తొంగి చూశాను. కనిపించలేదు. లోపల ఊపిరి ఆడటం లేదు. అసలే థర్డ్ క్లాస్. అందులో వేసవి కాలం. రైలు గంట కొట్టారు. ఇంతలో గబగబా ఓ తెలుగురాని– ముతక ఖద్దరు చొక్కా, పిలకా, మీసాలు ఉన్న మనిషి(అంత క్రితం బండిలోంచి దిగినవాడే) లోపలికి జొరబడి, తువాలు గుడ్డతో మొహం తుడుచుకొంటున్నాడు. జామకాయలేవో తినివస్తున్నాడు లాగుంది. మీసాల మీద గింజలు అంటుకున్నాయి. అంత క్రితం తను భద్రపరచుకొన్న సీట్లో కూర్చున్నాడు. ఊపిరాడని ప్రపంచ జనాభా ఆందోళన అంతా మా కంపార్ట్మెంట్లో అవతరించిందేమో అనిపించింది. నేనూ చొరవ చేసి ఒక పైబెర్త్ సంపాదించాను. రెండ్రోజులుగా హరగోపాల్ వాళ్ల నాటకం రిహార్సల్స్‌కి వెళ్లడంతో నిద్ర చెడింది. గుబులు, చిరాకు వ్యక్తమయ్యే థర్డ్ క్లాస్ ప్రయాణం మధ్యతరగతి జీవితం లాగుంది. గోదావరి, కొవ్వూరు, నిడదవోలు... నిద్ర తోసుకొచ్చింది కళ్ల మీదికి. హరగోపాల్ నిడదవోలులో గాని కనిపిస్తాడేమోనని, బలవంతాన కళ్లు తెరిచి ప్రయత్నించాను దిగుదామని. పై నుంచి ఒక కాలు కిందికి పెట్టానో లేదో, అరడజను కంఠాలు ముక్తకంఠంగా విరుచుకు పడ్డాయి. నోరు మూసుకుని ఒరిగాను, న్యూస్ పేపరుతో విసురుకుంటూ. ఎప్పుడు పట్టిందో– హరగోపాల్ కేకేసేవరకూ మెలకువే రాలేదు. తమ నాటకంలో వేసే హీరోయిన్ డైలాగ్ డెలివరీ నచ్చక ఇంకొకామెని గుడివాడ నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో హరగోపాల్ భీమవరంలో ఒక మిత్రుని కలియడానికి దిగుతానన్నాడు నాతో ఉత్తరంలో. సర్దుకుని కిందికి దిగాను. ఎవరో ఒకతను. టక్ అప్ చేసుకున్నాడు. ఖరీదైన వేషం. కళ్ల గాగుల్స్ తీసేసి, చేత్తో షోగ్గా ఊపుతూ, చటుక్కున మా కంపార్ట్మెంట్లో జొరబడి, సుతారంగా విసుక్కుంటూ చరచరా వెళ్లిపోయాడు. ‘‘చూడండి ఎంత చలాకీగా ఉన్నాడో అతడు!’’ రైలు కదిలింది. తొందరగా లోపలి కెక్కాను. హరగోపాల్ వెళ్లిపోయాడు. హరగోపాల్‌ని ఇంప్రెస్ చేసినతను, నా బెర్త్ కింద సీట్లో కూర్చుని, పెర్సీ మేసన్ డిటిక్టెవ్ నవల చదువుతున్నాడు. బండి ఊపుకి మళ్లీ కళ్లు మూతలు పడుతున్నాయి. అతని గొంతు వినిపిస్తోంది. డిటెక్టివ్ లిటరేచర్ ఆపోశన పట్టినవాడికి మల్లే లెక్చర్ దంచుతున్నాడు. మనిషి చామనఛాయ. చురుకైన కంఠం. కొంచెం సేపు మాట్లాడి, వెనకవైపు వరసల్లో కూర్చున్న ఎవళ్లనో పలకరిస్తూ, అక్కడికి వెళ్లిపోఊయాడు. చీకటి కమ్ముకుంటోంది. రైలు గుడివాడకీ, బెజవాడకీ మధ్య ఉందన్నారు. ఉండి ఉండి, ఉత్తరాది మనిషి గొల్లుమన్నాడు తన భాషలో. ఏం జరిగిందని అంతా ఆతృతగా అడిగారు. కళ్లనీళ్లు కుక్కుకుంటూ, లాల్చీ జేబు చూపించాడు. మధ్యకి తెగిపోయి ఉంది. అతని చేతిలో మధ్యకి తెగిపోయిన ఏడెనిమిది రెండు రూపాయల నోట్లూ ఒక పది రూపాయల నోటూ ముక్కలున్నాయి. పాతిక రూపాయలు పనికిరాకుండా పోయాయి. అతను ఏ ఒరిస్సా ప్రాంతం వాడిలాగో ఉన్నాడు. సంజ్ఞల్ని బట్టీ కొద్దిగా అర్థం అయింది. కటక్ జిల్లాలో ఏదో పల్లెటూరు. తెనాలి పోవాలట. చుట్టాలు ఎవరికో జబ్బు చేసిందట. టిక్కెట్టుకు పోగా, పాతిక రూపాయలుంచుకున్నాడు జేబులో. బెజవాడ వరకూ మాత్రమే టిక్కెట్టు తీశాడు. అక్కణ్ణించి ఇంకా ఎవర్నో తీసుకుని తెనాలి వెళ్లాలట. తను అటూ ఇటూ దిగడంలో ఎవళ్లో జేబు కొయ్యడంతో– సగం నోటుముక్కలు ఆ కోసినవాడికీ, మిగతా సగం ఇతనికీ దక్కాయి. జాలిగా చూశాడు అందరికేసి. మోసం కాదనిపించింది నాకు. మోసం చేసి సంపాదిద్దామని అనుకున్నా పోయినవి పాతిక రూపాయలు. జాలి వేసింది. ఓ అర్ధరూపాయిచ్చాను. ఇదంతా చూస్తున్న ఒక రైతు జాలిపడి, రైల్వే దొంగతనాల్ని తన పరిభాషలో తిట్టి, తన రొంటిన సంచీ తీసి చూశాడు. చిల్లరేమీ లేదు. ఒక రూపాయి నోటు ఇతని చేతిలో పెట్టాడు. వెనక నుంచి రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరాయి. హరగోపాల్‌ని ‘ఇంప్రెస్’ చేసిన వ్యక్తి తాలూకు ‘డిటెక్టివ్ గొంతు వేసే ప్రశ్నలూ, తెలుగురాని ఇతని తబ్బిబ్బూ వినిపించాయి. డిటెక్టివ్ గొంతు ఈ కేసుని ఇట్లా ‘ఎనలైజ్’ చేస్తోంది. ‘‘పది రూపాయల నోటు సంగతి చూడండి, నోటుని మధ్యకు మడిచి, మళ్లీ మధ్యకు మడిచాడు కదా. మడిచిన గుర్తు ఇదిగో, నోటు కూడా మరీ కొత్తది కాదు. రెండు రూపాయల నోట్లు కూడా రెండు మూడు దొంతర్లుగా పెట్టినట్టున్నాడు. మరి పదిరూపాయల నోటు అదే నాలుగు మడతల మీద కట్టినవై ఉండాలి. అప్పుడు నోటుకి ఈ పక్కా ఆ పక్కా చెరో అంగుళం ముక్కా ఇంచుమించు మడత స్వభావాన్ని బట్టి తెగిపోయి ఉండాలి. అయితే మిగిలేది మధ్యముక్క, అలాలేదే. రెండు రూపాయల నోటు మధ్యకి కట్ అయిపోయిన మాట నిజమే. మరి పదిరూపాయల నోటు కూడా మధ్య ఎలా తెగింది కొలిచినట్టుగా. ఇతను నోట్లు జేబులో పెట్టుకున్న పద్ధతి చూస్తే పది రూపాయల నోటు మధ్యకి మడిచి, దాన్ని మళ్లీ మధ్యకి మడిచి, మధ్యలో రెండు రూపాయల నోట్లు మడత పెట్టి ఉండాలి. ఇదంతా, ఇలా ఉండనివ్వండి– అయితే, ఎలా ఎందుకు చేశాడు! మోసగించి డబ్బు సంపాదించాలనుకునే వాడు పాతిక రూపాయలు చేతులారా నాశనం చేసుకుంటాడా? అని సందేహం కలగవచ్చు. దీన్ని ‘సాల్వ్’ చేయటం సింపుల్. ఈమధ్య ‘ఫేక్’ నోట్లు వస్తున్నాయి కదా– ఎలాగా మారవని ఎవరో చెప్పివుంటారు. వీటిని తెగ్గోసుకుని, డబ్బు చేసుకుందామన్న ఆలోచన పుట్టి ఉండవచ్చు.’’ అతను జుట్టు పైకి ఎగదోసుకుని, చుట్టూ చూశాడు. అంతా ముగ్ధులైపోయారు. ‘ఫేక్ నోట్స్’ అనగానే నాకూ అనుమానం వచ్చింది. రూపాయి దానం చేసిన రైతు బూడిదలో పన్నీరు పోసిన మొహం పెట్టాడు. హరగోపాల్ కాలిక్యులేషన్ సాధారణంగా దెబ్బ తినదు. హరగోపాల్‌ను ఇతను తన వేషం చేతే ఇంప్రెస్ చేసినా, నేను ఇతని తెలివిని చూస్తున్నాను. అంతా అవహేళన చేసి, తిట్టి, కొట్టినంత పని చేశారు ఆ పల్లెటూరి ఆసామిని. ఆ ఆసామి ఏడుస్తూ ఏదో తన భాషలో ఘోషిస్తున్నాడు. ఎవరి హృదయం కరగలేదు. ఛీ దేశద్రోహం కదూ? ఇలాంటి వాళ్లకి డబ్బిచ్చి పోషించడం? పరోక్షంగా వాళ్లు చేసే వెధవ పనుల్ని ప్రోత్సహించడం కదూ, అనిపించి సిగ్గుపడ్డాను. ‘‘పోలీసులకి అప్పగించండి’’ అన్నారెవరో. ‘‘మరే, అప్పుడుగాని బుద్ధిరాదు.’’ ఈ కేస్ నడిపిన డిటెక్టివ్ చెయ్యి ఆ వ్యక్తిని ఉరిమి చూసి ఫెడీఫెడీ మని లెంపకాయలు కొట్టింది. గొల్లుమన్నాడు అతను. మానవ మనస్తత్వం– అందులోనూ మధ్యతరగతి మనస్తత్వం– అదేం చిత్రమోకాని అంతగా దయనీ చూపించగలదు. అంతగా కక్షనూ సాధించగలదు. అందరి తరఫునా అతను చెయ్యి చేసుకుని, అందరి మనస్సుల్లో ఉన్న కోపానికీ శాంతిని కలిగించాడు. బెజవాడ వస్తోంది. ‘‘దూరదేశప్పీనుగ పోలీసులకు ఒప్పగించడం ఎందుకులెండి’’ అనేసి, పైని ఉన్న బాగ్ తీసుకుని కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గరికి వెళ్లి, కుడిజేబులోంచి సిగరెట్ పెట్టితీసి, వెలిగించుకుని, ఖాళీ పెట్టి అవతల పారేశాడు. రాత్రి పది గంటలు దరిదాపవుతోంది. బెజవాడ స్టేషన్ జనంతో హడావుడిగా ఉంది. రైలాగింది. అతను దిగి తన దారిన తను గబగబ వెళ్లిపోయాడు. గుమ్మం దగ్గర అతని రుమాలు పడిపోయింది. బండి దిగుతున్న రైతు అతని పట్ల అత్యంత గౌరవం కలిగిన వాడవటం చేత, ఆ రుమాలు తీసి దులిపి, ‘‘బాబూ’’ అని కేకేసి, అంతలోనే తెల్లబోయి... ‘‘హారి దొంగ నాయనోయ్’’ అని అరిచాడు. ముక్కలైన పది రూపాయల నోటు, రెండు రూపాయల నోట్ల భాగాలు చెదిరిపడ్డాయి. నాకు కళ్లు తిరిగాయి. అయితే, అతను తనని తను కొట్టుకోలేక ఆ మనిషిని ఎందుకు కొట్టినట్టు? హరగోపాల్ వాళ్ల నాటకంలో పాత్రకి ఇతను సజీవమూర్తి. నటించక్కరలేదు– అనిపించింది.(సమాప్తం) పుట్టినప్పుడు సంక్రమించిన పటకుటీరం తనువు– మోసుకు తిరుగుతూ కలలు వండుకు తింటూ నేటి కిక్కడ రేపటి కెక్కడో! ఉత్సవాలు చూస్తూ ఉత్సాహాలు కొనుక్కుంటాం. పచ్చని లోకపు బయళ్లలో పగలంతా కోలాహలంగా గడుపుతూంటాం పరిపరి పరిచయాలతో నిద్దుర సంచుల్లో కలల అరల్ని నింపుకొంటాం. నీలాకాశం కత్తిరించి దుప్పటిగా కప్పుకుంటాం– ఎన్నో కోరికల కథలకి మనమే నాయకులమై కూర్చుంటాం. కొంత కాలానికొక గొంతు బెదిరిస్తుంది అంటుకొంటుందట పటకుటీరం అప్పుడీ సంచులు వెంటరావటకద! పోతే పోనీ– పిడికెడు బూడిదగా లేద్దాం మేఘాల్లో చరిద్దాం. చిటికెడు నీటితడి సోకి పువ్వులమై పుడదాం– మనకేం? ఆకాశాన్ని విసిరి పారేసి పొమ్మన్న చోటికే పోదాం పద. (శ్రీకాంత శర్మ ‘అనుభూతి గీతాలు’ లోంచి; ప్రచురణ– 1976) -
తూర్పున వాలిన సూర్యుడు
తెలుగు సాహిత్య వీధుల్లో అర్ధ శతాబ్ది పాటు రంగురంగుల వెలుగుపూలు పూయించిన సిద్ధుడు, అసాధ్యుడు శ్రీకాంత శర్మ. 1944లో గోదావరి జిల్లా రామచంద్రాపురంలో పుట్టారు. సంస్కృతాంధ్రా లలోనే కాక ఆంగ్లంలో సైతం మంచి పట్టు సాధించారు. కొద్దికాలం బడిలో పాఠాలు చెప్పారు. ఆనక పత్రికా రంగానికి వచ్చి ఒక ప్రముఖ వార పత్రిక సంపాదక వర్గంలో కుదురుకున్నారు. 1976లో విజయవాడ ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్‌గా శర్మని తీసుకున్నారు. ఎలాగంటే– ఆ ఉద్యోగానికి అర్హత ఉన్నత విద్యతోబాటు గరిష్టంగా 30 ఏళ్ల వయస్సు. అప్పుడు స్టేషన్ డైరెక్టర్‌గా బాలాంత్రపు రజనీకాంతరావు ఏలుతున్నారు. ఎలాగైనా ఇంద్రగంటివారి అబ్బాయిని రేడియోలోకి లాగితే స్టేషన్ బాగుపడుతుందనుకున్నారు. అన్నిట్లో నెగ్గిన శ్రీకాంత శర్మ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాయించారు. తీరా చేరాక, అన్నిరకాల రాత కోతల్లో శర్మ తల, చేతులు పెట్టాక, ఢిల్లీ నుంచి రజనీకి శ్రీముఖం వచ్చింది. మన విధి విధానాల్లో వయసు పరిమితి 30 కదా. శ్రీకాంత శర్మకి 32 కదా అంటూ తాఖీదిచ్చారు. రజనీ అంటే అప్పటికే అతడనేక యుద్ధముల నారితేరిన గడుసు పిండం. మంచిదనిపిస్తే ముందు చేయదలచిన పనులు పూర్తి చేసి తర్వాత సమర్థించుకోవడమే ఆయనకు తెలుసు. ‘అయ్యా, మన నిబంధనావళిలో ప్రిఫరబ్లీ 30 ఇయర్స్ అని ఉండటం చేతనూ, కుర్రవాడు చాకు అవడం చేతనూ రెండేళ్లని పక్కన పెట్టడం జరిగింది. అయినా, ఇకపై ఇలా హద్దు మీరడం ఉండదని మనవి’ అని జవాబిచ్చారు. చవగండాలు తప్పుకుని శ్రీకాంత శర్మ, ఏకు మేకై 1996 దాకా ఆకాశవాణిని సేవించారు. శర్మ పాడింది పాటగా విజయవాడ రేడియో నడిచింది. ఎన్ని పల్లవులు? ఎన్ని పాటలు? ఎమ్మెస్ శ్రీరాం అంటే ప్రఖ్యాత వైణికులు ఈమని శంకరశాస్త్రి మేనల్లుడు. ఆయన రేడియోలో సంగీత శాఖాధిపతిగా ఉన్నప్పుడు, శర్మకి ట్యూన్లు చెప్పి పాటలు ఇమ్మన్నాడు. ఆ ఒరవడిలో ఉరవడిలో వచ్చిన తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా.. పాట. అప్పటికీ ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందిన శర్మ పాట. శర్మ మనసులో పాట అలవోకగా పల్లవిస్తుంది. పరిమళిస్తుంది. ‘శ్రావణాన మధురమైన వలపు తలపు తేనె సోన..., కనరే నీలి వెన్నెల..., తెరపు మరపు మనసులో విరజాజి వెన్నెల నీడలో...’ ఇలా తెంపు లేకుండా రసికుల జ్ఞాపకాల్లోంచి వస్తూనే ఉంటాయ్. దేవులపల్లి కృష్ణ శాస్త్రీయం బలంగా ఆవహించి ఉన్నా, చెట్టు ఇస్మాయిల్ ధోరణి ఆవరించి ఉన్నా, శేషేంద్ర మధ్య మధ్య పలకరిస్తున్నా సకాలంలో వైదొలగి తన సొంత కక్ష్యలో ఏ ఉల్కల బారినా పడకుండా హాయిగా పరిభ్రమిస్తూనే గడిపారు. ప్రోజు, పొయిట్రీ, పద్యం, నాటకం, పత్రి కారచన– ఇలా అన్ని ప్రక్రియల్ని వెలిగించి పూయించారు శ్రీకాంత శర్మ. మితంగానే అయినా మంచి పాటలు సినిమాలకి రాశారు. కృష్ణ శాస్త్రి, భుజంగరాయశర్మల తర్వాత వెంపటి చినసత్యం మేష్టారికి కూచిపూడి నృత్యరూపక కర్తగా ఆ స్థాయిని నిలబెట్టారు. నలభై పైబడిన మా స్నేహంలో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు.చివరిదాకా హాస్యోక్తులతోనే మా మాటలు సాగాయి. శర్మ కాగితం మీదికి వస్తేనే సీరియస్గానీ లేదంటే హ్యూమరే! శర్మ చాలా తరచుగా మద్రాసు వచ్చేవారు. నాతోనే ఉండేవారు. ఒకసారి వచ్చినప్పుడు మా అబ్బాయ్ అక్షరాభ్యాసం నిర్ణయమైంది. సామగ్రిని పిల్లాణ్ణి తీసుకుని రమణ గారింటికి వెళ్లాం. వాళ్లిద్దరి చేతా చెరో అక్షరం దిద్దించాలని సంకల్పం. తీరా అక్క డికి వెళ్లాక ‘మేం కాదు. ఇక్కడీ సాహితీ శిఖరం ఉండగా మేమా, తప్పు’ అంటూ బాపురమణ మా అబ్బాయిని శర్మగారి ఒళ్లో కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయించారు. ఆ సన్నివేశం అలా సుఖాంతమైంది. కొన్నాళ్లు గడిచాయ్. బళ్లో మావాడి ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడొచ్చినా, కాపీ తీయించి శర్మకి పోస్ట్ చేసేవాణ్ణి. ‘ఇదేంటండీ, నన్నీ విధంగా హింస పెడుతున్నారు. నేను వద్దు మొర్రో అంటున్నా వినకుండా నాతో దిద్దబెట్టించారు. నేనెప్పుడూ లెక్కల్లో పూరే. వాడికి లెక్కల్లో తోకలేని తొమ్మిదులు, తలలేని ఆర్లు వస్తుంటే నాదా పూచీ’ అంటూ జవాబులు వస్తుండేవి. అయ్యా, లెక్కలు సరే. తెలుగూ అట్లాగే ఉంది. ‘స్నానం పోసు కోవడం’ లాంటి మాటలొస్తున్నాయ్ అనే వాడిని. ఆప్తమిత్రుని అనారోగ్యం మాటలు వింటూనే ఉన్నా, ఇప్పుడే ఇంతటి విషాద వార్త వింటానని అనుకోలేదు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రికి నేనంటే ఎంతో వాత్సల్యం. నాకో మంచి ముందుమాట రాశారు. శ్రీకాంత శర్మ సరేసరి. శ్రీమతి జానకి బాల, పిల్లలు మా స్నేహం నించి హితంగా సన్నిహితంగానే ఉన్నాం. ఇంద్రగంటి వారితో మూడు తరాల అనుబంధం. ఇంటిల్లి పాదీ మాటలకోర్లు. ఎప్పుడు కలిసినా ఎన్నాళ్లున్నా టైము మిగిలేది కాదు. శర్మ పార్థివ దేహాన్ని కడసారి దర్శించడానికి వెళ్లినపుడు దుఃఖం పెల్లుబికి వచ్చింది. మోహనకృష్ణ తన సినిమాకి తండ్రి రాసిన పాట గురించి ప్రస్తావించారు. కిరణ్మయి కూడా తనకు రాసిన పాట చెప్పింది. ప్రయోజకులై, బుద్ధిమంతులై, తల్లిదండ్రులను నడిపిస్తూ ఉండే పిల్లలున్న తండ్రి మా శ్రీకాంత శర్మ అన్పించింది. నా కళ్లలోంచి ఆనంద బాష్పాలు రాలాయి. స్నేహశీలికి అశ్రు తర్పణం. శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు -
అనుభూతి కవితకు.. చెరిగిన చిరునామా
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి తీరంతో చెరగని చెలిమి పెనవేసుకున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇక లేరన్న వార్త తెలిసి తూర్పు గోదావరి జిల్లా సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో తెలుగు కవితారంగంలో అనుభూతి కవిత్వానికి చిరునామా చెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. సాహితీరంగంలో లబ్ధప్రతిష్టుడైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మన జిల్లాలోని రామచంద్రపురం పట్టణంలోని రత్నంపేటలో 1944 మే 29న జన్మించారు. ఆయన తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రామచంద్రపురంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేశారు. ఆయన మంచి కవి, రచయిత, మహాపండింతుడు. శ్రీకాంతశర్మ ఇక్కడే పుట్టినప్పటికీ విద్యాభ్యాసం కాకినాడ, హైదరాబాద్‌లలో జరిగింది. ఉద్యోగ ప్రస్థానం విజయవాడ, హైదరాబాద్ నగరాలకే పరిమితమైనా, గోదావరి ఆయన హృదయంలో తిష్ట వేసుకున్నదని చెప్పడానికి ఆయన స్వీయచరిత్రే నిలువెత్తు సాక్ష్యం. ఆయన ఇక లేరన్న వార్తను సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని కవి పండితులు నమ్మలేకపోతున్నారు. యానాంతో ప్రత్యేక అనుబంధం యానాం: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటని ప్రముఖ కవి దాట్ల దేవదానంరాజు పేర్కొన్నారు. సాహిత్య సమావేశాలకు యానాం వచ్చిన ప్రతిసారీ మంచి ఆహార నియమాలు పాటించేందుకు తన ఇంటికి వచ్చి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. గత ఏడాది శిఖామణి పురస్కారం పొందిన ఆయన తన ‘కథల గోదారి’కి ‘జీవధార’ పేరుతో ముందుమాట రాసి ఆశీర్వదించారని అన్నారు. ఆయన రచించిన లలిత గీతాలు అందరినీ ఆకట్టుకుంటాయని, అలాగే ఆయన రాసిన ‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా..’ అనే దేశభక్తి గీతం నేటికీ విద్యార్థుల నోట మార్మోగుతూనే ఉంటుందని అన్నారు. ఆయన రచనలు భావికవులకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సినీగీతాల స్థాయి పెంచారు తెలుగు సినీగీతాలకు ఒక స్థాయి, గౌరవాన్ని కలిగించిన గీతాలు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలం నుంచి జాలువారాయి. కృష్ణావతారం, నెలవంక, రెండుజెళ్ల సీత వంటి చిత్రాలకు ఆయన అద్భుతమైన గీతాలను అల్లారు. ఆయన తండ్రి హనుమచ్ఛాస్త్రి విద్వత్కవి. సతీమణి జానకీబాల కూడా చేయి తిరిగిన కవయిత్రి. – డాక్టర్ పీవీబీ సంజీవరావు, వ్యవస్థాపకుడు, తెలుగు సారస్వత పరిషత్ అనుభూతి ప్రేరకంగా రాసేవారు మిత్రుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మరణంతో ఆధునిక తెలుగు కవిత్వంలో అనుభూతి వాదం చిరునామా చెరిగిపోయింది. తాను రాసింది వచన కవిత అయినా, గేయమైనా అనుభూతి ప్రేరకంగా ఉండేలా శ్రద్ధ తీసుకునేవాడు. అనేక విలువైన వ్యాసాల ద్వారా శుభ్రమైన వచన రచయితగా కూడా గుర్తింపు పొందాడు. కవిగా, కథకునిగా, నవలాకారునిగా సినీ గేయ రచయితగా, పత్రికా సంపాదకునిగా, ఆకాశవాణి ప్రయోక్తగా శ్రీకాంతశర్మ బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – అదృష్ట దీపక్, సినీ గేయ రచయిత, కవి, విమర్శకుడు, రామచంద్రపురం స్వీయచరిత్రలో నా పేరు ప్రస్తావించడం నా అదృష్టం మహాకవులు మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, మల్లంపల్లి శరభేశ్వరశర్మలను కలవడానికి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రాజమహేంద్రవరానికి వస్తూండేవారు. గౌతమీ గ్రంథాలయంపై ఆయన ఆకాశవాణిలో శబ్దప్రసారం చేశారు. ఆయన కవి, కథా, గేయ రచయిత. ఆయన తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి పెద్దతరానికి చెందిన విద్వత్కవి. ప్రాచీన కావ్యాల్లో కూడా ఇంద్రగంటికి అభినివేశం ఉండేది. ఈ విషయంలో ఆయనను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒకసారి ఆయనకు ఫోన్ చేశాను. ‘స్వీయచరిత్రలో మీ ప్రస్తావన గురించి రాస్తున్నప్పుడు మీరు ఫోన్ చేయడం ఆనందదాయకం, ఆశ్చర్యదాయకం’ అని ఆయన నాతో అన్నారు. నాతోపాటు ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు పేరును కూడా ఆయన స్వీయచరిత్రలో ప్రస్తావించడం రాజమహేంద్రిపై ఆయనకుగల అభిమానానికి తార్కాణం. ఆయన రచించిన ‘శిలామురళి’ అనుభూతి కవిత్వంలో మేలుబంతి. ఆయన లేని లోటు తీరనిదే! – సన్నిధానం నరసింహశర్మ, ప్రాణహిత కవి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. లలిత గీతాలు, కవితలు, సాహిత్య వ్యాసాలు, ఆకాశవాణి నాటికలు, నాటకాలు.. ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఇంద్రగంటిది అందె వేసిన చేయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కళాగౌతమి ప్రార్థిస్తోంది. – డాక్టర్ బీవీఎస్ మూర్తి, కళాగౌతమి వ్యవస్థాపకుడు, రాజమహేంద్రవరం -
తల్లిదండ్రుల అభిప్రాయాలు పిల్లలపై రుద్దడం సరికాదు
ప్రముఖ కవి, రచయిత, సంపాదకులు, సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గురువారం (నిన్న) తెల్లవారు జామున మృతి చెందారు. గతంలో వారు సాక్షికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని విశేషాలను ఈ సందర్భంగా పాఠకులకు మరోసారి గుర్తుచేస్తున్నాం. ‘‘పిల్లలు ఎంత లావుగా ఉన్నారన్నది కాదు, ఎంత బలంగా, ఆరోగ్యంగా ఉన్నారన్నదే ప్రధానం. మా పిల్లలకు మేము ఇన్నిసార్లు తినిపిస్తున్నామని గొప్పలు చెప్పుకునే తల్లిదండ్రులు పిల్లలను అసలు విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నామో లేదో ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ ‘‘ఫలానా పుస్తకం చదవద్దు, ఫలానా ఛానల్ చూడద్దు, ఆ సినిమా చూడద్దు, ఆ సైట్ జోలికి వెళ్లద్దు అని పిల్లలకు ఆంక్షలు విధించడం వల్ల మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనం గుప్పిట మూసి ఉంచినప్పుడు పిల్లలకు అందులో ఏముందో చూడాలన్న కుతూహలం పెరుగుతుంది. అదే ఓపెన్‌గా ఉంచితే ఆ గొడవే ఉండదు’’ అంటారు సుప్రసిద్ధ కవి, కథారచయిత ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ‘అలా పెంచాం’ కోసం ఆ దంపతులను కలిసినప్పుడు తమ పిల్లల చదువుల విషయం, తాము వారిని పెంచిన తీరుతెన్నులూ వివరించారిలా! ‘‘మాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మాయి కిరణ్మయి టొరెంటోలోని యార్క్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ యూనివర్శిటీలో ఫిలిమ్ స్టడీస్‌లో పీహెచ్డీ చేసింది. ప్రస్తుతం రాఫ్ట్‌లో ఫాకల్టీ మెంబర్‌గా పని చేస్తోంది. అబ్బాయి మోహనకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎం.ఎ. ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన తర్వాత ఎం.ఫిల్ చేశాడు. కెనడాలో ఎం.ఎఫ్.ఎ. చేశాడు. అక్కడే పీహెచ్డీ చేస్తూ ఉంటే అకడమిక్‌గా ఎదగడమే తప్ప మనం నేర్చుకున్నదానిని అమలు చేయడానికి వీలు కాదనే ఉద్దేశ్యంతో 2001లో ఇండియా వచ్చేశాడు. చలంగారి ‘దోషగుణం’ అనే కథ ఆధారంగా ‘గ్రహణం’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ చిత్రానికి ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం లభించింది. ఆ తర్వాత అష్టాచెమ్మా, మాయాబజార్, గోల్కొండ హైస్కూల్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం చేతిలో ఇంకొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. నమ్మాము... ఆచరించాము మా పిల్లల బాల్యం అంతా విజయవాడలోనే గడిచింది. వారి చదువులు అయిపోయాకనే మేము హైదరాబాద్ వచ్చాము. మేమిద్దరం మా పిల్లలు ఏం చదువుకుంటామంటే అదే చదువుకోనిచ్చాము. నచ్చిన పుస్తకాలు చదువుకోమన్నాము. వాళ్ల పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే మా ఇద్దరి ఫిలాసఫీ ఒకటే... పిల్లలు తమకు నచ్చిన చదువులు చదువుకోవాలి, ఇష్టమైన ఉద్యోగం చేయాలి. ఇష్టపడ్డవారిని పెళ్లి చేసుకోవాలి. వాళ్లు మనకు పిల్లలుగా పుట్టినంత మాత్రాన తల్లిదండ్రుల అభిప్రాయాలను వాళ్లపై రుద్దడం సబబు కాదని మా ఉద్దేశ్యం. వారి జీవితం వారిది. వాళ్లకు ఎన్నేళ్లొచ్చినా ప్రతిదీ మన ఇష్టప్రకారమే నడుచుకోవాలనుకోవడం వల్ల వారు స్వతంత్రంగా ఎదగలేరు! వాళ్లు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోలేనప్పుడు మాత్రం మన సహాయ సహకారాలు అందించాలి. మేము నమ్మిన ఈ సూత్రాలను అక్షరాలా పాటించాము. మా పిల్లలు మంచి పుస్తకాలు చదివారు, మంచి సినిమాలు చూశారు. మంచి సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సంగీతంలో, పాటలలో కూడా మంచి అభినివేశం ఉండేది. వక్తృత్వం, వ్యాసరచన... వంటి పోటీలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఎలా జరిగిందన్నది కాదు... పెళ్ళిళ్ల విషయంలో కూడా మేం వారిని నిర్బంధించలేదు. వాళ్లు ఎవరిని ఇష్టపడ్డారో వాళ్లనే చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మా అమ్మాయిది కులాంతర వివాహం. ‘మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం, జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం‘ అని చెప్పినప్పుడు నేనేమీ కంగారుపడలేదు. పైగా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సింపుల్‌గా జరిగిన వారి పెళ్లికి నేనే వెళ్లి సాక్షి సంతకం పెట్టివచ్చాను కూడా! ఎందుకంటే సాధారణంగా మేము ఫలానా వారిని ఇష్టపడుతున్నాము, వారినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని పిల్లలు చెప్పడం, తల్లిదండ్రులు అందుకు అభ్యంతరపెట్టడం, వద్దని బతిమాలడం, బెదిరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగని వారు ఏం చేస్తే అది కళ్లు మూసుకుని ఆమోదించాలని ఉద్దేశ్యం కాదు. వాళ్లకి అందులోని మంచి చెడులను వివరించాలి. అప్పుడు వాళ్లంతట వాళ్లే తమకు ఏది మంచో గ్రహిస్తారు. అలాగే పెళ్లి ఎవరితో, ఎలా జరిగిందన్నది సమస్య కానే కాదు, వారి వైవాహిక జీవితం ఎంత బాగున్నది, ఎంత ఫలప్రదంగా ఉన్నదనేది ప్రధానం. జీవితాంతం కలిసి ఉండేదీ, కాపురం చేయవలసినదీ వాళ్లే కదా! మా అబ్బాయి మోహన కృష్ణదీ ప్రేమవివాహమే! తన క్లాస్‌మేట్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా ఇద్దరు పిల్లలూ సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. వారిని చూసి మాకు ఆనందంగా ఉంది. ‘‘అసలు పెద్దవాళ్లకూ, పెళ్లయిన తర్వాత పిల్లలకూ భేదాభిప్రాయాలు వచ్చే సందర్భం ప్రధానంగా డబ్బు విషయంలోనే ఎదురవుతుంది. పిల్లలు ఎడాపెడా ఖర్చు పెడుతున్నారని, దుబారా చేస్తున్నారని తిట్టడం సరికాదు. అలాగే కోడలు తాను సంపాదిస్తోంది కదా అని కొడుకును నిర్లక్ష్యం చేస్తోందని అత్తమామలు అనుకోవడం, అదే విషయాన్ని పదే పదే కొడుకుతో అంటుండటం మూలాన వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కలగడం మినహా ప్రయోజనం ఏముంటుంది? ’’ సంభాషణ: డి.వి.ఆర్. భాస్కర్ -
ఇంద్రగంటి కన్నుమూత
హైదరాబాద్ : దాదాపు నాలుగున్నర దశాబ్దాలు సాహిత్య, పత్రికా రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖ రచయిత, కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నేరేడ్మెట్లోని ఆయన స్వగృహంలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులతోపాటు బంధువులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వెంకటరత్నమ్మ దంపతుల మూడో కొడుకు శ్రీకాంత శర్మ. విజయవాడలో చాలా కాలంపాటు ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. ఇంద్రగంటి భార్య ప్రముఖ రచయిత్రి జానకీబాల, కొడుకు ప్రముఖ సినీ దర్శకులు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ. కాగా, బంధువులు, సన్నిహితుల సమక్షంలో గురువారం సాయంత్రం అల్వాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీనటులు నరేష్, తనికెళ్ల భరణి, షఫి, పవిత్రలోకేష్, సాహిత్య రంగ ప్రముఖులు శ్రీరమణ, పతంజలిశాస్త్రి, సుధామ, శారదాశ్రీనివాస్ తదితరులు ఇంద్రగంటి పార్థివ దేహం వద్ద నివాళులర్పించి, మోహన్‌కృష్ణ, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అభ్యుదయ కవి, సాహితీవేత్త.. 1944 మే 29న జన్మించిన ఇంద్రగంటికి.. తండ్రి హనుమత్ శాస్త్రి సుప్రసిద్ధ కవి కావడంతో సహజంగానే సాహిత్యం ఒంటబట్టింది. విద్యార్థి దశనుంచే ఆయన రచనావ్యాసాంగాన్ని చేపట్టారు. చిన్నవయసులోనే అభ్యుదయ కవిగా ప్రసిద్ధులయ్యారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ఎడిటర్గా పనిచేశారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రేడియోలో నాటికలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలకు ప్రాణం పోశారు. ఆ తర్వాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకులుగా కూడా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పనిచేశారు. ఇటీవలే ఆయన ’ఇంటిపేరు ఇంద్రగంటి’పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. గత యాభై సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు. దాదాపు నాలుగున్నర దశబ్దాల సాహితీ ప్రస్థానంలో కవిత్వం, విమర్శలు, నాటకాలు, నవలలు 20కిపైగా పుస్తకాలు రాశారు. రచయితగా, కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకులుగా ఆయన సాహిత్యరంగంలో చేసిన సేవలకుగాను పలు జాతీయ స్థాయి పురస్కారాలు, వివిధ సంస్థల నుంచి అవార్డులను అందుకున్నారు. తెలుగు సాహిత్యంలో గుడిపాటి వెంకటాచలం, కృష్ణశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీశ్రీ, బుచ్చిబాబు, బాల గంగాధర్ తిలక్, విశ్వనాథశాస్త్రి, అజంతా రచనలతో ఆయన బాగా ప్రభావితమయ్యారు. ‘ఈ ప్రపంచంలో సర్వవిశ్వాసాలకి, చర్యలకి, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు, సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం అయితే ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యమే. అందుచేత సాహిత్య పఠనం, రచనా వ్యాసంగంలోకి మనసు పెట్టే వాళ్లు, తమ మనసులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవాల్సి రావచ్చు. కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనసులోకి వెలుతురుతాకే అవకాశం ముఖ్యం. దాన్ని మూసి పెట్టకూడదు’అని ఓ సందర్భంలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ చేసిన ప్రతిపాదన నేటి రచయితలకు ఓ దీపస్తంభం లాంటిది. నెలవంక నుంచి సమ్మోహనం వరకు శ్రీకాంత శర్మ 20కి పైగా సినిమాలకు పాటలు కూడా రాశారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ’నెలవంక’చిత్రంలో 6పాటలు రాశారు. ఇందులో ’ఏది మతం’పాటకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే ’పుత్తడిబొమ్మ’సినిమాకు రెండు పాటలు, ’రావు–గోపాల్‌రావు’చిత్రంలో ఓ పాట రాశారు. ’కృష్ణమూర్తి కుక్కపిల్లలు’అనే టెలీఫిలిం కోసం ఓ పాట రాశారు. తనయుడు మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ’గోల్కొండ హైస్కూల్’సినిమాలో ’ఏనాటివో రాగాలు’పాటను, ‘అంతకు ముందు ఆ తర్వాత’చిత్రంలో ’నా అనురాగం’పాటను, ’సమ్మోహనం’లో ’మనసైనదేదో’పాటను రాశారు. 74 సంవత్సరాల వయసులో ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ ’సమ్మోహనం’కోసం ఆయన రాసిన ఫుల్ రొమాంటిక్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. -
రచనల్లో జీవించే ఉంటారు
రొమాంటిక్ సాంగ్ రాయాలంటే మంచి వయసులో ఉండాలా? ఉంటేనే రాయగలుగుతారా? అలాంటిదేం లేదు. మనసులో భావాలు మెండుగా ఉండాలే కానీ ఏ వయసులోనైనా ప్రేమ పాటలు రాయొచ్చు. అందుకు ఉదాహరణగా నిలిచినవాళ్లల్లో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఒకరు. 74 ఏళ్ల వయసులో ఆయన కలం నుంచి ‘మనసైనదేదో..’ అనే ప్రేమ పాట కాగితం మీదకు వచ్చింది. ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలోనూ ‘సమ్మోహనం’ కోసం ఆయన ఈ పాట రాయడం విశేషం. ఇదే శ్రీకాంత శర్మ రాసిన చివరిపాట. ఎన్నో అద్భుతమైన రచనలను మిగిల్చి, ఎప్పటికీ రచనల్లో గుర్తుండిపోయే ప్రముఖ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గురువారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీకాంత శర్మ తన స్వగృహంలోనే నిద్రలో కన్ను మూశారు. 1944, మే 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారాయన. శ్రీకాంతశర్మ తండ్రి ఇంద్రగంటి హనమచ్ఛాస్త్రి మహా పండితులు. తండ్రి బాటలోనే సాహిత్య రంగంపై తనదైన ముద్రవేశారు. కవిత్వం, లలిత గీతం, చలన చిత్రం, యక్షగానం, కథ, నవల, నాటిక, వ్యాసం, పత్రికా రచన ఇలా బహు రూపాలుగా శ్రీకాంత శర్మ ప్రతిభ వికసించింది. జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన శ్రీకాంత శర్మ 1976లో ఆలిండియా రేడియో విజయవాడలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. ఆ తర్వాత సినీ కవిగా మారారు. ‘కృష్ణావతారం’ సినీ రచయితగా ఆయన తొలి సినిమా. అలాగే జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నెలవంక, రావు – గోపాలరావు, రెండు జళ్ల సీత, పుత్తడి బొమ్మ వంటì సినిమాల్లో పాటలను రాశారు శ్రీకాంత శర్మ. ఆయన సతీమణి ఇంద్రగంటి జానకీబాల ప్రముఖ రచయిత్రి. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈయన తనయుడే. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘గోల్కొండ హైస్కూల్, ‘అంతకుముందు ఆ తర్వాత’, సమ్మోహనం’ సినిమాల్లోనూ పాటలు రాశారాయన. ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరుతో తన ఆత్మకథను 2018లో విడుదల చేశారు. తన సాహిత్య జీవితం, కుటుంబ విశేషాలు, రచయితగా తన అనుభవాలు ఇందులో పొందుపరిచారు. శ్రీకాంత శర్మ మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. బంగారు పూలతో అభిషేకం చేశాను – తనికెళ్ల భరణి అనుభూతి కవిత్వం అనేది ఒక ప్రక్రియ. ‘అనుభూతి గీతాలు’ టైటిల్‌తో శ్రీకాంత శర్మగారు రాశారు. కవి, పండితుడు, సంస్కృతం బాగా చదువుకున్నవాడు. ఆయనది ఒక శకం. సాహిత్యంలో ఏ డౌట్ వచ్చినా ఆయన్నే అడిగేవాణ్ణి. ‘కవికి కనకాభిషేకం’ పేరుతో నేను ఆయనకు బంగారు పూలతో అభిషేకించుకునే అవకాశం లభించింది. 50 వేల రూపాయిల బంగారం పూలతోటి వారికి అభిషేకం చేయడం ఒక పండగ. అక్కినేని నాగేశ్వరరావు కూడా వచ్చారు. నా జీవితంలో అది బెస్ట్ మూమెంట్. మర్చిపోలేనిది. ఆయన అర్హుడు. ఇవాళ ఉదయం (గురువారం) వాళ్ల ఇంటికి వెళ్లి నమస్కరించుకొని వచ్చాను. వాళ్ల కుటుంబమంతా పండితుల సమూహం. వాళ్ల తండ్రి, భార్య, కుమారుడు అందరూ సాహితీవేత్తలే. తెలుగు సాహిత్యం గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పగలరో సంస్కృత సాహిత్యం గురించీ అంతే గొప్పగా చెప్పగలరు. సంస్కృత కావ్యాలు కొన్ని తెలుగులోకి అనువదించారు. సంస్కృత కావ్యాల మీద నాకు ఆసక్తి కలగడానికి కారణం పరోక్షంగా ఆయనే. తెలుగు కావ్యాలనుంచి గొప్ప సాహిత్య సంపదను పరిచయం చేశారు. శ్రీకాంత శర్మగారు ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. -
ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (75) గురువారం తెల్లవారుఝామున హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఆయనలేని లోటు సాహిత్య లోకానికి తీరనిదంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ శ్రీకాంతశర్మ తనయుడన్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మే 29 ,1944 న జన్మించారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరిన తదనంతరం కాలంలో ఆకాశవాణి కేంద్రానికి విశేష సేవలందించారు. అనేక లలిత గేయాలు కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలనురచించారు. కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు- గోపాలరావు(1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశారు. ఇటీవలి కాలంలో సమ్మోహనం సినిమాలో ‘మనసైనదేదో’ అనే రొమాంటిక్ సాంగ్ ఆయన కలం నుంచి జాలువారినదే. సీఎం జగన్ సంతాపం ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఒక గొప్ప సాహితీవేత్త, పత్రికా సంపాదకుడు, కవి, పండితుడిని తెలుగుజాతి కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రొమాంటిక్ సాంగ్ @ 74
సుధీర్‌బాబు, అదితీరావ్ హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ‘మనసైనదేదో..’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచించారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ –‘‘74ఏళ్ల వయసులో శర్మ ఇంత రొమాంటిక్‌గా పాట రాస్తారని ఊహించలేదు. కవిత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ పాట వింటే ఒప్పుకుంటారు. పాట లాగే సినిమా కూడా హాయిగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నగారు అనుభూతి కవిత్వానికి పెట్టింది పేరు. నాన్నగారికి సందర్భం చెప్పగానే రాత్రికి రాత్రి పాట రాసిచ్చారు’’ అన్నారు మోహనకృష్ణ. ‘సమ్మోహనం’ జూన్ 15న విడుదల కానుంది. -
ఉంగరం కథ
‘‘మాయా సంసారం తమ్ముడూ నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు....’’ పాటలో ఇదే చరణం పాడుకుంటూ సదానందమూర్తి వంట గట్టు దగ్గర నిలబడి కూరలో పోపు పెట్టడానికి సన్నాహం చేస్తున్నాడు. సదానందమూర్తి సదా ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తూంటాడుగాని, నిత్య సందేహాస్పదమైన దిక్కుమాలిన మనస్సు మొరాయిస్తూంటుంది. సదానందమూర్తి జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి- ఐచ్ఛికంగా బ్రహ్మచారి జీవితం ఎంచుకుని- దరిమిలా, స్త్రీ విముఖత కాస్తా ద్వేషంగా వృద్ధి అవుతున్న కాలంలో ఈ కథ జరిగింది. ‘సదా’ అని ముద్దుగా పిలవబడే ఆనందమూర్తికి బాల్యంలోనే ఆనందం చంపేసింది వాళ్ల అమ్మ జగదంబ. ఆవిడికి, తన భర్త తగినవాడు కాడని గాఢమైన నమ్మకం ఉండేది. అందువల్ల - మొదటగా ద్వేషం, తరవాత క్రమంగా రంగులు మారి లోకువగా, విసుగుగా, పీడగా పరిణమించింది. అయితే, స్త్రీ పురుష సంయోగం, సంసారమన్నాక తప్పదు కనక ఇద్దరు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల కలగక తప్పలేదు. అప్పట్నించి పిల్లల్ని ప్రేమించుకుంటూ, భర్తని ద్వేషించుకుంటూ నలభై ఏళ్లు పైబడి గడిపేసింది. ఇది జగదంబ కథ కాదు గనుక - ఆవిడ భర్తను మానసికంగా భయపెట్టి, బెదిరించి, లోకువ చేసి, ఏమేమి సాధించిందో వివరాలలోకి వెళ్లే ఉద్దేశం ప్రస్తుతం అప్రస్తుతం. ఆవిడ ప్రవర్తన, తన తండ్రి సంసారపు ఇరకాటంలో పొందిన వేదన, సదానందమూర్తి మీద తీవ్ర ప్రభావం ప్రసరించాయి. దానితో సదా, సదా మాతృద్వేషిగా ఎదిగిపోయాడు. అక్కడ నుండి - కాలేజీ జీవితంలో మిత్రుల ప్రేమానుభవాలూ, తన వృత్తిలో ఎదురైన రకరకాల స్త్రీల వగలమారితనాలూ, అతన్ని ఒంటరివాడిగా ఉండిపొమ్మనే ప్రోత్సహించాయి. ఫలితంగా ‘హార్డుకోరు’ స్త్రీజన వ్యతిరేకిగా తయారయ్యాడు. తయారైన వాడు ఊరుకోకుండా కొన్ని సిద్ధాంతాలు, ప్రకటనలకు సిద్ధపడ్డాడు. మచ్చుకి మూడు: 1. యౌవనంలో మిసమిసలాడే ప్రతి స్త్రీ ప్రకృతిలో అందంగా కనిపించే తామరపూల చెరువులాంటిది. అయితే, లోపల ఒక మొసలి దాగి ఉంటుంది. ఏమరిపాటుగా ఉన్నా, సౌందర్యానికి ప్రలోభపడినా, లాగి పారేసి మగాణ్ణి సంసారం పేరిట మింగేస్తుంది. 2. స్త్రీలకు వంటింట్లోకి ప్రవేశం ఉండకూడదు. వట్టి కక్కుర్తి మేళం. కిట్టింపు వంటలు చేసి, తలతిక్క వాదనలు చేస్తారు. 3. స్త్రీకి ఉన్న శక్తిమంతమైన ఆయుధం ‘సెక్సు’. మొగ వెధవ, కోడిపుంజులాగ వెంటపడతాడని తెలుసు. దొరకబుచ్చుకొని మెడ విరిచేస్తుంది. స్త్రీకి బహుదూరులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు: భయస్థులు. రెండోవారు: అనుమానస్థులు, మూడోవారు: అహంకారస్థులు. ఇతడు ఏ బాపతో కొంచెంకొంచెం ‘స్టడీ’ చేయడం ప్రారంభించింది. సదానందమూర్తి ఆంజనేయస్వామి లాంటివాడు కూడా. పొగిడే కొద్దీ రెచ్చిపోయి ఎంతపనైనా చేసేస్తాడు. ఈ గుణం వల్లనే ముప్ఫై మూడేళ్ల వయస్సుకే జర్నలిస్టుగా బయటపడి, ప్రభుత్వం వారి ‘కల్చరల్ అఫైర్సు’ డిపార్టుమెంటులో డెరైక్టరై కూర్చున్నాడు. అన్నింటికీ మించి- ‘సదా’ ఆనందమంతా పూజలు చేయడంలో ఉంది. దైవభక్తి మెండు. ఇల్లూ ఒళ్లూ ఘాటెత్తిపోయే కూరపోపు తగిలించి- ‘సదా’ పరవశిస్తున్న వేళ, శేషుబాబు నేరుగా వంటింట్లోకి వచ్చి ఆఫీసు వార్త తెలియచెప్పాడు. శేషుబాబు, సదా దగ్గర సహాయక పదవిలో ఉన్న సంసారి. సాంస్కృతిక శాఖ సహాయంతో ఒక ప్రసిద్ధ కళాసంస్థ శాస్త్రీయ సంగీత పోటీలు గాత్రంలో నిర్వహించడం ఆ వార్త విషయం. ఏర్పాట్ల వివరాల చర్చ ప్రధానాంశం. ‘‘మీటింగు బుధవారం మధ్యాహ్నం రెండింటికి కదా! నా పూజ, భోజనం ఒంటిగంటకి గాని కావు. తెలుసుగా!- ‘ఎకార్డింగ్లీ’ ఏర్పాటు చెయ్యి-’’ అని ఆదేశించి- శేషుబాబుని, పిలవని పేరంటంగా ఇంటికి వచ్చినందుకు కొంచెం ముఖం ముడిచి- పంపేసి- స్నానానికి లేచాడు- సదా. దినపత్రికలో న్యూస్ ఎడిటర్‌గా సదానందమూర్తి పని చేసే కాలంలో - కళావతి మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ చేసి- కొత్తగా సబ్-ఎడిటర్‌గా చేరింది. అందమైంది. చలాకీ అయింది. మాటకారి. అన్నింటికీ మించి, ఈ లక్షణాలన్నీ తనకి గలవు సుమా! అనే ‘స్పృహ’ పుష్కలంగా ఉన్న పరిపూర్ణ మహిళ. కళావతికి సదానంద మూర్తి చాలా నచ్చాడు. అతని అభిప్రాయాల గురించి ఆఫీసులో కథలు కథలుగా విన్నప్పటి నుంచి, అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరిగింది. ఆఫీసులో న్యూస్టేబుల్ దగ్గర సదానందమూర్తి సింహం. పని తప్ప ఎవరితో ఏ విషయాలూ చిల్లరగా ప్రస్తావనకు రానివ్వడు. పైగా స్త్రీకి బహుదూరుడు. కళావతి ఆలోచించింది. స్త్రీకి బహుదూరులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు: భయస్తులు. రెండోవారు: అనుమానస్తులు, మూడోవారు: అహంకారస్తులు. ఇతడు ఏ బాపతో కొంచెంకొంచెం ‘స్టడీ’ చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి తేలిన విషయం ఏమంటే - ఈ ‘కేసు’ సైకలాజికల్‌గా బాల్య ప్రభావంలోంచి మొలిచినదనీ, తొందరగా నమ్మకం ఏర్పడదనీ, మొండిగా ముందుకు వెడితే, విషయం ఎదురు తిరుగుతుందనీ- ఒకటి రెండు వార్తా సందర్భాలలో అర్థమైంది. అపార్థం తొలగిస్తే సదానందమూర్తి తనకి తగిన భర్త కాగలడనే నిర్ణయానికి వచ్చింది. ఈ అన్వేషణలో ‘సదా’ భక్తీ, పూజా కైంకర్యాలూ ఆసరా అయ్యాయి. ప్రయత్నాలు ముమ్మరం చేద్దామనుకుంటున్న తరుణంలో, సదానందమూర్తి పత్రికా రంగం విడిచి, సాంస్కృతిక రంగంలో ప్రవేశించడం జరిగిపోయింది. అయితేనేం? మంచి గాయకురాలైన కళావతి తన ఉద్దేశాలు మానుకోలేదు. సాంస్కృతిక శాఖ సాయంతో, కళాసంస్థ నిర్వహించిన శాస్త్రీయ సంగీత పోటీల్లో తానూ పాల్గోదలిచానంటూ పూర్వ పరిచయం పురస్కరించుకుని - కళావతి ‘సదా’ని కలిసి కోరింది. సదా చాలా మర్యాదగానే, కళా సంస్థ వారిని కలవమని సూచించి- తనకి సంగీతం మీద ఉండే అభిరుచి వల్ల- తటస్థంగానే - పదినిమిషాలు రాగాల గురించీ, కీర్తనల గురించీ, సంగీత శాస్త్రంలో భక్తి ప్రాధాన్యం గురించీ, మాట్లాడాడు. చాలు - కళావతి సంగీత సరస్వతి గురించీ, లలితా త్రిపురసుందరీ దేవి మహిమ గురించీ, లలితా సహస్ర పారాయణ మహిమ గురించీ, సదాకి భక్తి పారవశ్యంతో వివరించింది. దాని మీదట హిందూ సంప్రదాయంలో పూజలు, యంత్రాలు, మంత్రాలు, వివిధ రకాల రాళ్ల ఉంగరాల ధారణ మహాత్మ్యం దాకా, సంభాషణ సాగింది. సదానంద మూర్తికి ఆ చర్చ ఎంతో ఆహ్లాదంగా, చల్లగా, శాంతిగా అనిపించింది. ‘‘తప్పక పోటీలో పాడండి’’ అన్నాడు సదా మెత్తబడి. ‘‘అంతా ఆ తల్లి దయ’’ అంది, కళావతి నిర్లిప్తంగా. ‘‘కళావతిగారు దీన్ని మీకిచ్చి, పూజలో పెట్టమన్నారు’’ - అన్నాడు శేషుబాబు. సదానందమూర్తి అనుమానంగా చూసి- ‘‘ఏమిటిది?’’ అన్నాడు. శేషుబాబు ఇచ్చాడు. ఉంగరం. బంగారు ఉంగరం. పచ్చరాయి ఉంగరం- సదాకి కోపం వచ్చింది- ‘‘పాడింది ఆమె. బహుమానం ఇచ్చినవాళ్లు కళాసంస్థ న్యాయనిర్ణేతలు. నాకెందుకీ ఉంగరం? దీన్ని లంచంగా ఇవ్వాలనుకుంటోందా? జడ్జిమెంటుకి, నాకు ఏమీ సంబంధం లేదు. నేను బహుమతి ఇప్పించాననుకుంటూందేమో! చెప్పు. తీసికెళ్లి ఇచ్చెయ్యి’’ శేషుబాబు భయపడి, వెనక్కి వెళ్లి కళావతికా ఉంగరం ఇచ్చేశాడు. మర్నాడు కళావతి ఉంగరం తీసుకుని సదానందమూర్తి ఇంటికి వచ్చి- ‘‘నేను దీనిని మీకిమ్మన్నది లంచంగా కాదు. మీ పూజలో పెట్టి, లలితాదేవికి కుంకంపూజ చేసి, ఆ పూజ కుంకంతో ఈ ఉంగరాన్ని మీరు నాకివ్వాలని కోరానంతే. తప్పయితే క్షమించండి’’ అంది. సదానందమూర్తి తన పొరపాటుకి నొచ్చుకున్నాడు. ఒక సాంస్కృతిక శాఖ డెరైక్టరుగా ఆ విధంగా కళావతి తన ఆశీస్సు కోరిందని గ్రహించాక- భక్తిగా ఆమె నుంచి ఉంగరం తీసుకుని- మర్నాడుదయం ఇనుమడించిన భక్తితో అమ్మవారి పూజ చేసి, కుంకం, ఉంగరం, పొట్లం కట్టి- శేషుబాబు చేత తిరిగి పంపించాడు. వారం రోజుల్లో అసలైన వార్త ఇలాగొచ్చింది: సదానందమూర్తి అనే సాంస్కృతిక శాఖ డెరైక్టరు, పంజాబులో ‘జలంధరు’ నుంచి ఒక వశీకరణ ఉంగరం తెప్పించి- పూజాకుంకంతో కూడా కళావతి అనే శాస్త్రీయ సంగీత కళాకారిణి గాత్రానికి మెచ్చుకోలుగా, కానుక పంపించి, ఆమెను వశపరుచుకున్నాడనీ- ఆ సదరు కళావతి సదానందమూర్తినే తప్ప ఇంకెవరినీ పెళ్లాడనని కూర్చుందనీ- సదానందమూర్తి భవిష్యత్తు ఎలా ఉండగలదోనని!-