ఉంగరం కథ | ring Story of indraganti srikanth sharma | Sakshi
Sakshi News home page

ఉంగరం కథ

Published Sun, Jan 11 2015 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

ఉంగరం కథ

ఉంగరం కథ

‘‘మాయా సంసారం తమ్ముడూ నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు....’’ పాటలో ఇదే చరణం పాడుకుంటూ సదానందమూర్తి వంట గట్టు దగ్గర నిలబడి కూరలో పోపు పెట్టడానికి సన్నాహం చేస్తున్నాడు. సదానందమూర్తి సదా ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తూంటాడుగాని, నిత్య సందేహాస్పదమైన దిక్కుమాలిన మనస్సు మొరాయిస్తూంటుంది.
 
సదానందమూర్తి జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి- ఐచ్ఛికంగా బ్రహ్మచారి జీవితం ఎంచుకుని- దరిమిలా, స్త్రీ విముఖత కాస్తా ద్వేషంగా వృద్ధి అవుతున్న కాలంలో ఈ కథ జరిగింది.
 ‘సదా’ అని ముద్దుగా పిలవబడే ఆనందమూర్తికి బాల్యంలోనే ఆనందం చంపేసింది వాళ్ల అమ్మ జగదంబ. ఆవిడికి, తన భర్త తగినవాడు కాడని గాఢమైన నమ్మకం ఉండేది. అందువల్ల - మొదటగా ద్వేషం, తరవాత క్రమంగా రంగులు మారి లోకువగా, విసుగుగా, పీడగా పరిణమించింది. అయితే, స్త్రీ పురుష సంయోగం, సంసారమన్నాక తప్పదు కనక ఇద్దరు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల కలగక తప్పలేదు. అప్పట్నించి పిల్లల్ని ప్రేమించుకుంటూ, భర్తని ద్వేషించుకుంటూ నలభై ఏళ్లు పైబడి గడిపేసింది.
 
ఇది జగదంబ కథ కాదు గనుక - ఆవిడ భర్తను మానసికంగా భయపెట్టి, బెదిరించి, లోకువ చేసి, ఏమేమి సాధించిందో వివరాలలోకి వెళ్లే ఉద్దేశం ప్రస్తుతం అప్రస్తుతం. ఆవిడ ప్రవర్తన, తన తండ్రి సంసారపు ఇరకాటంలో పొందిన వేదన, సదానందమూర్తి మీద తీవ్ర ప్రభావం ప్రసరించాయి. దానితో సదా, సదా మాతృద్వేషిగా ఎదిగిపోయాడు.

అక్కడ నుండి - కాలేజీ జీవితంలో మిత్రుల ప్రేమానుభవాలూ, తన వృత్తిలో ఎదురైన రకరకాల స్త్రీల వగలమారితనాలూ, అతన్ని ఒంటరివాడిగా ఉండిపొమ్మనే ప్రోత్సహించాయి. ఫలితంగా ‘హార్డుకోరు’ స్త్రీజన వ్యతిరేకిగా తయారయ్యాడు. తయారైన వాడు ఊరుకోకుండా కొన్ని సిద్ధాంతాలు, ప్రకటనలకు సిద్ధపడ్డాడు. మచ్చుకి మూడు:
 1. యౌవనంలో మిసమిసలాడే ప్రతి స్త్రీ ప్రకృతిలో అందంగా కనిపించే తామరపూల చెరువులాంటిది. అయితే, లోపల ఒక మొసలి దాగి ఉంటుంది. ఏమరిపాటుగా ఉన్నా, సౌందర్యానికి ప్రలోభపడినా, లాగి పారేసి మగాణ్ణి సంసారం పేరిట మింగేస్తుంది.
 2. స్త్రీలకు వంటింట్లోకి ప్రవేశం ఉండకూడదు. వట్టి కక్కుర్తి మేళం. కిట్టింపు వంటలు చేసి, తలతిక్క వాదనలు చేస్తారు.
 3. స్త్రీకి ఉన్న శక్తిమంతమైన ఆయుధం ‘సెక్సు’. మొగ వెధవ, కోడిపుంజులాగ వెంటపడతాడని తెలుసు. దొరకబుచ్చుకొని మెడ విరిచేస్తుంది.

స్త్రీకి బహుదూరులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు: భయస్థులు. రెండోవారు: అనుమానస్థులు, మూడోవారు: అహంకారస్థులు. ఇతడు ఏ బాపతో కొంచెంకొంచెం ‘స్టడీ’ చేయడం ప్రారంభించింది.
 
సదానందమూర్తి ఆంజనేయస్వామి లాంటివాడు కూడా. పొగిడే కొద్దీ రెచ్చిపోయి ఎంతపనైనా చేసేస్తాడు. ఈ గుణం వల్లనే ముప్ఫై మూడేళ్ల వయస్సుకే జర్నలిస్టుగా బయటపడి, ప్రభుత్వం వారి ‘కల్చరల్ అఫైర్సు’ డిపార్టుమెంటులో డెరైక్టరై కూర్చున్నాడు. అన్నింటికీ మించి- ‘సదా’ ఆనందమంతా పూజలు చేయడంలో ఉంది. దైవభక్తి మెండు.
 
ఇల్లూ ఒళ్లూ ఘాటెత్తిపోయే కూరపోపు తగిలించి- ‘సదా’ పరవశిస్తున్న వేళ, శేషుబాబు నేరుగా వంటింట్లోకి వచ్చి ఆఫీసు వార్త తెలియచెప్పాడు. శేషుబాబు, సదా దగ్గర సహాయక పదవిలో ఉన్న సంసారి.
 సాంస్కృతిక శాఖ సహాయంతో ఒక ప్రసిద్ధ కళాసంస్థ శాస్త్రీయ సంగీత పోటీలు గాత్రంలో నిర్వహించడం ఆ వార్త విషయం. ఏర్పాట్ల వివరాల చర్చ ప్రధానాంశం.
 ‘‘మీటింగు బుధవారం మధ్యాహ్నం రెండింటికి కదా! నా పూజ, భోజనం ఒంటిగంటకి గాని కావు. తెలుసుగా!- ‘ఎకార్డింగ్లీ’ ఏర్పాటు చెయ్యి-’’ అని ఆదేశించి- శేషుబాబుని, పిలవని పేరంటంగా ఇంటికి వచ్చినందుకు కొంచెం ముఖం ముడిచి- పంపేసి- స్నానానికి లేచాడు- సదా.
 
దినపత్రికలో న్యూస్ ఎడిటర్‌గా సదానందమూర్తి పని చేసే కాలంలో - కళావతి మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ చేసి- కొత్తగా సబ్-ఎడిటర్‌గా చేరింది. అందమైంది. చలాకీ అయింది. మాటకారి. అన్నింటికీ మించి, ఈ లక్షణాలన్నీ తనకి గలవు సుమా! అనే ‘స్పృహ’ పుష్కలంగా ఉన్న పరిపూర్ణ మహిళ. కళావతికి సదానంద మూర్తి చాలా నచ్చాడు. అతని అభిప్రాయాల గురించి ఆఫీసులో కథలు కథలుగా విన్నప్పటి నుంచి, అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరిగింది.

ఆఫీసులో న్యూస్‌టేబుల్ దగ్గర సదానందమూర్తి సింహం. పని తప్ప ఎవరితో ఏ విషయాలూ చిల్లరగా ప్రస్తావనకు రానివ్వడు. పైగా స్త్రీకి బహుదూరుడు. కళావతి ఆలోచించింది. స్త్రీకి బహుదూరులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు: భయస్తులు. రెండోవారు: అనుమానస్తులు, మూడోవారు: అహంకారస్తులు. ఇతడు ఏ బాపతో కొంచెంకొంచెం ‘స్టడీ’ చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి తేలిన విషయం ఏమంటే - ఈ ‘కేసు’ సైకలాజికల్‌గా బాల్య ప్రభావంలోంచి మొలిచినదనీ, తొందరగా నమ్మకం ఏర్పడదనీ, మొండిగా ముందుకు వెడితే, విషయం ఎదురు తిరుగుతుందనీ- ఒకటి రెండు వార్తా సందర్భాలలో అర్థమైంది. అపార్థం తొలగిస్తే సదానందమూర్తి తనకి తగిన భర్త కాగలడనే నిర్ణయానికి వచ్చింది.

ఈ అన్వేషణలో ‘సదా’ భక్తీ, పూజా కైంకర్యాలూ ఆసరా అయ్యాయి. ప్రయత్నాలు ముమ్మరం చేద్దామనుకుంటున్న తరుణంలో, సదానందమూర్తి పత్రికా రంగం విడిచి, సాంస్కృతిక రంగంలో ప్రవేశించడం జరిగిపోయింది. అయితేనేం? మంచి గాయకురాలైన కళావతి తన ఉద్దేశాలు మానుకోలేదు.
 
సాంస్కృతిక శాఖ సాయంతో, కళాసంస్థ నిర్వహించిన శాస్త్రీయ సంగీత పోటీల్లో తానూ పాల్గోదలిచానంటూ పూర్వ పరిచయం పురస్కరించుకుని - కళావతి ‘సదా’ని కలిసి కోరింది. సదా చాలా మర్యాదగానే, కళా సంస్థ వారిని కలవమని సూచించి- తనకి సంగీతం మీద ఉండే అభిరుచి వల్ల- తటస్థంగానే - పదినిమిషాలు రాగాల గురించీ, కీర్తనల గురించీ, సంగీత శాస్త్రంలో భక్తి ప్రాధాన్యం గురించీ, మాట్లాడాడు.
 
చాలు - కళావతి సంగీత సరస్వతి గురించీ, లలితా త్రిపురసుందరీ దేవి మహిమ గురించీ, లలితా సహస్ర పారాయణ మహిమ గురించీ, సదాకి భక్తి పారవశ్యంతో వివరించింది. దాని మీదట హిందూ సంప్రదాయంలో పూజలు, యంత్రాలు, మంత్రాలు, వివిధ రకాల రాళ్ల ఉంగరాల ధారణ మహాత్మ్యం దాకా, సంభాషణ సాగింది.
 సదానంద మూర్తికి ఆ చర్చ ఎంతో ఆహ్లాదంగా, చల్లగా, శాంతిగా అనిపించింది. ‘‘తప్పక పోటీలో పాడండి’’ అన్నాడు సదా మెత్తబడి. ‘‘అంతా ఆ తల్లి దయ’’ అంది, కళావతి నిర్లిప్తంగా.

‘‘కళావతిగారు దీన్ని మీకిచ్చి, పూజలో పెట్టమన్నారు’’ - అన్నాడు శేషుబాబు. సదానందమూర్తి అనుమానంగా చూసి- ‘‘ఏమిటిది?’’ అన్నాడు. శేషుబాబు ఇచ్చాడు. ఉంగరం. బంగారు ఉంగరం. పచ్చరాయి ఉంగరం-

సదాకి కోపం వచ్చింది-
‘‘పాడింది ఆమె. బహుమానం ఇచ్చినవాళ్లు కళాసంస్థ న్యాయనిర్ణేతలు. నాకెందుకీ ఉంగరం? దీన్ని లంచంగా ఇవ్వాలనుకుంటోందా? జడ్జిమెంటుకి, నాకు ఏమీ సంబంధం లేదు. నేను బహుమతి ఇప్పించాననుకుంటూందేమో! చెప్పు. తీసికెళ్లి ఇచ్చెయ్యి’’ శేషుబాబు భయపడి, వెనక్కి వెళ్లి కళావతికా ఉంగరం ఇచ్చేశాడు.
 
మర్నాడు కళావతి ఉంగరం తీసుకుని సదానందమూర్తి ఇంటికి వచ్చి- ‘‘నేను దీనిని మీకిమ్మన్నది లంచంగా కాదు. మీ పూజలో పెట్టి, లలితాదేవికి కుంకంపూజ చేసి, ఆ పూజ కుంకంతో ఈ ఉంగరాన్ని మీరు నాకివ్వాలని కోరానంతే. తప్పయితే క్షమించండి’’ అంది.
 సదానందమూర్తి తన పొరపాటుకి నొచ్చుకున్నాడు. ఒక సాంస్కృతిక శాఖ డెరైక్టరుగా ఆ విధంగా కళావతి తన ఆశీస్సు కోరిందని గ్రహించాక- భక్తిగా ఆమె నుంచి ఉంగరం తీసుకుని- మర్నాడుదయం ఇనుమడించిన భక్తితో అమ్మవారి పూజ చేసి, కుంకం, ఉంగరం, పొట్లం కట్టి- శేషుబాబు చేత తిరిగి పంపించాడు.
 
వారం రోజుల్లో అసలైన వార్త ఇలాగొచ్చింది: సదానందమూర్తి అనే సాంస్కృతిక శాఖ డెరైక్టరు, పంజాబులో ‘జలంధరు’ నుంచి ఒక వశీకరణ ఉంగరం తెప్పించి- పూజాకుంకంతో కూడా కళావతి అనే శాస్త్రీయ సంగీత కళాకారిణి గాత్రానికి మెచ్చుకోలుగా, కానుక పంపించి, ఆమెను వశపరుచుకున్నాడనీ- ఆ సదరు కళావతి సదానందమూర్తినే తప్ప ఇంకెవరినీ పెళ్లాడనని కూర్చుందనీ- సదానందమూర్తి భవిష్యత్తు ఎలా ఉండగలదోనని!-

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement