ప్రముఖ కవి, రచయిత, సంపాదకులు, సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గురువారం (నిన్న) తెల్లవారు జామున మృతి చెందారు. గతంలో వారు సాక్షికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని విశేషాలను ఈ సందర్భంగా పాఠకులకు మరోసారి గుర్తుచేస్తున్నాం.
‘‘పిల్లలు ఎంత లావుగా ఉన్నారన్నది కాదు, ఎంత బలంగా, ఆరోగ్యంగా ఉన్నారన్నదే ప్రధానం. మా పిల్లలకు మేము ఇన్నిసార్లు తినిపిస్తున్నామని గొప్పలు చెప్పుకునే తల్లిదండ్రులు పిల్లలను అసలు విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నామో లేదో ఆత్మవిమర్శ చేసుకోవాలి’’
‘‘ఫలానా పుస్తకం చదవద్దు, ఫలానా ఛానల్ చూడద్దు, ఆ సినిమా చూడద్దు, ఆ సైట్ జోలికి వెళ్లద్దు అని పిల్లలకు ఆంక్షలు విధించడం వల్ల మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనం గుప్పిట మూసి ఉంచినప్పుడు పిల్లలకు అందులో ఏముందో చూడాలన్న కుతూహలం పెరుగుతుంది. అదే ఓపెన్‌గా ఉంచితే ఆ గొడవే ఉండదు’’ అంటారు సుప్రసిద్ధ కవి, కథారచయిత ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ‘అలా పెంచాం’ కోసం ఆ దంపతులను కలిసినప్పుడు తమ పిల్లల చదువుల విషయం, తాము వారిని పెంచిన తీరుతెన్నులూ వివరించారిలా!
‘‘మాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మాయి కిరణ్మయి టొరెంటోలోని యార్క్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ యూనివర్శిటీలో ఫిలిమ్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేసింది. ప్రస్తుతం రాఫ్ట్‌లో ఫాకల్టీ మెంబర్‌గా పని చేస్తోంది.
అబ్బాయి మోహనకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎం.ఎ. ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన తర్వాత ఎం.ఫిల్ చేశాడు. కెనడాలో ఎం.ఎఫ్.ఎ. చేశాడు. అక్కడే పీహెచ్‌డీ చేస్తూ ఉంటే అకడమిక్‌గా ఎదగడమే తప్ప మనం నేర్చుకున్నదానిని అమలు చేయడానికి వీలు కాదనే ఉద్దేశ్యంతో 2001లో ఇండియా వచ్చేశాడు. చలంగారి ‘దోషగుణం’ అనే కథ ఆధారంగా ‘గ్రహణం’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ చిత్రానికి ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం లభించింది. ఆ తర్వాత అష్టాచెమ్మా, మాయాబజార్, గోల్కొండ హైస్కూల్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం చేతిలో ఇంకొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు.
నమ్మాము... ఆచరించాము
మా పిల్లల బాల్యం అంతా విజయవాడలోనే గడిచింది. వారి చదువులు అయిపోయాకనే మేము హైదరాబాద్ వచ్చాము. మేమిద్దరం మా పిల్లలు ఏం చదువుకుంటామంటే అదే చదువుకోనిచ్చాము. నచ్చిన పుస్తకాలు చదువుకోమన్నాము. వాళ్ల పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే మా ఇద్దరి ఫిలాసఫీ ఒకటే... పిల్లలు తమకు నచ్చిన చదువులు చదువుకోవాలి, ఇష్టమైన ఉద్యోగం చేయాలి. ఇష్టపడ్డవారిని పెళ్లి చేసుకోవాలి. వాళ్లు మనకు పిల్లలుగా పుట్టినంత మాత్రాన తల్లిదండ్రుల అభిప్రాయాలను వాళ్లపై రుద్దడం సబబు కాదని మా ఉద్దేశ్యం. వారి జీవితం వారిది. వాళ్లకు ఎన్నేళ్లొచ్చినా ప్రతిదీ మన ఇష్టప్రకారమే నడుచుకోవాలనుకోవడం వల్ల వారు స్వతంత్రంగా ఎదగలేరు! వాళ్లు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోలేనప్పుడు మాత్రం మన సహాయ సహకారాలు అందించాలి. మేము నమ్మిన ఈ సూత్రాలను అక్షరాలా పాటించాము. మా పిల్లలు మంచి పుస్తకాలు చదివారు, మంచి సినిమాలు చూశారు. మంచి సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సంగీతంలో, పాటలలో కూడా మంచి అభినివేశం ఉండేది. వక్తృత్వం, వ్యాసరచన... వంటి పోటీలలో ఉత్సాహంగా పాల్గొనేవారు.
ఎలా జరిగిందన్నది కాదు...
పెళ్ళిళ్ల విషయంలో కూడా మేం వారిని నిర్బంధించలేదు. వాళ్లు ఎవరిని ఇష్టపడ్డారో వాళ్లనే చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మా అమ్మాయిది కులాంతర వివాహం. ‘మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం, జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం‘ అని చెప్పినప్పుడు నేనేమీ కంగారుపడలేదు. పైగా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సింపుల్‌గా జరిగిన వారి పెళ్లికి నేనే వెళ్లి సాక్షి సంతకం పెట్టివచ్చాను కూడా! ఎందుకంటే సాధారణంగా మేము ఫలానా వారిని ఇష్టపడుతున్నాము, వారినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని పిల్లలు చెప్పడం, తల్లిదండ్రులు అందుకు అభ్యంతరపెట్టడం, వద్దని బతిమాలడం, బెదిరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగని వారు ఏం చేస్తే అది కళ్లు మూసుకుని ఆమోదించాలని ఉద్దేశ్యం కాదు. వాళ్లకి అందులోని మంచి చెడులను వివరించాలి. అప్పుడు వాళ్లంతట వాళ్లే తమకు ఏది మంచో గ్రహిస్తారు. అలాగే పెళ్లి ఎవరితో, ఎలా జరిగిందన్నది సమస్య కానే కాదు, వారి వైవాహిక జీవితం ఎంత బాగున్నది, ఎంత ఫలప్రదంగా ఉన్నదనేది ప్రధానం. జీవితాంతం కలిసి ఉండేదీ, కాపురం చేయవలసినదీ వాళ్లే కదా! మా అబ్బాయి మోహన కృష్ణదీ ప్రేమవివాహమే! తన క్లాస్‌మేట్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా ఇద్దరు పిల్లలూ సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. వారిని చూసి మాకు ఆనందంగా ఉంది.
‘‘అసలు పెద్దవాళ్లకూ, పెళ్లయిన తర్వాత పిల్లలకూ భేదాభిప్రాయాలు వచ్చే సందర్భం ప్రధానంగా డబ్బు విషయంలోనే ఎదురవుతుంది. పిల్లలు ఎడాపెడా ఖర్చు పెడుతున్నారని, దుబారా చేస్తున్నారని తిట్టడం సరికాదు. అలాగే కోడలు తాను సంపాదిస్తోంది కదా అని కొడుకును నిర్లక్ష్యం చేస్తోందని అత్తమామలు అనుకోవడం, అదే విషయాన్ని పదే పదే కొడుకుతో అంటుండటం మూలాన వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కలగడం మినహా ప్రయోజనం ఏముంటుంది? ’’ సంభాషణ: డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment