ఆశ దివ్వెలా వెలుగుతుంటే...
పాటతత్వం
అన్నీ తానై పెంచిన మామయ్య ప్రేమ ఒకవైపు. మనసు కోరుకున్న మనిషి మరోవైపు. ఈ సంఘర్షణలో పుట్టిన కథే ‘ఎగిరే పావురమా’. నేను దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘ఎగిరే పావురమా’ నాకు చాలా ఇష్టం. ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్న కథ ఇది. శ్రీకాంత్, లైలా, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో వన భోజనాల సందర్భం ఒకటి ఉంది. దాని కోసం మంచి పాట రాయించాలని అనుకున్నాం. మనుషుల మధ్య దూరం పెరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కలుసుకోవాలంటే ఎప్పటికోగానీ తీరిక ఉండటం లేదు.
అందరూ కలిసి ఒక రోజు తోటలో వంటలు వండుకుని, ఆటపాటలతో గడిపితే ఎంత బాగుంటుంది అనిపించింది. సుహాసిని పాత్రతో ఈ మాట చెప్పించి పాటకు కథలో స్థానం కల్పించాం. భువన చంద్ర గారికి చెబితే అద్భుతమైన పాట రాసిచ్చారు. నా సినిమాలకు నేనే సంగీత దర్శకత్వం వహిస్తాను. ట్యూన్‌కు రాసిన పాట ఇది... పల్లవి చాలా కొత్తగా అనిపించింది.
రోనా లైలా వానలాగా..
నిన్న కల్లోకొచ్చి పాడిందొక్క పాటా
మేడమ్ రంభా స్వర్గంలోనా
కాటేజ్ ఇప్పిస్తాను ఆడేయ్‌మంది ఆటా
విశ్వమిత్రా రాజపుత్రా..
ట్యూనింగ్ చేసేయ్ నీ పాటా
హృదయపు కితకితలో..
సరదా పాటలు చాలా విని ఉంటాం కానీ.. ఈ పాట చాలా కొత్త కొత్త పదాలతో భువనచంద్ర గారు రాశారు.
రోనా లైలా వానలాగా నిన్న కల్లోకొచ్చి పాడిదొక్క పాటా... మేడమ్ రంభా స్వర్గం లోనా కాటేజ్ ఇప్పిస్తాను ఆడేయ్ మంది ఆటా... పల్లవిలోని ఈ వరుసలు భువనచంద్ర సృష్టించిన నూతన సాహిత్య ఒరవడిని చూపిస్తాయి. చరణంలో ఈ పదాల జోరు పెంచి ఇలా రాశారు..
పసిఫిక్ ఓషన్ చెక్కిలిపైనా..
ఫుల్‌మూన్ లైటూ పడుతూ ఉంటే..
సాగర కెరటం రాకెట్ ఎక్కి...
రోదసి ఎదలో నిద్దురపోతే..
అది ఒక ఇదిలే పరువపు సొదలే
మనసుకు తెలిసిన కథలే
విలవిలలాడే యక్షుడి విరహపు వ్యథలే
లేఖలు తెచ్చే మబ్బులు కరువై
కార్డ్‌లెస్ ఫోన్ లో కాంటాక్ట్ చేశామ్
కబురులు ఎవ్వరు తెచ్చిననేమి
కుశలము తెలియుట ముఖ్యముగానీ
పసిఫిక్ ఓషన్ చెక్కిలి, సాగర కెరటం రాకెట్, రోదసి ఎద, యక్షుడి విరహ వ్యథ...
అంటూ గ్రాంథిక, ఆధునిక భాషల కలయికలో ఓ కొత్త పాటను భువనచంద్ర ఆవిష్కరించారు. ఇక రెండో చరణంలో మాసిడోనియా గుర్రాన్నీ, ఆల్ఫ్ పర్వతాల అంచుల్నీ పట్టుకొచ్చి పాటలో కూర్చారాయన.
మాసిడోనియా గుర్రం లాగా
నీడ తోడుకై పరిగెడుతుంటే
ఆల్ఫ్ పర్వతం మొదటి అంచునా
ఆశ దివ్వెలా వెలుగుతు ఉంటే
తనువుల సెగలే తొణికిన కురులై
సూర్యుని కప్పిన వేళా
పెదవుల జారే కవితల కోసం
కోయిల వేచిన వేళా
హార్ట్ స్టూడియో తలుపులు తెరిచా
విశ్వచిత్రమే ప్రేమగ మలిచా
పాట చివర్లో వచ్చే ‘దిస్ ఈజ్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్’ అనే లైన్ హీరో హీరోయిన్లతో కలిసి మిగతా వారంతా పాడతారు. అంటే ఆ ఇద్దరి ప్రేమను అంతా ఇష్టపడుతున్నారని సింబాలిక్ గా చెప్పించాం.
పాట రాయడంలో భువనచంద్ర ఏకాగ్రత చాలా గొప్పది. ఆయన అరణ్యంలోని ప్రశాంతతలో ఉన్నా... ట్రాఫిక్ గోల మధ్య ఉన్నా పాట రాయడంలో ఒకే శ్రద్ధ చూపిస్తారు. ఏ దారిలో వెళ్లినా మంచి పాట అనే గమ్యాన్ని చేరుకునే రచయిత భువనచంద్ర. ‘ఎగిరే పావురమా’ సినిమా పూర్తిగా అరకులో చిత్రీకరించాం. అక్కడి లొకేషన్ల అందాలకు మరింత అందమైన పాటలు తోడై సినిమా విజయంలో పాలుపంచుకున్నాయి.
ఎగిరే పావురమా లైలాకు తొలి సినిమా.
అమాయకపు యువతి పాత్రలో ఆమె చాలా బ్యూటిఫుల్‌గా నటించారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమాకు లైలానే ప్రధానాకర్షణ. మరో రెండు ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్, జేడీ చక్రవర్తి సహజంగా నటించారు. ఎంతో ప్రతిభ ఉండీ... ఆర్థిక పరిస్థితులతో కార్పెంటర్ పనిచేస్తుంటాడు శ్రీకాంత్. అలాంటి వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతుంది లైలా. మేనకోడలు ను పెళ్లి చేసుకోవాలన్న జేడీ చక్రవర్తి ఆలోచన లోనూ... ఆమెను బాధ్యతగా చూసుకోవాలన్న ఆలోచనే ఉంటుంది. ఇలా సినిమాలో మూడు మంచి పాత్రల విలక్షణత, సంఘర్షణ ప్రేక్షకులని ఆకట్టుకుంది.
సేకరణ: రమేష్ గోపిశెట్టి
- భువనచంద్ర, గీత రచయిత
- ఎస్.వి.కృష్ణారెడ్డి, దర్శకుడు