ఇప్పటికీ నడుస్తున్నది వేటూరి ట్రెండే! | still veturi trend is going | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ నడుస్తున్నది వేటూరి ట్రెండే!

Published Wed, Jan 29 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

ఇప్పటికీ నడుస్తున్నది వేటూరి ట్రెండే!

ఇప్పటికీ నడుస్తున్నది వేటూరి ట్రెండే!

వేటూరి ఓ నిరంతర అన్వేషి. మనో యాత్రికుడు. ఓ మహా వేదాంతి... అన్నిటినీ మించి లోకేశ్వరుడంత ‘ఏకాకి’. ఈ మాటే ఒకసారి నేను వేటూరి గారిని అడిగాను. ఆయన తనదైన ‘చిరునవ్వు’ నవ్వి, ‘అవును’ అన్నారు. ఆ తరవాత చాలాసేపు కళ్లు మూసుకుని ‘‘నేను వెతుకుతూనే ఉన్నాను దేనికోసమో..! దేనికోసమో తెలీదు గానీ వెతుకుతూనే ఉన్నాను. అది దొరికే వరకూ నా ఒంటరితనం పోదు... బహుశా... నన్ను ‘నేనే’ వెతుక్కుంటున్నానేమో’’ అన్నారు. భారతీయమైన వేదాంతాన్నంతట్నీ ఒక్కముక్కలో చెప్పారాయన.
 
  రమణమహర్షి అన్నదీ అదేగా. ‘‘హూయామ్ ఐ? నేనెవరూ?’’ అన్న ప్రశ్న వేసుకోమన్నారు అంటే నిన్ను నువ్వు వెతుక్కోమనేగా! 
 వేటూరిగారి గురించి చెప్పాలంటే ఒకే భాష వుంది... అది ‘మనోభాష’. దాని పేరు ‘మౌనం’. ఎందుకంటే అక్షరాల వెనుక ‘అనుభూతి’ని పొదిగిన రచయిత వేటూరి. అక్షరాలకి అర్థాలుంటాయి. అనుభూతికీ? ఊహూ... అక్షరాలకి అతీతమైనదది. ప్రతి మాటా, ప్రతి పాటా ఆణిముత్యమే. పాటల్ని అందరం పంచుకోగలం. ఆయన ‘మాటల్ని’ దాచుకోగలిగే భాగ్యం ‘నాకూ’ దక్కింది. 
 
 ఓసారి కళ్లు మూసుకుని కూర్చున్నా. ఆయన రాకని గమనించలా. చాలా సేపయ్యాక కళ్లు తెరిచి చూస్తే ఎదుటే కుర్చీలో ఆయన.  ‘‘క్షమించండి... చూళ్లేదు’’ కంగారుగా లేచి పాదాలకి నమస్కరించా. ‘‘ఆయుష్మాన్‌భవ’’ అని, ‘‘ఏమిటీ... మనసు బాగోలేదా?’’ అన్నారు. అంటే ఆయన చూసింది నన్ను కాదు... ‘నా మనసుని’ అనిపించింది. ‘‘అవును గురూగారూ... ఎన్ని వెర్షన్లు రాసినా పాట ఓకే కావడం లేదు’’ అన్నాను. ‘‘ఇక్కడ చూడు...’’ అని తన శరీరం వంక చూపించి, ‘‘బాగోలేదు... ఇంకో వెర్షన్ రాయండి...’’ అని క్షణంలో వాళ్లంటారు. కానీ ఎన్ని నరాలు తెగుతాయో, ఎన్ని చుక్కల రక్తం మెదడులో గడ్డ కడుతుందో, వాళ్లకేం తెలుసూ? నా మెదడు నిండా గాయాలే...’’ నవ్వారాయన. ప్రతీ పాటకీ ఇక్కడ జరిగేది పోస్టుమార్టమే. చిత్రం ఏమంటే యీ ‘చిత్ర హింస’ సముద్రాల, ఆరుద్ర, వేటూరి వంటి మనో పండితులకే గాక, సరికొత్త రచయితకీ తప్పదు.
 
 ఆయన ఏనాడూ ఉపన్యాస ధోరణి అవలంభించలా. చాలా క్లుప్తంగా వుంటాయి ఆయన సమాధానాలు. అర్థం మాత్రం అనంతం. ఓసారి ఓ పాట ట్యూన్‌కొచ్చింది. పాట రికార్డ్ అయ్యాక తెలిసింది. ఆ పాట ట్యూన్ వేటూరిగారి కిచ్చారనీ, ఆయనా రాశారనీ. తరవాత వేటూరిగార్ని కలిసినప్పుడు, ‘‘సార్ ఆ ట్యూన్ మీకిచ్చారనీ, మీరు పాట వ్రాశారనీ నిజంగా నాకు తెలీదు... మీకిచ్చిన పాట రాసే ధైర్యం నేనేనాడూ చెయ్యను. చెయ్యలేను’’ అన్నాను. ‘‘నాకు తెలుసు నాయనా... వీళ్లు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ‘నిబద్ధత’ వుండేది. ఇప్పుడది లేదు. వచ్చింది రాసెయ్యడమే. ఎవరెవరికి అదే ట్యూన్ ఇచ్చారో ఎలా తెలుస్తుందీ? పాట రాసినా పాడినా అన్నీ ప్రాప్తాన్ని బట్టేగా!’’ అన్నారు.
 
 ఓసారి సౌండ్ ఇంజినీర్ రామకృష్ణగారి రూమ్‌లో వుండగా అంటే, వేటూరిగారూ, రామకృష్ణగారూ, కోటి, రాజ్, నేనూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వుండగా, ‘‘నటులు కెమేరా ముందు పాత్రలు ధరిస్తే మనం మనస్సులో ఆ పాత్రల్ని ధరిస్తాం... లేకపోతే మీకు ‘ట్యూనూ’ రాదు... మా పాట ‘పాత్రకి సరిపోదు’. అన్నారు. అసలీ అవగాహన ఎంతమందికున్నదీ? ఒకే ట్యూన్‌లో రాసే, లేక ఒదిగే మాటలు ‘హీరో’ని బట్టి మారిపోతుంటే ఆ హీరోని మనసులో పెట్టుకుంటేగానీ అతనికి సరిపోయే మాటలు పడవు. ఇక సన్నివేశానికి సంబంధించిన పాటల కథ వేరు. సన్నివేశమే కవికి చెప్తుంది... ఏం రాయాలో! ఇటు హీరోచితమైనవీ - అటు వీరోచితమైనవీ - కొన్ని ‘నటన’ని నేర్పేవీ (నిజంగా... పాట వింటుంటేనే నటన శరీరంలో ఉద్భవిస్తుంది) ఎన్ని రకాల పాటలు వ్రాశారో లెక్కలేదు. ప్రతి పాటా ఓ పాఠ్యగ్రంథమే. 
 
 సినిమా పాటల్ని విభజించాలంటే రెండు భాగాలుగా విభజించాలి. ‘వేటూరి రాకముందు పాటలూ... వేటూరి పాటలూ’ అంతే. ఇప్పటికీ నడుస్తున్నది వేటూరి ట్రెండే! మరో ‘ట్రెండు’ మొదలవ్వాలంటే వేటూరి పద సముద్రాన్ని యీదుకుని అవతల ఒడ్డుకి చేరాలి. సాధ్యమా? ఆయన నిజంగా చాలా మంచి హోస్టు. అనుభవించిన వారికే ఆయన ‘తండ్రి’ హృదయం తెలుస్తుంది. ఉన్నట్టుండి ‘‘పులిహోర తిందామా?’’ అని, మమ్మల్ని (నేనూ, మరో అసిస్టెంటు డెరైక్టరూ) కార్లో ‘సవేరా’కి తీసికెళ్లారు. పులిహోర ‘చేయించిమరీ’ తినిపించారు. ‘నాయనా ఆవకాయ అన్నంలో కందిపొడి కలిపితే చాలా రుచిగా వుంటుంది. అలాగే గోంగూర పచ్చడీ!’’ అన్నారు. ఇప్పటివరకూ ఆ రుచికరమైన ‘మెనూ’నే ఫాలో అవుతూ ఉన్నాను.
 
 ‘పాట’కి పల్లకీలు కట్టిన రచయితలెందరో వున్నా, ఆర్థికంగా రచయితని అందలమెక్కించిన వారు మాత్రం కచ్చితంగా వేటూరిగారు ఒక్కరే. పాటకి అయిదొందలో వెయ్యో ఉండే రెమ్యునరేషన్ని అమాంతంగా పెంచి, రచయితకి గౌరవస్థానం కల్పించింది మాత్రం వేటూరిగారు. ‘‘అవును... మన కష్టానికి తగిన  ప్రతిఫలం తప్పక తీసుకోవాల్సిందే. అడక్కపోతే అమ్మయినా పెట్టదుగా!’’ అనేవారు. ‘‘ఫలానా ఘనుడు పాట రాయించుకుని డబ్బులు ఎగ్గొట్టాడు గురూగారు’’ అని ఓ నాడు నేనాయనతో అంటే, ‘‘రోలు వొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది!’’ అన్నారు నవ్వుతూ. ‘‘మీక్కూడానా?’’ అన్నాను ఆశ్చర్యంగా. ‘‘వడ్డికాసుల వాడికే ఎగ్గొట్టే మహానుభావులున్నారు నాయనా!’’ అన్నారు అదే చిరునవ్వుతో. 
 
 నాకు ఆయన దగ్గర శిష్యరికం చెయ్యాలనిపించేది. రచయితగా కాదు... ఆధ్యాత్మికంగా. ఆయన ‘లోపలి మనిషి’ ఎలా వుంటారో ఊహాతీతమే. కవిగా, నాటకకర్తగా, పాత్రికేయుడిగా ఇలా అనేక ముఖాలు వేటూరికి వున్నా, ఆయనలో వున్న ‘దాత’ చాలా తక్కువమందికి తెలుసు. ఎంతమందికి అడక్కుండా ‘డబ్బిచ్చి’ ఆదుకున్నారో, ఎందర్ని హాస్పటల్ ఫీజుల రూపంలో బతికించారో చాలామందికి తెలీదు. నాకూ తెలీదు. ప్రతిఫలాన్ని పొందిన వాళ్లు చెప్పేదాకా. అప్పుడర్థమైంది. ఆయన పబ్లిసిటీ కోరని పరమేశ్వరుడని. ఆయన ‘‘రైటర్స్ రైటర్...’’. ప్రతి పాటా ఓ అధ్యయన గ్రంథమే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనది ఓ సువర్ణాధ్యాయం. తెలుగు పాట ఉన్నంత కాలం ఆయన బ్రతికే వుంటారు... మన శ్వాసగా మన గుండెలోతుల్ని స్పృశిస్తూ..
   భక్తితో... భువనచంద్ర
 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement