బెజవాడ–గుంటూరు రోడ్డు మీద తుపాకి గుండులా దూసుకుపోతోంది బైక్. పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. చల్లగాలి సుఖంగా ఉంది. రాత్రి తొమ్మిందిటికి బెజవాడలో షాపింగ్ పూర్తి చేసుకుని రాజారావు శరవేగంతో గుంటూరు వస్తున్నాడు. మర్నాడు ఉదయం పోలీసు ఉద్యోగానికి అతనికి ఇంటర్వ్యూ.
రాజారావు షికారీలో ఆరితేరాడు. గుండెబలం, కండబలం గలవాడు. ముక్త్యాల ప్రాతం అడవుల్లో గండు పులుల్ని మట్టుపెట్టి మాయం చేసిన దిట్ట. అలా శరంలా దూసుకుపోతున్న రాజారావుకు గబిక్కిన ఏదో గగ్గోలు వినిపించింది.
చుట్టపట్ల కలయచూశాడు. బైక్ పరిగెడుతూనే ఉంది. మార్గం నిర్మానుష్యంగా ఉంది. ఏమీ కనిపించలేదు.
ఈదురుగాలులు చెవిలో విసిరి కొడుతున్నాయి. ఆ ఒంటరితనం అతన్ని భయపెట్టబోయి తెల్లబోయిందా అన్నట్లు మసక వెన్నెల అంతటా ఆకట్టుకుంది. రోడ్డు మీద తన ముందు అరఫర్లాంగు దూరంలో ఒక కారు అమిత వేగంగా పోతోంది. ఈసారి మళ్ళీ అలికిడి వినిపించింది. భయంకరమైన అరుపేదో వికారంగా వినిపించింది. అది తన ముందున్న కారులోంచే వస్తున్నట్లు అనిపించింది. పసిగట్టిన రాజారావు లాగు జేబులో తుపాకి తడిమి చూసుకున్నాడు.
ఆ గగ్గోలు ఏదో స్త్రీ కంఠం. స్త్రీ ఆర్తనాదం. రాజారావుకు ఉద్వేగం ఎక్కువైంది. దాంతో వేగం హెచ్చించాడు.
క్షణం వితర్కించి ‘అవును, బహుశా ఆ కారులో ఎవరో దుండగులు స్త్రీని అపహరించి బలాత్కారం చేస్తున్నారు’ అనుకున్నాడు రాజారావు.
అరుపు మళ్ళీ వికృతంగా వినిపించింది. రెచ్చిపోయి వేగం హెచ్చించేశాడు రావు. ముందు కారు మరింత వేగంగా దూసుకుపోతోంది.
కారును దాటి పోవాలని సైడ్ కోసం హాక్ చేశాడు. అట్నించి వచ్చి రోడ్డు కడ్డంగా ఖణాయిస్తే కారు ఆగిపోవాల్సిందే....ఇలా ఊహించాడు. కారు వ్యక్తి సైడ్ ఇవ్వలేదు. రావుకి అనుమానం దృఢపడింది. కారుదాటి దారికడ్డంవచ్చి ఆ కిరాతకుణ్ణి పట్టేసుకోవడం ఎలా? అతని మోటర్ బైక్ రోడ్డుపై ఉక్కిరిబిక్కిరి అయింది.
ఇంతలో మార్గంలో మలుపు వచ్చింది. కారు మలుపు తిరుగుతోంది. ఇదే సమయమని పక్క సందుగా రివ్వున దూసుకుపోయాడు రావు. సరాసరి ముందుకు దౌడాయించి రోడ్డు కడ్డంగా బైక్ నిలబెట్టి కారుని ఆపివేశాడు. రోషంగా, పౌరుషంగా కారు దగ్గరికి వచ్చాడు రావు. కారులోంచి తనాబీలా బైటకొచ్చిన వ్యక్తి యుద్ధమల్లుడిలా కుప్పించి ముందకు దూకాడు. జబ్బకొద్ది దెబ్బతీశాడు. మూడు గజాల దూరంలో పడ్డాడు రావ్.
దిమ్మ తిరిగిపోయి కసి బుసలు కొట్టింది అతనికి. తమాయించుకొని చివాలున లేచి బలం కొద్దీ గింగిరాలు తిరిగేట్లు గూబ గుంయ్‌మనిపించాడు కారు వ్యక్తిని.
కారులో గోల ఇంకా జరుగుతూనే ఉంది. బాహాబాహీగా ఇక లాభం లేదని రావు కారు మనిషి మోకాలి కీలు మీద తుపాకి గురి పెట్టి ప్రయోగించాడు. గుండు తగిలిన ఆకాశసౌధంలా, చిన్న ‘క్లూ’తో–కథలో పేర్చిన ‘సస్పెన్స్’లా దభాల్న కూలిపోయాడు దుండగీడు.
రాజారావు కాలునిలదొక్కుకుని–ఆదుర్దాగా కారు దగ్గరికి వెళ్ళి చూశాడు. మసకచీకటిలో అతడికేం కనిపించలేదు. ఆక్రితం క్షణం వరకు వినిపించిన అల్లరీ, ఆర్తనాదం ఆగిపోయాయి. కారులో మరెవ్వరూ వ్యక్తులున్నట్లు కనిపించలేదు.
ధైర్యం చేసి తలుపు తీసి చూశాడు.
రెండు పెట్టెలు మాత్రం ఉన్నాయి.
మనుష్యులు...తను అనుకున్న స్త్రీ....ఎవరూ లేరు. ఆదుర్దా ఎక్కువైపోయింది. అయోమయమైపోయింది.
ఇంతలో...‘ఆలిండియా రేడియో...మీరింతవరకు ‘కారులో హత్య’ డిటెక్టివ్ నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న వారు...’
నిర్ఘాంతపోయాడు రావు. నిర్విణ్ణుడై స్తంభించిపోయాడు. అప్రయత్నంగా కొరుక్కున నాలిక మంట పుట్టనేలేదు. బుద్ది ఫల్టీ కొట్టి చిత్తయిపోయాననుకున్న రాజారావు–చేసిన పనికి బాధతో భయపడిపోయాడు. తానో పెద్ద కొండతవ్వి పట్టిన ఎలుకలా ఎదర తుప్పలో పడి కనిపించాడు దెబ్బతిన్న మనిషి!
ఆ క్షణంలో ఏమిటో, ఎలాగో, యేం చేయాలో రావుకు తోచలేదు.
హఠాత్తుగా ఆ తికమకలో రేచులా ఒక వాహనం వచ్చి ఆగింది.
అందులోంచి గబగబా పోలీసుపటాలం ఒకటి దిగి చుట్టూ వచ్చి కమ్ముకున్నారు.
రావు వణికిపోయాడు. పోలీసులు కొందరు కారంతా వెతుకుతున్నారు. రావుని దబాయించి ‘‘ఎవరు నువ్వు? ఏమిటిది? ఎక్కడ ఈ కారులో వచ్చిన వ్యక్తి?’’ అని అడిగాడు పోలీసు అధికారి.
మూల కాలు విరిగి పడివున్న వ్యక్తిని చూపించాడు రావు.
చేసిన నేరానికి వెంటనే తనకే సంకేళ్ళు పడతాయనుకున్న రాజారావు–తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. కుప్పకూలిపడి వున్న కారు మనిషి చేతికి తటాలున బేడీలు వేశారు పోలీసులు.
‘‘ఇక్కడేం జరిగింది?’’ పోలిసు అధికారి ప్రశ్నించాడు.
జరగిన కథ వివరించాడు రాజారావు.
‘‘ఎక్కడికి వెడుతున్నారీ అర్ధరాత్రి?’’ మళ్ళీ ప్రశ్నించాడు అధికారి.
గుంటూరు ఇంటర్వ్యూ సంగతి చెప్పాడు రావ్.
‘‘ముందు స్టేషన్‌కు నడవండి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్.
‘‘ఏమిటిది ఇన్‌స్పెక్టర్...అంతా అయోమయంగా వుంది’’ రావ్ ప్రశ్నించాడు.
ఖైదీతో సహా పటాలంతో జీప్‌వాన్ కదిలింది. మోటర్‌బైక్ మరో పోలీస్ జవాన్ తెస్తున్నాడు. ఇన్‌స్పెక్టర్ చెప్పాడు:
‘‘ముందు మీరు కూడా స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలి. తరువాత మీరు వెళ్ళవచ్చు. వీడు మా కళ్ళలో కారం కొట్టి అర్నెల్లుగా ఈ చుట్టుపట్ల చోరీలు చేస్తున్న బడాచోర్ కేడీ....గూండా...సినిమా హాల్లో రెండువేల రూపాయలు కొట్టేసి, పార్క్ చేసివున్న మునిసిపల్ కమిషనర్ కార్లో ఉడాయించాడని తెలిసి వెంబడించాం. దొంగనోట్లు అచ్చు వేయడం వీడి వృత్తి...రాస్కెల్....
మొత్తానికి భలే చిత్రమైన సంఘటన మీరు వీణ్ణి పట్టుగోటం–మీకు చాలా థ్యాంక్స్’’
అప్రయత్నంగా ‘‘ఏమిటిదంతా, ముద్దాయిని పెద్దమనిషినయిపోయాను’’ అన్నాడు సంభ్రమంతో రావ్.
‘‘మరేంలేదు. రేపే మీరు పోలీస్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెడుతున్నారు కదూ...ఇది ఇంటర్వ్యూ ప్రీవ్యూ’’ అని క్షణం ఆగి బిగ్గరగా నవ్వి–మీకీమాటలిలా అర్థం కావడం కష్టం, మరివస్తా...నమస్తే...’’ అని ఠాణాలోకి నడిచాడు ఇన్‌స్పెక్టర్.
మర్నాడు ఇంటర్వ్యూలో ఇన్‌స్పెక్టర్ కూడా ఒక పరిశీలకుడే. ఈ మాటలు ఒక కానిస్టేబుల్ రావు చెవిలో ఊదాడు. స్టేట్‌మెంట్ ఇచ్చి బయటికి వస్తుంటే...మరోడు మోటర్‌బైక్ అందించాడు. ఈ మాటలు విన్న రాజారావు ఆ మోటర్‌బైక్ ఎక్కి జరిగిందానికి, జరగబోయేదానికి ఒక్కసారి ఆశ్చర్యంలో మునిగిపోయి గుంటూరు ఇంటర్వ్యూలో పైకి తేలాడు.
Comments
Please login to add a commentAdd a comment