వసంతాలు విరబూయించిన కవి | Veturi Ravi Prakash Talk About Sundara Rama Murthy In Sakshi Family | Sakshi
Sakshi News home page

వసంతాలు విరబూయించిన కవి

Published Wed, Mar 25 2020 8:37 AM | Last Updated on Wed, Mar 25 2020 8:52 AM

Veturi Ravi Prakash Talk About Sundara Rama Murthy In Sakshi  Family

‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అన్నాడాయన ప్రకృతిని చూసి. ‘ఆమని పాడవే హాయిగా’ అని కూడా అన్నాడు. ‘ఈ మధుమాసంలో నీ దరహాసంలో’ అని పచ్చదనంలో పులకరించిపోయాడు. వేటూరి కలానికి వేయి చివుళ్లు. ‘కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ అని అందుకే అది అనగలిగింది.వేటూరికి పొన్నచెట్టు నీడ అన్నా, కృష్ణవేణి నడక అన్నా బహుఇష్టం.‘కృష్ణాతరంగాలు తారంగనాదాలు’ అన్న కలమే ‘ఆకుచాటు పిందె ఉంది’ అని చిలిపిదనాన్ని ఒలకబోసింది. ఉగాది పండుగ రోజున వెండితెర కవిరాజును తలుచుకోవడానికి మించిన సందర్భశుద్ధి ఏముంది? వేటూరి గురించి ఆయన పెద్ద కుమారుడు వేటూరి రవిప్రకాశ్‌ సాక్షితో ఎన్నో విషయాలు పంచుకున్నారు..

నాన్నగారికి మేం ముగ్గురం అబ్బాయిలం. నేను పెద్దబ్బాయిని. ఎనర్జీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. అంతకుముందు.. ప్రేమించు, జగదేకవీరుడు (కృష్ణ) చిత్రాలకు కథలు రాశాను. తమ్ముడు చంద్రశేఖర్‌ – ఎం. ఏ సైకాలజీ చేసి, అమెరికన్‌ కాన్సులేట్‌లో పనిచేసిన అనుభవంతో సొంతగా కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. రెండో తమ్ముడు నందకిశోర్‌ ఎంబిఏ చేసి, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సిలో రీజనల్‌ మేనేజర్‌గా పని చేసి, సొంత కన్సల్టెన్సీ ప్రారంభించాడు. నాకు తమ్ముళ్లకి  పది సంవత్సరాల అంతరం ఉంది. నాన్నగారు  ‘ఆంధ్రజనత’కి ఎడిటర్‌గా పనిచేసిన సమయం నుంచి ఆయనను దగ్గరగా గమనించడం వల్ల, ఆయన రచన, జీవితం, సినిమా సంబంధం గురించి నాకు అవగాహన ఉంది. నాన్నగారు బిఏబిఎల్‌ చేశారు. ఆయనకుర రచనలంటే ఆసక్తి. కాని ఇంట్లో వారు మాత్రం ఉద్యోగం చేయమనేవారు. వాస్తవానికి నాన్నగారు సంపాదించవలసిన అవసరం లేదు. అంత ఆస్తిపరులు ఆయన. అందరూ ఆయనను పిల్ల జమీందారు అనేవారు. అయినప్పటికీ, ఉద్యోగంలో ఉంటే నెలకు ఇంత అని నికర ఆదాయం ఉంటుంది కదా అనడంతో, నాన్నగారు ఉద్యోగంలో చేరడం అనివార్యమైంది.  

జర్నలిస్టుగా ఆంధ్రజనతలో..
నాన్నగారు ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వార పత్రికలలో సబ్‌ ఎడిటర్‌గా, ఆంధ్రజనతకి ఎడిటర్‌గా పనిచేశారు. తన ముప్పయ్యవ ఏటే ఎడిటర్‌ అయ్యారు. 1968లో ఎడిటర్‌గా రిజైన్‌ చేసి, స్వతంత్ర రచన చేపట్టాలనుకున్నారు. గురు తుల్యులైన విశ్వనాథ సత్యనారాయణగారితో ‘చందవోలు రాణి’ నవలను అడిగి రాయించుకుని, సుందర ప్రచురణలు పేరున ప్రచురించారు. తరవాత ఆయన రాసిన ‘జీవనరాగం’, ‘దేవాలయ చరిత్ర’ పుస్తకాలను కూడా ప్రచురించారు. 1970లో ఆకాశవాణిలో చేరడానికి వెళ్లగా బాలాంత్రపు రజనీకాంతరావు గారు ‘ఏదైనా స్వచ్ఛంద రచన చేయ’మని అడగటంతో, ‘సిరికాకుళం చిన్నది’ అనే సంగీత నాటకాన్ని రాశారు. ఈ సమయంలో చక్రపాణి గారు ఆడవారికి ప్రత్యేక పత్రిక‘ వనిత’ మొదలుపెడుతూ, నాన్నగారిని ఎడిటర్‌గా రమ్మని ఆహ్వానించారు.

నిర్భయంగా రాసేవారు..
నాన్నగారు రచయితగా విభిన్నంగా రాయాలనీ, సమాజంలో తాను, తన రచనలు గుర్తుండిపోవాలనీ అనుకున్నారు. ‘హి ఈజ్‌ ఎ పొయటిక్‌ క్రిటిక్‌’. 1965లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ భద్రాచలం దగ్గర రోడ్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో, ఒక విషయాన్ని తప్పుగా చెప్పారు. ఆ తప్పుని ఆంధ్రప్రభ పత్రికలో నిర్భయంగా ప్రకటించారు నాన్నగారు. మరోసారి... అసెంబ్లీ సమావేశాల రిపోర్టింగుకి వెళ్లినప్పుడు అక్కడ అందరినీ లె ల్లబట్టల్లో చూడగానే నాన్నగారికి ఒక సరదా ఆలోచన వచ్చింది. మరుసటి రోజు పత్రికలో ‘అదిగో ద్వారక, ఆలమందలవిగో..’ అంటూ వార్త రాశారు. అది చూసిన ఎంఎల్‌ఏలు స్పీకర్‌ని కలిసి, నాన్నను శిక్షించమన్నారు. స్పీకర్‌ చిరునవ్వుతో, ‘సరసంగా తీసుకోవాలి’ అన్నారు. ఆయన అలా అనకుండా ఉంటే, నాన్నకు శిక్ష పడేది.

ఓ సీత కథ..
1952 – 58 మధ్య కాలంలో నాన్నగారికి సిని మాలకు సంబంధించి పనిచేసిన అనుభవం ఉంది. 1959లో ‘వసుబాల’ అనే కథను బిఎన్‌ రెడ్డిగారి కోసం రాశారు. ఎన్‌టిఆర్‌ ప్రోత్సాహంతో ‘పెండ్లి పిలుపు’ సినిమాకి స్క్రిప్టు వర్క్‌ చేశారు. ఎన్‌టిఆర్‌ కోరిక మేరకు గొల్లపూడి మారుతీరావుగారు నాన్నగారిని కె. విశ్వనాథ్‌ గారికి పరిచయం చేశారు. అప్పటికే విశ్వనాథ్‌ గారు మూగ డ్యాన్సర్‌ కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమాకు పాటలు రాయమని నాన్నగారిని అడిగారు. ఈ లోగా ‘ఓ సీత కథ’ చిత్రానికి కె. విశ్వనాథ్‌ గారి కోరిక మీద పాటలు రాశారు. మంచి పేరు సంపాదించుకున్నారు. 1975 లో బాపుగారి భక్తకన్నప్ప, 1977లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

పాటలు రాసే కొత్తల్లో..
పాటలు రాస్తున్న తొలినాళ్లలో ‘ఈ సినిమాకి ఈ పాట రాస్తున్నాను’ అని చెబితే, బిజీ అయిన తరవాత సినిమాల పేర్లే తప్ప మిగిలిన వివరాలు తెలిసేవి కాదు. ఓ సీత కథ, భక్త కన్నప్ప, సిరిసిరి మువ్వ, కల్పన.. చిత్రాలలో పాటలు రాస్తున్నప్పుడు ‘ఇలా రాస్తున్నాను. ఇలా రాశాను’ అని చెప్పేవారు. శంకరాభరణం, సప్తపది, శుభోదయం.. చిత్రాల సమయానికి ‘పాటలు రాస్తున్నాను’ అనేవారు. అంతే. బావున్నాయనుకున్న సినిమాలను రిలీజ్‌కు ముందుగా ‘ప్రివ్యూ షో థియటర్‌’లో వేసుకుని చూసే వాళ్లం. మాకందరికీ ముందు నుంచి మిగతా కుటుంబాలతో కలిసే అలవాటు తక్కువ. 
నాన్నగారు ఆడియో ఫంక్షన్లు, శత దినోత్సవాలకు వెళ్లేవారు కాదు. కె. విశ్వనాథ్, జంధ్యాల, బాపురమణలు, మాధవపెద్ది చక్రవర్తి.. వీరి కుటుంబాలతో తప్ప మిగిలిన సినిమా వారి కుటుంబాలతో సాన్నిహిత్యం లేదు. 


వేటూరి కుటుంబ సభ్యులతో ఎస్‌.పి.బాలు 
అచ్చ తెలుగు పదాలు..
సాహిత్యం మీద మక్కువతో నాన్న జర్నలిస్టు, రచయిత రెండూ అయ్యారు. సాహిత్యాన్ని ఆరాధించి, జర్నలిస్టిక్‌ వేలో తన కంటే పూర్వీకుల గురించి, తన తరవాత వారి గురించి కూడా ఎన్నో రచనలు చేశారు. తన పాటల్లో గతాన్ని, భాషను గుర్తు చేసే కొంటెతనం, ఋతువులు, కాలం, ఆత్మీయత అనుబంధం, తెలుగుదనం ఉండాలనుకున్నారు. తెలుగుభాష వాడుక భాష స్థాయికి మారిపోయాక అచ్చతెలుగు పదాలు ఉపయోగిస్తే ఎవరికీ అర్థం కావట్లేదనేవారు. సాహిత్య పరిజ్ఞానం కలగాలంటే టీకా తాత్పర్యాలు లేకుండా చదివి అర్థం చేసుకోవాలి లేదా పెద్దల చేత చెప్పించుకో వాలని మా తాతగారు అంటుండేవారు. నాన్నగారు సీతారామయ్యగారి మనవరాలు చిత్రం కోసం రాసిన ‘కలికి చిలకల కొలికి’ పాటలో ‘అద్ద గోడలకి’ (వంట గదిలో వండిన పదార్థాలను మరుగున ఉంచటం కోసం ఉండే గోడ) అని చేసిన ప్రయోగం చాలామందికి తెలియలేదు. 

తోబుట్టువుల నుంచే..
స్వయంగా సాహితీమూర్తులైన దర్శకులు బాపు, విశ్వనాథ్, జంధ్యాల, క్రాంతి కుమార్‌ వంటి వారి కోసం తన కలానికి పదును పెట్టారు. అందువల్ల వారికి మంచి పాటలు రాయగలిగారు. నాన్నగారికి తోబుట్టువులే ఇరవై మంది దాకా ఉన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా నాన్నగారి దగ్గర పంచుకునేవారు. అలా వారినందరినీ దగ్గరగా పరిశీలించి, వాళ్ల అనుభవాలను తెలుసుకోవటం వల్ల రకరకాల ప్రయోగాలు చేయగలిగారు.

ఆడవాళ్లే అభిమానులు..
నాన్నగారు మాస్‌ రైటరే కాదు, ఆడవారి మనసులలో ఉండిపోయే పాటలు రాసిన మనసు కవి కూడా. ఆయన సాహిత్యం తెలిసినవారు ఆయన గురించి ఏమనుకుంటారో నేను వివరంగా చెప్పక్కర్లేదు. ఒక పాటను మగవారైతే విన్న వెంటనే, కనెక్ట్‌ అయ్యి, ఆ పాటను ప్రాచుర్యంలోకి తెస్తారు. కాని ఆడవారు అభిమానించి, ఆదరిస్తారు. అందుకే ఇప్పటికీ చాలామంది ఆడవారు మా అమ్మగారిని కలిసినప్పుడో లేదా ఫోన్‌లోనో నాన్నగారి మీద వారికున్న అభిమానాన్ని చెబుతుంటా రు. ఇదీ... ఇప్పటి పదహారేళ్ల ఆడ పిల్ల దగ్గర నుంచి, 80 ఏళ్లు పైబడ్డ వారికి నాన్నగారి మీద ఉన్న అభిమానం, ప్రేమ. 

తెలుగు పండుగలంటే ఇష్టం
నాన్నకు ఉగాది వంటి తెలుగు పండుగలంటే చాలా ఇష్టం. అందుకే వీలైనంత వరకు పండుగల సమయంలో ఇంటి దగ్గరే ఉండేవారు. ఉదయమే స్టూడియోకి వెళ్లినా, పది గంటలకు ఇంటికి వచ్చేసేవారు. ముఖ్యంగా ఉగాది పండుగను  తప్పనిసరిగా అందరం కలిసి చక్కగా చేసుకునేవాళ్లం. పండుగలకు సంబంధించిన కథలన్నీ చెప్పేవారు. మా పక్కనే కూర్చుని, అందరం సరిగా తిన్నామా లేదా అని చూసి, అప్పుడు బయటకు వెళ్లేవారు. నాన్నగారికి నచ్చిన పని.. తనకు నచ్చిన రచనలు, మనుషుల గురించి అందరికీ చెప్పడం. అలాగే తనకు నచ్చిన తినుబండారాలను అందరితో పంచుకోవటం.
– వేటూరి రవిప్రకాశ్, (వేటూరి పెద్ద కుమారుడు)
– సంభాషణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement