lyric writer
-
తెలుగు హిట్ పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత
'ముద్దబంతి నవ్వులో మూగబాసలు', ‘కుంతీకుమారి తన కాలుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ లాంటి సూపర్ హిట్ పాటలను రచించిన ప్రముఖ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుఝామున కన్నుమూశారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు. ఎం.ఎ. వరకు చదివిన ఆయన ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్. మోహన్‌బాబు నటించిన చిత్రాలలో గురుచరణ్‌తో ఒక్క పాట అయినా తప్పకుండా రాయించేవారు. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలను గురుచరణ్ రచించారు. -
తిరుమల సన్నిధిలో టాలీవుడ్ రచయిత.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
టాలీవుడ్ సినీ రచయిత, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగులో గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్న రామజోగయ్య శాస్త్రి ప్రస్తుతం దేవర సినిమాకు పనిచేస్తున్నారు. తాజాగా రిలీజైన చుట్టమల్లే చుట్టేస్తావే సాంగ్‌కు లిరిక్స్ అందించారు.ఇవాళ తిరుమల దర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలో తన కుమారుడి పెళ్లి ఉందని వెల్లడించారు. అందుకే తిరుమల స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వచ్చినట్లు రామజోగయ్య తెలిపారు. కాగా.. రామజోగయ్య శాస్త్రికి హర్ష, తేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకన్న దర్శనం అద్భుతంగ జరిగింది నేను మా చిన్నబ్బాయ్ ❤️గోవిందా🙏🙏 pic.twitter.com/Our25bxRne— RamajogaiahSastry (@ramjowrites) August 6, 2024 -
నేను రాసిన పాటలోని పదాలు సీఎం జగన్ నోట రావడం..ఈ జన్మకు ఇది చాలు
-
మూగబోయిన కందికొండ గుండె సవ్వడి
-
సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు
Sirivennela Sitaramasastry Popular Hit Songs: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల ఆయన న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రీ. ఆయన 'సిరివెన్నెల' సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న ఈ సినిమాకు కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 'సిరివెన్నెల' చిత్రంలోని 'విధాత తలపున ప్రభవించినది' అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో 'సిరివెన్నెల సీతారామశాస్త్రీ'గా స్థానం సంపాదించి పెట్టంది. ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎంతో మంది మదిని మీటుతుంది. మూడు నాలుగు నిమిషాలుండే పాటలో సినిమా తాలుకు భావాన్ని నింపడం అదికూడా అర్ధమయ్యే పదాలతో రాయడం అంటే అది అందరికీ సాధ్యం కాదు.. అలా పాటలు రాయడంలో దిగ్గజాలు అయిన మహానుభావులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు పరిచయం చేశారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. అలాగే రుద్రవీణ సినిమాలో 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ' అనే పాట, 'లలిత ప్రియ కమలం విరిసినదీ' అనే పాటలను అద్భుతంగా రాసారు. 'లలిత ప్రియ కమలం' పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలాగే కృష్ణ వంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో ఆయన రాసిన 'అర్ధ శతాబ్దపు' పాట సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అగ్నిజ్వాలలను రగిలించే పాటలే కాదు చిగురుటాకు లాంటి అందమైన ప్రేమ గీతాలను కూడా సీతారామ శాస్త్రీ అందించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అని పాటను రాయడంమే కాదు అందులో పాడి నటించి మెప్పించారు. ఈ పాటకు సిరివెన్నెలను ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన 'దోస్తీ' పాటతో కూడా అలరించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ. ఎన్నో వేల అద్భుత గేయాలు అందించి సంగీత ప్రపంచంలో జో కొట్టిన ఆయనకు నివాళిగా ఆ ఆణిముత్యాలు మీకోసం. 1. విధాత తలపున ప్రభవించినది (సిరివెన్నెల) 2. పారాహుషార్ (స్వయంకృషి) 3. నమ్మకు నమ్మకు ఈ రేయిని (రుద్రవీణ) 4. తరలిరాద తనే వసంతం (రుద్రవీణ) 5. ఘల్లు ఘల్లు (స్వర్ణకమలం) 6. బోటనీ పాఠముంది (శివ) 7. కొత్త కొత్తగా ఉన్నది (కూలీ నెం 1) 8. చిలుకా క్షేమమా (రౌడీ అల్లుడు) 9. జాము రాతిరి జాబిలమ్మ (క్షణక్షణం) 10. వారేవా ఏమీ ఫేసు (మనీ) 11. నిగ్గ దీసి అడుగు (గాయం) 12. అమ్మ బ్రహ్మ దేవుడో (గోవిందా గోవిందా) 13. చిలకా ఏ తోడు లేక (శుభలగ్నం) 14. తెలుసా మనసా (క్రిమినల్) 15. హైలెస్సో హైలెస్స (శుభసంకల్పం) 16. అపురూపమైనదమ్మ ఆడజన్మ (పవిత్రబంధం) 17. అర్ధ శతాబ్దపు (సింధూరం) 18. జగమంత కుటుంబం నాది (చక్రం) 19. సామజ వరగమన (అల వైకుంఠపురములో) 20. దోస్తీ (ఆర్ఆర్ఆర్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రముఖ సినీ గీత రచయిత ప్రేమ పెళ్లి
ప్రముఖ సినీ గీత రచయిత శ్రీమణి ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పదేళ్లు ప్రేమించిన ప్రేయసి ఫరాను ఆదివారం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టాడు. ‘ఫరాతో పెళ్లి కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నాను. చివరకి కల నిజమైంది. ప్రియమైన ఫరా.. నా జీవితంలోకి వెలకమ్. మా ప్రేమను అర్థం చేసుకొని మమ్మల్ని ఒకటి చేసినందుకు మా తల్లిదండ్రులకు, దేవునికి కృతజ్ఞతలు. వివాహ జీవితం ప్రారంభం’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా! Welcome to my life My sweet little angel (fara) We r waiting for this moment From past 10 years Finally dream came true Thx to the God and our parents For understanding our hearts 💕 #MarriedLifeBegins pic.twitter.com/2njsfNClqc — ShreeMani Lyricist (@ShreeLyricist) November 22, 2020 కాగా కరోనా మహమ్మారి కాలంలో అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి, నిఖిల్, నితిన్తోపాటుగా కాజల్ అగర్వాల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లో శ్రీమణి కూడా చేరిపోయారు. దీంతో శ్రీమణికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు ‘‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పుడు అర్థమైందంటూ ట్వీట్ చేశాడు. ‘ఇష్క్ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్నమాట అని ట్వీట్ చేశారు. చదవండి: వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి Woww CONGRATS dearest @ShreeLyricist Now I understand d secret of ur Romantic Lyrics😜❤️ ISHQ SIFAAYAA🎶😍 ani paadi..#Ranguladdhukunna ani Secret ga Love Chesi..#EmitoIdhu ani memandaram anukunela Pelli Chesesukunnaru maata.. HAPPY MUSICAL MARRIED Life to both of U❤️🤗 https://t.co/MaTBh8nf0k — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 22, 2020 ఇక తన పాటలతో సంగీత ప్రేమికులను అలరించిన వ్యక్తిగా శ్రీమణికి మంచి పేరు ఉంది. 100% లవ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీమణి.. ఆ తరువాత జులాయిలో చక్కని బైక్ ఉంది, మీ ఇంటికి ముందో గేటు, అత్తారింటికి దారేదిలో ఆరడగుల బుల్లెట్టు, గీతా గోవిందం సినిమాలోని వచ్చిందమ్మా వచ్చిందమ్మా, ఎఫ్ 2లో ఎంతో ఫన్, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో జారుకో.. జారుకో వంటి అద్భుతమైన పాటలను రాశారు. అంతేగాక ఉప్పెన సినిమాలో ‘నీకళ్లు నీలి సముద్రం’ అంటూ ఆయన రాసిన పాట రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: అప్పుడే నా పెళ్లి.. లేదంటే..!: త్రిష -
వసంతాలు విరబూయించిన కవి
‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అన్నాడాయన ప్రకృతిని చూసి. ‘ఆమని పాడవే హాయిగా’ అని కూడా అన్నాడు. ‘ఈ మధుమాసంలో నీ దరహాసంలో’ అని పచ్చదనంలో పులకరించిపోయాడు. వేటూరి కలానికి వేయి చివుళ్లు. ‘కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ అని అందుకే అది అనగలిగింది.వేటూరికి పొన్నచెట్టు నీడ అన్నా, కృష్ణవేణి నడక అన్నా బహుఇష్టం.‘కృష్ణాతరంగాలు తారంగనాదాలు’ అన్న కలమే ‘ఆకుచాటు పిందె ఉంది’ అని చిలిపిదనాన్ని ఒలకబోసింది. ఉగాది పండుగ రోజున వెండితెర కవిరాజును తలుచుకోవడానికి మించిన సందర్భశుద్ధి ఏముంది? వేటూరి గురించి ఆయన పెద్ద కుమారుడు వేటూరి రవిప్రకాశ్ సాక్షితో ఎన్నో విషయాలు పంచుకున్నారు.. నాన్నగారికి మేం ముగ్గురం అబ్బాయిలం. నేను పెద్దబ్బాయిని. ఎనర్జీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. అంతకుముందు.. ప్రేమించు, జగదేకవీరుడు (కృష్ణ) చిత్రాలకు కథలు రాశాను. తమ్ముడు చంద్రశేఖర్ – ఎం. ఏ సైకాలజీ చేసి, అమెరికన్ కాన్సులేట్‌లో పనిచేసిన అనుభవంతో సొంతగా కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. రెండో తమ్ముడు నందకిశోర్ ఎంబిఏ చేసి, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సిలో రీజనల్ మేనేజర్‌గా పని చేసి, సొంత కన్సల్టెన్సీ ప్రారంభించాడు. నాకు తమ్ముళ్లకి పది సంవత్సరాల అంతరం ఉంది. నాన్నగారు ‘ఆంధ్రజనత’కి ఎడిటర్‌గా పనిచేసిన సమయం నుంచి ఆయనను దగ్గరగా గమనించడం వల్ల, ఆయన రచన, జీవితం, సినిమా సంబంధం గురించి నాకు అవగాహన ఉంది. నాన్నగారు బిఏబిఎల్ చేశారు. ఆయనకుర రచనలంటే ఆసక్తి. కాని ఇంట్లో వారు మాత్రం ఉద్యోగం చేయమనేవారు. వాస్తవానికి నాన్నగారు సంపాదించవలసిన అవసరం లేదు. అంత ఆస్తిపరులు ఆయన. అందరూ ఆయనను పిల్ల జమీందారు అనేవారు. అయినప్పటికీ, ఉద్యోగంలో ఉంటే నెలకు ఇంత అని నికర ఆదాయం ఉంటుంది కదా అనడంతో, నాన్నగారు ఉద్యోగంలో చేరడం అనివార్యమైంది. జర్నలిస్టుగా ఆంధ్రజనతలో.. నాన్నగారు ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వార పత్రికలలో సబ్ ఎడిటర్‌గా, ఆంధ్రజనతకి ఎడిటర్‌గా పనిచేశారు. తన ముప్పయ్యవ ఏటే ఎడిటర్ అయ్యారు. 1968లో ఎడిటర్‌గా రిజైన్ చేసి, స్వతంత్ర రచన చేపట్టాలనుకున్నారు. గురు తుల్యులైన విశ్వనాథ సత్యనారాయణగారితో ‘చందవోలు రాణి’ నవలను అడిగి రాయించుకుని, సుందర ప్రచురణలు పేరున ప్రచురించారు. తరవాత ఆయన రాసిన ‘జీవనరాగం’, ‘దేవాలయ చరిత్ర’ పుస్తకాలను కూడా ప్రచురించారు. 1970లో ఆకాశవాణిలో చేరడానికి వెళ్లగా బాలాంత్రపు రజనీకాంతరావు గారు ‘ఏదైనా స్వచ్ఛంద రచన చేయ’మని అడగటంతో, ‘సిరికాకుళం చిన్నది’ అనే సంగీత నాటకాన్ని రాశారు. ఈ సమయంలో చక్రపాణి గారు ఆడవారికి ప్రత్యేక పత్రిక‘ వనిత’ మొదలుపెడుతూ, నాన్నగారిని ఎడిటర్‌గా రమ్మని ఆహ్వానించారు. నిర్భయంగా రాసేవారు.. నాన్నగారు రచయితగా విభిన్నంగా రాయాలనీ, సమాజంలో తాను, తన రచనలు గుర్తుండిపోవాలనీ అనుకున్నారు. ‘హి ఈజ్ ఎ పొయటిక్ క్రిటిక్’. 1965లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచలం దగ్గర రోడ్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో, ఒక విషయాన్ని తప్పుగా చెప్పారు. ఆ తప్పుని ఆంధ్రప్రభ పత్రికలో నిర్భయంగా ప్రకటించారు నాన్నగారు. మరోసారి... అసెంబ్లీ సమావేశాల రిపోర్టింగుకి వెళ్లినప్పుడు అక్కడ అందరినీ లె ల్లబట్టల్లో చూడగానే నాన్నగారికి ఒక సరదా ఆలోచన వచ్చింది. మరుసటి రోజు పత్రికలో ‘అదిగో ద్వారక, ఆలమందలవిగో..’ అంటూ వార్త రాశారు. అది చూసిన ఎంఎల్ఏలు స్పీకర్‌ని కలిసి, నాన్నను శిక్షించమన్నారు. స్పీకర్ చిరునవ్వుతో, ‘సరసంగా తీసుకోవాలి’ అన్నారు. ఆయన అలా అనకుండా ఉంటే, నాన్నకు శిక్ష పడేది. ఓ సీత కథ.. 1952 – 58 మధ్య కాలంలో నాన్నగారికి సిని మాలకు సంబంధించి పనిచేసిన అనుభవం ఉంది. 1959లో ‘వసుబాల’ అనే కథను బిఎన్ రెడ్డిగారి కోసం రాశారు. ఎన్టిఆర్ ప్రోత్సాహంతో ‘పెండ్లి పిలుపు’ సినిమాకి స్క్రిప్టు వర్క్ చేశారు. ఎన్టిఆర్ కోరిక మేరకు గొల్లపూడి మారుతీరావుగారు నాన్నగారిని కె. విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు. అప్పటికే విశ్వనాథ్ గారు మూగ డ్యాన్సర్ కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమాకు పాటలు రాయమని నాన్నగారిని అడిగారు. ఈ లోగా ‘ఓ సీత కథ’ చిత్రానికి కె. విశ్వనాథ్ గారి కోరిక మీద పాటలు రాశారు. మంచి పేరు సంపాదించుకున్నారు. 1975 లో బాపుగారి భక్తకన్నప్ప, 1977లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పాటలు రాసే కొత్తల్లో.. పాటలు రాస్తున్న తొలినాళ్లలో ‘ఈ సినిమాకి ఈ పాట రాస్తున్నాను’ అని చెబితే, బిజీ అయిన తరవాత సినిమాల పేర్లే తప్ప మిగిలిన వివరాలు తెలిసేవి కాదు. ఓ సీత కథ, భక్త కన్నప్ప, సిరిసిరి మువ్వ, కల్పన.. చిత్రాలలో పాటలు రాస్తున్నప్పుడు ‘ఇలా రాస్తున్నాను. ఇలా రాశాను’ అని చెప్పేవారు. శంకరాభరణం, సప్తపది, శుభోదయం.. చిత్రాల సమయానికి ‘పాటలు రాస్తున్నాను’ అనేవారు. అంతే. బావున్నాయనుకున్న సినిమాలను రిలీజ్‌కు ముందుగా ‘ప్రివ్యూ షో థియటర్’లో వేసుకుని చూసే వాళ్లం. మాకందరికీ ముందు నుంచి మిగతా కుటుంబాలతో కలిసే అలవాటు తక్కువ. నాన్నగారు ఆడియో ఫంక్షన్లు, శత దినోత్సవాలకు వెళ్లేవారు కాదు. కె. విశ్వనాథ్, జంధ్యాల, బాపురమణలు, మాధవపెద్ది చక్రవర్తి.. వీరి కుటుంబాలతో తప్ప మిగిలిన సినిమా వారి కుటుంబాలతో సాన్నిహిత్యం లేదు. వేటూరి కుటుంబ సభ్యులతో ఎస్.పి.బాలు అచ్చ తెలుగు పదాలు.. సాహిత్యం మీద మక్కువతో నాన్న జర్నలిస్టు, రచయిత రెండూ అయ్యారు. సాహిత్యాన్ని ఆరాధించి, జర్నలిస్టిక్ వేలో తన కంటే పూర్వీకుల గురించి, తన తరవాత వారి గురించి కూడా ఎన్నో రచనలు చేశారు. తన పాటల్లో గతాన్ని, భాషను గుర్తు చేసే కొంటెతనం, ఋతువులు, కాలం, ఆత్మీయత అనుబంధం, తెలుగుదనం ఉండాలనుకున్నారు. తెలుగుభాష వాడుక భాష స్థాయికి మారిపోయాక అచ్చతెలుగు పదాలు ఉపయోగిస్తే ఎవరికీ అర్థం కావట్లేదనేవారు. సాహిత్య పరిజ్ఞానం కలగాలంటే టీకా తాత్పర్యాలు లేకుండా చదివి అర్థం చేసుకోవాలి లేదా పెద్దల చేత చెప్పించుకో వాలని మా తాతగారు అంటుండేవారు. నాన్నగారు సీతారామయ్యగారి మనవరాలు చిత్రం కోసం రాసిన ‘కలికి చిలకల కొలికి’ పాటలో ‘అద్ద గోడలకి’ (వంట గదిలో వండిన పదార్థాలను మరుగున ఉంచటం కోసం ఉండే గోడ) అని చేసిన ప్రయోగం చాలామందికి తెలియలేదు. తోబుట్టువుల నుంచే.. స్వయంగా సాహితీమూర్తులైన దర్శకులు బాపు, విశ్వనాథ్, జంధ్యాల, క్రాంతి కుమార్ వంటి వారి కోసం తన కలానికి పదును పెట్టారు. అందువల్ల వారికి మంచి పాటలు రాయగలిగారు. నాన్నగారికి తోబుట్టువులే ఇరవై మంది దాకా ఉన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా నాన్నగారి దగ్గర పంచుకునేవారు. అలా వారినందరినీ దగ్గరగా పరిశీలించి, వాళ్ల అనుభవాలను తెలుసుకోవటం వల్ల రకరకాల ప్రయోగాలు చేయగలిగారు. ఆడవాళ్లే అభిమానులు.. నాన్నగారు మాస్ రైటరే కాదు, ఆడవారి మనసులలో ఉండిపోయే పాటలు రాసిన మనసు కవి కూడా. ఆయన సాహిత్యం తెలిసినవారు ఆయన గురించి ఏమనుకుంటారో నేను వివరంగా చెప్పక్కర్లేదు. ఒక పాటను మగవారైతే విన్న వెంటనే, కనెక్ట్ అయ్యి, ఆ పాటను ప్రాచుర్యంలోకి తెస్తారు. కాని ఆడవారు అభిమానించి, ఆదరిస్తారు. అందుకే ఇప్పటికీ చాలామంది ఆడవారు మా అమ్మగారిని కలిసినప్పుడో లేదా ఫోన్లోనో నాన్నగారి మీద వారికున్న అభిమానాన్ని చెబుతుంటా రు. ఇదీ... ఇప్పటి పదహారేళ్ల ఆడ పిల్ల దగ్గర నుంచి, 80 ఏళ్లు పైబడ్డ వారికి నాన్నగారి మీద ఉన్న అభిమానం, ప్రేమ. తెలుగు పండుగలంటే ఇష్టం నాన్నకు ఉగాది వంటి తెలుగు పండుగలంటే చాలా ఇష్టం. అందుకే వీలైనంత వరకు పండుగల సమయంలో ఇంటి దగ్గరే ఉండేవారు. ఉదయమే స్టూడియోకి వెళ్లినా, పది గంటలకు ఇంటికి వచ్చేసేవారు. ముఖ్యంగా ఉగాది పండుగను తప్పనిసరిగా అందరం కలిసి చక్కగా చేసుకునేవాళ్లం. పండుగలకు సంబంధించిన కథలన్నీ చెప్పేవారు. మా పక్కనే కూర్చుని, అందరం సరిగా తిన్నామా లేదా అని చూసి, అప్పుడు బయటకు వెళ్లేవారు. నాన్నగారికి నచ్చిన పని.. తనకు నచ్చిన రచనలు, మనుషుల గురించి అందరికీ చెప్పడం. అలాగే తనకు నచ్చిన తినుబండారాలను అందరితో పంచుకోవటం. – వేటూరి రవిప్రకాశ్, (వేటూరి పెద్ద కుమారుడు) – సంభాషణ: వైజయంతి పురాణపండ -
పాటల తోటలో ఒంటరి సేద్యం!
సాక్షి, తెనాలి: కృష్ణాజిల్లాలోని ఓ పల్లెటూరి కుర్రోడు గోసాల రాంబాబు. తెలుగు సినిమా గీత రచయితగా గెలిచాడు. పదేళ్ల సినీజీవితంలో 30 సినిమాల్లో వంద పాటలు రాశాడు. పాటల తోటలో తాను చేసిన ఒంటరి సేద్యం అద్భుతమైన సాహిత్యం అందించిందని చెబుతున్న రాంబాబు సోమవారం తెనాలి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి వెల్లడించిన విశేషాలు ఆయన మాటల్లోనే... ఉద్యోగం పేరుతో సినిమాల వైపు.. కృష్ణాజిల్లా ముసునూరు మండలం వేల్పుచర్ల నా సొంతూరు. తలిదండ్రులు గోసాల దానయ్య, కోటేశ్వరమ్మ. పాటలవైపు మళ్లింది హైస్కూల్లోనే. ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని వేసిన అడుగులు...సినిమా రంగంకేసి నడిచాయి. ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌కి వెళ్లాను. ‘ఉయ్యాల జంపాల’తో అవకాశాలు ‘వియ్యాలవారి కయ్యాలు’కు తొలిసారిగా నాకు పాట రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు రాలేదు. అనంతరం స్నేహితుడు విరించి వర్మతో వరించిన ‘ఉయ్యాల జంపాల’ సినిమా పాట (నిజంగా నేనేనా)తో అవకాశాలు తలుపు తట్టాయి. మజ్నూ చిత్రంలో పాటలకు అభినందనలు అందుకున్నా. డైరెక్టర్ సందీప్‌రెడ్డి ఇచ్చిన స్టోరీ అవుట్‌పుట్స్‌తో ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో రెండు పాటలు రాశాను. నాకు పేరుతో పాటు అవార్డులనూ తెచ్చిపెట్టాయి. యూత్‌కి కనెక్ట్ అయ్యాయి.. అర్జున్‌రెడ్డి సినిమాలో లవ్ బ్రేకప్ పాట యూత్‌కి బాగా కనెక్టయింది. ‘తెలిసెనే నా నువ్వే...నా నువ్వు కాదనీ...తెలిసెనే నేననే నే నేను కాదనీ’ అంటూ ఆరంభమయ్యే పాటది. ఇది సినిమాలో అర్జున్‌రెడ్డి ప్రేమ గురించే అయినా, నా జీవితానికీ అన్వయించొచ్చు. సినిమా టైటిల్స్‌లో పేరు చూసుకుని శభాష్ అంటూ నాకు నేను భుజం తట్టుకోవటానికి పదేళ్లు పట్టింది. సినీ ‘మజిలీ’ బాగుంది.. ఈ ఏడాది నాగచైతన్య, సమంత జంటగా వచ్చిన ‘మజిలీ’ సినిమాలో ‘నా గుండెల్లో ఉండుండి’ అనే పాట, ప్రస్తుతం థియేటర్లలో వున్న ‘కౌసల్య కృష్ణమూర్తి’లో ‘రాకాసి గడుసుపిల్ల’ పాటలు విజయవంతమయ్యాయి. ఆలీ హీరోగా నటించిన పండుగాడి ఫొటో స్టూడియో సినిమాలో అన్ని పాటలూ నేనే రాశాను. ప్రస్తుతం మరో పది సినిమాలకు పాటలు రాస్తున్నాను. అర్జున్‌రెడ్డి సినిమాకు ఉత్తమ గేయరచయితగా ప్రభుత్వ ఉగాది పురస్కారం తీసుకున్నాను. 2018లో ఉదయ్‌కిరణ్ స్మారక అవార్డు, 2019లో మనసుకవి ఆత్రేయ పురస్కారం అందుకున్నాను. -
చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే
ఓ బేబీ చిత్రంలోని ‘ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన’ పాట గురించి నా మనసులో భావాలు పంచుకోవాలనుకున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన పాట. భర్త పోయిన భార్య తన బిడ్డను ఎంత కష్టపడి పెంచుకుందో అనే నేపథ్యంలో వచ్చిన ఈ పాట నా జీవితానికి కూడా వర్తిస్తుంది. నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే మా నాన్నగారు గతించారు. అప్పటికి నాకు ఇద్దరు చెల్లెళ్లు. వాళ్లు చాలా చిన్న పిల్లలు. అమ్మ వయసు 35 కూడా ఉండదు. మగ దిక్కులేని కుటుంబం ఎలా ఉంటుందో తెలిసిందే. తాతయ్య కూడా (అమ్మమ్మ భర్త) చాలా తొందరగా పోయారు. రకరకాల వ్యాపారాలు చేసి తన పిల్లలను పెంచుకుంది మా అమ్మమ్మ. ఆ సంఘటనలన్నీ నా మనసును కలచి వేశాయి. సినిమాలో కనిపించే లక్ష్మి పాత్రలో నాకు మా అమ్మమ్మ కనిపించారు. అలాంటి కుటుంబాల నేపథ్యంలో ఉన్నాను కాబట్టి ఈ పాట రాయటం నాకు సులువైంది. మా ఇంట్లో చూసిన పాత్రలే రెండూ. అందువల్లే అంత నేచురల్‌గా వచ్చాయి మాటలు పాటలు. ‘సమాజంలో రకరకాల మనుషులు కన్నేసినా, మగాడికి మొగుడిలా బతికాను’ అని అమ్మమ్మ నా దగ్గర చాలాసార్లు అంది. ఆ మాటలను యథాతథంగా రాశాను.ఈ పాట పల్లవి విన్నవారంతా ఇదొక కొత్త భావన అన్నారు. ఆకాశం అనేది సమాజమైతే, ప్రతి తల్లి ఆ ఆకాశంలో ఏకాకి మేఘమే. తన బాధను ఎవరికీ చెప్పకోలేదు. తనలో తాను కుమిలిపోతే వచ్చేదే ఏడుపు ... అదే వాన. ‘నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా’ – ఏ దిక్కు, ఇల్లు లేని ఆ తల్లి నడిరోడ్డు మీద ఉంది, ఆ విషయం తెలియని పసి పిల్లవాడు పాల కోసం తల్లి ఎదను తాకుతుంటాడు. అప్పుడు తల్లికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాలకోసం ఏడ్చి నన్ను ఇబ్బంది పెట్టకు అని పిల్లవాడిని బతిమాలుతుంది. ‘తన పేగే తన తోడై తన కొంగే నీడై’ పేగు తోడు అంటే తన పేగు పంచుకుని పుట్టిన కొడుకే, వాడికి కొంగు తప్ప ఇంక నీడ ఇవ్వడానికి ఏమీ లేదు. అంత హీనమైన పరిస్థితిలో ఉంటుంది ఆ తల్లి. ‘అరచేత తలరాత ఎవరు చెరిపారో’ – అరచేతి రేఖలు వేరు, తలరాత వేరు, రెండింటినీ కలిపి ప్రయోగం చేశాను. మన అదృష్టం మన తలరాతను ఎవరు చెరిపేశారో అని గతం తలచుకుంటుంది. ‘ఒంటౖరై ఉన్నా ఓడిపోలేదు/జంటగా ఉంటే కన్నీరే కళ్లలో’ ఒంటరితనంతో ఉన్నా, ఏనాడూ ఓటమిని అంగీకరించకుండా, జీవితంలో ఎంతో పోరాడింది. ఆవిడ కళ్లలో ఉన్న కన్నీళ్లే ఆమెకు తోడుగా ఉన్నాయి. అందువల్ల ఆ తల్లికి తోడులేకపోవడం అనే ప్రశ్నే లేదు. ‘చీకటెంతున్నా వెలుగునే కన్నా బోసి నవ్వుల్లో నా బిడ్డ సెందురుడే’ – జీవితంలో చీకటి ఎంత ఉన్నా వెలుగునే చూసింది ఆ తల్లి. మరో అర్థంలో వెలుగుని కన్నది అని కూడా వచ్చేలా ఉపయోగించాను. బోసి నవ్వుల్లో తన బిడ్డ చంద్రుడే కనుక, ఆ తల్లి జీవితంలో చీకటి లేదు’ అనే భావనతో రాశాను. ఆ తల్లి నిరాశ నిస్సత్తువలో ఉన్నప్పుడు తన కొడుకే తనకు ఓదార్పు అయ్యాడు. ‘కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే’ – బతికి ఉందా లేదా అని అడిగే దిక్కు లేకపోవడంతో, తాను బతికి ఉందా లేదా అనే స్పృహ కూడా లేని దీనమైన స్థితిలో ఆ తల్లి పడిన బాధల నుంచి పుట్టింది ఈ పాట. చలికి శరీరం వణుకుంతుంటే, తాను బతికి ఉన్నానని తెలుసుకుంది ఆ తల్లి. పాట కోసం కొత్తగా నేను శ్రమ పడలేదు. ఒక్క పూటలో రాసేశాను. రెండు చరణాలు రాశాను. సినిమాలో ఒక చరణం మాత్రమే పెట్టగలిగాం. నా మీద వేటూరి గారి ప్రభావం ఉంటుంది. ఈ పాట విషయంలో ఆయన ఆశీస్సులు నా నెత్తి మీద ఉన్నాయో, సరస్వతీ కటాక్షం ఉందో తెలీదు. నేను ఏ పాటనూ ఆలోచించి రాయను. పెన్ను పెట్టాక ఏది వస్తే అది రాస్తాను. మళ్లీ ఒక్క అక్షరం కూడా మార్చను. ఏదో మైకంలాంటిది వచ్చినప్పుడు నేను నేను కాదని నా అభిప్రాయం. అందుకే ఎవరైనా పాట బావుందని చెప్పినా అది నాకు ఆపాదించుకోను. - లక్ష్మీ భూపాల, సినీ రచయిత చిత్రం: ఓ బేబీ, రచన: లక్ష్మీ భూపాల, గానం: నూతన మోహన్, సంగీతం: మిక్కీ. జె. మేయర్ -
అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూ.. రచనలు..
కమ్మర్పల్లి(బాల్కొండ): కమ్మర్పల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న మగ్గిడి లక్ష్మి కవయిత్రిగా రాణిస్తోంది. వృత్తి అంగన్వాడీ టీచరే అయినా సాహితీ కళా రంగంపై మక్కువతో కవితలు రాస్తూ కళాకారిణిగా గుర్తింపు పొందుతోంది. ఫలితంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటుండడంతో పాటు, సాహిత్య కళా రంగ సంస్థల నుంచి అవార్డులను దక్కించుకుంటోంది. గత ఐదేళ్లలో వందకుపైగా కవితలు రాయగా, పలు కవితలు పుస్తక రూపంలో ఆవిష్కరింపబడ్డాయి. పాటలు, జానపద గేయాలతో మొదలై.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో నిర్మల్‌కు వచ్చిన ఎన్టీఆర్ ముందు లక్ష్మి ‘ఎన్టీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలనే’ సారాంశంతో పాట పాడడంతో మంత్రముగ్ధుడైన ఎన్టీఆర్ లక్ష్మిని అభినందించారు. అదే స్ఫూర్తితో ఆమె ఆడుతూ, పాడుతూ పాటలు రాయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరి, గేయాలతో పాటు జానపద గేయాలు రాయడం వైపు దృష్టి సారించారు. అయితే వాటికి తానే స్వరకల్పన చేస్తూ, ఆలపించడం అలవాటు చేసుకున్నారు. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో తాను రాసిన పాటలు పాడి ఉద్యమకారులను ఉత్సాహపరిచారు. 2014 నుంచి కవితలు రాయడంపై దృష్టి సారించిన లక్ష్మి ఐదేళ్లలో కవయిత్రిగా మంచి గుర్తింపు పొం దింది. వందకుపైగా కవితలు రాసి ప్రముఖుల మన్ననలను పొందింది. జిల్లాలోనే కాకుండా పలు జిల్లాల్లో సాహిత్య కళా రంగాలు, చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే కవి సమ్మేళనాల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభావంతురాలైన కవయిత్రిగా పేరు పొందుతోంది. ప్రశంసలు, అవార్డులు 2017లో నిర్వహించిన ప్రపంచ మహాసభల సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో తెలంగాణ విజయం అనే అంశంపై రాసిన 21 వరసల కవిత పుస్తక రూపంలో ఆవిష్కరింపబడింది. గోదావరిఖనిలో దేశభక్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనంలో విప్లవాత్మక కవిత రాసి ఆలపించి ప్రముఖుల నుంచి ప్రశంసా పత్రం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి శిల్పకళా వైభవంపై నిర్వహించిన కవితా సంపుటికి లక్ష్మి కవితలు ఎంపికై, ప్రశంసా పత్రం అందుకుంది. కొఱవి గోపరాజు సాహిత్య వైభవ సమాలోచన, రాష్ట్రస్థాయి సదస్సులో సాహితీ ప్రియత్వాన్ని ప్రదర్శించి ప్రశంసా పత్రం అందుకుంది. ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్, త్యారాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో కవితలను రాసి ఆలపించండంతో ప్రశంసా పత్రం అందుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఉత్తమ కవయిత్రిగా అవార్డును సొంత చేసుకుంది. -
ప్రేక్షక హృదయ నిశ్శబ్దానికి ప్రతిధ్వనిని
‘‘నాకు ‘పద్మశ్రీ’ అవార్డు రావడం వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, నా పేరు సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీతారామశాస్త్రికి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి, ఎందుకు ఇవ్వాలో కేంద్రానికి సకాలంలో వివరిస్తూ తమ అభ్యర్థనలను పంపిన వేలాది మందికి పేరు పేరునా ధన్యవాదాలు. నాకు అవార్డు రావడం వేడుకగా, పండగలా భావిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించిన సందర్భంగా గురువారం సీతారామశాస్త్రి హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► ‘పద్మశ్రీ’ అవార్డు ఎంతది అన్న విషయం పక్కనపెడితే ఈ అవార్డు నాకు రావాలని కోరుకున్న తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. 30ఏళ్లుగా నేను సాగిస్తున్న ఈ సాహితీ వ్యవసాయానికి ఫలసాయంగా నాకు పద్మ అవార్డు రావాలనేది వారి ఆకాంక్ష, ఆశీర్వాదం, కోరిక.. ఇవన్నీ కలిపి ఈ రూపంలో వచ్చాయి అనుకుంటున్నాను. వారి ఆనందానికి కారణమైన నా సాహితీ వ్యవసాయం పట్ల నాకు ఒకింత వినయంతో కూడిన గర్వం కలిగింది. నాకు గీత రచయితగా జన్మనిచ్చిన దర్శకులు విశ్వనాథ్‌గారి చరణాలకు నమస్కరిస్తున్నా. నేను ఇక్కడికి వచ్చి పాటలు రాయాలని తలపించిన మా మాస్టారును తలచుకుంటున్నా. ఈ వేడుకను పై నుంచి చూస్తున్న నాన్నగారికి నమస్కరిస్తున్నా. ► ‘మాటలతో చెప్పడానికి అవకాశం లేని, సరిపోని భాష మూగబోయే స్థితిలో మాటల్ని వాహిక చేసుకుంటూ కనిపించని భావాన్ని అనిపింపజేసే ప్రక్రియ పాట’ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఈ రంగంలోకి వచ్చాను. శోకం, క్రోదం, కోపం... ఇలాంటి దేశ, కాల అతీతమైన కొన్ని భావాలు ఉన్నాయి. సంఘటనలు, వ్యక్తులు, స్థలాలు... వీటిపై పాట రాయడం ఆసక్తి లేదు. పద్యం రాయాలని కానీ లేదా వచన కవిత్వం కానీ రాయాలని అప్పట్లో ఉండేది. ► నాకు చంధస్సు, పద్యం రాయడం రాదు కనక పాట రూపంలో నా అభిప్రాయాలను వ్యక్తపరిచేవాడిని. మెచ్చుకున్నవాళ్లూ నొచ్చుకున్నవాళ్లూ ఉన్నారు. నేనేమీ సంస్కృతాన్ని ఒక సన్నిధానంలో చదువుకున్నవాడినేం కాదు.. వినికిడి పాండిత్యం. మా నాన్నగారు మహా పండితులు. ఆయన సహచర్యం, భగవద్గీత ఇత్యాది వాటివల్ల నా భావాలకు అవసరమైన పద సంపద దొరికింది. అది అందరి దగ్గర ఉంది. నేను కఠినమైన భాషలో రాస్తాను అని చాలా మంది అంటుంటారు. కానీ, అలా రాయడం నాకు రాదు. ► విశ్వనాథ్‌గారి సినిమాకు సంబంధించి ఓ సారి విలేకర్ల సమావేశం జరిగింది. అప్పుడు ‘సిరివెన్నెల’ పాట చదువుతారు అన్నారు నొక్కి. అప్పుడు చదివాను. అక్కడి నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. అప్పుడు ఒక రకమైన బతుకు జీవుడా భావం అనిపించింది. జన్మ ధన్యమైన భావం కలిగింది. ► నా ప్రతి పాటను అవార్డుగానే భావిస్తాను. పాట ఎలా కావాలో తెలిస్తే దర్శక–నిర్మాతలే తీసుకునేవారు. ఎలా ఉండాలో చెప్పడానికే 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. సినిమా కోసమే కాదు.. నా కోసం కూడా నేను పని చేస్తున్నా. ఆ శ్రద్ధ, ఆ భయం ఉన్నాయి. వీటికి భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయి. పాట పట్ల నాకు ఉన్న భయం, భక్తి... నా పాట పంచామృతం. ► పద్మం బురదలో వికసిస్తుంది. గళం అశ్లీల మాటలను ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ బురదలో పూసిన ప్రతి పాట కూడా ఒక పద్మంలా ఉండాలని కోరుకుంటాను నేను. సరస్వతీదేవి కూర్చొనే ఆసనం పద్మం. నా ప్రతి పాట సరస్వతీదేవి పీఠం కావాలనే కోరికతో శ్రద్ధతోనే చేశాను. ఇకపై కూడా అలానే చేస్తాను. ► మీ (ప్రేక్షకులు) హృదయాల్లో నిక్షిప్తమైన, మీకు ఇష్టమైన భావాలను నేను పలికిస్తున్నాను కాబట్టి మీరు స్పందిస్తున్నారు. మీకు నచ్చని మాటలు మాట్లాడితే మెచ్చుకునేవారు కాదు. సీతారామశాస్త్రి మంచి పాటలు రాస్తారు అనే భావనకు వెళితే రేపు నేను తప్పు చేసినా మీ కంట పడదు. మీ గుండెల్లోని నిశ్శబ్దానికి ప్రతిధ్వని నేను. సినిమా కథ జీవితాల్లో నుంచే వస్తుంది. కాకపోతే కాస్త డ్రామా ఉంటుంది. ఎక్కడైతే మాట మూగబోతుందో అక్కడ పాట ఆలాపన మొదలవుతుంది అంటూ ‘సిరివెన్నెల’ తరంగాలు అనే పుస్తకం రాశాను. ► పద్మ అవార్డుని ఆశించలేదు. నా ప్రతి పాటను నేను అవార్డుగానే భావిస్తాను. ఎంతో మంది అభిమానించారు. వారి హృదయ స్పందనకన్నా పెద్ద అవార్డు ఉంటుందని అనుకోను. అవార్డు కోసం నేను ఎప్పుడూ అప్లై చేసుకోలేదు. నా ప్రతి పాట నాకు నచ్చుతుంది. ‘లాలిజో..లాలిజో ఊరుకో పాపాయి, గుమ్మాడి గుమ్మాడి...’ ఇలా అనేక పాటలు ఉన్నాయి. ► ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను అభిమానిస్తారు. నేను వ్యక్తిత్వానికి విలువిస్తాను. నువ్వు ఏం సాధించావ్? అంటే మానవ వ్యవసాయం చేసి హృదయాల్లో స్థానం సంపాదించానని చెబుతాను. రాజ్యం సంపాదించడం కంటే ఒక మనిషి హృదయంలో విలువైన స్థానం సంపాదించడానికే నేను ఇష్టపడతాను. ► నేనే నం.1... లాంటి పాటలు రాయడానికి ఇష్టపడను. ఎందుకంటే తెర ఆడే వరకే ఆ మాట మిగులుతుంది. కథానాయకుడిని పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు ‘గెలుపంటే పసిడి పతకాల తీరం కాదురా..’ అని రాశాను. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం అని ఓ సందర్భంలో రాశాను. పాత్రకు సరిపోతుంది. కేవలం ఆ ఒక్క సందర్భానికి మాత్రమే కాకుండా అన్ని సందర్భాలకు అన్వయించవచ్చు. ► ఆకలేస్తుందని భయపడుతుంటాం. భయపడితే ఆకలి తీరుతుందా? ప్రకృతి కఠినంగానే ఉంటుంది. భయానికి ఎంత స్థానం ఇవ్వాలో తెలుసుకోవాలి. అలా ఏయే భావాలకు ఏయే స్థానాలు ఇవ్వాలో తెలిస్తే ‘ఇవాళ ఉన్నటువంటి ఇన్‌బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. ఇలాంటి భావాలను పంచుకునేందుకు నాకు సినిమా రంగం దొరికింది. నేను సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. సినిమా అన్నది నాటక శాస్త్రానికి యాంత్రిక స్వరూపం. ఒకే చోట.. చాలా చోట్లా ప్రదర్శించవచ్చు. సాహిత్యంలో అనేక రకాలున్నాయి. కథ, సాహిత్యం, నవల.. ఇలా పలు రకాలున్నాయి. నాటకానికి ఇంకా ముఖ్య స్థానం ఉంది. సినిమా వల్ల సమాజం పాడవుతుంది అంటారు. సినిమా వల్ల సమాజం బాగుపడుతుంది. సినిమా సమాజానికి అద్దం మాత్రమే. సినిమా కొత్తగా చూపించేది ఉండదు. 5 రూపాయలతో పెన్సిల్ తయారు చేసి, దాన్ని 7 రూపాయలకు అమ్మరు. ఆ శ్రమకు విలువ కట్టకుండా భౌతికంగా వెచ్చించే సమయానికి డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ఇది ధర్మమైన వ్యాపారం చేస్తున్నాను అనే గర్వం పోవడం మన దురదృష్టం. ఒక్కసారి ఆ గర్వాన్ని మళ్లీ భావిస్తే తెలుగు సినిమా తన వైభవాన్ని చాటుతుందని అనుకుంటా. ► పాట రాయడం ప్రసవ వేదన అంటారు. ఏ పనిలో కష్టం లేదు? కష్టపడకుండా ఏదీ రాదు. అమూల్యం అన్నదానికి రెండర్థాలున్నాయి. పొగరుగా ధ్వనించవచ్చు. పల్లవి నుంచి పాటలోని ఆఖరి వాక్యం వరకూ పాడుకుంటూ తమ జీవితాల్లోకి అన్వయించుకుంటూ ఆనందిస్తున్న వాళ్ల సంతోషానికి విలువ ఏం ఉంటుంది? పారితోషికం ఆలోచించకుండా, ఆశించకుండా పాటలు రాసిన సందర్భాలున్నాయి. అది త్యాగం అనుకోను. నా బాధ్యత అని భావిస్తాను. నేను సైతం అని సహాయం చేస్తాను. ► కాలం మారదు. కాలం మారితే మనం బతకలేం. పంచభూతాలే మారనప్పుడు మనం మారడమేంటి? సభ్యంగా పూర్తిగా ప్యాంటు వేసుకునే దగ్గరి నుంచి చిరిగినవే వేసుకుంటున్నాం. ట్రెండ్ అండీ.. అంటారు. మన సమాజం తాలూకు సంస్కృతులు ఓవర్‌ల్యాప్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ అంటే వల. మౌస్ అంటుంటాం. ఎలుక తోక పట్టుకొని ముందుకు వెళ్లడం ఏంటి? చాటింగ్ అంటూ మాట్లాడటం మానేశాం. తెలుగులో ఎకిమీడ (రాజా) అని రాస్తే పట్టించుకోం. అదేదో ఫారిన్ భాష నుంచి కసరసకరస అని రాస్తే అర్రే బహు బాగుందే అని ఫీల్ అవుతుంటాం. తెలుగు వాళ్లు తమ తాలూకా ఉనికిని కోల్పోవడానికి ఎక్కువగా ముచ్చటపడుతుంటారు. ఇలాంటి తలకిందుల చేష్టలు కూడా మళ్లీ మామూలుగా అయిపోతాయనే అనుకుంటున్నాను. ► ఒక పాట బయటకు రావడానికి దర్శక–నిర్మాతలు, సంగీత దర్శకుడు, రచయిత అభిప్రాయాలు కలవాలి. దీన్నే సాంఘిక జీవనానికి అన్వయిస్తే ఈ మధ్య మా అభిప్రాయాలు కుదరడం లేదని విడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అభిప్రాయం కలవని ఇద్దరూ సాగించే ప్రయాణమే పెళ్లి అంటాను. నచ్చనది చెబుతూ నచ్చినవి స్వీకరించడమే ప్రయాణం. జీవితం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. సినిమా రంగం కూడా అలానే. ► ట్యూన్‌కి రాయడమే ఆది నుంచి ఉన్నది . సినిమా నేర్పింది కాదిది. మనకు నూట ఒక్క వృత్తాలు ఉన్నాయి. ఇవన్నీ ట్యూన్లే. కవి చెప్పదలుచుకున్న భావానికి ఎటువంటి నడకైతే బావుంటుందో నువ్వే ఎంచుకొని అది రాయి. ట్యూన్‌కి రాయడం సాధారణ ప్రక్రియ. ట్యూన్ ఓకే చేసేశాం సార్ అంటుంటారు. ఓకే చేయాల్సింది నేను కదయ్యా అనిపిస్తుంది (నవ్వుతూ). ► నిర్మాత సంకల్పంలో లోపం ఉండదు. మంచి సినిమా తీయాలనే అనుకుంటారు.. అందరూ గౌరవించాలి. నేను నిర్మాతల రచయితను. ఇది వరకు పాటను రాత్రిళ్లు రాసేవాడిని. ఆరోగ్య రీత్యా ఇప్పుడు కొంచెం తగ్గించాను. అయినప్పటికీ రాత్రుళ్లే రాస్తున్నాను. పాట ఎందుకు? కథ అడగని పాట ఎందుకు? ఇటీవల హిట్ అయిన సినిమాల్లో పాటలు గుర్తున్నాయా? వస్తున్నా సరే క్షమించి కూర్చుంటున్నారు. అంత అక్కర్లేని, ఆనందింపజేయలేని పాట పెట్టే బదులు ఆ పాటకు అయ్యే ఖర్చు మిగిల్చుకోవచ్చుగా. ఈ విషయం నిర్మాతలకు చెప్పాలి అనిపిస్తుంది. ఆరు నుంచి నాలుగుకు పడిపోయాయి. ఇప్పుడు మూడు అయ్యాయి. మెల్లిగా పల్లవి, ఆ తర్వాత రెండు వాక్యాలు చిత్రీకరిస్తున్నారు. పాట ఎందుకుండాలో, ఎప్పుడుండాలో అని కూర్చుని ఆలోచించి అవసరమైతే పెట్టండి. పాటలు ఎప్పటికీ ఉంటాయి. మనిషి ఉన్నంతకాలం పాటలుంటాయి. ఆ భావాల్ని రాయను ఏ పరిస్థితుల్లోనూ స్త్రీని కించపరచలేను. ఆమె పాత్ర ఏదైనా అవ్వొచ్చు. సెక్స్ వర్కర్ అవ్వొచ్చు. క్లబ్ డ్యాన్సర్ అవ్వొచ్చు. ఎంత ఘాటు శృంగారం అయినా, మోటు శృంగారం అయినా రాస్తాను. అది కూడా నా తల్లితోటి, చెల్లితోటి వినగలిగేలా రాస్తాను. అలాగే కుర్రకారుని రెచ్చగొట్టే పాటల్ని రాయను. జీవితం ఏదైనా నేర్పుతుంది. బలవంతంగా జీవితం నేర్పే పాఠాల్ని వదిలేసి వయసు మళ్లే దాకా నాలుగు గోడల మధ్య చదివేదే చదువు అంటున్నాం. మనకు నాలుగు భాషలు రావు. ఆటో డ్రైవర్‌కి వస్తాయి. ఎలా? అవసరం. పాట పదాలలో లేదు. మాటల్లో కానీ, అక్షరాల్లో కానీ లేదు. వాటి పోహళింపు మధ్య ఉన్న నిశ్శబ్దంలో ఉంది పాట. కేవలం పదాల పదాల ప్రయోగం నుంచి బయట పడినప్పుడే సినీ గీత రచయితలు మంచి పాటలు రాయగలుగుతారు. -
యువ కళా కెరటం
జవహర్‌నగర్: ఇటు నృత్యం.. అటు సాహిత్యంలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శివాజీనగర్‌కు చెందిన వేములవాడ శివకుమార్. పేదరికం కళకు అడ్డు కాదని నిరూపిస్తున్నాడు. నృత్యంతో మొదలైన తన ప్రస్థానం ప్రస్తుతం సాహిత్యం దిశగా సాగుతోంది. ఆల్బమ్స్ సైతం రూపొందిస్తున్నాడు. ఆరో తరగతి నుంచే డ్యాన్స్ నేర్చుకున్న శివ.. ఆ విద్యను పది మందికి అందజేస్తున్నాడు. ఆల్బమ్స్ రూపకల్పన... ఇంటర్ పూర్తి చేసిన శివకుమార్ జవహర్‌నగర్‌లో ‘అమ్మ’ నృత్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. తక్కువ ఫీజులు తీసుకుంటూ నటన, నృత్యంలో శిక్షణనిస్తున్నాడు. శివకుమార్ నృత్య రంగంలో రాణిస్తూనే.. మరోవైపు లఘు చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ‘అమ్మ క్రియేషన్స్’ పేరుతో ‘చెలియా సఖియా.. అందాల పువ్వేదో.. ‘అను అను అనురాగం.. హృదయమా... కళ్లలోనూ కలలే కంటూ’ అనే గీతాలతో ఓ ఆల్బమ్ రూపొందించాడు. భవిష్యత్‌లో సినీ రంగంలో అడుగు పెట్టాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాడు. లిరిక్ రైటర్ కావాలని.. సాధ్యమైనంత వరకు కళను పది మందికి పంచడమే నా ఆశయం. ఇప్పటి వరకు ఎన్నో కవితలు రాశాను. ‘ఇట్స్ మై లవ్’ ఆల్బమ్ విడుదల చేశాను. మ్యూజిక్ యాంకర్ భార్గవ్‌తో రెండు పాటలను చిత్రీకరించాను. దానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. యాంకర్ రవి, లాస్యలతో ఆల్బమ్ రూపొందించాం. భవిష్యత్‌లో సినీగేయ రచయిత కావడమే నా ధ్యేయం. – శివకుమార్ -
‘ఉయ్యాల జంపాల’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలతో బ్రేక్
గుంటూరు, తెనాలి: సినిమా పాటతో చదువుకునే రోజుల్నుంచి ప్రయాణం కట్టాడో యువకుడు. పాటను పలవరిస్తూ, కలవరిస్తూ, పాటే జీవితమనుకున్నాడు. తెలుగు సినిమా వేదికగా నిరూపించుకోవాలని కలలుగన్నాడు. చదువు పూర్తవగానే తన కలలు నెరవేర్చుకునేందుకు ఓ సుముహూర్తాన హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. కాలచక్రంలో పదేళ్లు గిర్రున తిరిగాయి. ఒకే ఏడాది పది సినిమాలకు పాటలు రాసే ఘనతను పొందాడు. ఉయ్యాల జంపాల, మజ్నూ, అర్జున్‌రెడ్డి సినిమాలతో యువతరానికి దగ్గరైన ఆ గీత రచయిత గోసాల రాంబాబు. సాదాసీదాగా మన పక్కింటి కుర్రోడిలా కనిపించే ఆ యువకుడి కలం అన్ని రకాల ఎమోషన్లను ప్రతిబింబించే పాటలు రాస్తుందన్న ప్రశంసలు దక్కాయి. తాజాగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమా పాటల నిమిత్తం తెనాలి వచ్చిన రాంబాబు పాటతో తన ప్రయాణాన్ని ఇలా వివరించారు. ఈ ఏడాది పది సినిమాలు... టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు దిలీప్‌రాజా దర్శకత్వంలో తీస్తున్న ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమాకు పాటలు రాస్తున్నా. యాజమాన్య సంగీత దర్శకత్వంలో నాలుగు పాటలు రికార్డయ్యాయి. మొత్తం అయిదుపాటలు. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఉంటాయి. చివరిపాట టైటిల్సాంగ్పై డిస్కషన్‌కు తెనాలి వచ్చాను. గ్రామీణ నేపథ్యంలోని కథ, చక్కని కామెడీతో జంధ్యాల మార్కు సినిమాలో పాటలు రాయడం మంచి అవకాశం. సిచ్యుయేషన్‌కు తగినట్టుగా పాట ఏ విధంగా ఉండాలనేది దర్శకుడు సూచించారు. యాజమాన్య అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. సాయిధరమ్‌తేజ సినిమా ‘తేజ్ ఐ లవ్ యూ’తో ఈ ఏడాది నేను పాటలు రాసిన మూడు సినిమాలు రిలీజయ్యాయి. మరో నాలుగు రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి ఇంకో మూడు సినిమాలకు పాటలు రాస్తున్నా. మొత్తంమీద ఈ ఏడాది పది సినిమాలకు రాసినట్టవుతుంది. యువతరానికి దగ్గర చేసిన సినిమాలు... నిజానికి 2007 నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతూ పాటలు రాస్తున్నా. తొలి గుర్తింపు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వచ్చింది. రాజ్‌తరుణ్, అవికాగోర్ నటించిన ఈ సినిమాకు విరించివర్మ దర్శకుడు. ‘నిజంగా... అది నేనేనా/ ఉయ్యాల జంపాల లూగేను నా ఊహలే’ అన్న పాట నేనొకడిని ఉన్నానని జనానికి తెలియజేసింది. ఇదే దర్శకుడు నానీతో తీసిన ‘మజ్నూ’లో ‘జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే’ లవ్ మెలోడీ సాంగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ పాట చరణంలోని ‘వాలు కనులలోన దాచేసినావా/ ఆ నింగిలోన లేదు నీలం’ చక్కని భావగీతంగా భుజం తట్టారు. అన్నిటికీ మించి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నన్ను యువతరానికి బాగా దగ్గర చేసింది. ‘తెలిసెనే నా నువ్వే...నా నువ్వు కాదనీ...తెలిసెనే నేననే నే నేను కాదనీ’ అంటూ ఆరంభమయ్యే లవ్ బ్రేకప్ పాటతో సినిమా ఆరంభమవుతుంది. అదే సినిమాలో క్లైమాక్స్‌లో కథంతా చెబుతున్నట్టుగా ‘ఊపిరాడుతున్నదే ఉన్నపాటుగా ఇలా...దారేంటో తోచకున్నదే నిన్ను చూడగా ఇలా’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్. ఆ రెండు పాటలు రాసే అవకాశం నిజంగా నా అదృష్టమే. మరో పది సినిమాల్లో అవకాశాలను తెచ్చింది. ఈ సినిమాతోనే నాకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసింది. పాటతో ప్రయాణం రేడియోతోనే... మా స్వగ్రామం ఏలూరు దగ్గర్లోని కృష్ణాజిల్లా గ్రామం వేల్పుచర్ల, సాధారణ పల్లెటూరు. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, దానయ్య. వ్యవసాయ కూలీ కుటుంబం. రెక్కల కష్టంపై ఆధారపడినప్పటికీ నన్నూ, తమ్ముడినీ, చెల్లెలినీ చదివించారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్ చేశాను. పాటపై మమకారం పెరగడానికి కారణం ఇంట్లో రేడియో. తాతయ్య అమ్మకు కొనిచ్చారట. ఇంట్లో ఉన్నంతసేపు రేడియోలో పాటలు వింటూ హమ్ చేసేవాడిని. ఏడోతరగతి నుంచి పదోతరగతి వరకు నాలుగు కి.మీ దూరంలోని హైస్కూలుకు వెళ్లేవాడిని. తర్వాత ఇంటర్, ఇంజినీరింగ్ ఏలూరులో. బస్టాండులో పాటల పుస్తకాలు కొనుక్కుని, అందులో పాటలు పాడుకుంటూ ప్రయాణించేవాడిని. మధ్యమధ్యలో నేనే సొంతంగా పాటలు అల్లుతూ వచ్చాను. ఆ రకంగా పాఠ్యపుస్తకాలతో పాటు పాటతో నా విద్యార్థి జీవితం గడించింది. తర్వాతి జీవితం పాటతోనే సాగించాలనుకుంటూ, 2007లో చదువైపోగానే హైదరాబాద్ బయలుదేరి వెళ్లా. ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి దగ్గర పనిలో చేరడం నా అదృష్టం. అద్భుతమైన ప్రతిభామూర్తి, అర్ధగంటలో పాట రాసేవారు. నేను చేరిన ఆర్నెల్ల తర్వాత ఆయన కాలం చేశారు. 30 సినిమాల్లోవంద పాటలు... 2007లో ఉదయ్‌కిరణ్, శ్రీహరిల ‘వియ్యాలవారి కయ్యాలు’ నా తొలి సినిమా. రమణ గోగుల సంగీత దర్శకుడు. నేను అనుకున్న ట్యూన్‌లోనే పాటని కంపోజ్ చేయడం మంచి అనుభూతి. తర్వాత ‘టిక్‌టిక్‌టిక్’, ‘లవ్ చేస్తున్నా’ వంటి సినిమాలకు రాస్తూ వచ్చాను. ఉయ్యాల జంపాల తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ ‘బందిపోటు’కు ‘ఏదో మాయవై ఉన్నాదే మనసాగనన్నాదే’ మెలోడీ పాట రాశా.మజ్నూ తర్వాత జగపతిబాబు హీరోగా తీసిన ‘పటేల్ సార్’ సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. పద్మాలయ మల్లయ్యగారు కుమారుడు హీరోగా తీసిన సినిమాలో ‘ఓ సజనా ఓ సజనా’ రాశాను. శ్రీకాంత్ ‘నాటుకోడి’లో ‘కన్ను పడిందే, కన్ను పడిందే నీపై నా కన్ను పడిందే’ మాస్ మసాలా పాట రాయించారు. సాయిధరమ్ తేజ సినిమాలో ‘హ్యాపీ ఫ్యామిలీ’ పాటతో ఫ్యామిలీ సాంగ్‌కు అవకాశం లభించింది. ‘ప్రేమెంత పనిచేసెను నారాయణ’, ‘సమీరం’, సీతాపహరణం’ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. మొత్తంమీద 30 సినిమాల్లో వంద పాటలు రాశాను. అందరు హీరోలతో అన్ని రకాల ఎమోషన్లతో రాయాలనేది నా ఆశ... -
ఆ వార్త మీ దాకా వచ్చిందా!
లేటెస్ట్ లిరిక్ రైటర్స్‌లో సూపర్ మోస్ట్ బిజీ ఎవరంటే ఫస్ట్ తట్టే పేరు - రామజోగయ్య శాస్త్రి. అటు మోడ్రన్‌గానూ, ఇటు ట్రెడిషనల్‌గానూ ఆయన కలానికి రెండు వైపులా పదునే. పదేళ్ల కెరీర్లో 500కు పైగా పాటలు రాసిన ఈ మృదుస్వభావితో భేటీ... మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాకు పాటలన్నీ మీరే రాసినట్టున్నారు? అవునండి. ఈ మధ్య కాలంలో నాకిది గోల్డెన్ ఛాన్స్. ఇటీవల విడుదలైన ఆరు పాటలూ రాక్ చేస్తున్నాయి. సాహిత్యం స్పష్టంగా వినబడుతోందని అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ కుదిరాయి. ‘నువ్వే కాని కలకండైతే నేనొక చిన్న చీమై పుడతా’, ‘తేనెటీగల్లే నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగా నీకు జతకడతా’, ‘కాముడు రాసిన గ్లామరు డిక్షనరీ... నీ నడుమొంపున సీనరీ’... ఇలా అన్ని పాటల్లోనూ ఆకట్టుకొనే వాక్యాలు రాశా. ఈ విషయంలో నాకు స్వేచ్ఛనిచ్చిన దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌లకు నా కృతజ్ఞతలు. కమల్‌హాసన్ ‘చీకటి రాజ్యం’ సినిమాలో మీరు ఓ పాత్ర చేశారట. నిజమేనా? నిజమే కానీ, దాన్ని పాత్ర అని అనకూడదు. చాలా చిన్న వేషం. జస్ట్ అలా కనబడతానంతే. కమల్‌హాసన్ గారిని అడిగి మరీ యాక్ట్ చేశా. ఆ సీన్లో నాతో పాటు డైలాగ్ రైటర్ అబ్బూరి రవి కూడా కనిపిస్తారు. కమల్‌గారి పక్కన ఓ సీన్లోనైనా కనిపిస్తే ఓ జీవితకాల జ్ఞాపకంగా నిలిచిపోతుందనే స్వార్థంతో నేనే అడిగాను. ‘శ్రీమంతుడు’లో కూడా నటించారటగా? ఆ వార్త మీ దాకా వచ్చిందా!? ‘రామరామ’ పాటలో ‘సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు...’ అనే సాకీ పాడుతూ నేను కనిపిస్తాను. ఇంతకు ముందు కూడా మీరు కొన్ని సినిమాల్లో కనిపించారుగా! నాగార్జున గారి ‘కింగ్’లో ఫస్ట్ టైమ్ నటించా. లిరిక్ రైటర్ పాత్రే చేశా. ఆ తర్వాత ‘సూర్య వర్సెస్ సూర్య’లో ‘ఖవ్వాలీ’ సింగర్‌గా నటించా. ‘అల్లరి’ నరేశ్ ‘జేమ్స్ బాండ్’లో కూడా అరబ్ షేక్‌గా కనిపిస్తా. ఈ లిస్ట్ చూస్తుంటే త్వరలో మీరు నటుడిగా మారిపోయేట్టు కనిపిస్తున్నారే? అయ్యయ్యో... అంత మాట అనకండి.నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ పాటల రచనకే. నటన అనేది నా వల్ల కాని పని. ఏదో సరదాగా చేయడం తప్ప, కలలో కూడా నటుడు కావాలనే ఆలోచన లేదు. అయినా నటన అనేది మామూలు విషయం కాదండీ. ఏదో నన్నిలా పాటలు రాసుకోనివ్వండి. -
మనసుకు నచ్చిన పనిలోనే సంతృప్తి
తుని : మనసుకు నచ్చిన పనిని ఎంచుకోవడంలోనే సంతృప్తి ఉంటుందని నిరూపించాడు సినీగేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్. ఇంజనీరింగ్ చదివినప్పటికీ పాటల రచనతోనే సంతృప్తి ఉంటుందని భావించి సినీరంగంలో ప్రవేశించారు. ఆయనతో మాటా మంతీ. ప్ర : సినీ గేయరచయిత ఎలా అయ్యారు? జ : 12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాను. నాకు గురువంటూ ఎవరూ లేరు. మా నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ రచయితను కాగలిగాను. ప్ర : మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది? జ : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర ఉన్న దొడ్డిపట్ల మా స్వగ్రామం. పదోతరగతి వరకు అక్కడే చదివాను. ఇంటర్ విజయవాడలోను, ఇంజనీరింగ్ బాపట్లలోను చేశాను. ప్ర : ఇంజనీరింగ్ పూర్తి చేశారా? జ : ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి ఆపేశాను. ప్ర : మీ తొలిపాట ఏచిత్రానికి చేశారు ? జ : కాదంటే ఔననిలే చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే హైదరాబాద్ వెళ్లాను. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాను. ప్ర : ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు ? జ : 195 చిత్రాలకు 558 పాటలను రాశాను. అందరివాడు సినిమాతో గుర్తింపు వచ్చింది. ప్ర : ఏ రచయిత ఇష్టం ? జ : సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టం. ప్ర : సినీరంగంలో కొత్త గేయ రచయితలకు అవకాశాలు ఉన్నాయా ? జ : సినీ పరిశ్రమకు కొత్త గేయ రచయితల అవసరం ఉంది. అవగాహన ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. -
భాస్కరుడి లలితగీతం
ఆమెని చూడగానే... ‘గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే!’ అని పాడుకుంది అబ్బాయి మనసు. ‘బొమ్మని గీస్తే నీలా ఉంది..?’ అని కూడా అనుకుంది. ‘రామసక్కని బంగారుబొమ్మ...’ అంటూ స్పీడ్ పెంచేసి ‘సారొస్తారొస్తారే.. వస్తారొస్తారొస్తారే...’ అని అమ్మాయిచేతా అనిపించింది. ఆ అబ్బాయి భాస్కరభట్ల రవికుమార్. ఆ అమ్మాయి అతని అర్ధాంగి లలిత. పాటల రచయితగా ఆయన శ్రీకారం చుట్టకముందే ప్రేమకు పల్లవి, చరణంలా వారు కలిసిపోయారు. కృతికి హంసపాదులా, గీతానికి శ్రుతితప్పడంలా కాపురంలో అప్పుడప్పుడూ వచ్చే అన్యోన్య కలహాల్లో... పరిస్థితిని చక్కదిద్దేలా సర్దుబాట్లూ అవసరమే!’’ అని చెప్పిన ఈ జంట పాడిన యుగళగీతమే ఈవారం మనసే జతగా... అబ్బాయి పుట్టింది శ్రీకాకుళంలో. ఐదుగురు తోబుట్టువుల మధ్య పెరిగింది రాజమండ్రిలో. సినిమా జర్నలిస్ట్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం. ఆ తర్వాత సినీ గీత రచయితగా ప్రయాణం. అమ్మాయి స్వస్థలం వరంగల్. ఇంటికి పెద్దకూతురు. ప్రాంతాలు వేరు. భావాలు వేరు. కులాలు వేరు. ఆర్థిక పరిస్థితులు వేరు. అనుకోకుండా కలుసుకున్నారు. మనసులు కలిశాయి. పెద్దలను ఒప్పించి (ఆగస్టు 13, 1998) పెళ్లి చేసుకున్నారు. వీరికి అమంత, సంహిత ఇద్దరు సంతానం. ఇద్దరివైపు మాటవరసకు పలకరింపులే తప్ప, సహాయ సహకారాలు లేవు. ‘అభిరుచుల నుంచి అభిప్రాయాల దాకా అన్నింటా భిన్నం’ అంటున్న వీరు పదిహేనేళ్లుగా కలిసుంటున్నారు. నీ కళ్లతోటి నా కళ్లలోకి చూస్తేనే చంద్రోదయం... ‘ఈ పాటలాగే నా మనసెరిగి నడుచుకుంటూ నా జీవితంలో వెన్నెలలు నింపిన వ్యక్తి భార్యగా లభించడం నా అదృష్టం. పదిహేనేళ్ల క్రితం లలిత నా జీవితంలోకి అడుగుపెట్టి ఉండకపోతే ఈ రోజు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోయేవాడిని. పెళ్లయినకొత్తలోనే గీత రచయిత కావాలనే నా అభిలాషను అర్థం చేసుకొని, ఉద్యోగం వదులుకోమని సలహా ఇచ్చింది. ఆ సమయంలో లలిత ఇచ్చిన సహకారం ఎన్నటికీ మరవలేను. ఇల్లు గడవడానికి ఇతరత్రా ఆదాయవనరులేవీ లేవు. సెకండ్ హ్యాండ్ ఇంగ్లిష్ పుస్తకాలు, మాగజీన్లను మీద కొనుక్కొస్తే, వాటిని లలితే తెలుగు అనువాదం చేసి ఇచ్చేది. వాటికి నేను లీడ్ రాసి, ఫొటో జత చేసి అన్ని పత్రికాఫీసులకు తిరిగేవాడిని. అలా మంచి ఆదాయం సంపాదించాం. దాంతో ఇద్దరికీ ఆత్మవిశ్వాసం పెరిగింది. నాకున్న అభిరుచికి పదునుపెట్టే అవకాశం, సమయం దొరికింది. ఐదారు నెలలు ఇద్దరం కలిసి కష్టపడ్డాం. తర్వాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో నాకు ఓ ఆధారం దొరికింది. అప్పటినుంచి తను ఇంటిని చక్కదిద్దుకుంటుంటే... నేను పాటలు రాసుకుంటూ జాలీగా గడిపేస్తున్నా. ఆలుమగలు ఒకరికోసం ఒకరుగా ఉంటే, ఎంతటి కష్టమైనా దూదిపింజే అవుతుందని స్వానుభవంతో తెలుసుకున్నాను’’ అంటూ తమ సంసార ప్రయాణపు తొలి అడుగులో పంచుకున్న కష్టసుఖాలను వివరించారు. అడుగునవుతాను నీ వెంట నేను... ‘‘ఈ పదాల అల్లికలాగే ఇన్నేళ్లూ ఒకరికోసం ఒకరం అన్నట్టుగా ఉన్నాం. అప్పుడప్పుడు మా మధ్య చోటుచేసుకునే చిన్న చిన్న గ్యాపులను మా ఇద్దరిలో ఎవరో ఒకరం పూరించుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాం’’ అంటూ తమ సంసారంలోని సరాగాలను వినిపించారు లలిత. ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం... ‘పదహారేళ్ల క్రితం.. అచ్చు మా మనసు భాష ఇలాగే ఉంది. అప్పటికి నేను సినిమా జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నాను. వరంగల్‌లో ఓ సినిమా హీరోయిన్ హాజరయ్యే ఫంక్షన్‌ని కవర్ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ లలితను చూశాను. అప్పటికే బి.ఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది తను. ఫంక్షన్ మొత్తం తానే అయినట్టుగా తిరుగుతున్న లలిత నాకు బాగా నచ్చింది. హైదరాబాద్ వచ్చాక అడ్రస్ కనుక్కొని ఉత్తరం రాశాను’ అంటూ తమ ప్రేమ ప్రయాణాన్ని భాస్కరభట్ల చెబుతుంటే లలిత అందుకుని - ‘‘ఆఫీస్‌కు వెళ్లేసరికి వారానికి రెండు, మూడు ఉత్తరాలు నా కోసం రెడీగా ఉండేవి. ఉత్తరాలు రాస్తున్న వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఆ అక్షరాలు, పదాలు నన్ను అమితంగా ఆకట్టుకునేవి. తిరుగు ఉత్తరాలు రాసేలా చేశాయి. ఫలితంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. నమ్మకం కలిగింది. ఓ రోజు పెళ్లి పట్ల తన అభిప్రాయం తెలపమని నేనే రాశాను. వచ్చి కలిశారు. అవి జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు. కులాలు, ఉద్యోగాలు, సర్దుబాట్లు... ఇద్దరం మాట్లాడుకొని, ఇంట్లోవారు ఒప్పుకోకపోతే స్నేహంగానైనా ఉండాలనుకుని వెళ్లిపోయాం. కాని మరుసటి రోజు ఉదయమే ఈయన వచ్చి, పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకుందామన్నారు. వారిని ఒప్పించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది’’ అంటూ ఉద్వేగంతో చెప్పారు లలిత. తోడునీడల పందిరి... ఇల్లు ఆహ్లాదంగా కనిపించాలంటే ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి. ఒకరి బాధకు ఒకరి ఓదార్పు కావాలి. దీని గురించి ప్రస్తావిస్తూ- ‘‘ఎప్పుడైనా రికార్డింగ్‌లో నా పాట ఓకే కాకపోతే, మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు లలిత ఇచ్చే మనోధైర్యం మాటల్లో చెప్పలేనిది. ‘నీ పాట వినే అదృష్టం వారికి లేదు. వదిలేయ్ నాన్నా’ అంటుంది. ఆ మాట చాలా ఆనందాన్నిస్తుంది. మరో పెద్ద ఛాయిస్ వస్తుందన్న నమ్మకాన్నిస్తుంది. ఇలా చాలా విషయాల్లో లలిత మా అమ్మను తలపిస్తుంది’’ అన్నారు భాస్కరభట్ల. బాధ్యతల బంధం... ‘‘ఇన్నేళ్ల జీవితంలో అల్లకల్లోలమయిన పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. కారణం ఈయన ప్లానింగ్. మమ్మల్నెప్పుడూ సెక్యూర్డ్‌గా ఉంచాలనుకుంటారు. పనిలోనూ, డబ్బు విషయంలోనూ చాలా పక్కాగా ఉంటారు. ఇద్దరికిద్దరం కానుకలు ఇచ్చుకోవాలి, బాధ్యతలు వదిలించుకోవాలి... అనుకోం. ఇంటి సరుకులు తేవడం దగ్గర్నుంచి, అవసరమైన వస్తువుల వరకూ పిల్లలనూ వెంట తీసుకెళ్లి తెచ్చుకుంటాం. ఆ సమయంలో పిల్లలకు ఏ వస్తువు ఎంతవరకు అవసరం అనేది తెలిసి వస్తుందని మా ఇద్దరి నమ్మకం. అవసరం ఉందనుకుంటే రూపాయికి వచ్చే వస్తువు పదివేలైనా పెడతాం. అవసరం కానిదనుకుంటే పదివేల రూపాయల వస్తువు రూపాయికి వస్తుందన్నా కొనం. డబ్బు ఎంతవరకు, ఎలా ఖర్చుపెట్టాలనేది మా పద్ధతుల ద్వారా పిల్లలకు తెలియచేస్తుంటాం. వాళ్లూ చక్కగా అర్థం చేసుకుంటారు. గొప్పకోసం పెద్ద పెద్ద స్కూల్స్‌లో వేయాలనుకోం. బాగా చదవాలని అనుకుంటాం. మా నిర్ణయాలు, అలవాట్ల వల్ల పిల్లలు స్కూల్లో అన్నింటా ముందుంటారు. భార్యాభర్తల బంధం బాగుంటేనే పిల్లల ఎదుగుదల ఆశించిన విధంగా ఉంటుంది’’ అని వివరించారు లలిత. ‘‘భార్యాభర్తల మాటపట్టింపులను మూడోవ్యక్తికి చెప్పకూడదు. ఎందుకంటే అవి ఎక్కువసేపు నిలబడవు. నెమ్మదిగా సర్దుబాట్లు చేసుకొని, అన్యోన్యంగా ఉంటాం. మూడో వ్యక్తికి చెప్పడం వలన వారి దగ్గర చులకన అవుతాం. అలాగే కోపతాపాలు, భావోద్వేగాలు చోటుచేసుకోవడం సహజమే. మనసెరిగి సర్దుకుపోవడమే సమంజసం’’ అని తెలిపిన ఈ జంట. - నిర్మలారెడ్డి, సాక్షిఫీచర్స్ ప్రతినిధి ‘నా పాటలకు మొదటి శ్రోత లలితే! పదాల అల్లికలో నేను కుస్తీ పడుతుంటే తను అందించిన పలుకులెన్నో ఉన్నాయి. - భాస్కరభట్ల ఈయన మదిలో కొత్తపదం తట్టిందంటే ఎంత పనిలో ఉన్నా వదిలేసి రావలసిందే! పనికన్నా పదం ముఖ్యం కాబట్టి మొదటి ప్రాధాన్యత పదానికే ఇస్తుంటాను. - లలిత