హీరో విజయ్ దేవరకొండతో రాంబాబు
గుంటూరు, తెనాలి: సినిమా పాటతో చదువుకునే రోజుల్నుంచి ప్రయాణం కట్టాడో యువకుడు. పాటను పలవరిస్తూ, కలవరిస్తూ, పాటే జీవితమనుకున్నాడు. తెలుగు సినిమా వేదికగా నిరూపించుకోవాలని కలలుగన్నాడు. చదువు పూర్తవగానే తన కలలు నెరవేర్చుకునేందుకు ఓ సుముహూర్తాన హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. కాలచక్రంలో పదేళ్లు గిర్రున తిరిగాయి. ఒకే ఏడాది పది సినిమాలకు పాటలు రాసే ఘనతను పొందాడు. ఉయ్యాల జంపాల, మజ్నూ, అర్జున్‌రెడ్డి సినిమాలతో యువతరానికి దగ్గరైన ఆ గీత రచయిత గోసాల రాంబాబు. సాదాసీదాగా మన పక్కింటి కుర్రోడిలా కనిపించే ఆ యువకుడి కలం అన్ని రకాల ఎమోషన్లను ప్రతిబింబించే పాటలు రాస్తుందన్న ప్రశంసలు దక్కాయి. తాజాగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమా పాటల నిమిత్తం తెనాలి వచ్చిన రాంబాబు పాటతో తన ప్రయాణాన్ని ఇలా వివరించారు.
ఈ ఏడాది పది సినిమాలు...
టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు దిలీప్‌రాజా దర్శకత్వంలో తీస్తున్న ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమాకు పాటలు రాస్తున్నా. యాజమాన్య సంగీత దర్శకత్వంలో నాలుగు పాటలు రికార్డయ్యాయి. మొత్తం అయిదుపాటలు. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఉంటాయి. చివరిపాట టైటిల్‌సాంగ్‌పై డిస్కషన్‌కు తెనాలి వచ్చాను. గ్రామీణ నేపథ్యంలోని కథ, చక్కని కామెడీతో జంధ్యాల మార్కు సినిమాలో పాటలు రాయడం మంచి అవకాశం. సిచ్యుయేషన్‌కు తగినట్టుగా పాట ఏ విధంగా ఉండాలనేది దర్శకుడు సూచించారు. యాజమాన్య అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. సాయిధరమ్‌తేజ సినిమా ‘తేజ్ ఐ లవ్ యూ’తో ఈ ఏడాది నేను పాటలు రాసిన మూడు సినిమాలు రిలీజయ్యాయి. మరో నాలుగు రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి ఇంకో మూడు సినిమాలకు పాటలు రాస్తున్నా. మొత్తంమీద ఈ ఏడాది పది సినిమాలకు రాసినట్టవుతుంది.
యువతరానికి దగ్గర చేసిన సినిమాలు...
నిజానికి 2007 నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతూ పాటలు రాస్తున్నా. తొలి గుర్తింపు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వచ్చింది. రాజ్‌తరుణ్, అవికాగోర్ నటించిన ఈ సినిమాకు విరించివర్మ దర్శకుడు. ‘నిజంగా... అది నేనేనా/ ఉయ్యాల జంపాల లూగేను నా ఊహలే’ అన్న పాట నేనొకడిని ఉన్నానని జనానికి తెలియజేసింది. ఇదే దర్శకుడు నానీతో తీసిన ‘మజ్నూ’లో ‘జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే’ లవ్ మెలోడీ సాంగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ పాట చరణంలోని ‘వాలు కనులలోన దాచేసినావా/ ఆ నింగిలోన లేదు నీలం’ చక్కని భావగీతంగా భుజం తట్టారు. అన్నిటికీ మించి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నన్ను యువతరానికి బాగా దగ్గర చేసింది. ‘తెలిసెనే నా నువ్వే...నా నువ్వు కాదనీ...తెలిసెనే నేననే నే నేను కాదనీ’ అంటూ ఆరంభమయ్యే లవ్ బ్రేకప్ పాటతో సినిమా ఆరంభమవుతుంది. అదే సినిమాలో క్లైమాక్స్‌లో కథంతా చెబుతున్నట్టుగా ‘ఊపిరాడుతున్నదే ఉన్నపాటుగా ఇలా...దారేంటో తోచకున్నదే నిన్ను చూడగా ఇలా’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్. ఆ రెండు పాటలు రాసే అవకాశం నిజంగా నా అదృష్టమే. మరో పది సినిమాల్లో అవకాశాలను తెచ్చింది. ఈ సినిమాతోనే నాకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసింది.
పాటతో ప్రయాణం రేడియోతోనే...
మా స్వగ్రామం ఏలూరు దగ్గర్లోని కృష్ణాజిల్లా గ్రామం వేల్పుచర్ల, సాధారణ పల్లెటూరు. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, దానయ్య. వ్యవసాయ కూలీ కుటుంబం. రెక్కల కష్టంపై ఆధారపడినప్పటికీ నన్నూ, తమ్ముడినీ, చెల్లెలినీ చదివించారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్ చేశాను. పాటపై మమకారం పెరగడానికి కారణం ఇంట్లో రేడియో. తాతయ్య అమ్మకు కొనిచ్చారట. ఇంట్లో ఉన్నంతసేపు రేడియోలో పాటలు వింటూ హమ్ చేసేవాడిని. ఏడోతరగతి నుంచి పదోతరగతి వరకు నాలుగు కి.మీ దూరంలోని హైస్కూలుకు వెళ్లేవాడిని. తర్వాత ఇంటర్, ఇంజినీరింగ్ ఏలూరులో. బస్టాండులో పాటల పుస్తకాలు కొనుక్కుని, అందులో పాటలు పాడుకుంటూ ప్రయాణించేవాడిని. మధ్యమధ్యలో నేనే సొంతంగా పాటలు అల్లుతూ వచ్చాను. ఆ రకంగా పాఠ్యపుస్తకాలతో పాటు పాటతో నా విద్యార్థి జీవితం గడించింది. తర్వాతి జీవితం పాటతోనే సాగించాలనుకుంటూ, 2007లో చదువైపోగానే హైదరాబాద్ బయలుదేరి వెళ్లా. ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి దగ్గర పనిలో చేరడం నా అదృష్టం. అద్భుతమైన ప్రతిభామూర్తి, అర్ధగంటలో పాట రాసేవారు. నేను చేరిన ఆర్నెల్ల తర్వాత ఆయన కాలం చేశారు.
30 సినిమాల్లోవంద పాటలు...
2007లో ఉదయ్‌కిరణ్, శ్రీహరిల ‘వియ్యాలవారి కయ్యాలు’ నా తొలి సినిమా. రమణ గోగుల సంగీత దర్శకుడు. నేను అనుకున్న ట్యూన్లోనే పాటని కంపోజ్ చేయడం మంచి అనుభూతి. తర్వాత ‘టిక్‌టిక్‌టిక్’, ‘లవ్ చేస్తున్నా’ వంటి సినిమాలకు రాస్తూ వచ్చాను. ఉయ్యాల జంపాల తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ ‘బందిపోటు’కు ‘ఏదో మాయవై ఉన్నాదే మనసాగనన్నాదే’ మెలోడీ పాట రాశా.మజ్నూ తర్వాత జగపతిబాబు హీరోగా తీసిన ‘పటేల్ సార్’ సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. పద్మాలయ మల్లయ్యగారు కుమారుడు హీరోగా తీసిన సినిమాలో ‘ఓ సజనా ఓ సజనా’ రాశాను. శ్రీకాంత్ ‘నాటుకోడి’లో ‘కన్ను పడిందే, కన్ను పడిందే నీపై నా కన్ను పడిందే’ మాస్ మసాలా పాట రాయించారు. సాయిధరమ్ తేజ సినిమాలో ‘హ్యాపీ ఫ్యామిలీ’ పాటతో ఫ్యామిలీ సాంగ్‌కు అవకాశం లభించింది. ‘ప్రేమెంత పనిచేసెను నారాయణ’, ‘సమీరం’, సీతాపహరణం’ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. మొత్తంమీద 30 సినిమాల్లో వంద పాటలు రాశాను. అందరు హీరోలతో అన్ని రకాల ఎమోషన్లతో రాయాలనేది నా ఆశ...
Comments
Please login to add a commentAdd a comment