ఆ వార్త మీ దాకా వచ్చిందా!
లేటెస్ట్ లిరిక్ రైటర్స్‌లో సూపర్ మోస్ట్ బిజీ ఎవరంటే ఫస్ట్ తట్టే పేరు - రామజోగయ్య శాస్త్రి. అటు మోడ్రన్‌గానూ, ఇటు ట్రెడిషనల్‌గానూ ఆయన కలానికి రెండు వైపులా పదునే. పదేళ్ల కెరీర్‌లో 500కు పైగా పాటలు రాసిన ఈ మృదుస్వభావితో భేటీ...
మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాకు పాటలన్నీ మీరే రాసినట్టున్నారు?
అవునండి. ఈ మధ్య కాలంలో నాకిది గోల్డెన్ ఛాన్స్. ఇటీవల విడుదలైన ఆరు పాటలూ రాక్ చేస్తున్నాయి. సాహిత్యం స్పష్టంగా వినబడుతోందని అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా మంచి మంచి ఎక్స్‌ప్రెషన్స్ కుదిరాయి. ‘నువ్వే కాని కలకండైతే నేనొక చిన్న చీమై పుడతా’, ‘తేనెటీగల్లే నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగా నీకు జతకడతా’, ‘కాముడు రాసిన గ్లామరు డిక్షనరీ... నీ నడుమొంపున సీనరీ’... ఇలా అన్ని పాటల్లోనూ ఆకట్టుకొనే వాక్యాలు రాశా. ఈ విషయంలో నాకు స్వేచ్ఛనిచ్చిన దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌లకు నా కృతజ్ఞతలు.
కమల్‌హాసన్ ‘చీకటి రాజ్యం’ సినిమాలో మీరు ఓ పాత్ర చేశారట. నిజమేనా?
నిజమే కానీ, దాన్ని పాత్ర అని అనకూడదు. చాలా చిన్న వేషం. జస్ట్ అలా కనబడతానంతే. కమల్‌హాసన్ గారిని అడిగి మరీ యాక్ట్ చేశా. ఆ సీన్‌లో నాతో పాటు డైలాగ్ రైటర్ అబ్బూరి రవి కూడా కనిపిస్తారు. కమల్‌గారి పక్కన ఓ సీన్‌లోనైనా కనిపిస్తే ఓ జీవితకాల జ్ఞాపకంగా నిలిచిపోతుందనే స్వార్థంతో నేనే అడిగాను.
‘శ్రీమంతుడు’లో కూడా నటించారటగా?
ఆ వార్త మీ దాకా వచ్చిందా!? ‘రామరామ’ పాటలో ‘సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు...’ అనే సాకీ పాడుతూ నేను కనిపిస్తాను.
ఇంతకు ముందు కూడా మీరు కొన్ని సినిమాల్లో కనిపించారుగా!
నాగార్జున గారి ‘కింగ్’లో ఫస్ట్ టైమ్ నటించా. లిరిక్ రైటర్ పాత్రే చేశా. ఆ తర్వాత ‘సూర్య వర్సెస్ సూర్య’లో ‘ఖవ్వాలీ’ సింగర్‌గా నటించా. ‘అల్లరి’ నరేశ్ ‘జేమ్స్ బాండ్’లో కూడా అరబ్ షేక్‌గా కనిపిస్తా.
ఈ లిస్ట్ చూస్తుంటే త్వరలో మీరు నటుడిగా మారిపోయేట్టు కనిపిస్తున్నారే?
అయ్యయ్యో... అంత మాట అనకండి.నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ పాటల రచనకే. నటన అనేది నా వల్ల కాని పని. ఏదో సరదాగా చేయడం తప్ప, కలలో కూడా నటుడు కావాలనే ఆలోచన లేదు. అయినా నటన అనేది మామూలు విషయం కాదండీ. ఏదో నన్నిలా పాటలు రాసుకోనివ్వండి.