Ramajogayya Sastry
-
రామజోగయ్య శాస్త్రి కొడుకు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
తిరుమల సన్నిధిలో టాలీవుడ్ రచయిత.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
టాలీవుడ్ సినీ రచయిత, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగులో గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్న రామజోగయ్య శాస్త్రి ప్రస్తుతం దేవర సినిమాకు పనిచేస్తున్నారు. తాజాగా రిలీజైన చుట్టమల్లే చుట్టేస్తావే సాంగ్‌కు లిరిక్స్ అందించారు.ఇవాళ తిరుమల దర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలో తన కుమారుడి పెళ్లి ఉందని వెల్లడించారు. అందుకే తిరుమల స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వచ్చినట్లు రామజోగయ్య తెలిపారు. కాగా.. రామజోగయ్య శాస్త్రికి హర్ష, తేజ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకన్న దర్శనం అద్భుతంగ జరిగింది నేను మా చిన్నబ్బాయ్ ❤️గోవిందా🙏🙏 pic.twitter.com/Our25bxRne— RamajogaiahSastry (@ramjowrites) August 6, 2024 -
గుంటూరు కారం ఫస్ట్ సాంగ్.. మహేశ్ ఫ్యాన్స్‌కు మసాల బిర్యానీ రెడీ
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానుల జాతర నేటి నుంచి మొదలైంది. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చింది. నిజానికి ఈ ప్రోమో ముందే లీక్ అయింది. కొన్ని సెకెండ్ల బిట్ బయటకు వచ్చేసింది. అఫీషియల్‌గా విడుదలైన సాంగ్ ప్రోమోను వింటే మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ మసాలా బిర్యానీనే అనేలా ఉంది. తమన్-త్రివిక్రమ్ కాంబోలో మ్యూజిక్ ఎలా ఉటుందో ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దిరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ సెన్సేషన్ అని తెలిసిందే. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్) 'ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..' అంటూ మొదలైన సాంగ్‌లో.. బిరియానీ, మసాలా లాంటి మాస్ పదాలు ఉన్నాయి. అయితే ఇది జస్ట్ ట్రాక్ బీట్ మాత్రమే.. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రోమో కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నా తమన్ మ్యూజిక్ దుమ్ములేపాడు అని చెప్పవచ్చు. మంచి మసాలా బిర్యానీ తింటూ సాంగ్‌ను ఎంజాయ్ చేయవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. ఇటీవల చాలా సినిమాల నుంచి థమన్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు తరచు విమర్శలతో పాటు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఇలాంటివి ఏమీ తమన్ లెక్కచేయడు. నిజానికి తన వ్యవహారధోరణి, తత్వాన్ని బట్టి ఆలోచిస్తే తన మీద సోషల్ మీడియాలో ఏదో ప్రచారం జరిగితే డిస్టర్బ్ అయ్యే కేరక్టర్ కాదు… సోషల్ మీడియా తీరూతెన్నూ మొత్తం తెలిసినవాడే… అవసరమైతే సోవాట్ అని తేలికగా తీసుకోగలడు. గుంటూరు కారంతో ట్రోలర్స్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. -
అదే గేయ రచయిత గొప్పదనం: రామజోగయ్య శాస్త్రి
‘మంచి కవిత్వం రాసే ప్రతిభ ఉన్నంత మాత్రాన సినిమా పాటలు రాయలేం. ఇక్కడ ట్యూన్ కి రాయడం ప్రధానం. అలాగే కొన్ని సార్లు ట్యూన్ లేకుండా కూడా రాయాలి. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం ఉంటుంది. ఎంతగొప్పగా రాసినా సింపుల్ గా రాయడం ఇక్కడ ప్రధానం. బాగా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, పట్టుదల సహనం ఉండాలి. ఇదే యువ గేయ రచయితలకు నేను ఇచ్చే సలహా’ అని ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. తాజాగా ఆయన బాలయ్య 'వీరసింహారెడ్డి'లో అన్ని పాటలకు, చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోని 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' పాటకు సాహిత్యం అందించారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా తాజాగా రామజోగయ్య శాస్త్రీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' గురించి చెప్పండి ? ఈ లిరిక్స్ లో సౌండింగ్ సరదా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తో చెప్పాను. దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక ట్యూన్ ఇచ్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది. సంక్రాంతి సినిమాలన్నిటికీ లిరిక్స్ రాశారు కదా.. ఈ సంక్రాంతి మీదే అనిపిస్తోంది ? అనుకుంటే జరగదు. అలా కుదిరిందంతే. చాలా పాటలు రాస్తూనే ఉంటారు కదా.. ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ ఉంటుందా ? అలా ఏమీ ఉండదు. ఇన్నాళ్ళ అనుభవంతో టెక్నిక్, అలవాటు ప్రకారం కంటెంట్ ఇవ్వడం జరిగిపోతుంది. అయితే గొప్ప పాట రావాలి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కావాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది. 'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అలా నెక్స్ట్ లెవల్ కంటెంట్ అనుకునే పాటలు ఏంటి? 'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకంగా ఉంటుంది. పెద్ద సినిమాలకి వచ్చేసరికి కావాల్సిన సమయం ఇస్తారు. పైగా అఖండ సినిమాకి రాయలేదు. ఆ పట్టుదల ఉంటుంది. క్రాక్ తర్వాత గోపీచంద్ తో మళ్ళీ కలసి చేస్తున్నాను. 'వీరసింహారెడ్డి సింగిల్ కార్డ్ రాశాను. మొదటి నుంచి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత బలంగా రాసే అవకాశం ఉంటుంది. తమన్ తో కలసి అన్ని పాటలు అద్భుతంగా చేశాం. విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాట కూడా అంతకు మించి ఉంటుంది. సింగిల్ కార్డ్ రాస్తున్నపుడు మీ పై ఒత్తిడి ఉంటుందా ? సింగిల్ కార్డ్ అయినా.. ఒక్క పాట అయినా.. దర్శకుడి కల కోసమే గేయ రచయిత పని చేస్తాడు. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం ఉంటుంది. అయితే సింగిల్ కార్డ్ రాయడంలో ఒక సౌలభ్యం ఉంటుంది. పాటలన్నీ ఒకరే రాస్తారు కాబట్టి ఏ పాటలో ఎలాంటి మాట వాడాం, ఏ భావం చెప్పాం.. ఫ్లో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆరు పాటలు ఆరుగురు రాస్తే మాత్రం.. ఈ కోర్డినేషన్ పని దర్శకుడు చూసుకోవాల్సివస్తుంది. పెద్ద హీరోల సినిమాలకి రాస్తున్నపుడు అభిమానుల అంచనాలు అందుకోవడం సవాల్ గా ఉంటుందా ? ప్రతి పాటకు సవాల్ ఉంటుందండీ. ఉదాహరణకు ఒక ప్రేమ పాటే రాస్తున్నాం అనుకోండి. మనమే ఇప్పటికే బోలెడు ప్రేమ పాటలు రాసుంటాం. ఈ పాటలో ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. బాలయ్య గారికి ఇదివరకే కొన్ని పాటలు రాశాం. ఈ సారి ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి, సవాల్ ఉంటుంది. మా బావ మనోభావాలు ఐడియా ఎవరిది ? మా బావ మనోభావాలు ఐడియా నాదే. ఒకసారి తమన్ తో చెబితే దాచి పెట్టమని చెప్పాడు. తర్వాత దర్శకుడు గోపీచంద్ కి చెప్పడం, పాట చేయడం జరిగింది. మనోభావాలు అందరూ సమకాలీనంగా వాడే మాటే. మాస్ మొగుడు పాట గురించి ? మాస్ మొగుడు పాట మంచి ఊపుతో ఉంటుంది. క్లైమాక్స్ కి తగ్గట్టుగా ఉంటుంది. 'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య సినిమాలు ఎలా ఉండబోతున్నాయి ? 'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య రెండూ సినిమాలు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ తో పాటు మంచి మ్యూజికల్ ట్రీట్ ఇస్తాయి. ఈ రెండు చిత్రాలు బూమ్ బద్దలు రికార్డ్ లు సృష్టిస్తాయి. బాలకృష్ణ, చిరంజీవి గారి పాటలు రాస్తున్నపుడు ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు ? బాలకృష్ణ, చిరంజీవి గారి ఇమేజ్ పాట రాయడానికి ఒక ఊతమిస్తుంది. కొన్ని మాటలు వాళ్ళ ఇమేజ్ కే రాయగలం. చిరంజీవి గారికి రాసిన పాట విని చాలా బావుందని అన్నారు. అలాగే మనోభావాలు పాట షూటింగ్ జరిగినప్పుడు సెట్ కి వెళ్లాను. బాలకృష్ణ గారు కూడా బావుందని అభినందించారు. మనోభావాలు పాట విజువల్ గా కూడా చాలా కిక్ ఇచ్చింది. ట్యూన్ కి లిరిక్స్ రాస్తారా ? లిరిక్స్ కి ట్యూన్ చేస్తారా ? సంగీత దర్శకుడికి, లిరిక్ రైటర్ కి కేంద్ర బిందువు దర్శకుడు. ఆయన కథ, సందర్భం, విజన్ కి తగ్గట్టు పని చేయాల్సి ఉంటుంది. ఎక్కవ సమయాల్లో ట్యూన్కే లిరిక్స్ రాస్తాను. యువ గేయ రచయితలకు మీరు ఇచ్చే సలహా ? మనలో ఆసక్తి, పాటకు రాసే లక్షణం ఉందో లేదో చూసుకోవాలి. కొందరు చాలా మంచి కవిత్వం రాసే ప్రతిభ కలిగిఉంటారు. కానీ ఇక్కడ ట్యూన్ కి రాయడం ప్రధానం. ఎంతగొప్పగా రాసినా సింపుల్ గా రాయడం ఇక్కడ ప్రధానం. బాగా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, పట్టుదల సహనం ఉండాలి -
ఆచార్య ‘లాహే లాహే’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీలవ ఈ మూవీలోని ‘లాహే లాహే’ పాటను చిత్ర బృదం విడుదల చేసింది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ మారి.. అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఆ పాట తెలుగు లిరిక్స్ మీ కోసం.. పల్లవి: లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. కొండలరాజు బంగరుకొండ కొండజాతికి అండదండ మద్దెరాతిరి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే .. !! లాహే లాహే !! చరణం: మెళ్ళో మెలికల నాగులదండ వలపుల వేడికి ఎగిరిపడంగా ఒంటి ఇబుది జల జల రాలిపడంగ సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విల విల నలిగిండే .. !! లాహే లాహే !! చరణం: కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిరబోసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలెగసిన కుంకమ్ బొట్టు వెన్నెల కాసిందే పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే ఉబలాటంగా ముందటికురికి అయ్యవతారం చూసిన కలికి ఎందా సెంకం సూలం బైరాగేసం ఎందని సనిగిందె ఇంపుగా ఈపూటైన రాలేవా అని సనువుగా కసిరిందే ... !! లాహే లాహే !! చరణం: లోకాలేలే ఎంతోడైన లోకువమడిసే సొంతింట్లోన అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు ఆలుమగల నడుమన అడ్డంరావులె ఇట్టాటి నీమాలు ఒకటోజామున కలిగిన విరహం రెండోజాముకు ముదిరిన విరసం సర్దుకుపోయే సరసం కుదిరే యేలకు మూడో జామాయే ఒద్దిక పెరిగే నాలుగోజాముకు గుళ్లో గంటలు మొదలాయే... !లాహే లాహే ! ప్రతి ఒక రోజిది జరిగే గట్టం యెడముఖమయ్యి ఏకం అవటం అనాది అలవాటిల్లకి అలకలలోనే కిలకిలమనుకోటం స్వయానా చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం సినిమా: ఆచార్య సంగీతం: మణిశర్మ రచన: రామజోగయ్య శాస్త్రి గానం: హారికా నారాయణ్, సాహితీ చాగంటి -
చిరంజీవికి ఏమైంది.. ఇలా చేస్తున్నారు!
గతేడాది ఉగాదికి ట్విటర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఖాతాలో చేరిన మెగాస్టార్ చిరంజీవి అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. అంతేగాక ఆయన సటైరికల్ పోస్టులకు ట్విటర్లో ఎంతో క్రేజ్ ఉంది. అలా ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటున్న చిరు.. ట్విటర్ ఖాతా 1 మిలియన్ ఫాలోవర్స్‌కు చేరువలో ఉంది. అయితే చిరు మాత్రం ట్విటర్లో ఎవరిని ఫాలో కారు. కొద్ది రోజుల కిందట ఆయన ట్విటర్ ఫాలోయింగ్ లిస్టులో మాత్రం ఒకటి కనిపించేది. అదేవరిని చూడగా ఆయన తనయుడు రామ్ చరణ్ పేరు కనిపించింది. దీంతో చిరు ట్విటర్లో కేవలం చెర్రినే ఫాలో అవుతున్నాడనే వార్త గుప్పుమనడంతో కొద్ది రోజులకు అన్‌ఫాలో అయ్యాడు. తర్వాత ఆయన ఫాలోయింగ్ ఖాతా జీరో అయ్యింది. ఇక తాజాగా చిరు ట్విటర్ ఫాలోయింగ్ లిస్టులో ఒకటి కనిపించింది. ఈ సారి రామజోగయ్య శాస్త్రి పేరు కనిపించింది. దీంతో చిరు ట్విటర్లో ఫాలో అయ్యే ఒకే ఒక్క వ్యక్తిగా రామజోగయ్య శాస్త్రి నిలిచారంటు నిన్న వార్త తెగ వైరల్‌గా అయ్యింది. అది చూసిన రామాజోగయ్య శాస్త్రి సైతం హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఎప్పటికి రుణపడి ఉంటానని, కొండంత సంతోషంగా ఉందంటూ స్పందించారు. ఇక ఎమైందో ఏమో తెలీదు ఈ రోజు చిరు ట్విటర్ ఫాలోయింగ్ జీరో అయ్యింది. కేవలం చిరు ఆయనను మాత్రమే ఫాలో అవుతున్నారని తెగ మురిసిపోయిన రామజోగయ్యకు ఒక్కసారిగా షాక్ తగిలింది. అయితే ఇది చిరు చేస్తున్నారా లేదా ఆయన టీం చేస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా చిరు ఇలా చేయడంపై మెగా అభిమానులంతా ఆయనకు ఏమైంది ఇలా చేస్తున్నారంటూ జుట్టు పిక్కుంటున్నారు. చదవండి: ట్విట్టర్లో మెగాస్టార్ ఫాలో అయ్యే ఒకే ఒక వ్యక్తి ఆయనే.. మంగ్లీ పాటను లాంచ్ చేసిన మెగాస్టార్ -
ట్విట్టర్లో మెగాస్టార్ ఫాలో అయ్యే ఒకే ఒక వ్యక్తి ఆయనే..
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా అంటూ ఓ వార్త హైలెట్ అవుతుంది. చిరంజీవి ట్విట్టర్లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి. ఈ విషయాన్ని చెబుతూ ఓ నెటిజన్ రామ్‌జోగయ్య శాస్త్రికి ట్యాగ్ చేశారు. 'సర్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి' అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రామ జోగయ్య శాస్త్రి.. 'చిరంజీవి సర్ ప్రేమ, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొండంత సంతోషంగా ఉన్నాను' అని ఆ పోస్ట్‌ను షేర్ చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవి వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనమంటూ చిరు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా చిరు కొత్త సినిమా 'ఆచార్య'కు రామ జోగయ్య శాస్త్రి పాటలు రాసిన విషయం తెలిసిందే. Forever indebted to the Mega love n blessings dear @KChiruTweets Sir💕 Kondantha santhosham gaa unnanu 🙏 https://t.co/ZRWgfL5jwA — RamajogaiahSastry (@ramjowrites) April 2, 2021 చదవండి : చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్ మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్! -
శివయ్యా... కరుణించు
‘‘హే శీశైలం మల్లయ్యా... ఈ భూగోళం మంచిగా లేదయ్యా...’’ అంటూ తనదైన శైలిలో స్పందించారు ప్రముఖ సినీ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన ‘మల్లయ్యా...’ అని లిరికల్ సాంగ్‌ను రాసి, తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘మూకుమ్మడి మరణాలు, శవాల దగ్గరికి మనుషులు రాకపోవటం ఇదంతా ఏంటి? అని నా మనసుకు అనిపించింది. ప్రపంచం అంతా ఇదే ఆలోచనతో ఉండి ఉంటుంది. కానీ నేను దాన్ని కొంచెం పొడిగించి నాదైన ధోరణిలో ఆ శివయ్యను అడుగుదామనుకున్నాను. అందుకే ఈ పాట రాశాను. విన్నవాళ్లందరూ ‘మీ భావం చాలా చక్కగా ఉంది’ అన్నారు. ‘అయ్యా శివయ్యా, మూడోకన్ను తెరిచే సమయం ఆసన్నం కాలేదయ్యా, వద్దయ్యా వదిలిపెట్టయ్యా, మేము తప్పొప్పులు చేస్తే మమ్మల్ని నిండు మనసుతో క్షమించాల్సిన పెద్దరికం మీది. పిల్లలు తప్పు చేస్తే మందలించాలి కానీ, వీరభద్రుడివి అవుతావేంది. మంచి చెప్పాలి కానీ, కోప్పడతావేంది.. ఏదో చెంపదెబ్బ కొట్టి సరిపెట్టుకోవాలి కానీ, అలా శివాలెత్తుతావేమయ్యా, శివయ్యా.. మనుషులన్నాక ఆ మాత్రం తప్పులు చేస్తాం. ఆ తప్పులను సరిచేసే భాద్యత నీదే. అంతేకానీ, ఇలా మూకుమ్మడిగా ప్రాణాలు తీస్తావా, మమ్మల్ని ఇబ్బంది పెడితే మా బాధ దేవుడెరుగు. మమ్మల్ని పుట్టించిన పార్వతీదేవికి కడుపుకోతను మిగులుస్తావా. కొంచెం శాంతించు, కరుణించు అనే ఉద్దేశంతో పాట ఉంటుంది’’ అన్నారు. ‘‘నా కెరీర్లో ఇప్పటివరకు 1200 పాటలను రాశాను. ఈ ఏడాది అనేక పెద్ద సినిమాలకు రాస్తున్నాను’’ అని కూడా చెప్పారు రామజోగయ్య. -
నాట్స్ కవితల పోటీ పురస్కార విజేతలు
డల్లాస్ : భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) నిర్వహించిన కవితల పోటీకి అనూహ్య స్పందన లభించింది. నాట్స్ మొదటి సారిగా నిర్వహించిన ఈ కవితాస్పర్థలో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు కవులు పాల్గొన్నారు. 913కి పైగా అందిన కవితల్లోంచి 9 మందిని విజేతలుగా ఎంపిక చేసి, వారితో కవి సమ్మేళనం నిర్వహించిన అనంతరం ఎవరు ఏ పురస్కారాన్ని అందుకున్నారో ప్రకటించామని ఈ కార్యక్రమ నిర్వాహకులు డా.సూర్యం గంటి తెలిపారు. నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె, నిర్వాహకులు డా సూర్యం గంటి, డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి విజేతలను ప్రకటించారు. విజేతలు.. వారి బహుమతులు సర్వోత్తమ పురస్కారం: రూ 20,000/-: దోర్నాథుల సిద్ధార్థ ఉత్తమ పురస్కారం: రూ 15,000/-: వంగర పరమేశ్వర రావు విశిష్ట పురస్కారం: రూ 10,000/-: నూజిళ్ల శ్రీనివాస్ విశేష పురస్కారం: రూ 5,000/-: కిరణ్ విభావరి గౌరవ పురస్కారం-1: రూ. 2000/- : వినీల్ కాంతి కుమార్ (శతఘ్ని) గౌరవ పురస్కారం-2: రూ. 2000/- : శిరీష మణిపురి గౌరవ పురస్కారం-3: రూ. 2000/- : జోగు అంజయ్య గౌరవ పురస్కారం-4: రూ. 2000/- : అల్లాడి వేణు గోపాల్ గౌరవ పురస్కారం-5: రూ. 2000/- : చెరుకూరి రాజశేఖర్ "పురస్కారాలు గెలుపొందిన తొమ్మిది మంది కవులూ సినీ కవులైన చంద్రబోసు, భాస్కర భట్ల, సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రితో కవితా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 14 సాయంత్రం తెలుగువారు అభివృద్ధి చేసిన ఆన్‌లైన వీడియో ప్లాట్‌ఫాం https://nristreams.tv/NATS-live/ లోనూ నాట్స్ యూట్యూబ్ ఛానల్లోనూ, సామాజిక మాధ్యమంలోనూ ప్రసారం చేశామని, దీన్ని అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారని సంచాలకులు రాజశేఖర్ అల్లాడ తెలిపారు. మొదటి సారిగా ఈ ప్రయత్నం చేశాం. అనుకున్నదాని కంటే గొప్ప స్పందన లభించిందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. "భాషే రమ్యం- సేవే గమ్యం మా నాట్స్ నినాదం. ఆ దిశలో భాష విషయంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. కవితల పోటీలలో పురస్కారాలు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు. ఇంకా మరిన్ని కవితలు మరింత గొప్పగా వ్రాయాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన చంద్రబోసు గారికి, సిరాశ్రీ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, భాస్కరభట్ల గారికి కృతజ్ఞతలు" అని నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె చెప్పుకొచ్చారు. (500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం) "ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలనే ఉత్సాహం నాట్స్ కి కలుగుతోంది. దీనికి కారణభూతమైన అశేషమైన కవులకు, కవయిత్రులకు మా కృతజ్ఞతలు. తెలుగు భాషకు చేస్తున్న సేవలో మీ ప్రోత్సాహం శిరోధార్యం", అని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని తెలిపారు. యాప్‌లో ప్రసారమైన ఆన్లైన్ కవి సమ్మేళన కార్యక్రమంలో చివరిగా సినీ కవులు కూడా తమ దేశభక్తి కవితలను చదివి వినిపించారు. "విశేషమేమిటంటే జూమ్‌లో కాకుండా పూర్తిగా తెలుగువారి చేత తయారు చేయబడిన NRI STREAMS CONNECT APP ద్వారా ఈ ఆన్లైన్ కవి సమ్మేళనాన్ని నిర్వహించడం మరింత ఔచిత్యంగా అనిపిస్తోంది" అని సినీ కవి చంద్రబోస్ అన్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ లింకుల్లో చూడవచ్చు: https://nristreams.tv/NATS-live/ అండ్ https://www.youtube.com/watch?v=yWoDY7queO0 -
నెక్ట్స్ ‘సూర్యుడివో చంద్రుడివో’
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్ సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ‘మైండ్ బ్లాక్’సాంగ్ ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రస్తుతం టీజర్, మైండ్ బ్లాక్ సాంగ్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మిలియన్ వ్యూస్ సాధించి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక ప్రమోషన్లో భాగంగా ఐదు సోమవారాలు ఐదు పాటలను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మైండ్ బ్లాక్ సాంగ్‌ను రిలీజ్ చేయగా వచ్చే సోమవారం మరో పాటను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ‘సూర్యుడివో చంద్రుడివో’అంటూ సాగే మెలోడీ పాటను సోమవారం సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఈ సందర్భంగా ‘మంగళకరమైన మాధుర్య ప్రధానమైన సంగీతానికి మనిషి తనం తాలూకు భావోద్వేగం తోడైతే ఇలాంటి పాట పుడుతుంది. చాలా సంతృప్తిగా ఉన్నా ఈ పాట రాసి’అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేశ్ సరసన రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. దాదాపు దశాబ్దంన్నర తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతీ రీఎంట్రీ ఇస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. "సూర్యుడివో చంద్రుడివో 🥁" #SuryudivoChandrudivo .. a SOULFUL MELODY.. from #SarileruNeekevvaru will be live on Monday @ 5:04 PM#maSSMBmondays మంగళకరమైన మాధుర్యప్రధానమైన సంగీతానికి మనిషితనం తాలూకు భావోద్వేగం తోడైతే ఇలాంటి పాట పుడుతుంది చాలా సంతృప్తిగా ఉన్నా ఈ పాట రాసి pic.twitter.com/CdoKLFEusE — Ramajogaiah Sastry (@ramjowrites) December 7, 2019 -
రామజోగయ్యశాస్త్రికి గురజాడ పురస్కారం
సాక్షి, విజయనగరం: సినీ గేయ రచయిత, సాహితీవేత్త రామజోగయ్యశాస్త్రి గురజాడ విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ 104వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 30న సమాఖ్య సభ్యులు పురస్కారం అందజేయనున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పీవీ నరసింహరాజు, కాపుగంటి ప్రకాష్‌లు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. పురస్కార ప్రదానోత్సవంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాన వక్తగా పాల్గొంటారని చెప్పారు. సాయిఫౌండేషన్ అధ్యక్షుడు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పురస్కార ప్రదాతగా వ్యవహరిస్తారన్నారు. -
‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’
సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. హీటెక్కించే మాస్ సాంగ్ అయినా.. ఎప్పటికీ నిలిచిపోయే క్లాసికల్ సాంగ్ అయినా, ప్రేమ పాటలు, విషాద పాటలు ఇలా అన్నింటిలో తన ముద్ర వేస్తూ.. సంగీత ప్రియుల్ని అలరిస్తున్నారు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిరంతరం బిజీగా ఉండే.. దేవీ ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కలిస్తే.. ఇక ఆ పాట ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్లో మహేష్ బాబుకు చాలానే హిట్ సాంగ్స్ పడ్డాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షిలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ ద్వయం ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’కు పనిచేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి ఓ పాట రాసినట్టు.. దానికి అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్టు రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఆమ్మో @ThisIsDSP గారు అదరగొట్టేసారు 💕పూర్తి సంతృప్తి I am sure Bro💕 will like it💕#SarileruNeekevvaru — Ramajogaiah Sastry (@ramjowrites) September 21, 2019 -
ఆజన్మాంతం రుణపడి ఉంటా
‘‘ఒక సంఘటన వల్ల విషాదఛాయలు కమ్మిన మా ఇంట్లోకి వెలుతురు రేఖను, ఓ నవ్వు రేఖను తీసుకొచ్చిన నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు, చిత్ర బృందానికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. చాలా రోజుల తర్వాత మా అమ్మగారి ముఖంలో నవ్వు చూశా. ఈ ‘అరవిందసమేత...’ విజయాన్ని మా నాన్నగారికి (హరికృష్ణ) ఎందుకో గిఫ్ట్‌గా ఇవ్వాలని ఉంది సామీ (త్రివిక్రమ్‌ని ఉద్దేశిస్తూ) అని అడిగాను. మా నాన్నగారికి ఈ చిత్రం విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చేలా దోహదం చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని ఎన్టీఆర్ అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఎస్.రాధాకృష్ణ నిర్మించిన సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్‌మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నా గుండె లోతుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని త్రివిక్రమ్‌గారితో చేయాలనుకున్నా. ఆ తరుణం మూడు రోజుల క్రితం ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంతో రానే వచ్చింది. ఈ చిత్రం విజయం నా ఖాతాలో వేశారు త్రివిక్రమ్‌గారు. కానీ, ఇది ఆయన కలంలోని సిరా నుంచి వచ్చిన విజయం. దర్శకునిగానే కాదు.. ఓ గురువుగా కూడా త్రివిక్రమ్ ఈ సినిమాను ముందుండి నడిపించారు. నిర్మాత పాత్రను వంద శాతం నిర్వహించారు చినబాబుగారు. సహకరించిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఒక పరాజయం తర్వాత నేను మొదలుపెట్టిన సినిమా.. ఒక విషాదం తర్వాత విడుదలైన సినిమా ‘అర వింద సమేత వీరరాఘవ’. వీటన్నింటినీ దాటుకుని ఒక వెల్లువలాంటి విజయాన్ని ఇచ్చి, పండగను మా ఇళ్లలోకి తీసుకొచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి, నాలుగు రోజుల్లో వంద కోట్లు దాటించడానికి సారధి ఎన్టీఆరే. వాళ్ల తాతగారి పేరు నిలబెట్టడం కాదు.. దాన్ని మ్యాచ్ చేయగల సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆయన లైఫ్‌లో అంత విషాదం జరిగినా... మేము ఎక్కడ నలిగిపోతామేమోనని ఆయన నలిగిపోయాడు. ఈ సినిమా విజయం కచ్చితంగా ఎన్టీఆర్ ఖాతాలోకే వెళుతుంది. చినబాబుగారు ఖర్చుకు వెనకాడరు. నా మొదటి విమర్శకుడు ఆయనే’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు సునీల్, నవీన్‌చంద్ర, శత్రు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రచయితలు రామజోగయ్యశాస్త్రి, పెంచలదాస్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు
ఆడ ఏడనో కొండమీద కూసొని ఉంటాడు. ఈడ ఏడనో మనం మట్టిలో దొర్లాడుతుంటాం. ఓపారి సూడాలని ఓసారి దరిచేరాలని శానా ఆశ ఉంటుంది. దేవుడు కొండమీద ఉండనీ.. ఆకాశం అవతల ఉండనీ.. మన భుజమ్మీద ఒక చేయి ఉండనే ఉంటుంది. దేవుడంటే మిత్రుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి అంటూ... ‘సదాశివా సన్యాసి తాపసి కైలాసవాసి..’ పాటను అందించి మనందరి మనసులు గెలుచుకున్న రచయిత రామజోగయ్యశాస్త్రి గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ! పాటల రచయితగా వెలుగొందడం దైవ రచన అంటారా, మీ స్వయంకృషి అంటారా? మనలోని ప్రతీ ఒక్కరి జీవితం డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందని నా నమ్మకం. నా జీవితం కూడా భగవంతుని దయగానే భావిస్తున్నాను. ప్రపంచంలో వేలాది విషయాలు ఉన్నప్పుడు నాకు ఈ ‘అక్షరం’ మీదనే ఎందుకు జిజ్ఞాస కలిగింది? అదే నాకు అన్నం పెట్టేదిగా ఎలా అయ్యింది. ఇది తలచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ రంగంలోకి రావడానికి, నిలదొక్కుకోవడానికి దైవం ప్రేరణ తప్పక ఉంది. ఇంజనీరింగ్ చదివాను. ఉద్యోగం చేస్తూనే నా ఇష్టాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడటం అంటే ఇష్టం. ఆ ప్రయత్నంలో ఉండగానే పాట రాయాలనే ఆలోచన కలిగింది. నా ప్రయత్నమేదీ వృథా కాలేదు. ఇప్పటికీ నా ప్రతి అడుగులోనూ భగవంతుని అనుగ్రహం ఉంది. అయితే, దైవ కృప ఒక్కటే సరిపోదు. మన స్వయంకృషి ఉండాలి. మనమేదీ చేయకుండా భగవంతుని మీద వదిలేయడం సరైనది కాదు. ఉదయం పూజాధికాలు ముగించుకున్న తర్వాత రాయడం పనిగా పెట్టుకుంటాను. రాసే పనిలో లేనప్పుడు చదువుతాను. ఈ ధ్యాసలో పడితే అన్నం, నీళ్లు కూడా గుర్తుకురావు. జీవితంలో నిలదొక్కుకోవడానికి విధి మనకు కొన్ని అవకాశాలను ఇస్తుంది. వాటిలో అమితంగా నచ్చినదాన్ని పట్టుకుంటాం. దానిని వదలకుండా ఆ పనికి కావల్సిన వనరులన్నీ సమకూర్చుకోగలగాలి. సమర్థతను పెంపొందించుకోవాలి. చేసే సాధన ఎంత ఉంటే దైవం ఆశీస్సులు అంతగా ఉంటాయని నమ్ముతాను. చాలా మంది రచనలు చేసేటప్పుడు ముందు వారి ఇష్టదైవం పేరును రాస్తుంటారు. మీరూ అలా రాసే రచన మొదలుపెడుతుంటారా? ఒకటి కాదు మూడు రాస్తాను. మొదటగా శ్రీ గురుభ్యోనమః అని రాసుకుంటాను. ఆ విధంగా ముందు గురువును తలచుకుంటాను. తర్వాత ‘సాయి ప్రసాదం’ అని రాస్తాను. ప్రతీ అక్షరం సాయిబాబా ప్రసాదంగా భావిస్తాను. మా ఇంటి పేరు కూడా సాయిప్రసాదం అనే ఉంటుంది. ఇక ఏ పని చేసినా ఓర్పుగా, శ్రద్ధగా చేయడం అనేది ముఖ్యం. ఇదే విషయాన్ని సాయిబాబా సూక్తుల ద్వారా తెలియజేశారు. అందుకే పేజీకి ఒక మూలన ‘శ్రద్ధ– సబూరి’ అని రాసుకుంటాను. ఒక పాట ఎన్ని సార్లు రాసినా, ఎన్ని పేజీలు రాసినా.. ప్రతీ ఒక్క పేజీ మీద ఈ మూడు పదాలు తప్పనిసరిగా ఉంటాయి. మీలో ఆధ్యాత్మికత పెంపొందడానికి చిన్నప్పుడు ఇంట్లో అమ్మనాన్నలు చేసే పూజలు, తరచూ దేవాలయ సందర్శనలు దోహదపడ్డాయంటారా? మన సంస్కృతి, సంప్రదాయాలు ఆధ్యాత్మికత వైపు నడిపించే సాధనాలు. అవి నిన్నటి తరం నుంచి నేటి తరానికి, నేటి తరం నుంచి రేపటి తరానికి చేరుతుంటాయి. దైవానికి సంబంధించిన అంశాలు కూడా పెద్దవారి నుంచే పిల్లలు అందిపుచ్చుకుంటారు. మా అమ్మ (సరస్వతమ్మ) రాముడి భక్తురాలు. భద్రాచల రాముడికి మొక్కుకున్నాక నేను పుట్టానని, రాముడి భిక్ష అని భావిస్తూ నాకు ‘రామజోగయ్య’ అని పేరు పెట్టింది. అమ్మ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి నేనూ కొన్ని అలవర్చుకున్నాను. సాహిత్యంపైన ప్రేమ అక్కడినుంచే వచ్చి ఉంటుందని నా భావన. అయితే, భగవతారాధనలో నిత్యం చేసే క్రతువుల కన్నా ఆధ్యాత్మికానందం ఎవరికి వారు మనసు లోతుల్లో నుంచి పొందాలి. ఇది వారి మానసిక పరిణతిని బట్టి ఉంటుంది. నా చిన్నతనంలో గుళ్ల వద్ద తరచూ కొన్ని భక్తి పాటలు చెవిన పడుతుండేవి. వాటిలో మనసులో బలంగా నాటుకుపోయినవి ‘శివ శివ శంకర.. భక్తవ శంకర శంభో హరహర మహాదేవ..,’, ‘రామనీలమేఘశ్యామ కోదండ రామా.. రఘుకులాద్రి శోమ పరంధామ సార్వభౌమ..’ అనే పాటలు. ఇవి చెవిన పడితే చాలు ఇప్పటికీ ఏదో తెలియని ఆధ్యాత్మిక భావం మనసును తట్టిలేపుతుంది. ఇక ‘పిబరే రామరసం..’ అనే కీర్తన ఏ రూపంలో, ఏ సందర్భంలో, ఎక్కడ విన్నా పరవశానికి లోనవుతుంటాను. ఇతర కవులు రాసిన పాటల పరవశం గురించి చెప్పారు. మరి మీరు రాసిన దేవుడి పాటల్లో మీకు బాగా నచ్చినవి.. రెండు పాటలు ఉన్నాయి. ‘సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి..’ అనే పాట నాకు చాలా ఇష్టమైనది. ఈ పాటకు జరిగిన కృషి, తపనను మర్చిపోలేను. ప్రతి పదమూ ఓ అద్భుతంగా అమరింది. ఈ పాట ద్వారా నాకు ఎక్కడలేని గుర్తింపు లభించింది. అంతకుముందు సినీ పరిశ్రమలోనూ, బయట రామజోగయ్యశాస్త్రిని చూసిన విధానం వేరు. ఈ పాట తర్వాత నాకో గుర్తింపు, ప్రత్యేకత లభించాయి. మరో పాట నాగార్జున నటించిన సాయిబాబా సినిమాలో ‘నీ పదముల ప్రభవించిన గంగా యమున.. మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణ..’ అద్భుతం అనిపిస్తాయి. ఆ బాబాయే దయతలచి నా చేత ఈ పాట రాయించాడా అనిపిస్తుంది. దేవుడు మీకు అక్షరరూపంలో సరస్వతిని ఇచ్చాడు. అలాంటì అక్షరాన్ని కమర్షియల్ పాటలకు వాడటం గిల్ట్‌గా ఎప్పుడైనా భావించారా? ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే, భగవంతుని స్తుతించే కీర్తన అయినా, డ్యూయెట్, ఐటమ్ సాంగ్.. ఏదీ వేరు కాదు. ఇది దైవం నాకు ఇచ్చిన పని. నేటి తరానికి తగ్గట్టుగా ఉంటూనే విలువలు కోల్పోకుండా ఆ పరిధిలోనే నన్ను వరించిన పనులు చేస్తాను. నా ద్వారా ఎప్పుడూ చెడు రాదు. సాయి ప్రసాదం అని ఎప్పుడైతే రాసుకున్నానో అది భగవంతుని ప్రసాదంగానే భావించి భక్తిగా నా పనిని పూర్తిచేస్తాను. ఒక దశకు వచ్చాక.. అంటే ఆర్థికంగా స్థిరపడ్డాక ఎవరికైనా ఇక దేవుడితో పని లేదనిపిస్తుందా? అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆర్థికపరమైన విషయానికి, ఆధ్యాత్మికంగా దైవంతో కనెక్టివిటీ ఉండటానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఈ రెండూ వేరు వేరు విషయాలు. దేవుడు మనకు మంచి ఆలంబన. నా దృష్టిలో అయితే మంచి మిత్రుడు. మోటివేషనల్ స్పిరిట్. నా ఏకాగ్రతను ఇనుమడింపజేసే ఒక అంశం. నన్ను సరైన పద్ధతులు, కట్టుబాట్లలో ఉంచి పోషించే విషయం. నా కష్టనష్టాలు చెప్పుకునే కేంద్రస్థానం. ఇవన్నీ ఆర్థికంగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉండవు. కొంతమందికి దైవం మూర్తి స్వరూపంగా ఉంటాడు, కొంతమందికి భావనా స్వరూపంగా ఉంటాడు. అది వారి ఆలోచనా విధానం బట్టి ఉంటుంది. ఎవరెలా పూజించినా ప్రపంచాన్ని నడిపించే శక్తి ఉంది. ఆ శక్తికి అందరం ఎప్పుడూ అనుసంధానమై ఉండాల్సిందే! డబ్బులు ఉండటం, లేకపోవడం అనేది సమస్య కాదు. దేవుడితో మన సంబంధం ఎప్పుడూ శాశ్వతంగా ఉందా లేదా అనేది తరచి చూసుకోవాలి. అలాగే, ప్రపంచంలో మనశ్శాంతిని మించిన సంపద లేదు. దేవుడితో ఎంత కనెక్ట్ అయి ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటాం. ఎంత ఎత్తులకు ఎదుగుతున్నా భగవంతునితో కనెక్టివిటీ శాశ్వతంగా ఉండాలి. మీరు ఎప్పుడూ నుదుటన బొట్టుతో కనిపిస్తారు. ఈ రంగంలోకి వచ్చాకనే ఇలా బొట్టు పెట్టుకోవడం ప్రారంభించారా? దీని వెనుక ఉన్న సందర్భం ఏంటి? పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకోవడం మనందరి అలవాటు. ఒకసారి ఇంట్లో ఏదో పూజ జరిగి బయటకు వెళ్లినప్పుడు బొట్టు పెట్టుకొని ఉన్నాను. కలిసినవారు బొట్టుతో బాగున్నానని చెప్పారు. అసలు విషయం ఏంటంటే నా నుదురు విశాలంగా ఉంటుంది. నుదురు మధ్యలో ఏదో ఒకటి ఉంచాలి. బొట్టు పెట్టుకుంటే బాగుంటుందనిపించింది. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. మీ బాల్యంలో దేవుడు, ఇప్పుడు దేవుడు? ఈ రెండింటి మధ్య మీ ఆలోచనలు.. సంప్రదాయ కుటుంబంలో పుట్టినా, హేతుబద్ధమైన విషయాల పట్ల అవగాహనతో ఉండేవాడిని. ఎప్పుడూ నన్ను నేను సద్విమర్శ చేసుకుంటూ ఉండేవాడిని. ఈ ప్రక్రియ నా ఎదుగుదలకు బాగా దోహదపడింది. ఎప్పుడూ విరగబడి ఛాందసంగా పూజలు చేసింది లేదు. అలాగని అస్సలు పూజలు చేయకుండా లేను. అమ్మానాన్నలకు ఒక్కడినే కొడుకును. చిన్నప్పుడు అమ్మానాన్నలతో పాటు రాముడు, కృష్ణుడు, గణేషుడు .. అని పూజించినవారున్నారు. అయితే, నాదైన జీవితంలో ప్రవేశించాక మాత్రం ‘సాయిబాబా’ ఆలంబన అయ్యాడు. నాకు తెలియకుండానే నా జీవితంలో బాబాగారు ప్రవేశించారు. దేవతలందరిలోనూ ముందువరసలో బాబా ఉంటారు. అందరు దేవతలను ఆయనలో చూసుకుంటాను. పాట రాసే ముందు మంచి పదాలను ఇవ్వమని దేవుడిని తలుచుకుంటారా? పని ఇచ్చిన వారు.. అంటే పాట రాయమని చెప్పినవారు నాకు దైవ సమానులే! నాకు ఓ పనిని అత్యంత నమ్మకంగా అప్పజెప్పినప్పుడు అంతే జాగ్రత్తగా ఆ పనిని చేయాలి. అదే నేను చేసే పూజ. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
పత్రం పుష్పం ఫలం
ఉగాదితో కొత్త సంవత్సరం మొదలైనా... మన జీవితాల్లో ఎలాంటి విఘ్నాలూ లేకుండా ఉండడానికి మనం చేసుకునే మొదటి పండుగ వినాయక చవితి. మంచి మాట తెలుసుకోడానికి... మంచి బాటలో నడవడానికి మంచివారుగా బతకడానికి... గణనాథుడు నృత్త, గీత, వాద్యాలతో వినోదాత్మకంగా మనకు జ్ఞానం ప్రసాదిస్తాడన్నది నమ్మకం. పత్రం, పుష్పం, ఫలం... ఇవేవీ లేకపోయినా తోయం... అంటే... గరిటెడు జలంతో కూడా సంతృప్తి పడే జనదేవుడు లంబోదరుడు... వరసిద్ధి వినాయకుడు. ఈ పది రోజులూ ఆయనే ప్రతి వీధికీ కళ. అందుకే మా పాఠక దేవుళ్లకు ఇవాళ్టి ఫ్యామిలీ కళకళ. పత్రం దండాలయ్య ఉండ్రాళ్లయ్యా... దాదాపు పాతికేళ్లు అయ్యింది ఈ పాట వచ్చి. ఇప్పటికీ చవితి పందిళ్లలో మోగుతూనే ఉంటుంది. ఏ కవికైనా ఇది సంతోషం కలిగించే అంశమే. ‘కూలీ నెం.1’ సినిమాలో ఈ పాట ఒక టీజింగ్ సందర్భంలో వస్తుంది. బాగా డబ్బు, అహంకారం ఉన్న ఒక అమ్మాయి రైల్వే కూలీలు చేస్తున్న గణేశ్ ఊరేగింపునకు అడ్డం వస్తుంది. అంతకు ముందే ఆమె ప్రవర్తన గురించి విన్న హీరో దీనిని చాన్స్‌గా తీసుకుని టీజ్ చేస్తూ పాట పాడతాడు. పైకి ఇది టీజింగ్ సాంగ్లా అనిపించినా, అర్థం చూస్తే శాశ్వతంగా నిలిచే భక్తిగీతంలా రాయాలని నిశ్చయించుకున్నా. ఆ విధంగానే వచ్చింది. ‘చిన్నారి ఈ చిట్టెలుకరా భరించెరా లంబోదర... పాపం కొండంత నీ పెనుభారం... ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మధన్యం’ అనే పల్లవి ఎలుకకు వర్తిస్తుంది, హీరోయిన్‌కూ వర్తిస్తుంది. హీరోయిన్ను మర్చిపోవచ్చు. ఎలుకను మర్చిపోరు గదా. ‘శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం... ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం’... అనే లైన్లు హీరోయిన్‌కి వర్తిస్తాయి, వినాయకునికీ చంద్రునికీ మధ్య జరిగిన కథనూ చెబుతాయి. ఈ రెండో అర్థం వల్లే పాట ఇప్పటికీ నిలుచుందని అనుకుంటున్నాను. ఇళయరాజా ఇచ్చిన పల్లవికి చెన్నైలో కూచుని రాసిన పాట ఇది. బాలూ గళం, కోరస్, కంపోజిషన్ అందులో ఉండే సెలెబ్రేషన్ మూడ్ పాటను శాశ్వతం చేశాయి. ఈ పాటే కాదు చాలా సినిమాల్లో దైవప్రస్తావన ఉండే పాటలు అనేకం రాశాను. కాని నాది ఒక రకంగా నిరీశ్వరవాదం. నా దైవానికి రూపం లేదు. ఇది నాస్తికత్వం కాదు. నా దృష్టిలో దైవాన్ని బాహ్యంగా చూడటం కాదు లోలోపల చూడాలి. అందుకే నేను దేవతా మూర్తులను వివిధ బాధ్యతలు నిర్వహించే కార్యనిర్వహణాధికారులుగా చూస్తాను. ఇన్ఛార్జ్లన్న మాట. నిర్వికల్ప సమాధి అంటారు. ఈ స్థితికి చేరుకున్నప్పుడే దైవాన్ని, మనల్ని కూడా ఒకసారి దర్శిస్తాం. నా దృష్టిలో పూజలు, పండుగలు దుష్కార్యాల నుంచి కాసేపు మనసు మళ్లించడానికి ఉద్దేశించినవే. కాని దైవానికి చేరువ కావాలంటే బాహ్య బంధనాల నుంచి విముక్తి పొంది అంతఃస్వేచ్ఛను అనుభవించాలంటే ఇవి చాలవు. లోపలి ప్రయాణం సాగాలి. ఈ మాటను చెప్పడానికే నేను ‘శివదర్పణం’ గ్రంథం రాశాను. అందులో శివుణ్ణి ఒక వేటగాడిగా భావిస్తూ ‘నా మనసే ఒక కారడవి. అందులో కోర్కెలనే క్రూరమృగాలు విషసర్పాలు తిరుగుతున్నాయి. వాటిని వేటాడు’ అని వేడుకున్నాను. ప్రతి మనిషి కోరుకోవాల్సింది ఇదే. మనలో ప్రతి ఒక్కరం అంతర్గత సమృద్ధితో సంపదతో తులతూగాలని వినాయకచవితి సందర్భంగా ఆశిస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. - సిరివెన్నెల సీతారామశాస్త్రి పుష్పం జైజై గణేశా.. జై కొడతా గణేశా... ‘జై చిరంజీవ’ సినిమా కోసం ఈ పాట సిట్యుయేషన్‌ను క్రియేట్ చేసి హీరో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ పాడాలి అని చెప్పారు. ఏం స్తుతిస్తాడు... ఎలా స్తుతిస్తాడు... ఆ స్తుతిలో నుంచి ప్రేక్షకులకు ఏం సందేశం ఇవ్వాలి అనేది ఇక నా తలనొప్పి. కాని కవి కన్ను అనేది ఒకటి ఉంటుంది. దానికి దృష్టిలోపం, చత్వారం లేకపోతే ప్రతి సన్నివేశంలో ఏదో ఒక అర్థాన్ని వెతుకుతుంది. ఆ సమయంలో ఈ లోకంలో ఉన్న చెత్త నాకు గుర్తుకు వచ్చింది. ఈ చెత్తను వినాయకునికి గుర్తు చేయాలి. ఆయన తొండంతో కుంభవృష్టిని కురిపించి దానిని కడిగేయించాలి అనిపించింది. అందుకే పల్లవిలో ‘లోకం నలుమూలలా లేదయ్యా కులాసా... దేశం పలువైపులా ఏదో రభస... మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా... పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా’ అన్నాను. ‘చిట్టి ఎలుకను ఎక్కి, గట్టి కుడుములు మెక్కి ఈ చిక్కు విడిపించడానికి రమ్మ’ని పిలిచాను. పల్లవి ఓకే. చరణంలో ఏం చెప్పాలి? వినాయకుడు కుమారస్వామి సహిత శివపార్వతుల పటం చూడండి. వారి వాహనాలు గమనించండి. వాస్తవంగా అయితే ఒక వాహనానికీ మరో వాహనానికీ వైరం ఉంది. కాని అవి కలిసి మెలిసి లేవూ. మనమెందుకు కొట్టుకుంటున్నాం. అదే మొదటి చరణంలో చెప్పాను. ‘నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా... ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా... పలుజాతుల భిన్నత్వం కనిపి స్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా’... మనకెందుకు లేదు సోదరభావం అని నిలదీశాను. బాగుందనిపించింది. ఈ స్ఫూర్తితో మేం ఉంటాం కాని మాకో బెడదుంది దానిని తొలగించు అని రెండో చరణంలో చెప్పాను. దాదాల నుంచి లంచాలు మరిగిన నాయకుల నుంచి రక్షించమని కోరుకున్నాను. కాని అక్కడ నాకు తోచిన చమత్కారం ఏమిటంటే ‘ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా’ అనడం. నిజంగానే ఇప్పుడు కూడా ధరలు చుక్కల్లోనేగా ఉన్నాయి. కందిపప్పు కిలో రెండు వందలని విన్నాను. మనం వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తాం. కాని ఈ సందర్భంగా చేయాల్సింది మనలోని చెడును ముంచడం మనలోని అహాన్ని వంచడం. ఆ మాటను కూడా చెప్పాను. ఈ పాట జనానికి బాగా నచ్చింది. వినాయకుని మంటపాల్లో జేజేలు అందుకుంటూనే ఉంది. మరో విషయం ఏమిటంటే చిన్నప్పటి నుంచి నేను విఘ్నేశ్వరుడి భక్తుణ్ణి. మా ఊరి చెరువు దగ్గర మంచి నల్లరేగడి మట్టి దొరికేది. దానిని తీసుకొచ్చి నా స్వహస్తాలతో వినాయకుడి ప్రతిమను చేసి ఇంట్లో ఒక గుడిలాంటిదే మెయింటెయిన్ చేసేవాణ్ణి. ఆయన దయ వల్ల నాకు బుద్ధి లభించింది. పాటల రచయిత కావాలనే కోరికా సిద్ధించింది. అందరికీ హ్యాపీ వినాయక చవితి. - చంద్రబోస్ ఫలం తిరు తిరు గణనాథ... వినాయక చవితి అనగానే నాకు మా వూరు ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) పక్కన ఉండే చిట్టడివి గుర్తుకు వస్తుంది. ఆ రోజు పిల్లలందరికీ ఆ అడవిలోకి వెళ్లే పర్మిషన్ దొరుకుతుంది. మరి పత్రి తేవాలి కదా. అందరం సరదాగా పోలోమంటూ పోయి పత్రి తెచ్చేవాళ్లం. మా బ్రాహ్మణ కుటుంబం కాబట్టి దర్బలో ఇంట్లోనే ఉండేవి. నేను మరీ భక్తుణ్ణి కదా. అంత భక్తిశ్రద్ధలతో చిన్నప్పుడు పూజలూ అవీ చేసిన గుర్తు లేదు. అయినప్పటికీ ఆ వినాయకుడి దయ వల్ల చదువు బాగా వచ్చింది. అయితే నాగార్జున యూనివర్సిటీలో బి.టెక్ చేరాక చదువుపై శ్రద్ధంతా పోయింది. వినాయకుడు అనగానే చదువు గుర్తుకొస్తుంది కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను. ‘100% లవ్’ సినిమాలో నేను రాసిన పాటలో కూడా ఇదంతా కనిపిస్తుంది. ఆటపాటల్లో హాయిగా ఉండాలనుకునే యూత్‌కి బాబోయ్ ఈ పరీక్షల భారం లేకుండా హాయిగా మార్కులొస్తే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఆ మూడే పాట పల్లవిలో కనిపిస్తుంది. ‘తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై.. ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై’ అని ఉంటుంది పల్లవి. కాని చరణం అంతకన్నా సరదాగా ఉంటుంది. ‘చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూనివ్వు కనులారా చదివింది ఒకసారే ఐనా కల్లోను మరిచిపోని మెమరీనివ్వు’.... ఇలా ఉంటుంది చరణం. ఇందులో ‘ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్కు’ అడగడం ‘ఆన్సర్ షీటు మీద ఆగిపోని పెన్ను’ అడగడం కనిపిస్తుంది. రెండో చరణంలో ఇంకా సింపుల్ కోరికలు ఉంటాయి. ‘తలలే మార్చిన తండ్రిగారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు’ అని చెప్తూ కనుక మా తలరాతలు బాగుండేలా చూడు స్వామి అని వేడుకుంటుంది హీరోయిన్. ‘పేపర్లో ఫొటోలు ర్యాంకులెవ్వరడిగారు పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు’ అనడం ఒక చమక్కు. అప్పటికే కొన్ని మాంటేజస్ తీసి కొన్ని రఫ్నోట్స్లు సుకుమార్‌గారు తయారు చేశారు. ఆ మాంటెజస్కు తగినట్టుగా ఆ రఫ్నోట్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో రాసిన పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ బాణి, దానికి హరిణి గొంతు రాణించాయి. తమన్నా, నాగచైతన్య కూడా ఈ పాటలోని సన్నివేశాలను బాగా పండించారు. క్లాసికల్ బాణీలో ఉన్న ఈ పాట ఇంత పెద్ద హిట్ కావడం నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు రామ్ నటించిన ‘గణేశ్’ సినిమాలో కూడా వినాయకుడి మీద ఒక పాట రాశాను. మాలాంటివాళ్లకు పాటే దైవం. మంచి పల్లవి తడితే అదే పెద్ద ప్రసాదం. మీ అందరినీ ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. - రామజోగయ్యశాస్త్రి -
ఆ వార్త మీ దాకా వచ్చిందా!
లేటెస్ట్ లిరిక్ రైటర్స్‌లో సూపర్ మోస్ట్ బిజీ ఎవరంటే ఫస్ట్ తట్టే పేరు - రామజోగయ్య శాస్త్రి. అటు మోడ్రన్‌గానూ, ఇటు ట్రెడిషనల్‌గానూ ఆయన కలానికి రెండు వైపులా పదునే. పదేళ్ల కెరీర్లో 500కు పైగా పాటలు రాసిన ఈ మృదుస్వభావితో భేటీ... మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాకు పాటలన్నీ మీరే రాసినట్టున్నారు? అవునండి. ఈ మధ్య కాలంలో నాకిది గోల్డెన్ ఛాన్స్. ఇటీవల విడుదలైన ఆరు పాటలూ రాక్ చేస్తున్నాయి. సాహిత్యం స్పష్టంగా వినబడుతోందని అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ కుదిరాయి. ‘నువ్వే కాని కలకండైతే నేనొక చిన్న చీమై పుడతా’, ‘తేనెటీగల్లే నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగా నీకు జతకడతా’, ‘కాముడు రాసిన గ్లామరు డిక్షనరీ... నీ నడుమొంపున సీనరీ’... ఇలా అన్ని పాటల్లోనూ ఆకట్టుకొనే వాక్యాలు రాశా. ఈ విషయంలో నాకు స్వేచ్ఛనిచ్చిన దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌లకు నా కృతజ్ఞతలు. కమల్‌హాసన్ ‘చీకటి రాజ్యం’ సినిమాలో మీరు ఓ పాత్ర చేశారట. నిజమేనా? నిజమే కానీ, దాన్ని పాత్ర అని అనకూడదు. చాలా చిన్న వేషం. జస్ట్ అలా కనబడతానంతే. కమల్‌హాసన్ గారిని అడిగి మరీ యాక్ట్ చేశా. ఆ సీన్లో నాతో పాటు డైలాగ్ రైటర్ అబ్బూరి రవి కూడా కనిపిస్తారు. కమల్‌గారి పక్కన ఓ సీన్లోనైనా కనిపిస్తే ఓ జీవితకాల జ్ఞాపకంగా నిలిచిపోతుందనే స్వార్థంతో నేనే అడిగాను. ‘శ్రీమంతుడు’లో కూడా నటించారటగా? ఆ వార్త మీ దాకా వచ్చిందా!? ‘రామరామ’ పాటలో ‘సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు...’ అనే సాకీ పాడుతూ నేను కనిపిస్తాను. ఇంతకు ముందు కూడా మీరు కొన్ని సినిమాల్లో కనిపించారుగా! నాగార్జున గారి ‘కింగ్’లో ఫస్ట్ టైమ్ నటించా. లిరిక్ రైటర్ పాత్రే చేశా. ఆ తర్వాత ‘సూర్య వర్సెస్ సూర్య’లో ‘ఖవ్వాలీ’ సింగర్‌గా నటించా. ‘అల్లరి’ నరేశ్ ‘జేమ్స్ బాండ్’లో కూడా అరబ్ షేక్‌గా కనిపిస్తా. ఈ లిస్ట్ చూస్తుంటే త్వరలో మీరు నటుడిగా మారిపోయేట్టు కనిపిస్తున్నారే? అయ్యయ్యో... అంత మాట అనకండి.నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ పాటల రచనకే. నటన అనేది నా వల్ల కాని పని. ఏదో సరదాగా చేయడం తప్ప, కలలో కూడా నటుడు కావాలనే ఆలోచన లేదు. అయినా నటన అనేది మామూలు విషయం కాదండీ. ఏదో నన్నిలా పాటలు రాసుకోనివ్వండి. -
అమ్మా... అమ్మా... నీ పసివాణ్ణమ్మా...
లిరిక్ మేజిక్ మదర్స్ డే స్పెషల్ గుమ్మానికి బొట్టు ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. దండెం మీద నాన్న తువ్వాలు శుభ్రంగా ఆరి గాలికి మెల్లగా ఊగుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. పెరట్లో రాలిన బాదం ఆకులన్నీ కువ్వగా మూల చేరి, నీడన నులక మంచం, దాని పైన దిండు, ఆ పక్కనే డెబ్బై రెండు పేజీల తాజా తెలుగు వారపత్రిక రెపరెపలాడుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. నూరే రాయి మీద తేమ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. ఆరే వడియాల వాసన సోకుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. క్యారియర్ డబ్బాల హడావిడి బోర్లగింత, తెర్లే పులుసు మీద ఉప్పు జారింత, వంటింటి పొగగొట్టం నల్లటి నిట్టూర్పులు, గడ్డ కట్టిన నెయ్యి సెగ తగిలినంతలోనే పులుముకునే ఎరుపు... ఇవి ఉంటే గనక ఇంట్లో కచ్చితంగా అమ్మ ఉన్నట్టు. రాత్రిళ్లు లేటుగా వస్తే తలుపు తీసే వాచ్మెన్, తప్పు చేస్తూ దొరికిపోతే వెనకేసుకొచ్చే క్లోజ్‌ఫ్రెండ్, ఏ సందర్భంలోనైనా వాదించడానికి సిద్ధంగా ఉండే ప్లీడర్... వీళ్లంతా ఒకరుగా ఉంటే డౌట్ లేదు ఇంట్లో అమ్మ ఉన్నట్టు. ఇంకా చెప్పాలా? ఇంట్లో సంస్కారం ఉంటే అమ్మ ఉన్నట్టు. కళ ఉంటే అమ్మ ఉన్నట్టు. ముసురు ముంచుకొచ్చే వేళ తెల్లటి దీపం వెలిగితే అమ్మ ఉన్నట్టు. అమ్మ ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నట్టుగా తెలియదు. అమ్మ లేనప్పుడే ఇవన్నీ పోయినట్టుగా తెలుస్తుంది. చెట్టంత కొడుకే కావచ్చు... వయసు తిరోగమనం పట్టి పసివాడైపోతాడు. గుప్పిళ్లలో అమ్మ చూపుడువేలి కోసం వెర్రెత్తి పోతాడు. అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా... ఉద్యోగం లేదు. అయితే ఏంటట? అమ్మ ఉందిగా. నాన్న తిడతాడు. అయితే ఏమవుతుందట? అమ్మ రహస్యంగా ఒక ముద్ద పెడుతుందిగా. ఖర్చులకు డబ్బుల్లేవు. అమ్మే ఏటీఎం. గర్ల్‌ఫ్రెండ్ దగ్గర దర్జా. అమ్మే బ్రాండ్ అంబాసిడర్. ఏ అమ్మయినా ఏదైనా చదువుతుందో లేదో కాని తన కడుపున పుట్టిన పిల్లలను మాత్రం క్షుణ్ణంగా చదువుతుంది. వాళ్లకేం కావాలో అమ్మకు తెలుసు. వాళ్లకు నొప్పి పుట్టే క్షణాన తన పేగు కదలడం తెలుసు. ఏం కావాలి అమ్మకు? మణులా మాణిక్యాలా? తన పిల్లలు నోటికింత తిని, ఒంటికింత కట్టి సంతోషంగా ఉండటం. అంతే కదా! అందుకే తను వేయి దేవుళ్లకు మొక్కుతుంది. అందుకే తను వేయి కళ్లతో వాళ్లను కాపాడుకుంటుంది. అంతెందుకు... వాళ్ల కోసమే తాను యముడితో పోరాడైనా ఆయుష్షు దక్కించుకుంటుంది. కాని ఓడిపోతే? బహుశా సంతానానికి ఆయువు పోయడానికే తన ఆయువును త్యాగం చేసిందేమో. అమ్మెందుకు నాన్నా చనిపోయింది? అనడిగితే సరిగ్గా చెప్పవలసిన జవాబు అదే- నీకు ఆయువు పోయడానికే నాన్నా. అందుకే అమ్మ లేదంటే నొప్పిగా ఉంటుంది. గుండె మండినట్టుగా ఉంటుంది. గొంతు చేదుగా మారుతుంది. పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవరపెడుతోంది పెనుచీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్లిపోయింది బ్రతికి సుఖమేమిటి... అంతా అయ్యాక మేల్కొని లాభం లేదు. ముందే అమ్మను చూసుకుని ఉంటే బాగుండేది... ముందే అమ్మను డాక్టర్‌కు చూపించి ఉంటే బాగుండేది... ముందే తనకో మంచి చీర కొనిచ్చి ఉంటే బాగుండేది... ముందే తనతో రెండ్రోజులు గడిపి ఉంటే బాగుండేది.... అనుకొని ఏం ప్రయోజనం! అమ్మ చేజారిపోయాక మణులూ మాణిక్యాలను గుప్పిళ్లతో పట్టుకుని ఏం లాభం! అమ్మ కోరే బ్లాంక్ చెక్ ఏమిటి? ఫోన్ చేసి- అమ్మా... ఎలా ఉన్నావ్ అన్న చిన్న పలకరింపు. అదీ ఇవ్వలేకపోయావా? తను కాల్ చేస్తే ఎత్తలేనంత బతుకు బాదరబందీలో కూరుకుపోయావా? అయ్యో వెళ్లిపోయావే నన్నొదిలేసి ఎటు పోయావే.... కాని అమ్మ ఎక్కడకు పోగలదు? కనపడకుండా పోయినా సరే కన్నబిడ్డలను కనిపెట్టుకునే ఉండగలదు. ఏ లోకాన ఉన్నా ఆమె ఆత్మ పరితపించేది వారి కోసమే. పిల్లల కోసం. తనను అమ్మా.. అమ్మా... అని పిలిచిన సంతానం కోసం. తను లేకపోయినా పిలిస్తే పలుకుతుంది. కాకుంటే మనకు వినిపించదు అంతే.విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన... అమ్మ ఉండలేదు. తన పిల్లలను వదిలి ఉండలేదు. వారికి దూరమయ్యి దూరలోకాల్లో అయినా సరే మనలేదు. అందుకే పరిగెత్తుకుని వచ్చేస్తుంది. తను కన్న సంతానం కడుపులో తిరిగి అమ్మైపుడుతుంది. అమ్మ రుణం తీర్చుకోగలిగాము అనేది పిచ్చిమాట. అమ్మ రుణం తీరదు. దోసిళ్లలోని మట్టితో నది నీరు ఎండదు.కలతను రానీకు కన్నంచున కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిను చేరనా ... అమ్మ పాటలు చాలా వచ్చాయి. కాని అమ్మ కోసం కొడుకు, కొడుకు కోసం అమ్మ తమ పాశాన్ని వ్యక్తం చేసిన ఇటీవలి పాట ఇది. తెలుగువారు ఇటువంటి సెంటిమెంట్లకు నవ్విపోయే స్థితిలో ఉన్నారు. తమిళలు ఇంకా తమ సున్నితత్వాన్ని కోల్పోకుండా ఉన్నారు. అందుకు అమ్మ మోములాంటి ఈ అందమైన పాటే తార్కాణం. చిత్రం: రఘువరన్ (2015); రచన: రామజోగయ్యశాస్త్రి సంగీతం: అనిరుధ్ రవిచందర్; గానం: ఎస్.జానకి, దీపు -
అలా ముందుకెళితేనే...ఈ రంగంలో రాణించగలం..!
సందర్భం రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు భక్తి, రక్తి, విరక్తి, ట్రెండీ.. ఇలా ఏ తరహా పాటనైనా సరే... సునాయాసంగా, జనరంజకంగా రాయగల దిట్ట - రామజోగయ్యశాస్త్రి. సందర్భం చెబితే చాలు అలవోకగా అందుకుంటారాయన. దశాబ్దకాలంగా తన సాహిత్యంతో శ్రోతలను తన్మయానికి గురి చేస్తున్న ఈ సినీకవి పుట్టినరోజు ఇవాళే. ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. పాటల ప్రయాణం ఎలా ఉందండీ? హాయిగా, ఆహ్లాదకరంగా ఉంది. ప్రస్తుతం ఏ సినిమాలకు రాస్తున్నారు? అది పెద్ద లిస్టే. ప్రస్తుతం తయారీలో ఉన్న దాదాపు పెద్ద సినిమాలన్నింటికీ రాస్తున్నా. కెరీర్ అయితే స్పీడ్‌గానే ఉంది. అనువాద చిత్రాలకు కూడా రాస్తున్నాను. కమల్‌హాసన్ ‘మన్మథబాణం’, ‘విశ్వరూపం’ సినిమాలకు రాశాను. రానున్న శంకర్ ‘మనోహరుడు’కి కూడా ఓ పాట రాశాను. భాష వేరైనా వారి అభినయాన్ని బట్టి సాహిత్యాన్ని సమకూర్చే శక్తి నాలో ఉంది. అనువాద చిత్రాలకు రాయడం వల్ల... కమల్‌హాసన్, శంకర్ లాంటి గొప్పవారి అభిమానాన్ని పొందగలిగాను. ఇంత బిజీగా ఉండి... టీవీ సీరియల్స్‌కి కూడా రాసినట్టున్నారు? ‘సీతామాలక్ష్మి’ సీరియల్ కోసం రాశాను. నాగబాబుగారికి నేనంటే అభిమానం. ఆయనంటే నాకు గౌరవం. అందుకే... అడగ్గానే రాశాను. ఆ పాటకు మంచి పేరొస్తుంది. మీ ఇంట్లోనే మీరేనా, ఇంకెవరైనా కవులు ఉన్నారా? మా తాతయ్య పమిడి రామజోగయ్యశాస్త్రిగారు కవి. మల్లికార్జున శతకం రచించారాయన. అలాగే... కపోతేశ్వరచరిత్ర అనే గ్రంథాన్ని కూడా రాశారు. ఆయన ద్వారానే నాకు ఈ సాహిత్యం అబ్బిందేమో! అసలు పాటల ప్రయాణం ఎలా మొదలైంది? మాది గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ముప్పాళ్ల. బ్రాహ్మణ కుటుంబం. చిన్నప్పటి నుంచీ తెలియకుండానే కళలపై ఆసక్తి. మా బావ గారు భాషానాటకాలు ఆడేవారు. ఫుల్ ఆర్కెస్ట్రాతో రిహార్సల్స్ ఉండేవి. అక్కడే ‘వయసు పిలిచింది’ సినిమాలోని ‘ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గ’ పాట నేర్చుకున్నా. ఓ సారి పెళ్లిలో మైక్ ఇస్తే ఈ పాట పాడేశా. స్పందన బావుంది. ఇక స్కూల్లో కూడా నాతో పాడించడం మొదలుపెట్టారు. బెంగళూరు వెళ్లినప్పుడు కాలేజ్‌లో పాడేవాణ్ణి. ఖరగ్‌పూర్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా పాడేవాణ్ణి. అప్పటివరకూ నేను పాటగాణ్ణే అనుకున్నా. రాతగాణ్ణి అని తెలీదు. ఓ సారి బెంగళూరులో పాట పాడటానికి ఓ రికార్డింగ్ స్టూడియోకి వెళ్లా. వాళ్లు నా వాయిస్ టెస్ట్ చేశారు. అక్కడున్న వారందికీ ఫ్రెండ్ అయిపోయాను. ‘బాగా పాడుతున్నావ్ కానీ... ప్రొఫెషనల్ సింగర్‌గా రాణించేంత విషయం నీ పాటలో లేదు. పైగా శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోలేదు కదా. అయితే... మేం పాట రాస్తుంటే మాటలు బాగా అందిస్తున్నావ్. ప్రయత్నిస్తే మంచి గీత రచయితవి అవుతావ్’ అని అక్కడ కొందరు సలహా ఇచ్చారు. వాళ్లే ప్రాజెక్ట్ ఇప్పించారు. ఆ తర్వాత కన్నడ రవిచంద్రన్గారితో పరిచయం, తద్వారా కృష్ణవంశీగారికి కలవడం, ఆయన ద్వారా మా గురువుగారు సిరివెన్నెల సాంగత్యం లభించడం... ఇక ఆ తర్వాత మీకు తెలిసిందే.. ఇప్పుడు స్టార్ అయ్యారు కదా. మరి గాయకునిగా కూడా ప్రయత్నించొచ్చుగా? ఇటీవల వేటూరిగారి సంస్మరణ సభలో ఆయనే రాసిన ‘సిరిమల్లె నీవే... విరిజల్లు కావే’ పాట పాడాను. దాని వీడియోను ఫేస్బుక్లో పెడితే మంచి స్పందన లభించింది. అలాగే... ‘దూకుడు’లో ‘అదరగొట్టు... అదరగొట్టు’ పాట నాజర్‌కి పాడింది నేనే. అలా అప్పుడప్పుడు గళానికి పని చెబుతూనే ఉన్నాను. అయితే... పూర్తిస్థాయిలో గాయకునిగా రాణించే శక్తి నాలో లేదు. ‘కింగ్’ సినిమాలో నటించారు కదా. మళ్లీ ట్రై చేయలేదేం? ఏదో సరదాగా చేశానండీ. రెండు పడవలపై ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. గొప్ప పాట రాసే సందర్భాలు నేటి సినిమాల్లో కరువయ్యాయని టాక్. మీరేమంటారు? నిజానిజాలు ఎలా ఉన్నా... గీత రచయితలుగా మా వరకూ మేం సంతృప్తిగానే ఉన్నాం. కాలానుగుణంగా అడుగులు వేస్తూ, అడపాదడపా వచ్చే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లినప్పుడే ఈ రంగంలో రాణించగలం. మనకు వచ్చిన అవకాశాన్ని ఎంత చక్కగా వినియోగించుకున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. అయితే... విలువల విషయంలో మాత్రం రాజీ పడకూడదు. సాధ్యమైనంతవరకూ పాట ద్వారా మంచే చెప్పాలి. మీ తరం గీత రచయితల్లో మీకు నచ్చిన రచయిత? అందరూ సమర్థులే. ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి. ఇలాంటి పాట నాకొస్తే బావుండేది... అని మీకు అనిపించిన గీతం ఏదైనా ఉందా? ప్రత్యేకించి అలాంటి పాట అయితే... ఏదీ లేదు కానీ... నాకు ప్రేమగీతాలు రాయాలని కోరిక మొదట్నుంచీ ఉండేది. దిల్ రాజుగారు అలాంటి సినిమాలు ఎక్కువగా తీస్తారు. అందుకే... ఆయన సినిమాలకు పాటలు రాయాలని ఆశించేవాణ్ణి. అయితే... వంశీగారి ‘గోపి గోపిక గోదావరి’ సినిమాతో ఆ కోరిక తీరిపోయింది. ఆ సినిమా కోసం నేను రాసిన ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల...’ పాట నాకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చాలా ప్రేమగీతాలు రాశాను. గీత రచయితగా మీ లక్ష్యం? లక్ష్యం అనేదాన్ని నేను నమ్మను. ‘గమనమే నీ గమ్యం అయితే... బాటలోనే బతుకు దొరుకు’ అన్నారు సిరివెన్నెల. నేను నమ్మే సిద్ధాంతం అదే. వచ్చిన పని నిజాయితీగా చేయడం, కుదిరినన్ని పాటలు రాయడం... తర్వాత ఈశ్వరేచ్ఛ. బుర్రా నరసింహ -
తగ్గి తగ్గి దగ్గరయ్యారు రామజోగయ్యశాస్త్రి
రాజభోగం.ఇంటికి ఏ జాములోనైనా రానివ్వండి...సాదర స్వాగతం లభిస్తుంది! కాళ్లకు నీళ్లు, భుజానికి తువ్వాలు,భోజనాన్ని చల్లారనివ్వని ఇల్లాలు! శాస్త్రిగారు ఇలా స్వేచ్ఛగా పాటలు రాసుకుంటూ...తిరుగుతున్నారంటే... ‘ఫ్రీడమ్ ఆఫ్ లిరిసిజమ్’ వాళ్లావిడ సత్యప్రియ ప్రసాదించినదే!పాటలు తప్ప ఆయనకసలేమీ పట్టదు. ఆయన తప్ప ఆవిడకసలేమీ పట్టదు. ఇక ఏమైనా రాస్తాడు... తిరుతిరు గణనాథ దిద్దిద్దితై్త అంటాడు.దేఖోదేఖో గబ్బర్‌సింగ్ అనీ అంటాడు. సత్యప్రియ మాత్రం కామ్‌గా ఈ పాటలన్నీ వింటూ...‘ఇవాళేం కూర చేయమంటారు?’ అని ఠంచనుగా అడుగుతూనే ఉంటారు.వీరిద్దరూ ఒకరిలో ఒకరు ఇలా ఇంత ఇదిగా ఎలా ఒదిగిపోయారన్నదే ఈవారం... ‘మనసే జతగా... ‘‘దంపతులు ఎవరికి వారు తమదే గొప్ప అనుకోకుండా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గినట్టుగానే ఉండాలి. అప్పుడే కాపురం సజావుగా సాగుతుంది’’ అని సత్యప్రియ చెబితే ‘‘భార్య దగ్గర తగ్గుతూ ఎదిగేవాడే సిసలైన మొగుడు’’ అని నవ్వుతూ అన్నారు రామజోగయ్యశాస్త్రి. హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటున్న వీరు తమ దాంపత్యం మొదలైన నాటి నుంచి ఒకరికొకరు ఒదిగున్న వైనం గురించి ఇలా తెలిపారు. పెద్దలు ముడివేసిన బంధంరామజోగయ్యశాస్త్రి స్వస్థలం గుంటూరు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామం. తల్లిదండ్రులకి ఒక్కడే కుమారుడు. పెద్దమ్మ మనవరాలు సత్యప్రియ. ఉమ్మడి కుటుంబం. సత్యప్రియ పుట్టడంతోనే రామజోగయ్య భార్య అని పెద్దలు పేరు పెట్టేశారు. ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగారు. ‘‘ఇంజనీరింగ్ చదివేటప్పుడు సత్యప్రియతో పెళ్లిప్రస్తావన తెచ్చారు. తను నాకన్నా ఏడెనిమిదేళ్లు చిన్న. దాంతో మా అభిప్రాయాలలో కూడా తేడా వస్తుందేమోననుకుని కొంచెం తటపటాయించాను. కానీ పెద్దలు సర్దిచెప్పడంతో సరే అన్నాను. అప్పటి నా అభిప్రాయం తప్పు అని చాలా సార్లు నా అనుభవంలోకి వచ్చింది. పెద్దలు ఆలోచించిన ఈ బంధం అందం ఏంటో, దాని వల్ల వచ్చే ఫలితం ఏంటో ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. పాటలే లోకంగా నేనుంటాను. సమయానికి కావల్సినవన్నీ అమర్చిపెడుతూ తన పనిలో తానుంటుంది. నేనిలా మహారాజ వైభోగం అనుభవిస్తున్నానంటే చిన్ననాటి నుంచి నా మనస్తత్వం సత్యకు తెలుసు కాబట్టే! నాకు అనుగుణంగా తను ఉంది కాబట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను’’ అంటూ పద్దెనిమిదేళ్ల క్రితం(1995) తమ పెళ్లినాటి రోజులను గుర్తుతెచ్చుకున్నారు రామజోగయ్యశాస్త్రి. ‘‘పెళ్లికి ముందు నుంచీ మాది ఒకటే కుటుంబం కావడంతో మా గురించి మేం మరింతగా తెలుసుకునే అవకాశం లభించింది’’ అన్నారు సత్యప్రియ. ఎమ్‌టెక్ చేసిన రామజోగయ్య బెంగుళూర్లో ఉద్యోగం రావడంతో అక్కడే కాపురం పెట్టారు. ‘‘సాయంత్రం వరకు ఉద్యోగం, ఆ తర్వాత నాకున్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీ వాళ్లను కలిసేవాడిని. ఏ అర్ధరాత్రికో ఇంటికి వచ్చేవాడిని. అప్పటివరకు ఒక్కత్తే ఉండాలి. కాని ఏ రోజూ ఇదేమని అడిగింది లేదు. ఎందుకంటే నేను ఏ పని కోసం తిరుగుతున్నానో, నా ఆసక్తి ఏంటో సత్యకు తెలుసు. అక్కడ చుట్టుపక్కల వారితో స్నేహంగా ఉండటం, కన్నడ భాష నేర్చుకోవడం, వంటల్లో ప్రయోగాలు చేయడం తప్పించి ఎదుటివారితో పోల్చుకొని అలా మనం ఉండాలని ఎప్పుడూ పోరుబెట్టింది లేదు. అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పుడైనా బయటకు వెళ్దామంటుంది. అప్పుడే నాకు ఏదో పనిపడుతుంది. వెళ్లకతప్పదు. అలాగే నేను వెళ్దాం పద అన్నరోజున ఈవిడకు ఏదో పని ఉంటుంది. ఇలాంటివి చాలా సహజాతి సహజంగా జరిగిపోతుంటాయి.. ఇవి అందరి జీవితంలోనూ మామూలే’’ అని రామజోగయ్య చెబుతుంటే ‘‘పిల్లల అవసరాలు, ఇంటి పనులు, బంధువుల పలకరింపులు .. వీటన్నింటి మధ్య అల్లుకుపోయేదే దాంపత్యం. అందుకే సర్దుబాట్లు అవసరమవుతాయి. ఏ రోజుకారోజు మార్పులు చేసుకుంటూ వెళ్లాలి’’ అన్నారు సత్యప్రియ. రెండుపడవల మీద ప్రయాణం వృత్తి, ప్రవృత్తులను ఒకేసారి చేపట్టినప్పుడు కలిగిన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ- ‘‘సినిమా అంటే మోజు. పాట అంటే క్రేజ్! మొదట్లో బెంగుళూర్లో ప్రైవేట్ ఆల్బమ్స్‌కి పాడాలని ఆసక్తి చూపేవాడిని. అయితే అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ రికార్డింగ్‌లో పాల్గొనాలంటే కష్టం. దీంతో పాటలు రాయడంవైపు మళ్లింది దృష్టి. అప్పుడే పరిశ్రమలో పెద్దవాళ్లు రాసిన పాటల పదాలను స్టడీ చేయడం మొదలుపెట్టాను. బెంగుళూర్ నుంచి హైదరాబాద్‌కి వచ్చేటప్పటికే ఓ డబ్బింగ్ సినిమాకు పాటలు రాశాను. ‘యువసేన’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాను. ఈ క్రమంలో ఉద్యోగం, పాటలు అంటూ రెండు పడవల మీద కాళ్లు పెట్టినప్పుడు కొంత ఆందోళన చెందాను’’ అని రామజోగయ్య చెబుతుంటే సత్యప్రియ మాట్లాడుతూ ‘‘ఆర్థిక సమస్యలేవీ లేవు. ఉన్న పేరు పోకపోతే చాలు అనుకున్నాం. అందుకోసం ఇప్పటికీ రేయింబవళ్లు కష్టపడుతుంటారు. నూరు శాతం కష్టపడితే నూరు శాతం ఫలితం వస్తుందని నమ్మే గుణం ఈయనది. ఆ నమ్మకమే మమ్మల్ని ఇలా నిలబెట్టింది. ఈయన రాసిన పాటలను రికార్డింగ్ తర్వాతే వింటాను. ఎన్నడూ వాటిలో వేలు పెట్టను. ఏ సినిమాకు రాస్తున్నారో కూడా అడగను. అసలు ఆ ప్రపంచంలోకే వెళ్లను. ఈయన చాలా పంతం గల వ్యక్తి. పాట ఒప్పుకున్నారంటే ఇక దానిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పాటలో మ్యాటరుంటే చాలు సినిమాతో సంబంధం లేదు అంటారు. మనకోసం మనం వర్క్ చేస్తున్నాం అంటారు. అందుకే ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చూస్తాను. డబ్బు ఎంత వచ్చినా చేతికి తెచ్చిస్తారు. ఎంత కావాలో అడిగి తీసుకుంటారు. అంతే తప్ప సినిమా వాతావరణమే ఇంట్లో ఉండదు. పాట మీద చికాకులు ఇంట్లో చూపడాలు ఉండవు’’ అని ఆమె చెప్పుకుపోతుంటే ‘‘మరీ అంత మంచి వాడినేమీ కాదు లెండి, పని మీద కోపంలో ఒక్కోసారి తిడతాను. కళ్లనీళ్లు పెట్టుకుంటే బతిమాలుకుంటాను కదా ‘సత్యం’ అంటూ ‘‘మా ఆవిడకు ప్రేమ ఎక్కువైతే నన్ను ‘జోగీ’ అని పిలుస్తుంది’’ అన్నారు రామజోగయ్య. అప్పుడా దంపతుల మధ్య నవ్వులు విరబూశాయి. మినీ మిథునం ఇరవై నాలుగు గంటలు ఇంటి పట్టునే ఉండే భర్తతో కాస్త కష్టమే అని హాస్యమాడారు సత్యప్రియ. అసలు విషయం చెబుతూ - ‘‘ఈయన పని మూలంగా వేరే ఊళ్లకు వెళ్లటం... చుట్టాలింటికి వెళ్లడం.. అంటూ ఉండనే ఉండవు. అలాగని అసంతృప్తి ఛాయలు మా మధ్య ఎక్కడా కనిపించవు. ఆడపడుచు, అత్త పోరు లేదు. బోర్ అనిపిస్తే టీవీ చూద్దామంటే ఈయనకు ఎక్కడ డిస్టర్బ అవుతుందో అని ఆలోచన. అందుకే ఐపాడ్లో సెలైంట్‌గా ఇంటర్నెట్ చూస్తూ, పేపర్లు చదువుతూ కాలక్షేపం చేస్తుంటాను. మా ఇద్దరికీ కొత్త కొత్త వస్తువులు కొనాలనిగానీ, పిక్నిక్కులకీ, టూర్లకీ తిరగాలనీ గానీ ఉండదు. ఇద్దరివీ మధ్యతరగతి మనస్తత్త్వాలే. సెలైంట్‌గా ఒక అవగాహన పూర్వకమైన ప్రేమ నడుస్తుంటుంది మా మధ్య. అందుకే ఏ అసంతృప్తులూ ఉండవు’’ అని ఆమె చెప్పుకుపోతుంటే.. ‘‘నాకు తిండిపిచ్చి. హోటల్లో తినలేను. అందుకే ఇంటర్నెట్లో కొత్త కొత్త వంటలను సెర్చ్ చేసి మరీ వాటిని తయారుచేస్తుంటుంది. దీంతో మినీ మిథునం కథలా తయారైంది మా కాపురం’’ అన్నారు రామజోగయ్య. సాధనమున స్నేహం సమకూరు... దాంపత్యజీవితంలో పిల్లల పెంపకమే కీలకమైనదిగా అభిప్రాయపడ్డారు రామజోగయ్య, సత్యప్రియ. వీరికి సాయితేజ, సాయిహర్ష ఇద్దరు అబ్బాయిలు. చదువు విషయంలో ఒత్తిడి చేయడం కన్నా, వారితో స్నేహంగా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తామన్నారు. ‘‘ఈ రోజుల్లో పిల్లల్ని ‘నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?’ అని అడిగితే పక్కింటి బంటి అనో, ఎదురింటి బబ్లూ అనో చెబుతారు. కాని ఎప్పుడైతే ‘నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ, నాన్న’ అని చెబుతారో అప్పుడే పిల్లలతో పెద్దల రిలేషన్ బాగున్నట్టు! సినిమా పరిశ్రమలోకి రాకముందు వారితో కాస్త కరకుగానే ప్రవర్తించేవాడిని. కాని అది తప్పని అర్ధం చేసుకున్నాను. భార్యతో నా భావాలను పంచుకోవడం, పిల్లలతో స్నేహంగా ఉండటం కోసం కొన్నాళ్లు సాధన చేశాను. మనసుకు నచ్చే పనిలో ఆనందం కోట్లు గుమ్మరించినా రాదు. ఆ పని ఏంటో వెలికి తీయమని పిల్లలకు చెబుతుంటాను’’ అని చెప్పిన రామజోగయ్య పిల్లల ఇష్టం మేరకు ఇంట్లో సంగీతసాధనకు కావల్సిన వనరులన్నీ సిద్ధం చేశారు. ‘‘భార్యాభర్తలనే కాదు.. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలంటే ఎప్పుడూ మన వైపే ఆలోచించకూడదు. ‘ఒకసారి ఎదుటివారి కోణం నుంచి కూడా ఆలోచించి చూద్దాం’ అనిపిస్తే చాలు.. ఆ బాంధవ్యం గట్టిపడుతుంది’’ అని చెప్పిన ఈ జంట మాటలు జీవిత సత్యాలను చెప్పకనే చెప్పినట్లనిపించాయి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స ప్రతినిధి రామజోగయ్యశాస్త్రి రాసిన వందల పాటల్లో కొన్ని... ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా...(యువసేన) ఎవ్వరే నువ్వు నను కదిపావు... (రాజుభాయ్) నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల (గోపి గోపిక గోదావరి) ఓమ్ నమస్తే బోలో...(రెడీ) అటు నువ్వే ఇటు నువ్వే.. (కరెంట్) సదాశివ సన్యాసి...(ఖలేజా) చంద్రకళా చంద్రకళా చంద్రకళా... (అదుర్స్) గురువారం మార్చి ఒకటి... (దూకుడు) {పేమదేశం యువరాణి... (శక్తి) లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో (మిస్టర్ పర్ఫెక్ట్) మై నేమ్ ఈజ్ నానీ నేనీగనైతే కానీ... (ఈగ) నేనంటే నాకూ చాలానే ఇష్టం..(ఊసరవెల్లి) తిరు తిరు గణనాథ దిద్దిద్దితై్త ..(100%లవ్) దేఖో దేఖో గబ్బర్‌సింగ్... (గబ్బర్‌సింగ్) నీ పదముల ప్రభవించిన గంగా యమునా(శిరిడిసాయి) పండగలా దిగివచ్చావు... (మిర్చి) అమ్మో బాపుగారి బొమ్మో...! (అత్తారింటికి దారేది) డబ్బు ఎంత వచ్చినా బుద్ధిగా చేతికి తెచ్చిస్తారు. ఎంత కావాలో అడిగి తీసుకుంటారు. అంతే తప్ప సినిమా వాతావరణమే ఇంట్లో ఉండదు. పనిలో ఎన్ని చికాకులు వచ్చినా మౌనంగా భరిస్తారు తప్పితే వాటిని ఇంట్లో ఎప్పుడూ చూపరు. - సత్యప్రియ ఎదుటివారితో పోల్చుకొని అలా మనం ఉండాలని ఇన్నేళ్ల మా కాపురంలో తను ఎప్పుడూ నన్ను పోరుబెట్టింది లేదు. నా భోజన ప్రియత్వానికి తగ్గట్గుగా ఇంటర్ నెట్లో వెదికి మరీ రకరకాల వంటకాలను రుచి చూపిస్తుంటుంది. - రామజోగయ్య శాస్త్రి -
నా ప్రయాణం అప్పుడే మొదలైంది...
నాకు అక్షరాభ్యాసం చేసింది కాంతారావు మాస్టార్. ఇక ప్రాధమిక పాఠశాలలో నన్ను ప్రభావితం చేసిన గురువులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా నేను అన్నయ్యా అని ఆత్మీయంగా పిల్చుకున్న మా భద్రగిరి మాస్టార్ గురించి చెప్పాలి. ఆయన బోధనా విధానం బాగుండేది. ఇంకా ప్రాధమిక పాఠశాల దశలో నన్ను ప్రభావితం చేసిన గురువుల్లో ఇమామ్, మదీనా, సుబాని, మా హెడ్మాస్టర్ రాజు ఉన్నారు. నేను బాగా చదివే విద్యార్థిని కాబట్టి... గురువులందరూ నాతో బాగుండేవాళ్లు. ఇక, ఉన్నత పాఠశాలకు వచ్చేసరికి చంద్రశేఖర్‌రెడ్డి మాస్టర్, కోటయ్యగారు, వరప్రసాద్ మాస్టర్, జేఎల్ఎన్ మూర్తిగారు, నరసింహారావుగారు.. నా ఆత్మీయ గురువులు. వీళ్లలో మూర్తిగారు లెక్కల మాస్టార్. ఆయన లెక్కలు బోధించే విధానం ఎంతో బాగుంటుంది. పిల్లలందరం అయస్కాంతంలా ఆకర్షితులైపోయి, పాఠాలు వినేవాళ్లం. నా విద్యార్ధి దశలో నన్ను బాగా ప్రభావితం చేసింది మా వరప్రసాద్ మాస్టర్ అని చెప్పాలి. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. నేను ఎనిమిదో తరగతి అంటే... సెలవుల్లో ఆ తర్వాతి తరగతి పాఠాలు చెప్పి, నన్ను ఓ అడుగు ముందు నిలబెట్టేవారు. ప్రాపంచిక విషయాలపై ఆయనకు బాగా అవగాహన ఉండేది. మామూలుగా గ్రామాల్లో ఉండేవారికి అంత అవగాహన ఉండదు. కానీ, వరప్రసాద్ మాస్టర్ చాలా ప్రతిభావంతులు. అన్ని విషయాలను బాగా చెప్పేవారు. ఇక, రచయితగా నాకు బీజం పడేలా చేసింది మా డ్రిల్ మాస్టర్ మదీనాగారని నా భావన. క్లాస్ అయిన తర్వాత మాతో ఏదో ఒక పాట పాడించుకునేవారు. ఆ రకంగా పాటల వైపు నా ప్రయాణం అప్పుడే మొదలయ్యిందేమో అనిపిస్తుంటుంది. - రామజోగయ్య శాస్త్రి