తగ్గి తగ్గి దగ్గరయ్యారు రామజోగయ్యశాస్త్రి | ramajogayya sastri interview | Sakshi
Sakshi News home page

తగ్గి తగ్గి దగ్గరయ్యారు రామజోగయ్యశాస్త్రి

Published Tue, Oct 1 2013 11:08 PM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

తగ్గి తగ్గి దగ్గరయ్యారు రామజోగయ్యశాస్త్రి

తగ్గి తగ్గి దగ్గరయ్యారు రామజోగయ్యశాస్త్రి

రాజభోగం.ఇంటికి ఏ జాములోనైనా రానివ్వండి...సాదర స్వాగతం లభిస్తుంది!
కాళ్లకు నీళ్లు, భుజానికి తువ్వాలు,భోజనాన్ని చల్లారనివ్వని ఇల్లాలు!
శాస్త్రిగారు ఇలా స్వేచ్ఛగా పాటలు రాసుకుంటూ...తిరుగుతున్నారంటే... ‘ఫ్రీడమ్ ఆఫ్ లిరిసిజమ్’ 
వాళ్లావిడ సత్యప్రియ ప్రసాదించినదే!పాటలు తప్ప ఆయనకసలేమీ పట్టదు.
ఆయన తప్ప ఆవిడకసలేమీ పట్టదు. ఇక ఏమైనా రాస్తాడు...
తిరుతిరు గణనాథ దిద్దిద్దితై్త అంటాడు.దేఖోదేఖో గబ్బర్‌సింగ్ అనీ అంటాడు. 
సత్యప్రియ మాత్రం కామ్‌గా ఈ పాటలన్నీ వింటూ...‘ఇవాళేం కూర చేయమంటారు?’
అని ఠంచనుగా అడుగుతూనే ఉంటారు.వీరిద్దరూ ఒకరిలో ఒకరు ఇలా ఇంత ఇదిగా 
ఎలా ఒదిగిపోయారన్నదే ఈవారం... ‘మనసే జతగా...
 
‘‘దంపతులు ఎవరికి వారు తమదే గొప్ప అనుకోకుండా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గినట్టుగానే ఉండాలి. అప్పుడే కాపురం సజావుగా సాగుతుంది’’ అని సత్యప్రియ చెబితే ‘‘భార్య దగ్గర తగ్గుతూ ఎదిగేవాడే సిసలైన మొగుడు’’ అని నవ్వుతూ అన్నారు రామజోగయ్యశాస్త్రి. హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటున్న వీరు తమ దాంపత్యం మొదలైన నాటి నుంచి ఒకరికొకరు ఒదిగున్న వైనం గురించి ఇలా తెలిపారు.
పెద్దలు ముడివేసిన బంధంరామజోగయ్యశాస్త్రి స్వస్థలం గుంటూరు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామం. తల్లిదండ్రులకి ఒక్కడే కుమారుడు. పెద్దమ్మ మనవరాలు సత్యప్రియ. ఉమ్మడి కుటుంబం. సత్యప్రియ పుట్టడంతోనే రామజోగయ్య భార్య అని పెద్దలు పేరు పెట్టేశారు. ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగారు. ‘‘ఇంజనీరింగ్ చదివేటప్పుడు సత్యప్రియతో పెళ్లిప్రస్తావన తెచ్చారు. తను నాకన్నా ఏడెనిమిదేళ్లు చిన్న. దాంతో మా అభిప్రాయాలలో కూడా తేడా వస్తుందేమోననుకుని కొంచెం తటపటాయించాను. 
 
కానీ పెద్దలు సర్దిచెప్పడంతో   సరే అన్నాను. అప్పటి నా అభిప్రాయం తప్పు అని చాలా సార్లు నా అనుభవంలోకి వచ్చింది. పెద్దలు ఆలోచించిన ఈ బంధం అందం ఏంటో, దాని వల్ల వచ్చే ఫలితం ఏంటో ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. పాటలే లోకంగా నేనుంటాను. సమయానికి కావల్సినవన్నీ అమర్చిపెడుతూ తన పనిలో తానుంటుంది. నేనిలా మహారాజ వైభోగం అనుభవిస్తున్నానంటే చిన్ననాటి  నుంచి నా మనస్తత్వం సత్యకు తెలుసు కాబట్టే! నాకు అనుగుణంగా తను ఉంది కాబట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను’’ అంటూ పద్దెనిమిదేళ్ల క్రితం(1995) తమ పెళ్లినాటి రోజులను గుర్తుతెచ్చుకున్నారు రామజోగయ్యశాస్త్రి. ‘‘పెళ్లికి ముందు నుంచీ మాది ఒకటే కుటుంబం కావడంతో మా గురించి మేం మరింతగా తెలుసుకునే అవకాశం లభించింది’’ అన్నారు సత్యప్రియ. ఎమ్‌టెక్ చేసిన రామజోగయ్య బెంగుళూర్‌లో ఉద్యోగం రావడంతో అక్కడే కాపురం పెట్టారు.
 
‘‘సాయంత్రం వరకు ఉద్యోగం, ఆ తర్వాత నాకున్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీ వాళ్లను కలిసేవాడిని. ఏ అర్ధరాత్రికో ఇంటికి వచ్చేవాడిని. అప్పటివరకు ఒక్కత్తే ఉండాలి. కాని ఏ రోజూ ఇదేమని అడిగింది లేదు. ఎందుకంటే నేను ఏ పని కోసం తిరుగుతున్నానో, నా ఆసక్తి ఏంటో సత్యకు తెలుసు. అక్కడ చుట్టుపక్కల వారితో స్నేహంగా ఉండటం, కన్నడ భాష నేర్చుకోవడం, వంటల్లో ప్రయోగాలు చేయడం తప్పించి ఎదుటివారితో పోల్చుకొని అలా మనం ఉండాలని ఎప్పుడూ పోరుబెట్టింది లేదు. అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పుడైనా బయటకు వెళ్దామంటుంది. అప్పుడే నాకు ఏదో పనిపడుతుంది. వెళ్లకతప్పదు. అలాగే నేను వెళ్దాం పద అన్నరోజున ఈవిడకు ఏదో పని ఉంటుంది. ఇలాంటివి చాలా సహజాతి సహజంగా జరిగిపోతుంటాయి.. ఇవి అందరి జీవితంలోనూ మామూలే’’ అని రామజోగయ్య చెబుతుంటే ‘‘పిల్లల అవసరాలు, ఇంటి పనులు, బంధువుల పలకరింపులు .. వీటన్నింటి మధ్య అల్లుకుపోయేదే దాంపత్యం. అందుకే సర్దుబాట్లు అవసరమవుతాయి. ఏ రోజుకారోజు మార్పులు చేసుకుంటూ వెళ్లాలి’’ అన్నారు సత్యప్రియ.
 
రెండుపడవల మీద ప్రయాణం
వృత్తి, ప్రవృత్తులను ఒకేసారి చేపట్టినప్పుడు కలిగిన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ- ‘‘సినిమా అంటే మోజు. పాట అంటే క్రేజ్! మొదట్లో బెంగుళూర్‌లో ప్రైవేట్ ఆల్బమ్స్‌కి పాడాలని ఆసక్తి చూపేవాడిని. అయితే అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ రికార్డింగ్‌లో పాల్గొనాలంటే కష్టం. దీంతో పాటలు రాయడంవైపు మళ్లింది దృష్టి. అప్పుడే పరిశ్రమలో పెద్దవాళ్లు రాసిన పాటల పదాలను స్టడీ చేయడం మొదలుపెట్టాను. బెంగుళూర్ నుంచి హైదరాబాద్‌కి వచ్చేటప్పటికే ఓ డబ్బింగ్ సినిమాకు పాటలు రాశాను. ‘యువసేన’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాను. ఈ క్రమంలో ఉద్యోగం, పాటలు అంటూ రెండు పడవల మీద కాళ్లు పెట్టినప్పుడు కొంత ఆందోళన చెందాను’’ అని రామజోగయ్య చెబుతుంటే సత్యప్రియ మాట్లాడుతూ ‘‘ఆర్థిక సమస్యలేవీ లేవు. ఉన్న పేరు పోకపోతే చాలు అనుకున్నాం. అందుకోసం ఇప్పటికీ రేయింబవళ్లు కష్టపడుతుంటారు. నూరు శాతం కష్టపడితే నూరు శాతం ఫలితం వస్తుందని నమ్మే గుణం ఈయనది. ఆ నమ్మకమే మమ్మల్ని ఇలా నిలబెట్టింది. ఈయన రాసిన పాటలను రికార్డింగ్ తర్వాతే వింటాను. 
 
ఎన్నడూ వాటిలో వేలు పెట్టను. ఏ సినిమాకు రాస్తున్నారో కూడా అడగను. అసలు ఆ ప్రపంచంలోకే వెళ్లను. ఈయన చాలా పంతం గల వ్యక్తి. పాట ఒప్పుకున్నారంటే ఇక దానిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పాటలో మ్యాటరుంటే చాలు సినిమాతో సంబంధం లేదు అంటారు. మనకోసం మనం వర్క్ చేస్తున్నాం అంటారు. అందుకే ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చూస్తాను. డబ్బు ఎంత వచ్చినా చేతికి తెచ్చిస్తారు. ఎంత కావాలో అడిగి తీసుకుంటారు. అంతే తప్ప సినిమా వాతావరణమే ఇంట్లో ఉండదు. పాట మీద చికాకులు ఇంట్లో చూపడాలు ఉండవు’’ అని ఆమె చెప్పుకుపోతుంటే ‘‘మరీ అంత మంచి వాడినేమీ కాదు లెండి, పని మీద కోపంలో ఒక్కోసారి తిడతాను. కళ్లనీళ్లు పెట్టుకుంటే బతిమాలుకుంటాను కదా ‘సత్యం’ అంటూ ‘‘మా ఆవిడకు ప్రేమ ఎక్కువైతే నన్ను ‘జోగీ’ అని పిలుస్తుంది’’ అన్నారు రామజోగయ్య. అప్పుడా దంపతుల మధ్య నవ్వులు విరబూశాయి.
 
మినీ మిథునం
ఇరవై నాలుగు గంటలు ఇంటి పట్టునే ఉండే భర్తతో కాస్త కష్టమే అని హాస్యమాడారు సత్యప్రియ. అసలు విషయం చెబుతూ - ‘‘ఈయన పని మూలంగా వేరే ఊళ్లకు వెళ్లటం... చుట్టాలింటికి వెళ్లడం.. అంటూ ఉండనే ఉండవు. అలాగని అసంతృప్తి ఛాయలు మా మధ్య ఎక్కడా కనిపించవు. ఆడపడుచు, అత్త పోరు లేదు. బోర్ అనిపిస్తే టీవీ చూద్దామంటే ఈయనకు ఎక్కడ డిస్టర్‌‌బ అవుతుందో అని ఆలోచన. అందుకే ఐపాడ్‌లో సెలైంట్‌గా ఇంటర్‌నెట్ చూస్తూ, పేపర్లు చదువుతూ కాలక్షేపం చేస్తుంటాను. మా ఇద్దరికీ కొత్త కొత్త వస్తువులు కొనాలనిగానీ, పిక్నిక్కులకీ, టూర్లకీ తిరగాలనీ గానీ ఉండదు. ఇద్దరివీ మధ్యతరగతి మనస్తత్త్వాలే. సెలైంట్‌గా ఒక అవగాహన పూర్వకమైన ప్రేమ నడుస్తుంటుంది మా మధ్య. అందుకే ఏ అసంతృప్తులూ ఉండవు’’ అని ఆమె చెప్పుకుపోతుంటే.. ‘‘నాకు తిండిపిచ్చి. హోటల్‌లో తినలేను. అందుకే ఇంటర్‌నెట్‌లో కొత్త కొత్త వంటలను సెర్చ్ చేసి మరీ వాటిని తయారుచేస్తుంటుంది. దీంతో మినీ మిథునం కథలా తయారైంది మా కాపురం’’ అన్నారు రామజోగయ్య.
 
సాధనమున స్నేహం సమకూరు...
దాంపత్యజీవితంలో పిల్లల పెంపకమే కీలకమైనదిగా అభిప్రాయపడ్డారు రామజోగయ్య, సత్యప్రియ. వీరికి సాయితేజ, సాయిహర్ష ఇద్దరు అబ్బాయిలు. చదువు విషయంలో ఒత్తిడి చేయడం కన్నా, వారితో స్నేహంగా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తామన్నారు. ‘‘ఈ రోజుల్లో పిల్లల్ని ‘నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?’ అని అడిగితే పక్కింటి బంటి అనో, ఎదురింటి బబ్లూ అనో చెబుతారు. కాని ఎప్పుడైతే ‘నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ, నాన్న’ అని చెబుతారో అప్పుడే పిల్లలతో పెద్దల రిలేషన్ బాగున్నట్టు! సినిమా పరిశ్రమలోకి రాకముందు వారితో కాస్త కరకుగానే ప్రవర్తించేవాడిని. కాని అది తప్పని అర్ధం చేసుకున్నాను. భార్యతో నా భావాలను పంచుకోవడం, పిల్లలతో స్నేహంగా ఉండటం కోసం కొన్నాళ్లు సాధన చేశాను. మనసుకు నచ్చే పనిలో ఆనందం కోట్లు గుమ్మరించినా రాదు. ఆ పని ఏంటో వెలికి తీయమని పిల్లలకు చెబుతుంటాను’’ అని చెప్పిన రామజోగయ్య పిల్లల ఇష్టం మేరకు ఇంట్లో సంగీతసాధనకు కావల్సిన వనరులన్నీ సిద్ధం చేశారు. ‘‘భార్యాభర్తలనే కాదు.. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలంటే ఎప్పుడూ మన వైపే ఆలోచించకూడదు. ‘ఒకసారి ఎదుటివారి కోణం నుంచి కూడా ఆలోచించి చూద్దాం’ అనిపిస్తే చాలు.. ఆ బాంధవ్యం గట్టిపడుతుంది’’ అని చెప్పిన ఈ జంట మాటలు జీవిత సత్యాలను చెప్పకనే చెప్పినట్లనిపించాయి. 
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్‌‌స ప్రతినిధి 
 
రామజోగయ్యశాస్త్రి రాసిన వందల పాటల్లో కొన్ని...
ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా...(యువసేన)
ఎవ్వరే నువ్వు నను కదిపావు... (రాజుభాయ్)
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల (గోపి గోపిక గోదావరి)
ఓమ్ నమస్తే బోలో...(రెడీ)
అటు నువ్వే ఇటు నువ్వే.. (కరెంట్)
సదాశివ సన్యాసి...(ఖలేజా)
చంద్రకళా చంద్రకళా చంద్రకళా... (అదుర్స్)
గురువారం మార్చి ఒకటి... (దూకుడు)
{పేమదేశం యువరాణి... (శక్తి)
లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో (మిస్టర్ పర్‌ఫెక్ట్)
మై నేమ్ ఈజ్ నానీ నేనీగనైతే కానీ... (ఈగ)
నేనంటే నాకూ చాలానే ఇష్టం..(ఊసరవెల్లి)
తిరు తిరు గణనాథ దిద్దిద్దితై్త ..(100%లవ్)
దేఖో దేఖో గబ్బర్‌సింగ్... (గబ్బర్‌సింగ్)
నీ పదముల ప్రభవించిన గంగా యమునా(శిరిడిసాయి)
పండగలా దిగివచ్చావు... (మిర్చి)
అమ్మో బాపుగారి బొమ్మో...! (అత్తారింటికి దారేది)
 
డబ్బు ఎంత వచ్చినా బుద్ధిగా చేతికి తెచ్చిస్తారు. ఎంత కావాలో అడిగి తీసుకుంటారు. అంతే తప్ప సినిమా వాతావరణమే ఇంట్లో ఉండదు. పనిలో ఎన్ని చికాకులు వచ్చినా మౌనంగా భరిస్తారు తప్పితే వాటిని ఇంట్లో ఎప్పుడూ చూపరు. 
- సత్యప్రియ
 
ఎదుటివారితో పోల్చుకొని అలా మనం ఉండాలని ఇన్నేళ్ల మా కాపురంలో తను ఎప్పుడూ నన్ను పోరుబెట్టింది లేదు. నా   భోజన ప్రియత్వానికి తగ్గట్గుగా ఇంటర్ నెట్‌లో వెదికి మరీ రకరకాల వంటకాలను రుచి చూపిస్తుంటుంది. 
- రామజోగయ్య శాస్త్రి
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement