డల్లాస్ : భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) నిర్వహించిన కవితల పోటీకి అనూహ్య స్పందన లభించింది. నాట్స్ మొదటి సారిగా నిర్వహించిన ఈ కవితాస్పర్థలో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు కవులు పాల్గొన్నారు. 913కి పైగా అందిన కవితల్లోంచి 9 మందిని విజేతలుగా ఎంపిక చేసి, వారితో కవి సమ్మేళనం నిర్వహించిన అనంతరం ఎవరు ఏ పురస్కారాన్ని అందుకున్నారో ప్రకటించామని ఈ కార్యక్రమ నిర్వాహకులు డా.సూర్యం గంటి తెలిపారు. నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె, నిర్వాహకులు డా సూర్యం గంటి, డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి విజేతలను ప్రకటించారు.
విజేతలు.. వారి బహుమతులు
సర్వోత్తమ పురస్కారం: రూ 20,000/-: దోర్నాథుల సిద్ధార్థ
ఉత్తమ పురస్కారం: రూ 15,000/-: వంగర పరమేశ్వర రావు
విశిష్ట పురస్కారం: రూ 10,000/-: నూజిళ్ల శ్రీనివాస్
విశేష పురస్కారం: రూ 5,000/-: కిరణ్ విభావరి
గౌరవ పురస్కారం-1: రూ. 2000/- : వినీల్ కాంతి కుమార్ (శతఘ్ని)
గౌరవ పురస్కారం-2: రూ. 2000/- : శిరీష మణిపురి
గౌరవ పురస్కారం-3: రూ. 2000/- : జోగు అంజయ్య
గౌరవ పురస్కారం-4: రూ. 2000/- : అల్లాడి వేణు గోపాల్
గౌరవ పురస్కారం-5: రూ. 2000/- : చెరుకూరి రాజశేఖర్
"పురస్కారాలు గెలుపొందిన తొమ్మిది మంది కవులూ సినీ కవులైన చంద్రబోసు, భాస్కర భట్ల, సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రితో కవితా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 14 సాయంత్రం తెలుగువారు అభివృద్ధి చేసిన ఆన్‌లైన వీడియో ప్లాట్‌ఫాం https://nristreams.tv/NATS-live/ లోనూ నాట్స్ యూట్యూబ్ ఛానల్లోనూ, సామాజిక మాధ్యమంలోనూ ప్రసారం చేశామని, దీన్ని అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారని సంచాలకులు రాజశేఖర్ అల్లాడ తెలిపారు.
మొదటి సారిగా ఈ ప్రయత్నం చేశాం. అనుకున్నదాని కంటే గొప్ప స్పందన లభించిందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. "భాషే రమ్యం- సేవే గమ్యం మా నాట్స్ నినాదం. ఆ దిశలో భాష విషయంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. కవితల పోటీలలో పురస్కారాలు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు. ఇంకా మరిన్ని కవితలు మరింత గొప్పగా వ్రాయాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన చంద్రబోసు గారికి, సిరాశ్రీ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, భాస్కరభట్ల గారికి కృతజ్ఞతలు" అని నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె చెప్పుకొచ్చారు. (500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం)
"ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలనే ఉత్సాహం నాట్స్ కి కలుగుతోంది. దీనికి కారణభూతమైన అశేషమైన కవులకు, కవయిత్రులకు మా కృతజ్ఞతలు. తెలుగు భాషకు చేస్తున్న సేవలో మీ ప్రోత్సాహం శిరోధార్యం", అని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని తెలిపారు. యాప్‌లో ప్రసారమైన ఆన్‌లైన్ కవి సమ్మేళన కార్యక్రమంలో చివరిగా సినీ కవులు కూడా తమ దేశభక్తి కవితలను చదివి వినిపించారు. "విశేషమేమిటంటే జూమ్‌లో కాకుండా పూర్తిగా తెలుగువారి చేత తయారు చేయబడిన NRI STREAMS CONNECT APP ద్వారా ఈ ఆన్‌లైన్ కవి సమ్మేళనాన్ని నిర్వహించడం మరింత ఔచిత్యంగా అనిపిస్తోంది" అని సినీ కవి చంద్రబోస్ అన్నారు.
ఆ కార్యక్రమాన్ని ఈ లింకుల్లో చూడవచ్చు: https://nristreams.tv/NATS-live/ అండ్ https://www.youtube.com/watch?v=yWoDY7queO0
Comments
Please login to add a commentAdd a comment