
ఫ్లోరిడా : అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలో ఆర్ధిక అక్షరాస్యతపై సదస్సు నిర్వహించింది. అమెరికాలో ఆర్ధికాంశాలపై అవగాహన కల్పించేందుకు టెంపాలోని న్యూ టెంపా రీజనల్ లైబ్రరీలో ఈ సదస్సు ఏర్పాటు చేసింది. స్థానిక ప్రముఖ ఆర్ధిక నిపుణులు శ్రీథర్ గౌరవెల్లి ఈ సదస్సుకు విచ్చేసి తన విలువైన సూచనలు సలహాలు అందించారు. దాదాపు 70 మందికి పైగా తెలుగువారు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉన్నతవిద్యకు ఎలా నిధులు పొందాలి? అమెరికాలో ఏ రిస్క్ కు ఎలాంటి బీమా ఉంటుంది? ట్యాక్స్ ప్రణాళికలో ఎలాంటి వ్యూహాలు ఉండాలి? గృహాలు, ఎస్టేట్ లు కొనటానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆరోగ్య సంరక్షణకు ఎలా మనీ ప్లాన్ చేసుకోవాలి? సంపాదించే డబ్బును చక్కటి ప్రణాళికతో దేనికెంత ఖర్చు చేయాలి? పొదుపు ఎలా చేసుకోవాలి? లాంటి అనేక అంశాలపై చక్కటి అవగాహనను శ్రీథర్ గౌరవెల్లి కల్పించారు. వీటిపై ఈ సదస్సుకు విచ్చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆర్థికంగా ఎలా ప్రగతి సాధించాలనే అంశాలపై కూడా స్పష్టత ఇచ్చారు.
టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్థానిక తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. నాట్స్ ఆర్ధిక సదస్సు ద్వారా ఎన్నో విలువైన విషయాలను తెలుసుకున్నామని ఈ సదస్సుకు విచ్చేసిన వారు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలోరాజేశ్ కండ్రు, వంశీలతో పాటు పలువురు నాట్స్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment