కమ్మర్‌పల్లి(బాల్కొండ): కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న మగ్గిడి లక్ష్మి కవయిత్రిగా రాణిస్తోంది. వృత్తి అంగన్‌వాడీ టీచరే అయినా సాహితీ కళా రంగంపై మక్కువతో కవితలు రాస్తూ కళాకారిణిగా గుర్తింపు పొందుతోంది. ఫలితంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటుండడంతో పాటు, సాహిత్య కళా రంగ సంస్థల నుంచి అవార్డులను దక్కించుకుంటోంది. గత ఐదేళ్లలో వందకుపైగా కవితలు రాయగా, పలు కవితలు పుస్తక రూపంలో ఆవిష్కరింపబడ్డాయి.
పాటలు, జానపద గేయాలతో మొదలై..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో నిర్మల్‌కు వచ్చిన ఎన్టీఆర్ ముందు లక్ష్మి ‘ఎన్టీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలనే’ సారాంశంతో పాట పాడడంతో మంత్రముగ్ధుడైన ఎన్టీఆర్ లక్ష్మిని అభినందించారు. అదే స్ఫూర్తితో ఆమె ఆడుతూ, పాడుతూ పాటలు రాయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరి, గేయాలతో పాటు జానపద గేయాలు రాయడం వైపు దృష్టి సారించారు. అయితే వాటికి తానే స్వరకల్పన చేస్తూ, ఆలపించడం అలవాటు చేసుకున్నారు.
ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో తాను రాసిన పాటలు పాడి ఉద్యమకారులను ఉత్సాహపరిచారు. 2014 నుంచి కవితలు రాయడంపై దృష్టి సారించిన లక్ష్మి ఐదేళ్లలో కవయిత్రిగా మంచి గుర్తింపు పొం దింది. వందకుపైగా కవితలు రాసి ప్రముఖుల మన్ననలను పొందింది. జిల్లాలోనే కాకుండా పలు జిల్లాల్లో సాహిత్య కళా రంగాలు, చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే కవి సమ్మేళనాల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభావంతురాలైన కవయిత్రిగా పేరు పొందుతోంది.
ప్రశంసలు, అవార్డులు
- 2017లో నిర్వహించిన ప్రపంచ మహాసభల సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో తెలంగాణ విజయం అనే అంశంపై రాసిన 21 వరసల కవిత పుస్తక రూపంలో ఆవిష్కరింపబడింది.
- గోదావరిఖనిలో దేశభక్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనంలో విప్లవాత్మక కవిత రాసి ఆలపించి ప్రముఖుల నుంచి ప్రశంసా పత్రం అందుకుంది.
- రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి శిల్పకళా వైభవంపై నిర్వహించిన కవితా సంపుటికి లక్ష్మి కవితలు ఎంపికై, ప్రశంసా పత్రం అందుకుంది.
- కొఱవి గోపరాజు సాహిత్య వైభవ సమాలోచన, రాష్ట్రస్థాయి సదస్సులో సాహితీ ప్రియత్వాన్ని ప్రదర్శించి ప్రశంసా పత్రం అందుకుంది.
- ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్, త్యారాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో కవితలను రాసి ఆలపించండంతో ప్రశంసా పత్రం అందుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఉత్తమ కవయిత్రిగా అవార్డును సొంత చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment