సాక్షి, హైదరాబాద్: గర్భం వద్దు.. సరోగసీ ముద్దు అంటున్న సెలబ్రిటీల సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతోంది. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సరోగసీ ద్వారా బిడ్డను కన్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో సరోగసీ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. టెక్నాలజీ పుణ్యమా అని హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సరోగసీకి జై కొడుతున్నారు. ఆమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, శిల్పా శెట్టి, సన్నీ లియోన్, కరణ్ జోహార్ ఇప్పుడు ప్రియాంక చోప్రా దాకా సరోగసీని ఎంచుకుంటున్నారు.
పెళ్లి అయిన ఏడాదికో, రెండేళ్లకో దంపతులు తమకు పుట్టబోయే బిడ్డల గురించి కలలు కనడం సర్వ సాధారణం. తమకు ప్రతిరూపాలుగా పుట్టిన బిడ్డలని చూసి మురిసిపోతారు. ఈ సైకిల్ తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. అయితే వివిధ కారణాల రీత్యా ఏళ్లతరబడి ఎదురు చూసినా సంతానం కలగని వారు గతంలో ఎడాప్షన్ అనే ఆప్షన్‌ను ఎంచుకునేవారు. కానీ తమ రక్తం పంచుకుని పుట్టలేదనే ఒక సెంటిమెంట్ వారిని వెంటాడేది. ఈ క్రమంలో ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో వచ్చిన నయా ట్రెండే సరోగసీ. ముఖ్యంగా కరియర్‌కు బ్రేక్ ఇవ్వడం ఇష్టంలేని హీరోయిన్లు, గర్భం దాల్చిన తరువాత వచ్చే మార్పులకు భయపడి, మరోవైపు వయసు పెరగడం వల్ల బిడ్డలు ఆరోగ్యంగా ఉండరేమో అనే ఆందోళన తదితర కారణాల రీత్యా సరోగసి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే కొంతమంది పురుష సెలబ్రిటీలు కూడా ఈ విధానం ద్వారా సింగిల్ పేరెంట్‌గా అవతరిస్తున్నారు. ఇలా సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్నవారిలో ఆమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, శిల్పా శెట్టి, సన్నీ లియోన్, కరణ్ జోహార్ తాజాగా ప్రియాంక చోప్రా నిలిచారు. ఇక టాలీవుడ్‌లో లక్ష్మి మంచు తొలి సరోగసి మదర్‌గా నిలిచి ఒక పాపకు తల్లి అయిన సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ విధానం బాగా పాపులర్ అయింది.
ఆరోగ్యపరంగా తల్లి తండ్రులు కాలేని దంపతులు, జన్యుపరమైన సమస్యలతో తల్లి కాలేని మహిళలు, వివిధ సామాజిక కారణాలరీత్యా సరోగసీ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. సరోగసి అంటే ఒక విధంగా చెప్పాలంటే మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకుని తద్వారా సంతానాన్ని పొందడం. ఇందుకు గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళలకు డబ్బులు చెల్లిస్తారు. దీనికయ్యే ఖర్చుకూడా తక్కువేమీ కాదు. అయితే అమ్మలు, అమ్మమ్మలు, ఇతర సమీప బంధువుల ద్వారా కూడా బిడ్డల్ని కంటున్నప్పటికి.. ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. సరోగసీని ద్వారా తమ కుటుంబాల్లోకి బిడ్డల్ని ఆహ్వానిస్తున్న ప్రముఖుల జాబితా చాలా పెద్దదే. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి 2020లో సరోగసీ ద్వారా రెండవ బిడ్డగా సమీషా అనే పాపకు జన్మనిచ్చింది.
సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా కూడా ఈ ప్రక్రియలోనే కవల పిల్లల్ని తమ జీవితంలో ఆహ్వనించింది. 2021, నవంబరులో ప్రీతి జింటా జీన్ గూడెనఫ్ దంపతులు ఈ విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించారు. జై, గియా అంటూ తమ పిల్లల పేర్లను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. టెలివిజన్ నిర్మాత, బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత ఏక్తా కపూర్ జనవరి 2019లో సరోగసీ ద్వారా తన కుమారుడిని స్వాగతించారు. అంతేకాదు ముందు చూపుగా 36 ఏళ్ల వయసులో తన అండాన్ని భద్రపర్చుకోవడం విశేషం. 2008 ఫిబ్రవరిలో ఫరా ఖాన్, శిరీష్ కుందర్ ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నారు.
అంతుకుమందు ఆమె సోదరుడు తుషార్ జూన్ 2016లో సరోగసీ ద్వారా తన మగబిడ్డను కని సింగిల్ పేరెంట్‌గా అవతరించాడు. మార్చి 2017లో, దర్శక-నిర్మాత కరణ్ జోహార్ సరోగసీ ద్వారా కవలలకు తండ్రి అయ్యానని ప్రకటించుకున్నాడు
2013లో బాలీవుడ్‌స్టార్ హీరో షారూఖ్ ఖాన్ అభిరామ్‌కు జన్మనిచ్చింది కూడా సరోగసీ ద్వారానే. అలాగే ఇటీవలికాలంలో విడాకులు తీసుకున్న ఆమీర్ ఖాన్ కిరణ్ రావ్ 2011లో సరోగసీ ద్వారా ఆజాద్ రావ్ ఖాన్‌కు జన్మనిచ్చారు.
ఇక నటి సన్నీ లియోన్ కూడా సరోగసీ ద్వారా మరో ఇద్దరు పిల్లలకు తల్లి అని గర్వంగా ప్రకటించింది. మే 2018లో నటుడు శ్రేయాస్ తల్పాడే, దీప్తి సరోగసీ ద్వారా ఆద్య అనే పాపకు జన్మనించ్చారు. నటి లిసా రే , జాసన్ దేహ్ని జూన్ 2018లో అద్దె గర్భం ద్వారా సూఫీ, సోలీల్ అనే కవలలకు తల్లిదండ్రులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment