Welcome Obama
-
అమ్మతనపు కమ్మదనానికి ‘వెల్కమ్ ఒబామా’
తారాగణం: ఊర్మిళ, రేచల్, ఎస్తాబన్, సంజీవ్... దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాతలు: భారతీ, కృష్ణ మాతృమూర్తులు రెండు రకాలు. కన్నతల్లి, పెంచిన తల్లి. ఇతిహాసాలు సైతం ఈ ఇద్దరు తల్లుల గురించే ప్రస్తావించాయి. అమ్మ అనే భావన... బిడ్డల మూలకణాలు, జీన్స్ వంటి సాంకేతిక అంశాలకు అతీతం. తన శరీరాన్ని చీల్చుకొని బయటకొచ్చిన బిడ్డ జాతి గురించి, మతం, జీన్స్ గురించి అమ్మ ఆలోచించదు. శాస్త్ర, సాంకేతిక పరంగా అమెరికా లాంటి దేశాలు ఎంతైనా అభివృద్ధి చెందనీ, మనిషి జన్మకు సంబంధించినంతవరకూ ఎన్ని దారులైనా వెతకనీ.. కానీ అమ్మ మాత్రం అమ్మే. నవ మాసాలూ మోసి, కని... తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డను సాకే తల్లికి ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. శాస్త్రాలకు అందని మాయ అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అంది మన దేశం. ‘వెల్కమ్ ఒబామా’ సినిమాలో సింగీతం చెప్పింది అదే. సింగీతం శ్రీనివాసరావు నుంచి సినిమా వస్తుందంటే... కచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు సింగీతం. ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ఓ కొత్త ప్రయోగంతోనే మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఆ ప్రయోగం ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ముందు కథలోకెళదాం. లూసీ అనే విదేశీయురాలికి అద్దె గర్భం(సరోగసి) ద్వారా తన బిడ్డకు జన్మనిచ్చే ఓ అద్దె తల్లి అవసరం అవుతుంది. దాంతో ఇండియాలోని కొందరు దళారుల్ని ఆశ్రయిస్తుంది. వారి ద్వారానే యశోద గురించి తెలుసుకుంటుంది. యశోదకు డబ్బు చాలా అవసరం. తన పెంపుడు కూతురు ఆపరేషన్ నిమిత్తం ఆమెకు అర్జంట్‌గా లక్ష రూపాయిలు కావాలి. దాంతో తన గర్భం ద్వారా లూసీ బిడ్డకు జన్మనీయడానికి యశోద అంగీకరిస్తుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. లూసీ దంపతుల బిడ్డ యశోద కడుపులో పడుతుంది. నెలలు నిండుతాయి. యశోదను మెడికల్ చెకప్‌కి తీసుకెళుతుంది లూసీ. యశోద కడుపులోని బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురవుతుంది. అలాంటి బిడ్డ తనకొద్దంటుంది. ప్రసవానంతరం బిడ్డను ఆనాథ శరణాలయంలో పడేయమని యశోదకు డబ్బు కూడా ఇవ్వబోతుంది. కానీ యశోద మాత్రం ఒప్పుకోదు. అందరూ ఉన్న తన బిడ్డ అనాథ ఎలా అవుతాడని లూసీని నిలదీస్తుంది. కానీ లూసీ మాత్రం ఆ బిడ్డ తనకొద్దంటూ అక్కడ్నుంచీ వెళ్లిపోతుంది. తీరా యశోదకు ఎలాంటి లోపం లేని చక్కని మగబిడ్డ పుడతాడు. ఆ తెల్లజాతి బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టుకొని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది యశోద. కొన్నేళ్లు గడుస్తాయి. ఓ రోజు లూసీ మళ్లీ యశోద ముందు ప్రత్యక్షమవుతుంది. తన బిడ్డను తనకిచ్చేయమంటుంది. యశోద గుండె బద్దలైనంత పనవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. అమ్మ గొప్పదనాన్ని చూపిస్తూ, అంతర్లీనంగా దేశం గొప్పతనాన్ని వివరిస్తూ నవ్యరీతిలో సింగీతం ఈ కథను నడిపించిన తీరు అభినందనీయం. భావోద్వేగాలు కూడా కథానుగుణంగా సాగాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే... కళ్లు చెమర్చాయి. భారతమాతకు మరోరూపంలా యశోద పాత్రను, అమెరికాకు ప్రతిరూపంగా లూసీ పాత్రను మలిచారు సింగీతం. యశోద పాత్రలో మరాఠి నటి ఉర్మిళ చూపిన నటన అమోఘం. లూసీ క్యారెక్టర్లో రేచెల్(యూకే) ఫర్వాలేదనిపించింది. కృష్ణ పాత్రలో బాలనటుడు ఎస్తాబాన్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో రచయితలు భువనచంద్ర, అనంత శ్రీరామ్, బలభద్రపాత్రుని రమణి నటులుగా మారారు. అసహజమైన వారి హావభావాలు ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష. తెల్లని కాగితంపై నల్లని మచ్చలా ఉంది వారి ఎపిసోడ్. సింగీతం స్క్రీన్‌ప్లే, సంగీతం రెండూ బావున్నాయి. దర్శన్ కెమెరా, రోహిణి మాటలు సినిమాకు అదనపు ఆకర్షణలు. భారతీకృష్ణ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. హైబ్రిడ్ చిత్రాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత సమయంలో వచ్చినఈ మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్లస్: దర్శకత్వం, కథ, మాటలు, ఛాయా గ్రహణం, ఊర్మిళ నటన మైనస్: ముగ్గురు రచయితల ఎపిసోడ్ -
సింగీతంతో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి - భారతీకృష్ణ
సింగీతం ఓ ప్రయోగశాల. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా సింగీతం చేసిన ప్రయోగం ‘వెల్కమ్ ఒబామా’. శాండల్‌వుడ్ మీడియా పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భారతి, భారతీకృష్ణ నిర్మిం చిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా భారతీకృష్ణ చెబుతూ -‘‘తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన సీరియల్స్, రియాల్టీ షోలు నిర్మించాం. సుమలతగారితో చేసిన ‘బతుకు జట్కా బండి’ మాకు మంచి మలుపు అయ్యింది. తొలి ప్రయత్నంగా సింగీతంగారితో సినిమా చేయడం ఓ మర్చిపోలేని అనుభూతి. ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఊర్మిళ, రేచల్, ఎస్తబన్, సంజీవ్, భువనచంద్ర, అనంతశ్రీరామ్, నిరంజని, తదితరులు ఇందులో నటించారు. తదుపరి సింగీతం దర్శకత్వంలోనే సంగీతం ప్రధానంగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు భారతీకృష్ణ చెప్పారు. -
ప్రపంచంలోనే ఇప్పటివరకూ రాని ప్రయోగం చేయబోతున్నాను
వయసు ఎయిటీ దాటుతున్నా... మనసు మాత్రం ఎయిటీన్ దగ్గరే ఆగిపోయింది సింగీతం శ్రీనివాసరావుకి. ఇప్పటికీ ఫిలిం మేకింగ్ విషయంలో అప్ టు డేట్‌గా ఉంటారాయన. కొంత విరామం తర్వాత ఆయన చేసిన ‘వెల్కమ్ ఒబామా’ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సింగీతంతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక భేటీ. తెలుగు సినిమాలో ఒబామా ప్రస్తావన ఏంటి? కాస్త వివరిస్తారా? క్యూరియాసిటీ ఉంది కదా. దాన్ని అలా ఉంచేద్దాం. విషయం చెప్పేస్తే పస ఉండదు. సరే ఈ సినిమా ప్రత్యేకతలైనా చెప్పండి? ప్రత్యేకత లేకపోతే నేను అసలు సినిమాలు తీయను. ఇప్పటివరకూ ఎన్నో జానర్లను టచ్ చేశాన్నేను. ప్రతి జానర్లోనూ కామెడీకే పెద్ద పీట వేశాను. అయితే... ఈ సినిమా విషయంలో మాత్రం ఎమోషన్‌కి పెద్ద పీట వేశాను. సెంటిమెంట్‌ను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనుకుంటున్నాను. కథల్లేవని అందరూ అంటుంటే... ఎప్పటికప్పుడు కొత్త కథలు ఎలా దొరుకుతాయి మీకు? నిరంతరం అన్వేషించడమే నా పని. కథల్ని రిపీట్ చేయడం అంటే నాకస్సలు నచ్చదు. సొమ్మొకడిది-సోకొకడిది, మైకేల్ మదనకామరాజు మంచి కామెడీ ఎంటర్టైనర్స్. ‘మయూరి’ కళాత్మకం, ‘పుష్పక విమానం’ అద్భుతమైన ప్రయోగం, ‘భైరవద్వీపం’ జానపదం, ‘ఆదిత్య 369’ ఫిక్షన్... ఇలా చెప్పుకుంటూ పోతే దేనికదే విభిన్నం. 20న రాబోతున్న ‘వెల్కమ్ ఒబామా’ కూడా అంతే. ఓ యదార్థ సంఘటన స్ఫూర్తితో ఈ కథ తయారు చేసుకున్నాను. యానిమేషన్ ‘ఘటోత్కచ’ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నారే? నాకలా అనిపించడం లేదు. ఎందుకంటే.. ఆ సినిమా తర్వాత కొన్నాళ్ళు ‘జీసెస్ క్రైస్ట్’ సినిమా పనిలో ఉండిపోయా. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల సెట్స్‌కి వెళ్లలేకపోయింది. తర్వాత ఏడాది పాటు ‘వెల్కమ్ ఒబామా’ కథపైనే వర్క్ చేశా. ఈ సినిమాకు సంగీత దర్శకుణ్ణి కూడా నేనే అవ్వడంవల్ల ఆరు నెలలు మ్యూజిక్ సిట్టింగులకే సరిపోయింది. ఉన్నట్టుండి మ్యూజిక్ డెరైక్టర్‌గా మారాలని ఎందుకనిపించింది? ఇప్పుడు మారడమేంటి? కన్నడంలో ఎప్పుడో మ్యూజిక్ డెరైక్షన్ చేశా. సంగీతదర్శకునిగా నా తొలి చిత్రం కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ది. ఆ తర్వాత అక్కడే రెండు సినిమాలకు సంగీతం అందించా. ఈ కథ రాసుకున్నప్పుడే నాకు పాటలతో పాటు స్వరాలు కూడా పుట్టేశాయి. నటి రోహిణితో మాటలు రాయించాలని ఎందుకనిపించింది? రోహిణి నటి మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. తను మంచి విజన్ ఉన్న వ్యక్తి. అందుకే ధైర్యం చేసి తనకు మాటలు రాసే బాధ్యతను అప్పగించాను. ఎవరైనా రైటర్‌కి ఈ బాధ్యతను అప్పగిస్తే... వారి మార్క్ కనిపించడానికి ఉవ్విళ్లూరుతారు. పంచ్‌ల కోసం పాకులాడుతారు. కానీ ఒక నటికి ఆ బాధ్యత అప్పగిస్తే... ప్రతి పాత్రనూ తానుగా ఫీలవుతూ సంభాషణలు రాస్తారు. అప్పుడు అటోమేటిగ్గా డైలాగులు కొత్తగా ఉంటాయి. నేను అనుకున్నట్లే తను చక్కగా రాసింది. బాలకృష్ణతో ‘ఆదిత్య 999’ అన్నారు. ఏమైంది? ఆ సినిమా ఉంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ బిజీగా ఉన్నారు. నా సినిమాల పనిలో నేను బిజీగా ఉన్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ సినిమా సెట్స్‌కి వెళుతుంది. అయితే... ‘ఆదిత్య 369’కి పూర్తి భిన్నంగా ఉండే సినిమా అది. ఇందులో కూడా టైమ్ మెషీన్ ఉంటుంది. అయితే... ఆ ప్రయత్నం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత మీరు చేసే సినిమా అదేనా? కాదు.. ప్రీ రికార్డెర్ మూవీ చేయబోతున్నాను. ప్రపంచంలోనే ఇప్పటివరకూ రాని ప్రయోగం ఇది. సినిమాకు సంబంధించిన రికార్డింగ్, రీ-రికార్డింగ్, డబ్బింగ్.. అంశాలన్నీ ముందే చేసేస్తాం. తర్వాత చిత్రీకరణకు వెళతాం. ‘పుష్పకవిమానం’ తర్వాత నేను చేయబోతున్న భారీ ప్రయోగం ఇది. స్టార్స్‌తోనే ఈ సినిమా చేస్తా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా ఉంటుంది. ‘వెల్కమ్ ఒమామా’ నిర్మించిన ‘శాండిల్‌వుడ్ మీడియా’ పతాకంపైనే ఈ సినిమా చేస్తా. ఇంకో విషయం ఏంటంటే... కమల్‌హాసన్ కూడా తన సొంత సినిమాలో ఓ పాత్ర చేయమని అడిగాడు. ఆ పాత్ర పూర్వాపరాల గురించి ఇంకా తెలుసుకోలేదు. -
పాటలకు ‘వెల్కమ్ ఒబామా’
పయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వెల్కమ్ ఒబామా’. ఎస్.భారతి, కృష్ణ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఊర్మిళ, సంజీవ్, రేచల్, భువనచంద్ర, అనంత శ్రీరామ్, బలభద్రపాత్రుని రమణి ముఖ్య తారలు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సింగీతం ఓ కావ్యంలాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. రోహిణి స్క్రిప్ట్ ఈ చిత్రానికి బలం. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. సింగీతమే సంగీతం అందించారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో పాటలను విడుదల చేస్తున్నాం. సింగీతంగారితో పనిచేసిన ప్రముఖ హీరోలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని తెలిపారు.