ప్రపంచంలోనే ఇప్పటివరకూ రాని ప్రయోగం చేయబోతున్నాను | I am doing a unique movie says singeetham srinivas | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఇప్పటివరకూ రాని ప్రయోగం చేయబోతున్నాను

Published Sun, Sep 15 2013 12:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

ప్రపంచంలోనే ఇప్పటివరకూ రాని ప్రయోగం చేయబోతున్నాను

ప్రపంచంలోనే ఇప్పటివరకూ రాని ప్రయోగం చేయబోతున్నాను

వయసు ఎయిటీ దాటుతున్నా... మనసు మాత్రం ఎయిటీన్ దగ్గరే ఆగిపోయింది సింగీతం శ్రీనివాసరావుకి. ఇప్పటికీ ఫిలిం మేకింగ్ విషయంలో అప్ టు డేట్‌గా ఉంటారాయన. కొంత విరామం తర్వాత ఆయన చేసిన ‘వెల్‌కమ్ ఒబామా’  చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సింగీతంతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక భేటీ. 
 
తెలుగు సినిమాలో ఒబామా ప్రస్తావన ఏంటి? కాస్త వివరిస్తారా?
క్యూరియాసిటీ ఉంది కదా. దాన్ని అలా ఉంచేద్దాం. విషయం చెప్పేస్తే పస ఉండదు.
 
సరే ఈ సినిమా ప్రత్యేకతలైనా చెప్పండి? 
ప్రత్యేకత లేకపోతే నేను అసలు సినిమాలు తీయను. ఇప్పటివరకూ ఎన్నో జానర్లను టచ్ చేశాన్నేను. ప్రతి జానర్‌లోనూ కామెడీకే పెద్ద పీట వేశాను. అయితే... ఈ సినిమా విషయంలో మాత్రం ఎమోషన్‌కి పెద్ద పీట వేశాను. సెంటిమెంట్‌ను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనుకుంటున్నాను. 
 
కథల్లేవని అందరూ అంటుంటే... ఎప్పటికప్పుడు కొత్త కథలు ఎలా దొరుకుతాయి మీకు?
నిరంతరం అన్వేషించడమే నా పని. కథల్ని రిపీట్ చేయడం అంటే నాకస్సలు నచ్చదు. సొమ్మొకడిది-సోకొకడిది, మైకేల్ మదనకామరాజు మంచి కామెడీ ఎంటర్‌టైనర్స్. ‘మయూరి’ కళాత్మకం, ‘పుష్పక విమానం’ అద్భుతమైన ప్రయోగం, ‘భైరవద్వీపం’ జానపదం, ‘ఆదిత్య 369’ ఫిక్షన్... ఇలా చెప్పుకుంటూ పోతే దేనికదే విభిన్నం. 20న రాబోతున్న ‘వెల్‌కమ్ ఒబామా’ కూడా అంతే. ఓ యదార్థ సంఘటన స్ఫూర్తితో ఈ కథ తయారు చేసుకున్నాను. 
 
యానిమేషన్ ‘ఘటోత్కచ’ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నారే?
నాకలా అనిపించడం లేదు. ఎందుకంటే.. ఆ సినిమా తర్వాత కొన్నాళ్ళు ‘జీసెస్ క్రైస్ట్’ సినిమా పనిలో ఉండిపోయా. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల సెట్స్‌కి వెళ్లలేకపోయింది. తర్వాత ఏడాది పాటు ‘వెల్‌కమ్ ఒబామా’ కథపైనే వర్క్ చేశా. ఈ సినిమాకు సంగీత దర్శకుణ్ణి కూడా నేనే అవ్వడంవల్ల ఆరు నెలలు మ్యూజిక్ సిట్టింగులకే సరిపోయింది.
 
ఉన్నట్టుండి మ్యూజిక్ డెరైక్టర్‌గా మారాలని ఎందుకనిపించింది?
ఇప్పుడు మారడమేంటి? కన్నడంలో ఎప్పుడో మ్యూజిక్ డెరైక్షన్ చేశా. సంగీతదర్శకునిగా నా తొలి చిత్రం కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ది. ఆ తర్వాత అక్కడే రెండు సినిమాలకు సంగీతం అందించా.  ఈ కథ రాసుకున్నప్పుడే నాకు పాటలతో పాటు స్వరాలు కూడా పుట్టేశాయి. 
 
నటి రోహిణితో మాటలు రాయించాలని ఎందుకనిపించింది?
రోహిణి నటి మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. తను మంచి విజన్ ఉన్న వ్యక్తి. అందుకే ధైర్యం చేసి తనకు మాటలు రాసే బాధ్యతను అప్పగించాను. ఎవరైనా రైటర్‌కి ఈ బాధ్యతను అప్పగిస్తే... వారి మార్క్ కనిపించడానికి ఉవ్విళ్లూరుతారు. పంచ్‌ల కోసం పాకులాడుతారు. కానీ ఒక నటికి ఆ బాధ్యత అప్పగిస్తే... ప్రతి పాత్రనూ తానుగా ఫీలవుతూ సంభాషణలు రాస్తారు. అప్పుడు అటోమేటిగ్గా డైలాగులు కొత్తగా ఉంటాయి. నేను అనుకున్నట్లే తను చక్కగా రాసింది. 
 
బాలకృష్ణతో  ‘ఆదిత్య 999’ అన్నారు. ఏమైంది?
ఆ సినిమా ఉంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ బిజీగా ఉన్నారు. నా సినిమాల పనిలో నేను బిజీగా ఉన్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ సినిమా సెట్స్‌కి వెళుతుంది. అయితే... ‘ఆదిత్య 369’కి పూర్తి భిన్నంగా ఉండే సినిమా అది. ఇందులో కూడా టైమ్ మెషీన్ ఉంటుంది. అయితే... ఆ ప్రయత్నం చాలా కొత్తగా ఉంటుంది. 
 
ఈ సినిమా తర్వాత మీరు చేసే సినిమా అదేనా?
కాదు.. ప్రీ రికార్డెర్ మూవీ చేయబోతున్నాను. ప్రపంచంలోనే ఇప్పటివరకూ రాని ప్రయోగం ఇది. సినిమాకు సంబంధించిన రికార్డింగ్, రీ-రికార్డింగ్, డబ్బింగ్.. అంశాలన్నీ ముందే చేసేస్తాం. తర్వాత చిత్రీకరణకు వెళతాం. ‘పుష్పకవిమానం’ తర్వాత నేను చేయబోతున్న భారీ ప్రయోగం ఇది. స్టార్స్‌తోనే ఈ సినిమా చేస్తా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా ఉంటుంది. ‘వెల్‌కమ్ ఒమామా’ నిర్మించిన ‘శాండిల్‌వుడ్ మీడియా’ పతాకంపైనే ఈ సినిమా చేస్తా. ఇంకో విషయం ఏంటంటే... కమల్‌హాసన్ కూడా తన సొంత సినిమాలో ఓ పాత్ర చేయమని అడిగాడు. ఆ పాత్ర పూర్వాపరాల గురించి ఇంకా తెలుసుకోలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement