singeetham srinivas
-
నిర్మాతలు ఆ విషయం చెప్పడం సంతోషంగా ఉంది: నిఖిల్
‘‘కార్తికేయ’ సినిమా చూశాను.. బాగుంది. ఆ సినిమాలానే ‘కార్తికేయ 2’ కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు చిత్రపరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా ముందుకు వెళ్లాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘కార్తికేయ 2’ తీసిన స్పిరిట్ నన్ను ఇక్కడికి నడిపించింది. ఇండస్ట్రీకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, సినిమానే దాన్ని అధిగమిస్తుంది.. ఎటువంటి పరిస్థితులకి ఇండస్ట్రీ లొంగలేదు’’ అన్నారు. ‘ ‘కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా మొహమాటానికి కొన్నిసార్లు ఫంక్షన్స్‌కి రావాల్సి ఉంటుంది. కానీ, ‘కార్తికేయ 2’ చాలా బాగుంది’’ అన్నారు ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్. ‘మా సినిమా కచ్చితంగా బాగుంటుంది’’ అన్నారు చందు మొండేటి. ‘‘మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్‌కి వస్తారని ఇటీవల ‘బింబిసార, సీతారామం’ నిరూపించాయి. అలానే మా సినిమాకి కూడా బుకింగ్స్ బాగున్నాయని మా నిర్మాతలు చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిఖిల్. -
దిగ్దర్శకులుగా క్రిష్, తరుణ్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించనుంది. అంతేకాదు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితులైన మహానటుల పాత్రల్లో ఈ తరం నటీనటులు దర్శనమివ్వనున్నారు. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ కు సంబంధించి ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. తెలుగు సినిమా ఖ్యాతీని పెంచిన దిగ్గజ దర్శకులు కెవీ రెడ్డి పాత్రలో ఈ తరం దర్శకుడు క్రిష్, మాయాబజార్ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ పాత్రలో పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. వీరితో ఇతర కీలక పాత్రల్లో సమంత, రాజేంద్ర ప్రసాద్, షాలినీ పాండే లు నటిస్తున్నారు. -
బాలయ్య వందో సినిమా లిస్ట్‌లో మరో దర్శకుడు
ఏ నటుడి కెరీర్లో అయినా.. వంద సినిమాలు చేయటం అన్నది అరుదైన రికార్డే. అలాంటి ఘనతకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే 99 సినిమాలను పూర్తి చేసిన బాలయ్య తన వందో సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాతో భారీ విజయం సాధించి అభిమానులకు కానుకగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే సీనియర్ డైరెక్టర్లతో పాటు యువ దర్శకులు కూడా బాలయ్య వందో సినిమా ఛాన్స్ కోసం క్యూ కడుతున్నారు. బాలకృష్ణతో రెండు భారీ సక్సెస్‌లు సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని భావించినా, తరువాత సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ పేరు తెర మీదకు వచ్చింది. ఈ ఇద్దరిలో ఎవరు ఒకరు బాలయ్య వందో సినిమాను డైరెక్ట్ చేస్తారని భావించారు. కానీ అనూహ్యంగా యువ దర్శకుడు అనీల్ రావిపూడి పేరు తెర మీదకు వచ్చింది. పటాస్ లాంటి భారీ హిట్‌తో దర్శకుడిగా పరిచయం అయిన అనీల్ బాలయ్యతో రామారావుగారు పేరుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా బాలయ్య వందో సినిమానా.. లేక తరువాతి సినిమానా అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుండగానే మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. గమ్యం, కంచె లాంటి క్రియేటివ్ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు క్రిష్ కూడా బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. మరి ఈ నలుగురిలో బాలయ్య వందో సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఎవరు సాధిస్తారో చూడాలి. -
ప్రపంచంలోనే ఇప్పటివరకూ రాని ప్రయోగం చేయబోతున్నాను
వయసు ఎయిటీ దాటుతున్నా... మనసు మాత్రం ఎయిటీన్ దగ్గరే ఆగిపోయింది సింగీతం శ్రీనివాసరావుకి. ఇప్పటికీ ఫిలిం మేకింగ్ విషయంలో అప్ టు డేట్‌గా ఉంటారాయన. కొంత విరామం తర్వాత ఆయన చేసిన ‘వెల్కమ్ ఒబామా’ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సింగీతంతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక భేటీ. తెలుగు సినిమాలో ఒబామా ప్రస్తావన ఏంటి? కాస్త వివరిస్తారా? క్యూరియాసిటీ ఉంది కదా. దాన్ని అలా ఉంచేద్దాం. విషయం చెప్పేస్తే పస ఉండదు. సరే ఈ సినిమా ప్రత్యేకతలైనా చెప్పండి? ప్రత్యేకత లేకపోతే నేను అసలు సినిమాలు తీయను. ఇప్పటివరకూ ఎన్నో జానర్లను టచ్ చేశాన్నేను. ప్రతి జానర్లోనూ కామెడీకే పెద్ద పీట వేశాను. అయితే... ఈ సినిమా విషయంలో మాత్రం ఎమోషన్‌కి పెద్ద పీట వేశాను. సెంటిమెంట్‌ను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనుకుంటున్నాను. కథల్లేవని అందరూ అంటుంటే... ఎప్పటికప్పుడు కొత్త కథలు ఎలా దొరుకుతాయి మీకు? నిరంతరం అన్వేషించడమే నా పని. కథల్ని రిపీట్ చేయడం అంటే నాకస్సలు నచ్చదు. సొమ్మొకడిది-సోకొకడిది, మైకేల్ మదనకామరాజు మంచి కామెడీ ఎంటర్టైనర్స్. ‘మయూరి’ కళాత్మకం, ‘పుష్పక విమానం’ అద్భుతమైన ప్రయోగం, ‘భైరవద్వీపం’ జానపదం, ‘ఆదిత్య 369’ ఫిక్షన్... ఇలా చెప్పుకుంటూ పోతే దేనికదే విభిన్నం. 20న రాబోతున్న ‘వెల్కమ్ ఒబామా’ కూడా అంతే. ఓ యదార్థ సంఘటన స్ఫూర్తితో ఈ కథ తయారు చేసుకున్నాను. యానిమేషన్ ‘ఘటోత్కచ’ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నారే? నాకలా అనిపించడం లేదు. ఎందుకంటే.. ఆ సినిమా తర్వాత కొన్నాళ్ళు ‘జీసెస్ క్రైస్ట్’ సినిమా పనిలో ఉండిపోయా. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల సెట్స్‌కి వెళ్లలేకపోయింది. తర్వాత ఏడాది పాటు ‘వెల్కమ్ ఒబామా’ కథపైనే వర్క్ చేశా. ఈ సినిమాకు సంగీత దర్శకుణ్ణి కూడా నేనే అవ్వడంవల్ల ఆరు నెలలు మ్యూజిక్ సిట్టింగులకే సరిపోయింది. ఉన్నట్టుండి మ్యూజిక్ డెరైక్టర్‌గా మారాలని ఎందుకనిపించింది? ఇప్పుడు మారడమేంటి? కన్నడంలో ఎప్పుడో మ్యూజిక్ డెరైక్షన్ చేశా. సంగీతదర్శకునిగా నా తొలి చిత్రం కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ది. ఆ తర్వాత అక్కడే రెండు సినిమాలకు సంగీతం అందించా. ఈ కథ రాసుకున్నప్పుడే నాకు పాటలతో పాటు స్వరాలు కూడా పుట్టేశాయి. నటి రోహిణితో మాటలు రాయించాలని ఎందుకనిపించింది? రోహిణి నటి మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. తను మంచి విజన్ ఉన్న వ్యక్తి. అందుకే ధైర్యం చేసి తనకు మాటలు రాసే బాధ్యతను అప్పగించాను. ఎవరైనా రైటర్‌కి ఈ బాధ్యతను అప్పగిస్తే... వారి మార్క్ కనిపించడానికి ఉవ్విళ్లూరుతారు. పంచ్‌ల కోసం పాకులాడుతారు. కానీ ఒక నటికి ఆ బాధ్యత అప్పగిస్తే... ప్రతి పాత్రనూ తానుగా ఫీలవుతూ సంభాషణలు రాస్తారు. అప్పుడు అటోమేటిగ్గా డైలాగులు కొత్తగా ఉంటాయి. నేను అనుకున్నట్లే తను చక్కగా రాసింది. బాలకృష్ణతో ‘ఆదిత్య 999’ అన్నారు. ఏమైంది? ఆ సినిమా ఉంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ బిజీగా ఉన్నారు. నా సినిమాల పనిలో నేను బిజీగా ఉన్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ సినిమా సెట్స్‌కి వెళుతుంది. అయితే... ‘ఆదిత్య 369’కి పూర్తి భిన్నంగా ఉండే సినిమా అది. ఇందులో కూడా టైమ్ మెషీన్ ఉంటుంది. అయితే... ఆ ప్రయత్నం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత మీరు చేసే సినిమా అదేనా? కాదు.. ప్రీ రికార్డెర్ మూవీ చేయబోతున్నాను. ప్రపంచంలోనే ఇప్పటివరకూ రాని ప్రయోగం ఇది. సినిమాకు సంబంధించిన రికార్డింగ్, రీ-రికార్డింగ్, డబ్బింగ్.. అంశాలన్నీ ముందే చేసేస్తాం. తర్వాత చిత్రీకరణకు వెళతాం. ‘పుష్పకవిమానం’ తర్వాత నేను చేయబోతున్న భారీ ప్రయోగం ఇది. స్టార్స్‌తోనే ఈ సినిమా చేస్తా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా ఉంటుంది. ‘వెల్కమ్ ఒమామా’ నిర్మించిన ‘శాండిల్‌వుడ్ మీడియా’ పతాకంపైనే ఈ సినిమా చేస్తా. ఇంకో విషయం ఏంటంటే... కమల్‌హాసన్ కూడా తన సొంత సినిమాలో ఓ పాత్ర చేయమని అడిగాడు. ఆ పాత్ర పూర్వాపరాల గురించి ఇంకా తెలుసుకోలేదు.