బృందావనం చిత్రంలోని ‘మధురమే సుధాగానం/ మనకిదే మరోప్రాణం/మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం’ పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను చిత్రపరిశ్రమకు వచ్చిన కొత్తల్లో సింగీతం శ్రీనివాసరావుగారి సినిమాలకు కీబోర్డు ప్లేయర్‌గా పనిచేసేవాడిని. అప్పటికే ఆయన తీసిన పంతులమ్మ చిత్రంలో మోహన రాగంలో చేసిన ‘సిరిమల్లె నీవే విరిజల్లు తావే’ పాట బాగా పాపులరయ్యింది. ఈ పాటలో చరణాల మధ్యలో హమ్మింగ్ ఉంటుంది కాబట్టి నేను చేయబోయే పాటలో కూడా హమ్మింగ్ పెట్టాలనుకున్నాను. అలాగే ‘విజయా’ వారికి మోహన రాగమైతే సమ్మోహనంగా ఉంటుందనుకున్నాను. ‘చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా/కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా/ శతకోటి భావాలను పలుకు ఎద మాటున/సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా’ అనే చరణానికి అనువుగా అనుభూతి ప్రధానంగా చే శాను. లిరిక్ – ట్యూన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లాగ ఉండాలి. ‘సంగీతానికి ఇంటిపేరు సాహిత్యం’ అని నా నమ్మకం. సహజ నటుడు రాజేంద్రప్రసాద్, విలక్షణ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, ప్రముఖ సంస్థ ‘విజయా’... వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సంగీతం జాగ్రత్తగా చేశాను. ‘వేవేల తారలున్నా నింగి ఒకటే కదా/ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా/ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా/అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా’ చరణంలో కూడా భావాన్ని ప్రతిబింబించాను. మా అమ్మగారు వీణ విద్వాంసురాలు కనుక ఈ పాటలో వీణకు ప్రాధాన్యత ఇచ్చాను.
ఈ చిత్రంలో హీరోయిన్ సంగీతం టీచర్ కనుక మోహనరాగంలో ఉన్న ‘వరవీణా మృదుపాణి’ గీతం ట్యూన్ తీసుకున్నాం. పిల్లలకు నేర్పుతుండగా హీరో వచ్చి ఇంకో రకంగా సంగీతం తెలిసినట్లుగా పాడుతుంటే, ఇలా పాడతావేంటని ప్రశ్నిస్తుంది హీరోయిన్. అందరూ ఒకేలా పాడితే మిలిటరీ సంగీతం అవుతుంది అంటాడు హీరో. ఆ మాటలను ఆధారంగా చేసుకుని, ఆబ్లిగేటర్స్ చేశాను. అంటే ఒకరు గాంధారంలో పాడుతుంటే, ఒకరు షడ్జమం, మరొకరు పంచమంలో పాడుతుంటారు. ఇన్ని శృతుల్లో పాడినా చెవికి ఇంపుగా ఉండేదే సంగీతం అని చెప్పడానికి ఇలా చూపాం. ఆర్కెస్ట్రాలో సుమారు 40 మందిని వాడుకున్నాం. ఈ పాటకు ఆర్కెస్ట్రయిజేషన్ చేసిన ‘దిన’ ఇప్పుడు తమిళంలో పెద్ద సంగీత దర్శకులు అయ్యారు. చెన్నై ‘విజయా గార్డెన్ డీలక్స్’ లో పాట రికార్డు చేశాం. పియానో సౌండ్‌తో ప్రారంభించి, వీణా నాదంలోకి అనుసంధానం చేయడం ఒక కొత్త ప్రయోగం.
విజయా వారు బాపు దర్శకత్వంలో ‘రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ తీసిన పదిహేడేళ్ల విరామం తరవాత ‘బృందావనం’ చిత్రం తీశారు. ప్రముఖ నటులు రావికొండలరావుపూనుకొని... కెవిరెడ్డి దగ్గర అసోసియేట్‌గా చేసిన సింగీతం, నాగిరెడ్డి గారి పిల్లలు విశ్వనాథ రెడ్డి, మాధవపెద్ది వంశంలో మా రెండో తరం అందరినీ ఒక గ్రూప్ చేశారు. ‘చందమామ’ నాగిరెడ్డి, చక్రపాణిగారల మానసపుత్రిక కనుక ‘విజయా చందమామ’ బ్యానర్‌గా ఈ సినిమా విడుదల చేశారు. ఈ చిత్రంలోని పాటలు ఎస్. రాజేశ్వరరావుగారికి నివాళిగా చేశాం. ఈ ఆడియోని నా కోరిక మేరకు ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ‘విజయా వారి పాటలను, సంగీతాన్ని దృష్టిలో పెట్టుకుని, మాధవపెద్ది బాగా చేశాడు’ అని ఆయన నన్ను ప్రశంసించారు. ఈ పాట నాకు మరచిపోలేని గొప్ప పేరు సాధించి పెట్టింది.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
మదిలో మోహన గీతం...
Published Sun, Dec 9 2018 2:21 AM | Last Updated on Sun, Dec 9 2018 2:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment