కాలపరీక్షలో...వెండితెర విజేత | A full house expected for Stafford screening of Oscar-nominated film Boyhood | Sakshi
Sakshi News home page

కాలపరీక్షలో...వెండితెర విజేత

Published Tue, Mar 3 2015 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

కాలపరీక్షలో...వెండితెర విజేత

కాలపరీక్షలో...వెండితెర విజేత

సింగీతం శ్రీనివాసరావు సుప్రసిద్ధ దర్శకుడు
 హాలీవుడ్
 తారాగణం:ఎల్లార్ కోల్ట్రానే, లోరెలీ లింక్లాటర్,
 ప్యాట్రీషియా ఆర్క్వెట్, ఎథాన్ హాకీ
 చాయాగ్రహణం:    లీ డేనియల్, షానె కెల్లి
 దర్శకత్వం:     రిచర్డ్ లింక్లాటర్
 విడుదల:     2014 జూలై 11 (అమెరికా)
 సినిమా నిడివి:     165 నిమిషాలు
 నిర్మాణ వ్యయం:     40 లక్షల డాలర్లు (రూ. 24 కోట్లు)
 ఇప్పటివరకు వసూళ్లు:     444 లక్షల డాలర్లు (దాదాపు రూ. 276 కోట్లు)

 
 నాకు నచ్చిన హాలీవుడ్ సినిమా అంటే కచ్చితంగా ‘బాయ్‌హుడ్’ పేరు చెబుతా. అలాగని నాకు ఇదొక్కటే నచ్చిందని కాదు. ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని చాలా బాగుంటాయి. మరికొన్ని కలకాలం నిలిచిపోయేవిలా ఉంటాయి. ఈ రెండో కోవకు చెందినదే - ‘బాయ్‌హుడ్’.నిజానికి గతవారం ముగిసిన ‘ఆస్కార్’ అవార్డుల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా ఇది. ‘బర్డ్‌మ్యాన్’ చిత్రానికీ, ‘బాయ్‌హుడ్’ చిత్రానికీ మధ్య ఒక తెలియని పోటీ ఆ అవార్డుల్లో నెలకొంది. కథాకథనానికి సంబంధించి రెండు వేర్వేరు శైలులను ఇష్టపడే వారి మధ్య జరిగిన పోటీ అది. ‘బర్డ్ మ్యాన్’ చిత్రం హాలీవుడ్ మీద తీసిన వ్యంగ్యపూరిత హాస్య చిత్రమైతే, ‘బాయ్‌హుడ్’ సినిమా పన్నెండేళ్ళ జీవితంలోని ఘట్టాలను సహజాతి సహజంగా చూపిన సినిమా. హాలీవుడ్ జీవితం మీద తీసిన సినిమాగా ‘బర్డ్ మ్యాన్’ ఉత్తమ చిత్రంతో పాటు మరో మూడు విభాగాల్లో ఆస్కార్‌ను అందుకోవడం ఆశ్చర్యం అనిపించదు.
 
 ‘బాయ్‌హుడ్’ చిత్రం ఒక పాత్రను అద్భుతంగా చిత్రిస్తూ, పెరిగే వయసుతో పాటు అమాయకత్వం తరగిపోతూ రావడాన్ని చూపెడుతుంది. నిజం చెప్పాలంటే, ‘బాయ్‌హుడ్’ ఒక అద్భుతసృష్టి. నాకు తెలిసినంత వరకూ, ఇంతవరకూ ఇలాంటి ప్రయోగం ఎవరూ చెయ్యలేదు. ఇది మన జీవితాన్ని అనుసరిస్తూ చేసిన విచిత్రమైన సినిమా. ఇదొక అమెరికన్ కుటుంబానికి అద్దం పట్టే కథ. చూస్తున్నంతసేపూ ఒక సినిమా చూస్తున్నట్టుండదు. కొన్నేళ్ళ పాటు కొందరి జీవితాలను వాళ్లతో పాటు మనమూ అనుసరిస్తూ వెళుతున్నట్టుంటుంది.
 
 ఆరేళ్ల కుర్రాడు. మేసన్ అతని పేరు. అతని అక్క - సమంత. వాళ్ల తల్లి - ఒలివా. విడిపోయిన ఆమె భర్త - సీనియర్ మేసన్. వేరొకతనితో ఒలివా పెళ్లి. ఈ వాతావరణంలో మేసన్ పదేళ్ళ పెరుగుదల... ఇదీ సూక్ష్మంగా కథ.మామూలుగా మన సినిమాల్లో ఒక పాత్ర తాలూకు చిన్నప్పటి వేషాన్ని చూపించాలంటే, ఎవరైనా బాలనటునితో చిత్రీకరిస్తారు. కానీ విశేషమేమిటంటే - ఆరేళ్ల మేసన్ పాత్రను ఆరేళ్ల ఎల్లార్ కోల్ట్రాన్ పోషించాడు. ఇలాగే వాళ్ల వాళ్ల వయసులకు తగ్గట్టు మిగతా నటీనటులు పాత్రలు పోషించారు. ఇలా 2002వ సంవత్సరంలో ప్రారంభమైన షూటింగ్, అదే నటీనటులతో ప్రతి సంవత్సరం చిత్రీకరిస్తూ, అలా అలా 12 ఏళ్ళు చిత్రీకరించారు.
 
 అంటే ఆరేళ్ల కుర్రాడికి 18 ఏళ్ళు వచ్చేవరకూ అతనిలో ఏయే మార్పులు వచ్చాయో, వాటిని యథాతథంగా చిత్రీకరిస్తూ, 2013 వరకూ తీసి సినిమా ముగించారు. ఇలా ఇందులో నటించిన నటీనటులందరూ ఆ షూటింగ్ జరిగిన 12 సంవత్సరాల్లో ఎలా పెరిగారన్నది చూస్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి. ఇలాంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే రాయడం ఒక సాహసం. ఒక విచిత్రం. దీని దర్శకుడు రిచర్డ్ లింక్లాటర్ (ఖజీఛిజ్చిటఛీ ఔజీజ్చ్ట్ఛుట) చూచాయగా ఒక కథను నిర్ణయించుకున్నాడట. కాలాన్ని బట్టి నటీనటులు ఎలా మారుతుంటారో, దాన్ని బట్టి ప్రతి సంవత్సరం స్క్రీన్‌ప్లేను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ, చేర్చుకుంటూ రాసుకున్నాడట. ఈ సినిమాలో ట్రిక్స్ లేవు. స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు. ఉన్నదల్లా జీవితమే! సమంత పాత్ర పోషించిన లోరెలీ సాక్షాత్తూ దర్శకుడు లింక్లాటర్ కూతురే.
 
 ఇటీవల ‘బాఫ్తా’ అవార్డుల్లో ‘బాయ్‌హుడ్’ ఉత్తమ చిత్రమైతే, లింక్లాటర్ ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అంటారు. రిచర్డ్ లింక్లాటర్ ఒక పుణ్య పురుషుడు. ‘ఆస్కార్’ అవార్డుల్లోనూ ‘బాయ్‌హుడ్’ చిత్రం తొమ్మిది విభాగాల్లో నామినేటై, ఉత్తమ చిత్రం విభాగంలో గట్టి పోటీనిచ్చినా, చివరకు ఉత్తమ సహాయ నటి విభాగంలో మాత్రమే ఆస్కార్‌ను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ‘ఆస్కార్’ను అందుకోకపోయినా, అంతకు మించిన గౌరవమున్న చిత్రంగా ‘బాయ్‌హుడ్’ రానున్న రోజుల్లో హాలీవుడ్ చిత్ర చరిత్రలో నిలిచిపోతుంది. పైకి చేదుగా అనిపించే ఈ తీపి జ్ఞాపకాన్ని తెరపై ఆస్వాదించండి.
 
  కథ ఏమిటంటే...
 సమంత, మేసన్ అక్కా తమ్ముళ్లు. వీళ్ల తల్లి ఒలివా సొంత కాళ్లపై నిలబడాలనుకుని డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం సంపాదిస్తుంది. ఒలివా భర్త సీనియర్ మేసన్ ఇరాక్ యుద్ధంలో ఉండడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతుంటాడు. దాంతో ఒలివా, సీనియర్ మేసన్ విడిపోతారు. మూడేళ్ల తర్వాత - ఒలివా తన కుమారుడి ప్రొఫెసరైన బిల్‌తో ప్రేమలో పడుతుంది. బిల్ పిల్లలతో కలిసి సమంత, మేసన్ ఉండాల్సి వస్తుంది. బిల్‌కు క్రమశిక్షణ ఎక్కువ. పిల్లల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు. కొన్నాళ్ల తర్వాత బిల్ మద్యానికి బానిసై, ఒలివాను హింసిస్తుంటాడు. దాంతో ఒలివా, అతడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఇదంతా తెలుసుకున్న సీనియర్ మేసన్, ఒలివాకు సర్ది చెప్పి సమంత, మేసన్‌లను వేరే ప్రాంతానికి తీసుకువెళతాడు. మళ్లీ కొత్త జీవితం మొదలవుతుంది.
 
 ఒలివా వేరొకరితో సహజీవనం చేస్తుంది. మేసన్‌కు క్రమంగా ఫొటోగ్రఫీపై ఆసక్తి మొదలవుతుంది. ఒక పార్టీలో మేసన్, షీనా అనే యువతితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరూ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మేసన్‌కు షీనాతో త్వరగా బ్రేకప్ అవుతుంది. ఇంతకీ ఫొటోగ్రఫీలో మేసన్‌కు సిల్వర్ మెడల్ వస్తుంది. డిగ్రీ కూడా సాధిస్తాడు. సమంత, మేసన్‌ల భవిష్యత్ ప్రణాళికలను చర్చించడానికి ఒలివా వారిని లంచ్‌కు పిలుస్తుంది. గత జీవితం చాలా విఫలమైందనీ, అందుకే ఇల్లు అమ్మేస్తున్నాననీ ఒలివా చెబుతుంది. ఇంతలో మేసన్ చదువుకోవడానికి యూనివర్సిటీకి వెళతాడు. అక్కడ పరిచయమైన స్నేహితుడితో కలిసి నేషనల్ పార్క్‌కు వెళతాడు. ‘ఈ క్షణాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉండాలి’ అని వాళ్లు అనుకోవడంతో సినిమాకు ‘శుభం’ కార్డు పడుతుంది.
 
 ఆయన రూటే  సెపరేటు!
 అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, రచయిత అయిన యాభై అయిదేళ్ళ రిచర్డ్ స్టూవర్ట్ లింక్లాటర్ విభిన్న తరహా చిత్రాలను రూపొందిస్తుంటారు. ప్రేమ చుట్టూ తిరిగే కథతో ఆయన తీసిన ‘బిఫోర్ సన్‌రైజ్’ (1995), ‘బిఫోర్ సన్‌సెట్’ (2004), ‘బిఫోర్ మిడ్‌నైట్’ (2013)ల చలనచిత్ర త్రయం గురించి సినీ వర్గీయులు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అదే నటీనటుల్ని తీసుకొని కొన్నేళ్ళ పాటు వాళ్ళను చిత్రీకరించడమనే పద్ధతిని ఆయన ఆ ట్రయాలజీలోనూ, ఈ ‘బాయ్‌హుడ్’లోనూ అనుసరించారు.
 
 సినీ దర్శకత్వానికి రాక ముందు అనేక సంవత్సరాలు ఆయన ఫిల్మ్ టెక్నిక్‌లకు అభ్యాసాలుగా, ప్రయోగాలుగా చాలా లఘు చిత్రాలు తీశారు. చిత్రం ఏమిటంటే, ఒక రోజులో జరిగిన కథగా సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. ఇటీవలి కాలంలో ఆ రకమైన ఇతివృత్తాలు బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఇక, పన్నెండేళ్ళ పాటు ఆయన చిత్రీకరించిన ‘బాయ్‌హుడ్’ తాజాగా వార్తల్లో నిలిచింది. హాలీవుడ్ చిత్రాలు తీస్తున్నప్పటికీ, ఇప్పటికీ స్వస్థలమైన టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోనే ఉండడం ఆయన విల క్షణత. సాంప్రదాయిక సినీ కథాకథన శైలికి భిన్నంగా వెళ్ళడం వృత్తిపరంగానూ లింక్లాటర్‌ను ఇతరులకు భిన్నంగా నిలుపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement