‘బర్డ్‌మ్యాన్’కు ఆస్కార్ కిరీటం
‘బర్డ్‌మ్యాన్’, ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’లకు నాలుగేసి అవార్డులు... ‘విప్‌ల్యాష్’కు 3
సహజత్వానికి ప్రాధాన్యమిచ్చిన ‘బాయ్‌హుడ్’కు ఒకే అవార్డు
స్పెషల్ ఎఫెక్ట్స్‌లో ‘ఇంటర్స్టెల్లార్’... సౌండ్ ఎడిటింగ్‌లో ‘అమెరికన్ స్నైపర్’లకు పట్టం
ఉత్తమ విదేశీ భాషా చిత్రం... పోలెండ్‌కు చెందిన ‘ఇదా’
ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) అంగరంగ వైభవంగా సాగింది. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ ఈ అవార్డు ప్రదానోత్సవ వేదిక వద్ద తారల సందడి తగ్గలేదు. హాలీవుడ్‌కూ, అక్కడ కష్టాలు పడే నటీనటులకూ అద్దం పట్టిన వ్యంగ్యభరిత హాస్య చిత్రం ‘బర్డ్ మ్యాన్’ ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ‘ఉత్తమ చిత్రం’గా ఎంపికైంది. ‘ఉత్తమ చిత్రం’తో పాటు ‘ఉత్తమ దర్శకుడు’, ‘ఉత్తమ ఛాయాగ్రహణం’, ‘ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’తో కలిపి, మొత్తం 4 విభాగాల్లో ‘బర్డ్‌మ్యాన్’ చిత్రం ఈ 87వ వార్షిక అకాడెమీ అవార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది.
‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, మేకప్, కాస్ట్యూవ్ు డిజైన్ విభాగాలు నాలుగింటిలో ఉత్తమంగా నిలిచింది. ఇక, ‘విప్‌ల్యాష్’ చిత్రం ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఉత్తమ సహాయ నటుడి విభాగాలు మూడింటిలో విజేత అయింది. ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ అయిన ఎనిమిది సినిమాలూ కనీసం ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి. అయితే, అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బాయ్‌హుడ్’ చిత్రం మాత్రం ఒకే ఒక్క అవార్డుతో సంతృప్తిపడాల్సి వచ్చింది. ఒక చిన్న పిల్లవాడు పన్నెండేళ్ళ పైచిలుకు వయసు దాకా పెరిగే క్రమాన్ని అదే నటీనటులతో, కాలాన్ని లెక్క చేయక ‘బాయ్‌హుడ్’గా రూపొందించిన రిచర్డ్ లింక్లేటర్కు నిరాశ ఎదురైంది.
అలాగే, అమెరికన్లు పెద్ద పీట వేస్తారనుకున్న ‘అమెరికన్ స్నైపర్’కూ ఒకే అవార్డు (సౌండ్ ఎడిటింగ్) దక్కింది. నిరుడు ‘గ్రావిటీ’తో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికైన ఎమాన్యుయెల్ లుబెజ్కీ ఈసారి ‘బర్డ మ్యాన్’తో మళ్ళీ ఆస్కార్ గెలవడం విశేషం. అయితే, ఉత్తమ నటన విభాగాల్లో మొత్తం శ్వేత జాతీయులనే నామినీలుగా ఎంచుకున్నారనే విమర్శలు... రాజకీయాలున్నాయనే గుసగుసలు... ఆత్మహత్యల నివారణ, ప్రభుత్వ నిఘా లాంటి అంశాలపై ఉపన్యాసాల మధ్య ఈ ఉత్సవం సాగడం గమనార్హం. ఈసారి అవా ర్డులందుకొన్న చిత్రాల్లో ‘అమెరికన్ స్నైపర్’, ‘ది థీరీ ఆఫ్...’, ‘ఇమిటేషన్ గేమ్’ లాంటివన్నీ నిజజీవిత వ్యక్తుల ఆధారంగా రూపొందినవే కావడం విశేషం.
ఉత్తమ చిత్రం: బర్డ్‌మ్యాన్
‘బర్డ్ మ్యాన్’ (లేదా ‘ది అనెక్స్పెక్టెడ్ వర్చ్యూ ఆఫ్ ఇగ్నోరెన్స్’) సినిమా అమెరికన్ వ్యంగ్యభరిత హాస్య - నాటకీయ చిత్రం. వరుసగా అనేక చిత్రాల్లో సూపర్‌హీరో ‘బర్డ్‌మ్యాన్’గా పాత్రపోషణ చేసి సుపరిచితుడై, తెర మరుగైన రిగ్గన్ థామ్సన్ అనే హాలీవుడ్ నటుడి పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. అతను బ్రాడ్వేలో సొంత నాటకం ద్వారా ఒక సీరియస్ నటుడిగా మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆశిస్తాడు. అయితే, పేరుతో పాటు అహంకారం కూడా ఎక్కువున్న ఒక సినీ తార కూడా తన తారాగణంలో ఉండడంతో థామ్సన్‌కు ఎదురైన ఇబ్బందులేమిటి? వగైరా అంశాలతో వ్యంగ్యభరిత హాస్యం రంగరించిన సినిమా ఇది. రెండు గంటల నిడివి గల ఈ చిత్రం గత ఏడాది అక్టోబర్ 17న అమెరికాలో విడుదలైంది. తాజా ఆస్కార్ అవార్డుల్లో మొత్తం 9 విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది. ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’కు కూడా 9 విభాగాల్లో నామినేటైంది. చివరకు చెరి నాలుగేసి విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి.
ఉత్తమ దర్శకుడు: అలెగ్జాండ్రో గొంజాలెజ్ ఇనారిట్ (చిత్రం: ‘బర్డ్ మ్యాన్’)
యాభై ఒక్క సంవత్సరాల అలెగ్జాండ్రో సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. మెక్సికోలో జన్మించిన ఆయన 17 ఏళ్ళ వయసులో అట్లాంటిక్ సముద్రంపై సరకుల రవాణా నౌకలో ప్రయాణం సాగించారు. చిన్న వయసులో చేసిన ఆ ప్రయాణాలు సినీ రూపకర్తగా తనపై అమిత ప్రభావాన్ని చూపాయని ఆయనే చెబుతుంటారు. తాను చూసిన ప్రదేశాలను నేపథ్యాలుగా ఎంచుకోవడం ఆయన అలవాటు. ఆయన తీసిన సినిమాలు ‘అమోరెస్ పెర్రోస్’ (2000), ‘21 గ్రామ్స్’ (2003), ‘బాబెల్’ (2006), ‘బ్యూటిఫుల్‘ (2010), తాజా ‘బర్డ్ మ్యాన్’ (2014)లు ప్రపంచవ్యాప్తంగా ఆదరణనూ, అవార్డుల్నీ అందుకోవడం విశేషం. ‘బర్డ్ మ్యాన్’కు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ గెలుచుకోవడం అందుకు తాజా ఉదాహరణ. ఒక మెక్సికన్ సినీ రూపకర్తకు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు రావడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది ‘గ్రావిటీ’ చిత్రం ద్వారా ఆ ఘనత సాధించిన అల్ఫాన్సో క్యువారోన్ కూడా మెక్సికనే!
ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్మెయిన్ (చిత్రం: ‘ది థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్’)
ప్రపంచ ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీసిన ‘ది థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్’లో హ్యాకింగ్ పాత్రకు చాలా శ్రమించి, ప్రాణం పోశారు - నటుడు ఎడ్డీ రెడ్మెయిన్. హ్యాకింగ్ మాజీ భార్య రాసిన జ్ఞాపకాల పుస్తకం ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమా తీశారు. కేవలం 33 ఏళ్ళ వయసులో ఆయన పోషించిన ఈ నిజజీవిత పాత్ర అందరి ప్రశంసలనూ అందుకుంది. అత్యంత సహజంగా సాగిన ఈ పాత్రపోషణకు ఇప్పటికే ఉత్తమ నటుడిగా ‘గోల్డెన్ గ్లోబ్’, ‘బాఫ్తా’తో సహా పలు అవార్డులందుకున్న ఈ ఇంగ్లీషు నట, గాయక, మోడల్‌కు ఆస్కార్ తాజా విజయం. ఉత్తమ నటుడి విభాగంలో ‘బర్డ్ మ్యాన్’లోని టైటిల్ పాత్రధారి మైకేల్ కీటన్తో పోటీ పడి, ఆస్కార్‌ను గెలిచారు ఎడ్డీ. లండన్‌లో పుట్టి పెరిగిన ఎడ్డీ ఇరవయ్యేళ్ళ వయసులోనే రంగస్థలంపై నటుడిగా ఓనమాలు దిద్దారు. ‘ది గుడ్ షెపర్డ్’, ‘లే మిజరబుల్స్’ లాంటి పలు చిత్రాల్లో నటించిన ఎడ్డీకి టెలివిజన్ నటనలోనూ అనుభవం ఉంది. రంగస్థలం, టీవీ, సినిమా - మూడింటిలోనూ తనదైన ముద్ర వేయడం విశేషం. ఆస్కార్ అందుకున్న ఎడ్డీని స్టీఫెన్ హ్యాకింగ్ అభినందించారు.
ఉత్తమ నటి: జూలియన్ మూర్ (చిత్రం: ‘స్టిల్ ఎలైస్’)
పిన్న వయసులోనే అల్జీమర్స్ వ్యాధి వచ్చి, బాధకు గురైన మహిళగా ‘స్టిల్ ఎలైస్’ చిత్రంలో చూపిన నటన జూలియన్ మూర్కు ఆస్కార్ కిరీటాన్ని అలంకరించింది. భావోద్వేగపరంగా సమస్యలకు గురైన మహిళల పాత్రలను పోషించడంలో మూర్ దిట్ట. ఆ రకంగా 54 ఏళ్ళ ఈ అమెరికన్ నటి, పిల్లల పుస్తకాల రచయిత్రి ఇప్పటికి అయిదు సార్లు నటనా విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. తొలిసారిగా ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు. పిల్లల కోసం ఆమె రాసిన పుస్తకాల్లో కొన్ని ‘బెస్ట్ సెల్లర్స్’ ఉండడం విశేషం.
టూ మచ్ బాబూ...
వ్యాఖ్యాతలు ఎంత జోరుగా ఉంటే వేడుకలు అంత పసందుగా సాగుతాయి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు నీల్ ప్యాట్రిక్ హ్యారిస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘ఇవాళ హాలీవుడ్ బెస్ట్ అండ్ వెటైస్ట్.... ఐ మీన్ బ్రైటెస్ట్ పీపుల్‌కి అవార్డులు ప్రదానం చేయబోతున్నాం’ అని వేడుక ఆరంభంలోనే చర్చకు తావిచ్చే మాటలు మాట్లాడారు నీల్. ఈ ఏడాది నామినేషన్స్‌లో నల్ల జాతికి చెందినవారికి ప్రముఖ విభాగాల్లో స్థానం కల్పించలేదనే వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ‘బెస్ట్ అండ్ వెటైస్ట్’ అని ప్రసంగం మొదలుపెట్టి, అంతలోనే వెటైస్ట్ అంటే బ్రైటెస్ట్ అని మాట మార్చాడు. ఇక, ‘బర్డ్ మ్యాన్’ చిత్రం గురించి మాట్లాడేటప్పుడు అందులోని సన్నివేశాన్ని తలపించే విధంగా లో దుస్తుల్లో వేదిక పైకి వచ్చాడు నీల్. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వీక్షించే ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో ఇలా చేయడం ‘టూ మచ్ బాబూ’ అన్నవాళ్లూ ఉన్నారు.
విజేతల పేర్లు వీరిద్దరికే తెలుసు!
ఆస్కార్ అవార్డ్ విజేతలను ఎంపిక చేయడమనే వ్యవహారం అంత సులువు కాదు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్‌లో మొత్తం 6,100 మంది సభ్యులు ఉంటారు. వీళ్లందరూ వేసిన ఓట్లే విజేతలను నిర్ణయిస్తాయి. మూడేళ్లకు ముందు ఓటింగ్ విధానం మొత్తం పేపర్ వర్క్‌తోనే సాగేది. కానీ, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ పద్దతిలో ఓట్లు వేయడం మొదలైంది. సభ్యులందరి ఓట్లను చివరికి పరిగణనలోకి తీసుకునేది ఇద్దరే వ్యక్తులు. వాళ్లే.. ‘ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థకు చెందిన ‘బ్రియాన్ కల్లినన్, మార్తా రూయిజ్’.
విజేతలను కూడా నిర్ణయించేది వీళ్లే. గత మంగళవారంతో ఓటింగ్ ముగిసింది. 24 శాఖలకు సంబంధించి 6,000 పై చిలుకు ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లు లెక్కించి, విజేతలను శుక్రవారం నిర్ణయిస్తారు. 24 శాఖలకు సంబంధించిన విజేతలను నిర్ణయించిన తర్వాత ఒక్కో విజేత పేరుని ఒక్కో కార్డులా తయారు చేస్తారు. వాటిని ఆయా శాఖ పేరు ముద్రించిన కవర్లలో భద్ర పరుస్తారు. ఈ 24 కవర్లను రెండు బ్రీఫ్‌కేసులలో పెడతారు. ఒకవేళ పొరపాటున ఈ బ్రీఫ్‌కేసులు పోతే..? అందుకే విజేతలను నిర్ణయించిన బ్రియాన్ కల్లినన్, మార్తా రూయిజ్లువారి పేర్లను తమ మనసులో గుర్తుంచుకుంటారు.
అది అవార్డు కమిటీ నిబంధన. విజేతల ఎంపిక పూర్తయ్యి, బ్రీఫ్‌కేసులు రెడీ అయిన క్షణం నుంచీ ఈ ఇద్దరినీ సెక్యుర్టీ గార్డులు వెన్నంటే ఉంటారు. ఆస్కార్ అవార్డు వేడుక ముగిసే వరకు ప్రకృతి అవసరాలు మినహా కాపలాదారుల కనుసన్నల్లోనే ఈ ఇద్దరూ ఉండాలి. చివరి నిమిషం వరకూ విజేతల వివరాలు బ్రియాన్, మార్తాలకు తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు.
నామినీలకూ 'కోట్లు'!
పోటీలో అందరూ గెలవాలని ఎక్కడా ఉండదు. గెలిచినవాళ్లకు ఆనందం, గెలవనివాళ్లకు బాధ కూడా సహజమే. అందుకే, నామినేషన్‌తో సరిపెట్టుకున్నవారికి కొంతలో కొంత ఊరట ఇచ్చే విధంగా ఆస్కార్ అవార్డ్ కమిటీ వారికి ఒక్కొక్కరికీ లక్షా 68 వేల డాలర్లు (సుమారు కోటి రూపాయలకు పైగా) విలువ చేసే బహుమతులు ఇచ్చింది. వీటిని ఓ పెద్ద బ్యాగ్‌లో ఉంచి ఇస్తారు.
అందులో ఏమేం ఉంటాయంటే... బ్రాండెడ్ స్ప్రే, సోప్ లిప్ గ్లాస్ హెర్బల్ టీ, యాపిల్స్ స్త్రీలకు బ్రాండెడ్ మణికట్టు గొలుసు, పురుషులకు మంచి టైలు అలెక్సిస్ సెలెజ్కీ అనే ఫిజికల్ ట్రైనర్ దగ్గర పది సెషన్స్ ఉచిత శిక్షణ చర్మ, కేశ సంరక్షణకు సంబంధించిన సౌందర్య సాధనాలు హోమ్ స్పా సిస్టమ్ ఓ ఐదు నక్షత్రాల హోటల్లో మూడు పగలు, రెండు రాత్రులు గడిపే సౌకర్యం లగ్జరీ రైల్ ట్రిప్ ఓ జ్యోతిష్కుడు నామినీల ఇంటికెళ్లి ఈ ఏడాది వారి జాతకం ఎలా ఉందో చెప్పే వెసులుబాటు. ఇలా పలు రకాల బహుమతులు ఉంటాయి.
ఎర్ర గులాబీలు
‘‘అందమైన భామలు.. లేత మెరుపు తీగలు.. ముట్టుకుంటే మాసిపోయె వన్నెల అందాలు...’’ అందాల భామలను చూసినప్పుడు ఈ పాట గుర్తుకు రావడం ఖాయం. ఆస్కార్ వేడుకలో ఎర్ర తివాచీపై ఒయ్యారాలు పోయిన అందగత్తెలను చూసి, ఇంగ్లిష్‌వాళ్లు ఏం పాటేసుకున్నారో కానీ.. మన తెలుగువాళ్లు మాత్రం ఈ పాట పాడుకోకుండా ఉండలేరు. ప్రతి ఏడాదీ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో రెడ్ కార్పెట్‌పై ‘కాట్ వ్యాక్’ చేసే నటీమణులను వీక్షించడానికి చాలామంది టీవీలకు కళ్లప్పగించేస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. చూపులు తిప్పుకోవడం కష్టమైందట. నిజమే కదూ...
విజేతలు వీరే!
ఉత్తమ చిత్రం: బర్డ్‌మ్యాన్
ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్మెయిన్
ఉత్తమ నటి: జూలియన్ మూర్
ఉత్తమ సహాయ నటుడు: జె.కె. సిమ్మన్స్ (‘విప్‌ల్యాష్’)
ఉత్తమ సహాయనటి: ప్యాట్రీషియా ఆర్క్వెట్టె (బాయ్‌హుడ్)
ఉత్తమ యానిమేటడ్ మూవీ: ‘బిగ్ హీరో సిక్స్’
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎమాన్యుయెల్ లుబెజ్కీ (‘బర్డ్‌మ్యాన్’)
ఉత్తమ వస్త్రాలంకరణ: మిలెనా కానొనెరో (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్)
ఉత్తమ దర్శకుడు: అలె గ్జాండ్రో ఇనారిట్ (బర్డ్‌మ్యాన్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సిటిజన్ ఫోర్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: క్రైసిస్ హాట్‌లైన్ - వెటరన్స్ ప్రెస్ వన్ ఉత్తమ కూర్పు: టామ్ క్రాస్ (‘విప్‌ల్యాష్’)
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: పోలండ్ చిత్రం ‘ఇదా’
ఉత్తమ మేకప్ - కేశాలంకరణ: ఫ్రాన్సెస్ హానన్, మార్క్ కౌలియర్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (అలెగ్జాండ్రె డెస్ప్లాట్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గ్లోరీ... (చిత్రం ‘సెల్మా’)
ఉత్తమ ప్రొడక్ష న్ డిజైన్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఆడమ్ స్టాక్హొజెన్, అన్నా పినోక్)
ఉత్తమ యానిమేటెడ్ లఘుచిత్రం: ‘ఫీస్ట్’ (ప్యాట్రిక్ ఓస్బోర్న్, క్రిస్టీనా రీడ్)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ‘ది ఫోన్ కాల్’ ( మ్యాట్ కిర్క్‌బీ, జే మ్స్ లూకాస్)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: ‘అమెరికన్ స్నైపర్’ (ఏలన్ రాబర్ట్ ముర్రే బుబ్ అస్మాన్)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: ‘విప్‌ల్యాష్’ (క్రెగ్మాన్, బెన్ విల్కిన్స్, థామస్ కర్లే)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ‘ఇంటర్స్టెల్లార్’ (పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్లే, ఇయాన్ హంటర్, స్కాట్ ఫిషర్)
ఉత్తమ ఎడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: ‘ది ఇమిటేషన్ గేమ్’ (గ్రాహమ్ మూర్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: అలె గ్జాండ్రో ఇనారిట్ (‘బర్డ్‌మ్యాన్’)