బాయ్హుడ్ రీమేక్తో షారుఖ్ కొడుకు ఎంట్రీ
ముంబయి: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు. హాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్టయి ఆస్కార్ అవార్డు పొందిన చిత్రం బాయ్హుడ్ను తిరిగి బాలీవుడ్ లో నిర్మించడం ద్వారా ఆర్యన్ను ప్రేక్షకుల దగ్గరికి చేర్చాలని షారుఖ్ నిర్ణయించారు.. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని, అందులో తాను నటిస్తానని ఆర్యనే స్వయంగా తన తండ్రి షారుఖ్కు చెప్పాడట. లండన్లో ఈ చిత్రాన్ని చూసిన వెంటనే ఆర్యన్ షారుఖ్కు ఎంతో ఆత్రుతతో ఫోన్ చేసి తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేసినట్లు కుటుంబ సంబంధికుల సమాచారం.
అంతేకాదు, ఏదైనా మంచి పుస్తకంగానీ, మంచి చిత్రంగానీ తప్పక చదవాలని, చూడాలని ఒకరికొకరు ఎప్పుడూ చెప్పుకుంటుంటారట. ఈ నేపథ్యంలోనే ఆస్కార్ అవార్డు పొందిన బాయ్హుడ్ను తన కుమారుడిని హీరోగా పెట్టి తీయాలని షారుఖ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ చిత్ర నిర్మాతలను కూడా ఆయన సంప్రదించారని, నిర్మాణ హక్కులను తమకు ఇవ్వాలని కోరారని తెలిసింది.
అయితే, బాయ్ హుడ్ చిత్రాన్ని మొత్తం 12 ఏళ్లపాటు చిత్రీకరించారు. ఇందులో ఎల్లర్ కాల్ట్రేన్ నటించాడు. ఈ పన్నెండేళ్లలో వచ్చిన మార్పుల ఆధారంగా చిత్రాన్ని తీశారు. అయితే, షారుఖ్ రిమేక్ చేయనున్న ఈ చిత్రంలో బాల్యంనాటి సన్నివేశాలకోసం తన చిన్న కుమారుడు అబిరామ్తో చిత్రీకరిస్తారని నిర్ణయించినట్లు తెలిసింది. చిత్ర నిర్మాణానికి పూర్తి స్థాయిలో అనుమతి వచ్చాక దర్శకుడిని నిర్ణయిస్తారు. అయితే, ఇప్పటికే మనీశ్ శర్మతో మాట్లాడుతున్నారని తెలిసింది. ఈయన షారుఖ్ నటించిన ఫ్యాన్, రాహుల్ దలాకియా చిత్రాలకు దర్శకత్వం వహించారు.