వెల్లటూరు పడమర చెరువులో మట్టి తవ్వకాలు
సాక్షి, మైలవరం : అధికారం అండతో నాలుగున్నరేళ్లలో అందినకాడికి దండుకున్నారు. కాదేదీ అవినీతికి అనర్హం అన్న చందంగా సాగిపోయాయి టీడీపీ నాయకుల లీలలు. ఇసుక రేవుల నుంచి చెరువుల్లో మట్టిదాకా ప్రతి చోట అవినీతే. నీరు చెట్టు పనుల్లో రూ.కోట్లు కొల్లగొట్టినా.. అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేపట్టి రూ.కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టినా అడిగే నాథుడే లేదు. దేవినేని, అతని అనుచరులు కలిసి నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లు దోచుకున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు అవినీతి అక్రమాలు ఆయన పర్యవేక్షించిన శాఖ మాదిరిగానే భారీస్థాయిలో ఉండటం విశేషం. నియోజకవర్గంలో సహజ వనరులైన మట్టి, చెట్టు, ఇసుక, గ్రావెల్ ఇలా దేన్నీ వదలకుండా కోట్లు దండుకున్నారు. ఇక ఎత్తిపోతల పథకాల పేరుతో దేవినేనితో పాటు అతని అనుచరులు దోపిడీ అంతా ఇంతా కాదు. ఎందుకూ పనికిరాని వాగులు, వంకలపై 22 ఎత్తిపోతల పథకాలను నిర్మించి ప్రజాధనాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా మంత్రిగారి ఆజ్ఞలేనిదే పనులు మొదలు కాదంటే ఆయన ప్రభావం ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
ఎత్తిపోతల పథకాల్లో రూ.10కోట్ల అవినీతి
మైలవరం నియోజకవర్గంలో రైతులకు సాగు నీరు అందించడమే లక్ష్యం అంటూ 22 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఎత్తిపోతల పథకాలను దశాబ్దాలుగా నీరు ప్రవహించని ఎన్‌ఎస్పీ కాలువలు, బుడమేరు, వాగులపై నిర్మించారు. వీటి నిర్మాణాలకు గానూ రూ.22.57కోట్లను కేటాయించారు. నాసిరం పైపులు, తక్కు ఖరీదు మోటార్లు, షెడ్ల నిర్మాణం తదితర పనుల్లో రూ.10కోట్ల మేర అవినతీకి పాల్పడినట్లు తెలుస్తుంది.
నీరు–చెట్టులో కోట్లు పోగేశారు
నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద రూ.118కోట్ల పనులు చేపట్టారు. ఈ పథకం కింద చెరువుల్లో పూడికతీత, కాలువల మరమత్తులు తదితర పనులన్నీ చేశారు. చెరువుల్లో పూడికతీసిన మట్టిని రైతులకు ఉచితంగా అందించాల్సి ఉండగా ఇటుక బట్టీలకు, రియల్ వెంచర్లకు తరలించి రూ.కోట్లు వెనకేసుకున్నారు. మొత్తం 48 చెరువులలో పనులు జరగ్గా మట్టిని విక్రయించి రూ.70కోట్ల వరకు పోగేసినట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. మైలవరం మండలంలోని వెల్వడం సమీపంలో ఉన్న మోదుగుల చెరువులో దేవినేని అనుచరుడు కోమటి సుధాకర్ గతేడాది నీరు–చెట్టు పనులు చేపట్టారు.
అయితే చెరువులో 32వేల క్యాబిక్ మీటర్లు మాత్రమే తవ్వడానికి అనుమతులు ఉండగా 1,42,875 క్యాబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజుకు రూ.2 లక్షల చొప్పున రూ.5కోట్ల విలువైన మట్టిని చుట్టుపక్కల గ్రామాల్లోని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు పడమర చెరువు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు నుంచి 2017–18 సంవత్సరంలో 2లక్షల క్యాబిక్‌మీటర్ల మట్టిని తవ్వి తరలించారు.
ఒక్కొక్క ట్రక్కు మట్టిని రూ.400 నుంచి 600కు విక్రయించారు. ఈ విధంగా రెండేళ్లలో రూ.12కోట్ల మేర గడించారు. అదేవిధంగా గొల్లపూడి మేజర్ పంచాయతీ పరిధిలో నీరు–చెట్టు కింద రూ.1.80కోట్ల మేర పనులు జరిగాయి. ఇక్కడ కూడా మట్టిని విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
బుడమేరులో అక్రమాలెన్నో..
మైలవరం నియోజకవర్గంలో చండ్రగూడెం నుంచి వెలగలేరు వరకు విస్తరించి ఉన్న బుడమేరు ఆధునికీకరణ పనుల్లో దేవినేని అనుచరులు చేతివాటం చూపించారు. ఈ పనులకు గానూ రూ.45కోట్ల మేర కేటాయించారు. అయితే బుడమేరులోని మొక్కలు తొలగించి కేవలం రూ.10కోట్లతో పనులు ముగించి, అక్రమ బిల్లులతో రూ.35కోట్ల మేర కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారం అండతో..
ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి ఇసుకరేవుల్లో దేవినేని అనుచరులు నిబందనలకు విరుద్ధంగా నది నుంచి అక్రమంగా డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుకతోడుతున్నారు. రోజుకు 4వేల క్యూబిక్ మీటర్లు నది నుంచి తోడి లారీలతో రవాణా చేస్తున్నారు. రోజుకు రోజుకు సుమారు రూ.6లక్షలు వరకు సంపాడించారు. మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావుకు చెందిన సీలింగ్ భూమిని రాష్ట్రాభివృద్ధిలో భాగంగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే నేపథ్యంలో తన వాటా దక్కించుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు.
గుంటుపల్లిలో కృష్ణానది నుంచి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు
సర్వే నంబర్ 144, 147లో సుమారు 70 ఎకరాల్లో అమరావతి అమెరికన్ వైద్యశాలకు 26 ఎకరాలు కేటాయించి తెరవెనుక మంత్రాంగంతో తనవాటా దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్టీటీపీఎస్ బూడిద చెరువులో సిమెంటు కంపెనీల పేరుతో అనుమతులు పొంది ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా బూడిద తరలించి కోట్లు గడించారు. కేతనకొండ, మూలపాడు, కొండపల్లి రాతిక్వారీల్లోనూ పర్మిట్లు లేకుండానే అక్రమ మార్గాన నడిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment