మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ‘వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 151 కాదు.. 175కు 175 శాసనసభ స్థానాల్లో విజయం సాధించడమే’ అని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కార్యకర్తలకు ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్య నిర్దేశం చేశారు.
మనం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు విజయబావుటా ఎగుర వేయాలంటే యథావిధిగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మీరు, ఎమ్మెల్యే కలిసి.. అందరూ ఒక్కటై.. మనం చేస్తున్న మేలు, అభివృద్ధిని ప్రతి ఇంట్లో వివరించి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు.
అలా అందరూ కలిసికట్టుగా పని చేస్తే మొత్తం 175 సీట్లు గెల్చుకోగలం అని దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం.. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైలవరం నియోజకవర్గంలో చేసిన మంచిని గణాంకాలతో వివరించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
అర్హులందరికీ పథకాలు అందించడానికే..
► ‘మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకు చాలా సమయం ఉంది కదా అని అనుకోవద్దు. నాలుగు నెలల క్రితం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ కార్యక్రమం ద్వారా ప్రజల వైపు అడుగులు వేగంగా వేస్తున్నాం. ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే సుమారు 89 శాతం ఇళ్లకు మేలు జరిగింది. వివిధ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా దాదాపు రూ.900 కోట్ల నగదు నియోజకవర్గంలోని ఇళ్లకు చేర్చాం.
► ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి.. ఆ ఇంట్లో అక్కకూ, చెల్లెమ్మకూ పథకాల ద్వారా ప్రభుత్వం చేసిన మేలును వివరించండి. ఇంత మేలు చేసిన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలి.. దీవించండి అని అడిగే గొప్ప కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. అర్హత ఉండి మిగిలిపోయిన వారినిఅలానే వదిలేయకుండా.. వారికీ మేలు చేయాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం.
► మరోవైపు ప్రతి సచివాలయంలో అభివృద్ధి పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించాం. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రతి సచివాలయంలో కనీసం 2 రోజులు.. రోజుకు కనీసం 5 లేక 6 గంటలు గడపాలి. ప్రతి ఇంటికీ వెళ్లాలి. దాని వల్ల ఎమ్మెల్యేలు మీకు దగ్గర అవుతారు. దాంతో సచివాలయాలు కూడా మీకు మరింత చేరువవుతాయి. ఇంకా రూ.20 లక్షల పనుల వల్ల గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. వీటన్నింటి కోసమే గడప గడపకు కార్యక్రమం.
► వచ్చే జనవరి నుంచి అడుగులు ఇంకా వేగంగా ముందుకు పడనున్నాయి. బూత్ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు.. వారిలో ఒకరు మహిళ. వారిని ఎమ్మెల్యే ఎంపిక చేస్తారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు.. ఒక తమ్ముడు, ఒక చెల్లెమ్మను కన్వీనర్లు ఎంపిక చేస్తారు.
కన్వీనర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీసి.. అర్హులందరికీ పథకాలు అందేలా చూడటంలో భాగస్వాములవుతారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment