సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ‘మనబడి.. నాడు–నేడు’ కింద మొదటి దశలో చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు రూ.1,350.33 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ ప్రాంతాల్లోని 470 స్కూళ్లకు ప్రహరీలు, 14,010 పాఠశాలలకు రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్లు, 14,250 స్కూళ్లలో మంచినీటి సరఫరా సదుపాయం, 11,952 స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్‌ల ఏర్పాటు, 14,776 స్కూళ్లలో మరమ్మతు పనులకు ఈ నిధులు విడుదల చేశారు.
ఏపీఆర్‌డీసీకి రూ.133.50 కోట్లు
ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బ్యాంకు రుణాల వడ్డీ కింద రూ.133.50 కోట్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020–21 బడ్జెట్ కింద మొదటి త్రైమాసికానికి గాను ఈ నిధులను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.
గాలేరు–నగరి వరద కాలువ వెడల్పునకు గ్రీన్ సిగ్నల్
గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం వరద కాలువను వెడల్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచేలా కాలువను వెడల్పు చేసేందుకు రూ.632.88 కోట్లతో పరిపాలన అనుమతిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పనులు పూర్తిచేయడం ద్వారా శ్రీశైలానికి వరద వచ్చే 40 రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడిన ప్రాజెక్టులను నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులవల్ల కృష్ణా నదికి వచ్చే వరద రోజులు తగ్గిపోతుండటం, వచ్చిన రోజుల్లో గరిష్ఠ స్థాయిలో వస్తుండడంతో.. ఆ వరదను ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపడానికి వాటి కాలువల సామర్థ్యాన్ని పెంచాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జలవనరులశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment