Eenadu News Paper Spread Fake News On Galeru Nagari Project - Sakshi
Sakshi News home page

‘ఈనాడు’ కట్టుకథలు: నీళ్లిచ్చిన వారిమీదే... రామోజీ రాళ్లు! 

Published Sat, Jun 18 2022 2:56 AM | Last Updated on Sat, Jun 18 2022 2:36 PM

Eenadu News Paper Fake News On Galeru Nagari Project - Sakshi

1996 ఫిబ్రవరి 29న గండికోటలో గాలేరు నగరికి నాటి సీఎం చంద్రబాబు వేసిన పునాదిరాయి

అధికారంలో తన వాడుంటే... ఏమీ చేయకపోయినా ప్రశ్నలుండవు. అన్నీ ప్రశంసలే. అదే వేరొకరుంటే మాత్రం... ప్రశంసించాల్సిన చోట కూడా ప్రశ్నలే ఉంటాయి. ఇదీ... రామోజీరావు విధానం. ఇదే ‘ఈనాడు’కు ప్రధానం కూడా. చాలా ప్రాజెక్టుల్ని 2014–19 మధ్య ఐదేళ్ల పాటు చంద్రబాబు గాలికొదిలేసినా అప్పట్లో రామోజీ కంటికవి ఆనలేదు. ఇక 1996 నుంచి 2004 మధ్య సీఎంగా ఉన్నపుడు అసలు ప్రాజెక్టుల ఊసే ఎత్తకపోయినా... చంద్రబాబు కాబట్టి ‘ఈనాడు’కది కనీసం వార్తగా కూడా కనిపించలేదు. కానీ గడిచిన మూడేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టులపై దృష్టిపెట్టి వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి.. ఆయకట్టుల్ని స్థిరీకరిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం నచ్చటం లేదు. అందుకే.. ప్రశంసించాల్సిన చోట కూడా తప్పుడు కథనాలతో ప్రశ్నలే వేస్తున్నారు రామోజీ!!. ‘రైతు ఆశలపై నీళ్లు’ అంటూ అసత్యాలు, అర్థసత్యాలతో శుక్రవారం వండి వార్చిన కథనంలో అసలు నిజమెంత? ఏది నిజం? చూద్దాం... 

రైతుల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేస్తూ 2004లో జలయజ్ఞంలో భాగంగా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టింది దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆ పథకంలో అంతర్భాగమైన గండికోట, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను పూర్తి చేసిందీ ఆయనే. కానీ రామోజీ ‘పచ్చ’కామెర్ల కళ్లకు ఇవన్నీ చంద్రబాబు నాయుడి హయాంలో చేసినట్లుగానే కనిపిస్తున్నాయి. అందుకే 2019, జూన్‌లో 1,500 ఎకరాలకు ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లందిస్తే... అదంతా టీడీపీ సర్కార్‌ హయాంలో పూర్తయిన పనుల వల్లే సాధ్యమయిందని, కాబట్టే ఆ మేరకైనా ఆయకట్టుకు నీళ్లందించగలిగారని వక్రీకరించేశారు.

కానీ నిజమేంటో తెలుసా? రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... మిగిలిపోయిన కొందరు నిర్వాసితులకు కూడా ఐదేళ్ల కాలంలో కనీసం పునరావాసం కల్పించలేకపోయారు. దీంతో గండికోట, వామికొండ, సర్వారాయసాగర్‌లలో అరకొరగానే నీటి నిల్వ సాధ్యమయింది. నిల్వ సామర్థ్యం లేక వందల టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యాయి. ఈ రిజర్వాయర్ల కింద కొత్తగా ఒక్కటంటే ఒక్క ఎకరాకూ నీళ్లందించలేకపోయారు. ఇవీ ‘ఈనాడు’ ప్రశ్నించడానికి ఇష్టపడని నిజాలు. 


గరిష్ఠ నీటి నిల్వలు కంటికి కన్పించలేదా?:
దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేసి.. రైతుల ఆశలను నెరవేర్చడానికి సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే శ్రీకారం చుట్టారు. నిర్వాసితులకు రూ.640 కోట్లను పరిహారం చెల్లించి.. పునరావాసం కల్పించి.. గండికోట రిజర్వాయర్‌ 2020లోనే పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేశారు.

వామికొండ సాగర్‌లో 1.66, సర్వారాయసాగర్‌లో 1.2 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. నిర్వాసితులకు  రూ.240 కోట్లను పరిహారంగా చెల్లించి... పునరావాసం కల్పించి.. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 2020లోనే పూర్తి స్థాయిలో 10.20 టీఎంసీలు నిల్వ చేశారు. అదే రీతిలో పైడిపాలెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీలు నిల్వ చేశారు. ఇవేవీ రామోజీరావు కంటికి కన్పించకపోవడమే అసలైన దుర్మార్గం. వీటిని విస్మరించి రైతుల ఆశలపై నీళ్లు చల్లారంటూ రాయటమే దారుణాతిదారుణం.

దగుల్బాజీ రాతలెందుకు రామోజీ..?:
టీడీపీ సర్కార్‌ హయాంలో ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను చంద్రబాబు పట్టించుకుంటే ఒట్టు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రం ఓ వైపున జలాశయాల్లో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూనే.. మరో వైపు డిస్ట్రిబ్యూటరీల పనులు చేయిస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు.

గండికోట కింద 9,500 ఎకరాలు, వామికొండసాగర్‌ కింద 1,500 ఎకరాలు, సర్వారాయసాగర్‌ కింద 3 వేల ఎకరాలు, పైడిపాలెం రిజర్వాయర్‌ కింద 12,500 ఎకరాలు, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కింద 61 వేల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై అబద్ధాలు అచ్చేయటమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మాత్రం... డిస్ట్రిబ్యూటరీల పనులు చేయకుండా రైతుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోందంటూ విషం చిమ్మింది.

దుష్ప్రచారానికి అడ్డూఅదుపూ లేదా?
భారతి సిమెంట్స్‌ పరిశ్రమ తొలుత 0.06 టీఎంసీలను వినియోగించుకోవడానికి 2007, నవంబర్‌ 24న జీవో ఎంఎస్‌ నెం: 252 ద్వారా ఒక సారి.. 2008, ఫిబ్రవరి 1న జీవో ఎంఎస్‌ నెం:18 ద్వారా 0.09 టీఎంసీలు వాడుకోవడానికి మరోసారి అనుమతి తీసుకుంది.

వాటి ఆధారంగా 2019, ఫిబ్రవరి 5న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు పైపులైన్‌ వేసుకుని.. నీటిని వాడుకుంటోంది. వినియోగించుకున్న ప్రతి నీటి బొట్టుకూ ప్రభుత్వం నిర్ణయించిన పన్ను చెల్లిస్తోంది. నీటి పన్ను రూపంలో 2020, మార్చి నుంచి 2022, మార్చి వరకూ ప్రభుత్వానికి రూ.2,68,843.98 చెల్లించింది.

పైపెచ్చు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఇక సర్వారాయసాగర్, వామికొండసాగర్‌ల నిర్మాణంలో మట్టికట్ట పనుల కోసం మట్టి సమీపంలో దొరకకపోవడంతో కొంత భూమిలో మట్టిని తవ్వి తరలించారు. ఆ భూమి చెరువుగా మారింది. అందులో చేపల పెంపకం కోసం రైతులు ప్రభుత్వం అనుమతి తీసుకున్నారు. వాటికి వినియోగించే ప్రతి వెయ్యి గ్యాలన్ల నీటికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రూ.5.50 చొప్పున రైతులు చెల్లిస్తున్నారు.

ఇవన్నీ కూడా రామోజీకి అస్సలు నచ్చటం లేదు. భారతి సిమెంట్స్, చేపల రైతుల కోసమే జలాశయాల నీటిని వాడుకున్నట్లు అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తూ... సీఎం వైఎస్‌ జగన్‌పై బురదజల్లటానికి తెగబడ్డారు. ఇంతకీ రామోజీకి నచ్చనిదేంటో తెలుసా? ముఖ్యమంత్రిగా తాను కష్టపడి గద్దెనెక్కించిన చంద్రబాబు లేకపోవటమే. అదీ అసలు నిజం.

మరి.. దీన్నేమంటారు రామోజీరావు?
1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు ముందు గండికోట వద్ద గాలేరు–నగరి సుజల స్రవంతికి తొలుత చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు.. ఎన్నికలయ్యాక ఆ ప్రాజెక్టు పేరు కూడా మరిచిపోయారు. ఇంతలోనే  1999 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలకు ముందు వామికొండ వద్ద చంద్రబాబు మరో సారి గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు.

రైతులను నమ్మించడానికి తట్టెడు మట్టి కూడా ఎత్తారు. కానీ.. ఎన్నికలు పూర్తయ్యాక ఆ ఊసెత్తితే ఒట్టు. 1995 నుంచి 2004 మధ్య తొమ్మిదేళ్లలో ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది కేవలం రూ.13 కోట్లు. అదీ ఉద్యోగుల జీతభత్యాల కోసం. ఓట్ల కోసం నాటకాలాడి రైతు ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు దాష్టీకాలు రామోజీరావుకు ఎప్పుడూ కమ్మగానే కనిపించాయి. ఆయన రెండు సార్లు శంకుస్థాపనలు చేస్తే రెండుసార్లూ చక్కని ఫొటోలతో కవరేజీ ఇచ్చిన ఈనాడు... బాబు మోసాలపై ఒక్కటంటే ఒక్క కథనాన్ని కూడా అచ్చేయలేదు మరి.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement