వెలిగొండ రెండో టన్నెల్‌లో ముమ్మరంగా జరుగుతున్న పనులు
ఆలమూరు రామగోపాలరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు నీటిని తరలించడానికి వీలుగా 18.8 కి.మీల పొడవున మొదటి సొరంగం, హెడ్ రెగ్యులేటర్ పనులను 2021 నాటికే ప్రభుత్వం పూర్తిచేసింది.
కన్వేయర్ బెల్ట్ తెగిపోతుండటం, టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)లో సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో.. ఓ వైపు టీబీఎంతో సొరంగం తవ్వుతూనే మరోవైపు మనుషులతో తవ్వకం పనులు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది దిశానిర్దేశం చేశారు. దీంతో 2022–23లో 5.52 కి.మీల పొడవున సొరంగం తవ్వి.. ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు సృష్టించారు. మరోవైపు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నల్లమలసాగర్ పూర్తయింది. దీని నుంచి తీగలేరు కెనాల్‌ను అనుసంధానిస్తూ 550 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవల ప్రభుత్వం పూర్తిచేసింది.
అలాగే, తీగలేరు కెనాల్‌కు నల్లమలసాగర్ నుంచి నీటిని విడుదల చేయడానికి వీలుగా హెడ్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేసింది. తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్‌తో అనుసంధానం చేస్తూ 150 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవలే పూర్తిచేసిన ప్రభుత్వం.. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకూ శ్రీకారం చుట్టింది. యుద్ధప్రాతిపదికన తొలిదశ పనులను పూర్తిచేసి.. ఈ ఏడాది నల్లమలసాగర్‌కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వడివడిగా అడుగులేస్తున్నారు.
వెలి‘గొండంత’ చిత్తశుద్ధి..
వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,37,300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. అక్కడి 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చవచ్చు. అందుకే ఈ ప్రాజెక్టును ఆ మూడు జిల్లాల ప్రజల వరదాయినిగా అభివర్ణిస్తారు.
– నిజానికి.. 1996లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినా పనులు చేపట్టలేదు.
– పైగా.. 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.పది లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. అదీ శంకుస్థాపన సభ కోసమే.
– 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు.
– శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు రోజుకు 3,001 క్యూసెక్కులు తరలించేందుకు ఒక సొరంగం తవ్వేలా 1994లో డీపీఆర్‌ను మహానేత వైఎస్ సమూలంగా మార్చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజులు తగ్గిన నేపథ్యంలో.. రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా రెండు సొరంగాలు తవ్వేందుకు డీపీఆర్‌ను తయారుచేయించారు.
– ఇలా శ్రీశైలానికి వరద వచ్చే 43 రోజుల్లోనే వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్‌ను నింపాలన్నది మహానేత వైఎస్ ఆలోచన.
– ఇక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తిచేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా 23 కిమీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేందుకు ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. అలాగే, తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు.
చంద్రబాబు వెలి‘గొండంత’ దోపిడీ
విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును దోపిడికి అడ్డాగా మార్చుకున్నారు. అప్పటి నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎంల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు దండుకున్నారు. మళ్లీ 2018, 2019 నాటికి పూర్తిచేస్తామన్న చంద్రబాబు.. కమీషన్లు వసూలుచేసుకుని, ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు.
సీఎం జగన్ హయాంలో వడివడిగా..
మహానేత వైఎస్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా సీఎం వైఎస్ జగన్ ఆది నుంచి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబర్‌లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను పూర్తిచేయించారు.
– రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. కానీ, సీఎం జగన్ వీటిని రద్దుచేసి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన మేఘా సంస్థకు పనులు అప్పగించారు.
– రెండో సొరంగంలో టీబీఎంకు కాలంచెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దీంతో.. మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ చెప్పడంతో అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్విస్తున్నారు.
– ఇక 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున సొరంగం తవ్వారు. ఇది వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో రికార్డని ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఏఈ అనుదీప్ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం రోజుకు 12 మీటర్ల మేర పనులు చేస్తున్నామని.. ఆగస్టు నాటికి రెండో సొరంగంలో మిగిలిన 1.889 కిమీల పనులను పూర్తిచేస్తామన్నారు.
– మరోవైపు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్‌కు తరలించేందుకు 23 కిమీల పొడవున తవ్విన ఫీడర్ ఛానల్‌ను పటిష్టం చేసే పనులను చేపట్టామని.. ఆగస్టు నాటికి వాటిని పూర్తిచేస్తామని ఆ పనులను పర్యవేక్షిస్తున్న డీఈ ఆవుల లక్ష్మి చెప్పారు.
– అలాగే, నల్లమలసాగర్ నుంచి తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువకు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులు ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని ఈఈ రమణ తెలిపారు.
పునరావాసం పనులు వేగవంతం
నల్లమలసాగర్‌లో 11 గ్రామాలు ముంపుకు గురవుతాయి. వీటిల్లోని 7,318 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటికే 96 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగతా 7,222 నిర్వాసిత కుటుంబాలకు రూ.868.27 కోట్లతో పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేశారు. అలాగే, వెలిగొండ ప్రాజెక్టు కోసం 24,158.56 ఎకరాల భూమి అవసరం. ఇందులో ఇప్పటికే 20,760.47 ఎకరాల భూమిని సేకరించారు. మిగిలిన భూమిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.679.79 కోట్లను వ్యయంచేసి.. పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులు పెట్టిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇంజినీరింగ్ అద్భుతం..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపున ఉన్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ప్రకాశం జిల్లాలో పశ్చిమాన నల్లమల పర్వతశ్రేణుల్లో కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ కాంక్రీట్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటోంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ తవ్వుతున్న రెండు సొరంగాలు ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు.
ఈ ఏడాదే తొలిదశ పూర్తి
ఈ ప్రాజెక్టు తొలిదశను ఈ ఏడాదే పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేశాం. ఇప్పటికే తొలి సొరంగం పూర్తయింది. ఫీడర్ ఛానల్ సిద్ధంగా ఉంది. నల్లమలసాగర్ పూర్తయింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది పది టీఎంసీలను నల్లమలసాగర్‌లో నిల్వచేస్తాం. ఆ తర్వాత 30 టీఎంసీలు.. చివరగా 53.85 టీఎంసీలను నిల్వచేస్తాం.
– సి. నారాయణరెడ్డి, ఈఎన్‌సీ
మహానేత ముందుచూపునకు నిదర్శనం
శ్రీశైలంలో 840 అడుగుల నీటి మట్టం నుంచే సొరంగాల ద్వారా వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు నీటిని తరలించవచ్చు. 879 అడుగుల స్థాయిలో శ్రీశైలంలో నీరునిల్వ ఉంటే.. పూర్తి సామర్థ్యం మేరకు రోజుకు 11,583 క్యూసెక్కులను నల్లమలసాగర్‌కు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే 40–43 రోజుల్లోనే నల్లమలసాగర్‌ను నింపేలా ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపునకు తార్కాణం.
– మురళీనాథ్‌రెడ్డి, సీఈ, ప్రకాశం జిల్లా
సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధివల్లే..
ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధివల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతోంది. టీబీఎంలకు కాలం చెల్లడం, కన్వేయర్ బెల్ట్‌లు పనిచేయకపోవడంవల్ల సొరంగాల తవ్వకం 2014 నుంచి ముందుకు కదల్లేదు. మనుషుల ద్వారా సొరంగాలను తవ్వాలని సీఎం జగన్ నిర్ణయంవల్లే ఇప్పుడు ఆ పనులు పూర్తవుతున్నాయి. 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున తవ్వాం. ప్రాజెక్టు చరిత్రలో ఇదో రికార్డు.
– అబూ తలీమ్, ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment