సాక్షి, అమరావతి: శాసన రాజధాని అమరావతికి రాజమార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉండవల్లి అవుట్ ఫాల్ స్లూయిజ్ నుంచి ఎన్–13 రహదారి వరకు 15.52 కిలోమీటర్ల పొడవున.. కృష్ణానది కుడి కరకట్టను వెడల్పు చేసి, పటిష్టపరచి రెండు వరుసల (డబుల్ లేన్) రోడ్డును నిర్మించడానికి నడుంబిగించింది. రూ.149.5 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ పనులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రహదారి నిర్మాణానికి అవసరమైన కేంద్ర పర్యావరణశాఖ, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), రివర్ కన్జర్వేటర్ తదితర అనుమతులను తీసుకోవడం ద్వారా రహదారి పనులను వేగంగా పూర్తిచేసేందుకు జలవనరులశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీకి రాజమార్గాన్ని నిర్మించడం ద్వారా శాసన రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విజయవాడ నుంచి అమరావతి దారేది?
కృష్ణానది కుడి కరకట్ట పక్కన నదీ గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు కరకట్టపై ఒక వరుస రోడ్డుపైనే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయానికి రాకపోకలు సాగించేవారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. విజయవాడతో అమరావతిని అనుసంధానం చేసేలా రోడ్డు నిర్మించే ఆలోచన కూడా చేయలేదు. కళ్లెదుట కనిపిస్తున్న.. రోజూ రాకపోకలు సాగించే రహదారినే అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నానంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం. కరకట్టపై ఒకే వరుస రోడ్డు ఉండటం వల్ల శాసన రాజధాని అమరావతికి రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. దీన్ని గమనించిన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన విజయవాడతో అమరావతిని అనుసంధానం చేసేలా రాజమార్గం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సమతుల అభివృద్ధే లక్ష్యంగా..
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఐదేళ్లు హడావుడి చేసిన చంద్రబాబు చివరకు విజయవాడ నుంచి అమరావతికి కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కల్పించలేక చేతులెత్తేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రిక ఒప్పందాలను గౌరవించి సమతుల అభివృద్ధే ధ్యేయంగా అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తూ చట్టం చేసింది. శాసన రాజధాని అమరావతి అభివృద్ధికి నడుంబిగించింది. అందులో భాగంగానే.. విజయవాడ నుంచి అమరావతికి కృష్ణానది కరకట్ట మీదుగా రాజమార్గం నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపట్టింది.
రూ.149.5 కోట్లతో అసెంబ్లీకి రాజమార్గం
Published Wed, Jun 30 2021 3:18 AM | Last Updated on Wed, Jun 30 2021 3:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment