సాక్షి, అమరావతి: ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఫలాలను అందించే దిశగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారనడానికి మరో తార్కాణమిది. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో సొరంగం పనులను శరవేగంగా కొలిక్కి తెస్తోంది. ఇప్పటికే 17.924 కి.మీ. పొడవున సొరంగం తవ్వకం పనులు పూర్తి కాగా మిగతా 876 మీటర్ల పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేసేలా ముమ్మరం చేసినట్లు సీఈ మురళీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు.
శ్రీకారం చుట్టిన వైఎస్సార్
ఈ ఏడాదే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌కు తరలించి తొలి దశ పూర్తి చేసే దిశగా పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్‌లో నిల్వ చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టి పడియ కాలువ ద్వారా 9,500, గుండ్ల బ్రహ్మేశ్వరం రిజర్వాయర్ ద్వారా 3,500, రాళ్లవాగు ద్వారా 1,500) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో దివంగత వైఎస్సార్ 2004 అక్టోబర్ 27న వెలిగొండకు శ్రీకారం చుట్టారు.
జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్‌తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులను పూర్తి చేశారు. సొరంగాలను నల్లమల సాగర్‌తో అనుసంధానించి 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు.
ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు..
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక 1996 లోక్‌సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే అదికూడా శంకుస్థాపన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. 2014లో మళ్లీ అధికారంలో ఉండగా వెలిగొండను చంద్రబాబు కామధేనువులా మార్చుకున్నారు.
రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి లేకపోవడం గత సర్కారు లూటీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ని వర్తింపజేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా రూ.650 కోట్లకుపైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు రాబట్టుకున్నారు.
2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిచ్చిన చంద్రబాబు చివరకు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి అంచనా వ్యయాన్ని పెంచేశారు. అనంతరం వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు.
స్వప్నాన్ని సాకారం చేస్తున్న సీఎం వైఎస్ జగన్
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దివంగత వైఎస్సార్ చేపట్టిన వెలిగొండను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేశారు. శ్రీశైలం నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తి చేశారు.
► గత సర్కారు అంచనా వ్యయం పెంచిన రెండో సొరంగంలో మిగిలిన పనులను రద్దు చేసిన సీఎం జగన్ వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. నాడు టీడీపీ సర్కార్ నిర్దేశించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువ వ్యయంతో పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ. సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు.
► వైఎస్సార్ హయాంలోనే నల్లమల పర్వత శ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో విస్తరించిన వెలిగొండ కొండల మధ్య సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద కాంక్రీట్ ఆనకట్టలు నిర్మించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్‌ను పూర్తి చేశారు.
► శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్‌కు తరలించేందుకు వీలుగా 23 కి.మీ. పొడవున ఫీడర్ ఛానల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
► వెలిగొండ పనులకు ఇప్పటిదాకా రూ.953.12 కోట్లను వ్యయం చేసి ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేసేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు.
► రెండో సొరంగంలో కాలం చెల్లిన టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) స్థానంలో గతేడాది మనుషుల ద్వారా పనులను చేపట్టారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద మనుషుల ద్వారా సొరంగాన్ని తవ్విస్తున్నారు. ఇప్పటికే 6.822 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేసింది. మిగిలిపోయిన మరో 876 మీటర్ల పనులు అక్టోబర్‌లోగా పూర్తవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment