గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి నా జీవితాశయం
నదుల అనుసంధానం ఏపీకి గేమ్ ఛేంజర్
మూడునెలల్లో డీపీఆర్, టెండర్లు.. హైబ్రీడ్ విధానంలో పనులు
సీఎం చంద్రబాబు వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ సీఎం చంద్రబాబు ఎత్తేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూపంలో రూ.1,100 కోట్లు వెరసి రూ.3,900 కోట్లు విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లను చెల్లించడం లేదు. సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ స్వర్ణాంధ్ర విజన్–2047 పేరుతో సీఎం చంద్రబాబు మరో నాటాకానికి తెరతీశారు. రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతిని నిర్మిస్తానని ప్రకటనలు చేస్తూనే.. రోజుకో పిట్టకథ చెబుతూ ఆ నాటకాన్ని రక్తికట్టించడం ద్వారా ప్రజలను ఏమార్చేందుకు పూనుకున్నారు.
అందులో భాగంగా సోమవారం విజన్–2047 డాక్యుమెంట్‌లో పది సూత్రాల్లో ఒకటైన నీటి భద్రతపై వెలగపూడిలోని సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి–బనకచర్ల గోదావరి జలాలను రాయలసీమలోని బనకచర్లకు తరలించి.. తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశమయంటూ జనం చెవిలో పువ్వు పెట్టారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవానికి గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు 2019లోనే నాటి సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేశారు. గోదావరిలో ఏటా సగటున సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల్లో 280 టీఎంసీలను ఈ ప్రాజెక్టు ద్వారా తరలించాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)పై 2019, డిసెంబరు 20న నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాప్కోస్, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో కనిష్ఠ వ్యయంతో ఒడిసి పట్టి.. దుర్భిక్ష ప్రాంతాలకు తరలించడం ద్వారా కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో 2014–19 మధ్య ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ మ్యాన్యువల్‌ను తుంగలో తొక్కి పనులు చేపట్టడం ద్వారా నాటి సీఎం చంద్రబాబు సృష్టించిన విధ్వంసాన్ని వైఎస్ జగన్ చక్కదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా.. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తూ.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి వైఎస్ జగన్ ప్రణాళిక రచించారు.
పోలవరంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తోటపల్లి తదితర ప్రాజెక్టులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపడితే– వాటిని తానే ప్రారంభించినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ రూపొందించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు కూడా తన మానసపుత్రికగా
చంద్రబాబు చెప్పుకోవడంపై నీటిపారుదలరంగ నిపుణులు నివ్వెరపోతున్నారు.
మూడేళ్లలో ‘బనకచర్ల’?
మూడేళ్లలో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించేలా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించి.. తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంబర్ అవుతుందన్నారు. నదుల అనుసంధానంతో భావి తరాలకు నీటి సమస్య ఉండదని చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్‌లోని పది సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయే మూడువేల టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిసిపడతామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని.. పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చని చంద్రబాబు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
వెలుగొండతో ‘ప్రకాశం’లో కరువుకు చెక్..
ఇక వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ప్రకాశం జిల్లాలో కరువును అరికట్టవచ్చు. భావితరాలకు ఉపయోగపడే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజల్లో చర్చ జరగాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,112 కోట్లు అవసరమవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు హైబ్రీడ్ విధానంలో ప్రైవేటు సంస్థ భాగస్వామ్యం ద్వారా నిధులు సమకూర్చుకోవడంపై ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే ప్రాజెక్టు గురించి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించా. డీపీఆర్ పూర్తిచేసి.. పనులకు రెండు మూడు నెలల్లో టెండర్లు పిలుస్తాం. సకాలంలో నిధులు అందితే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. గత పాలకుల అసమర్థత, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నాం.
క్యూఆర్ కోడ్‌తో ప్రజాభిప్రాయ సేకరణ
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాలను సేకరించి అందుకు తగ్గట్టుగా అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆలయాలకు వెళ్లే భక్తులు, ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఆస్పత్రులకు వచ్చే రోగుల వరకు ప్రభుత్వ సేవలపై అభిప్రాయం తెలుసుకోవాలన్నారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో రూ.860 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతులపైనా ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్నారు. తద్వారా ఏవైనా ఫిర్యాదులు, అసంతృప్తి ఉంటే దానికి గల కారణాలను విశ్లేíÙంచి పనులు మెరుగుపర్చాలన్నారు. దీపం పథకం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేస్తున్నారా.. లేదా.. అనేది జీపీఎస్ అనుసంధానం ద్వారా తెలుసుకోవాలని, మద్యం బెల్టు షాపులు ఎక్కడైనా ఉన్నాయా అన్న సమాచారాన్ని ప్రజల నుంచి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్‌లలో సీసీ కెమెరాలు, వాహనాల జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరగాలని, ఇక నుంచి పాలనలో గేరు మార్చబోతున్నామని, వేగం పెంచుతామని అన్నారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment