banakacharla
-
బనకచర్ల నిర్మాణం అక్రమం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ఏపీ చేపట్టిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు.. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు–1980కి పూర్తి విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకున్నా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ వేగవంతం చేసిందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ అక్రమ ప్రాజెక్టును తక్షణమే ఏపీ విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి బోర్డు పారదర్శకతను పాటించడం లేదని తీవ్రంగా తప్పుబట్టింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) 17వ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. ఈ సందర్భంగా గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై వాడీవేడిగా సుదీర్ఘమైన చర్చ జరిగింది. చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ట్రిబ్యునల్ అవార్డును కాలరాయడమే.. ‘పోలవరం ప్రాజెక్టులో భాగంగా చెరో 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి, ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతించగా, ఇప్పటికే చెరో 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు కాల్వలను నిర్మించి ఉల్లంఘనలకు పాల్పడ్డారు. గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా కుడికాల్వ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించడం ట్రిబ్యునల్ అవార్డును కాలరాయడమే. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) పలు సమావేశాల్లో చేసిన తీర్మానాలకు సైతం పూర్తి విరుద్ధం..’అని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేశారు..సొరంగాలు నిర్మించారు ‘ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన పల్నాడు కరువు నివారణ పథకం కింద ఇప్పటికే రూ.1000 కోట్లు విలువైన పనులు చేశారు. 20వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న రెండు సొరంగాలను సైతం నిర్మించినట్టుగా సమాచార హక్కు చట్టం కింద ఏపీ ప్రభుత్వమే మాకు సమాచారం ఇచి్చంది. సత్వరమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దీనికోసం అమరావతి జల హారతి పేరుతో కార్పొరేషన్‌ను సైతం స్థాపించింది..’అని తెలిపారు. ‘బనకచర్ల’ప్రాజెక్టు డీపీఆర్‌ను తమకు సమర్పించాలని, అనుమతులొచ్చాకే పనులు జరపాలని గోదావరి బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ చెప్పగా, డీపీఆర్ తయారీ పూర్తైన తర్వాత సమరి్పస్తామని ఏపీ ఈఎన్సీ బదులిచ్చారు. గోదావరి బోర్డులో గోప్యత ఎందుకు? ‘బనకచర్ల’ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున గోదావరి జలాలను గుంటూరు జిల్లాలో నిర్మించనున్న బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ఈ అక్రమ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు, నిధులు ఇవ్వరాదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ..కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రతిపాదనలతో పాటు తెలంగాణ ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వం గోదావరి బోర్డుకు తదుపరి చర్యల కోసం పంపిస్తే, ఆ వివరాలను మాకు తెలియజేయలేదు. మా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు తీవ్ర నష్టాన్ని కలిగించనున్న ‘బనకచర్ల’విషయంలో గోదావరి బోర్డు పారదర్శకతను పాటించలేదు..’అని తెలంగాణ అధికారులు ధ్వజమెత్తారు. బోర్డులో సభ్యులైన తమకు ఇలాంటి విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని రాహుల్ బొజ్జా స్పష్టం చేయగా, ఆ అవసరం లేదని బోర్డు సభ్య కార్యదర్వి ఎ.అజగేషన్ వాదించారు. ఏపీ సైతం ఆయనకు మద్దతు తెలిపింది. పెద్దవాగు మరమ్మతులకు ఓకే.. గతేడాది వర్షాలతో గండిపడిన రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకి రూ.15 కోట్లతో 5 అదనపు గేట్లను ఏర్పాటు చేసి రెండు నెలల్లోగా తాత్కాలిక మరమ్మతులు నిర్వహించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరిచాయి. సభ్య కార్యదర్శిపై విచారణకు త్రిసభ్య కమిటీ గోదావరి బోర్డులో రెండు రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులను బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారంటూ సమావేశంలో తెలంగాణ, ఏపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల విభాగాల చీఫ్ ఇంజనీర్లు, గోదావరి బోర్డు నుంచి మరో అధికారితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నిజనిర్థారణ జరిపించాలంటూ తెలంగాణ చేసిన ప్రతిపాదనకు బోర్డు చైర్మన్ అంగీకారం తెలిపారు. సమావేశం ఎజెండాలో బోర్డు పెట్టిన పరిపాలన, ఆర్థికపరమైన ప్రతిపాదనలతో రెండు రాష్ట్రాలు తీవ్రంగా విబేధించాయి. 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా 16 ప్రాజెక్టుల నిర్వహణను తమకి అప్పగించాలని గోదావరి బోర్డు కోరగా, రెండు రాష్ట్రాలూ అంగీకరించలేదు. సమావేశంలో తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్ కుమార్, డీడీ సుబ్రమణ్యం ప్రసాద్ కూడా పాల్గొన్నారు. -
నేడు ‘బనకచర్ల’పై చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో కీలక చర్చ జరగనుంది. జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు 17వ సమావేశం జరగనుంది. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్.. ఏపీ తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొని వాదనలు వినిపించనున్నారు. గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలతో పాటు నాగార్జునసాగర్ నుంచి కృష్ణా వరద జలాలను తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించనున్న బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి వేస్తామని ఏపీ ప్రతిపాదించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రూ.80 వేల కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తామని ఏపీ చెబుతోంది.దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గోదావరి, కృష్ణా బోర్డులతోపాటు కేంద్ర జల్‌శక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, ఇతర వివరాలివ్వాలని గోదావరి బోర్డు ఏపీకి లేఖ రాయగా ఇంతవరకు అందించలేదు. సోమవారం నాటి సమావేశంలో ఈ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. సాగర్ కుడికాల్వ సామర్థ్యం పెంచడం ద్వారా కృష్ణా వరద జలాలను బొల్లపల్లి రిజర్వాయర్కి తరలిస్తామని ఏపీ చేసిన ప్రతిపాదనతో సాగర్ కింద తెలంగాణలో ఉన్న ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుల అప్పగింతపై చర్చగోదావరి పరీవాహకంలోని మొత్తం 16 ప్రాజెక్టుల నిర్వహణను గోదావరి బోర్డుకు అప్పగించాలని 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సైతం గోదావరి బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని, దానిని మినహా ఇతర ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని ఇప్పటికే తెలంగాణ తేల్చి చెప్పింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులను అప్పగిస్తే తమ ప్రాజెక్టులు సైతం అప్పగిస్తామని ఏపీ మెలిక పెట్టింది.గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలోని 11 ప్రాజెక్టులు, ఏపీలోని 4 ప్రాజెక్టులు కలిపి గోదావరి బేసిన్‌లోని మొత్తం 15 అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతి పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియలో పురోగతిపై సైతం చర్చ జరగనుంది. తెలంగాణలోని 11 ప్రాజెక్టుల్లో తొమ్మిదింటికి సంబంధించిన 8 డీపీఆర్‌లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం సమర్పించగా, 6 ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు సైతం లభించాయి. అపెక్స్ కౌన్సిల్ అనుమతిస్తే పూర్తిస్థాయి అనుమతులు లభించినట్టే. ఏపీ ఇంతవరకు తమ ప్రాజెక్టుల డీపీఆర్‌లను అనుమతుల కోసం సమర్పించలేదు. -
నేడు గోదావరి బోర్డు సమావేశం
సాక్షి, అమరావతి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో జరగనుంది. గోదావరి–బనకచర్ల అనుసంధానం, అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌ల మదింపు, బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, పెద్దవాగు ఆధునికీకరణ ఈ సమావేశం ప్రధాన అజెండా.జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరగనున్న ఈ 17వ సర్వ సభ్య సమావేశంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను బనకచర్లకు తరలించేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన అనుసంధానంపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్ఎంబీకి లేఖ రాసింది. సర్వ సభ్య సమావేశంలో ఆ అనుసంధానంపై చర్చించాలని కోరింది. -
బనకచర్ల, ఆర్‌ఎల్‌ఐపై ‘సుప్రీం’కు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఆర్ఎల్ఐ)లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం నీటి ఒప్పందాల ఉల్లంఘననేనని అన్నారు. వీటివల్ల తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు, తాగునీటికి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులను అడ్డుకునేలా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గాను న్యాయ నిపుణులు, సాగునీటి శాఖ స్టాండింగ్ కౌన్సిల్స్‌తో పాటు అడ్వొకేట్ జనరల్‌తో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం జలసౌధలో సాగునీటి శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించి ‘బనకచర్ల’, ఆర్ఎల్ఐ ఈ రెండు ప్రాజెక్టులపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. వేగవంతమైన, సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపక్రమించిందని చెప్పారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను రక్షించేందుకు సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడతామన్నారు. గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) చేసిన పంపకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలను కూడా బనకచర్ల ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందని, కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ల నుంచి రావాల్సిన అనుమతులు కూడా రాలేదని చెప్పారు.ఆర్ఎల్ఐ పథకం విషయంలోనూ పర్యావరణ నిబంధనలు, నీటి నిల్వ తదితర విషయాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కోరిన అనంతరం నిపుణుల కమిటీ ఈ పథకం పనులు నిలిపివేయాలని ఆదేశించిందని, అయినా ఏపీ ప్రభుత్వం ఇతర రూపాల్లో ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు.దానివల్ల భద్రాచలానికీ ప్రమాదం గోదావరి వరదను రాయలసీమకు తరలించడం ద్వారా టెంపుల్ సిటీ అయిన భద్రాచలానికి కూడా ప్రమాదం పొంచి ఉందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. వరదలు సహజంగా ప్రవహించే స్థితి కోల్పోయేలా ఏపీ ప్రభుత్వం ముందుకెళుతోందని, భద్రాచలం చుట్టూ గోడ కట్టడం ద్వారా వరదల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం రాకుండా కేంద్ర సాయాన్ని కోరతామని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికను తొలగించే పనులకు త్వరలోనే టెండర్లు పిలవాలని, ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడతామని చెప్పారు. సమీక్షలో సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. -
బనకచర్లకు గోదారెలా?
-
మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ సీఎం చంద్రబాబు ఎత్తేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూపంలో రూ.1,100 కోట్లు వెరసి రూ.3,900 కోట్లు విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లను చెల్లించడం లేదు. సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ స్వర్ణాంధ్ర విజన్–2047 పేరుతో సీఎం చంద్రబాబు మరో నాటాకానికి తెరతీశారు. రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతిని నిర్మిస్తానని ప్రకటనలు చేస్తూనే.. రోజుకో పిట్టకథ చెబుతూ ఆ నాటకాన్ని రక్తికట్టించడం ద్వారా ప్రజలను ఏమార్చేందుకు పూనుకున్నారు.అందులో భాగంగా సోమవారం విజన్–2047 డాక్యుమెంట్లో పది సూత్రాల్లో ఒకటైన నీటి భద్రతపై వెలగపూడిలోని సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి–బనకచర్ల గోదావరి జలాలను రాయలసీమలోని బనకచర్లకు తరలించి.. తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశమయంటూ జనం చెవిలో పువ్వు పెట్టారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవానికి గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు 2019లోనే నాటి సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేశారు. గోదావరిలో ఏటా సగటున సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల్లో 280 టీఎంసీలను ఈ ప్రాజెక్టు ద్వారా తరలించాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)పై 2019, డిసెంబరు 20న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాప్కోస్, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో కనిష్ఠ వ్యయంతో ఒడిసి పట్టి.. దుర్భిక్ష ప్రాంతాలకు తరలించడం ద్వారా కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో 2014–19 మధ్య ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ మ్యాన్యువల్‌ను తుంగలో తొక్కి పనులు చేపట్టడం ద్వారా నాటి సీఎం చంద్రబాబు సృష్టించిన విధ్వంసాన్ని వైఎస్ జగన్ చక్కదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా.. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తూ.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి వైఎస్ జగన్ ప్రణాళిక రచించారు. పోలవరంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తోటపల్లి తదితర ప్రాజెక్టులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపడితే– వాటిని తానే ప్రారంభించినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ రూపొందించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు కూడా తన మానసపుత్రికగా చంద్రబాబు చెప్పుకోవడంపై నీటిపారుదలరంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. మూడేళ్లలో ‘బనకచర్ల’?మూడేళ్లలో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించేలా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించి.. తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంబర్ అవుతుందన్నారు. నదుల అనుసంధానంతో భావి తరాలకు నీటి సమస్య ఉండదని చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్‌లోని పది సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయే మూడువేల టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిసిపడతామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని.. పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చని చంద్రబాబు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..వెలుగొండతో ‘ప్రకాశం’లో కరువుకు చెక్..ఇక వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ప్రకాశం జిల్లాలో కరువును అరికట్టవచ్చు. భావితరాలకు ఉపయోగపడే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజల్లో చర్చ జరగాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,112 కోట్లు అవసరమవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు హైబ్రీడ్ విధానంలో ప్రైవేటు సంస్థ భాగస్వామ్యం ద్వారా నిధులు సమకూర్చుకోవడంపై ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే ప్రాజెక్టు గురించి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించా. డీపీఆర్ పూర్తిచేసి.. పనులకు రెండు మూడు నెలల్లో టెండర్లు పిలుస్తాం. సకాలంలో నిధులు అందితే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. గత పాలకుల అసమర్థత, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నాం. క్యూఆర్ కోడ్‌తో ప్రజాభిప్రాయ సేకరణప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాలను సేకరించి అందుకు తగ్గట్టుగా అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆలయాలకు వెళ్లే భక్తులు, ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఆస్పత్రులకు వచ్చే రోగుల వరకు ప్రభుత్వ సేవలపై అభిప్రాయం తెలుసుకోవాలన్నారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో రూ.860 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతులపైనా ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్నారు. తద్వారా ఏవైనా ఫిర్యాదులు, అసంతృప్తి ఉంటే దానికి గల కారణాలను విశ్లేíÙంచి పనులు మెరుగుపర్చాలన్నారు. దీపం పథకం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేస్తున్నారా.. లేదా.. అనేది జీపీఎస్ అనుసంధానం ద్వారా తెలుసుకోవాలని, మద్యం బెల్టు షాపులు ఎక్కడైనా ఉన్నాయా అన్న సమాచారాన్ని ప్రజల నుంచి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్‌లలో సీసీ కెమెరాలు, వాహనాల జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరగాలని, ఇక నుంచి పాలనలో గేరు మార్చబోతున్నామని, వేగం పెంచుతామని అన్నారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలన్నారు. -
బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి నీరు విడుదల
పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి ఆదివారం 1125 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో ఎస్ఆర్బీసీకి 1050 క్యూసెక్కులు, కేసీసీ 75 క్యూసెక్కులు విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటి విడుదల నిలిపివేశామన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ వెల్లడించారు. -
ఎస్ఆర్బీసీకి 1,700 క్యూసెక్కులు విడుదల
బానకచెర్ల (పాములపాడు) : మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి ఆదివారం ఎస్ఆర్బీసీకి 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు నుంచి 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. ఇందులో తెలుగుగంగకు 300, కేసీసీకి 400 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
బానకచెర్ల నుంచి 4వేల క్యూసెక్కులు విడుదల
పాములపాడు : మండల పరిధిలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి సోమవారం 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సీఈ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. అలాగే ఎస్సార్బీసీకి 1800 క్యూసెక్కులు, కెసీసీకి 700, టీజీపీకి 1500 క్యూసెక్కుల చొప్పున దిగువకు వదిలామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఎస్సార్‌ఎంసీ దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.