సాక్షి, అమరావతి: కరోనా వంటి విపత్కర కాలంలోనూ రాష్ట్ర బడ్జెట్‌లో అన్నదాతకు ప్రభుత్వం అండగా నిలిచింది. గత ఏడాది కన్నా మిన్నగా కేటాయింపులను ప్రతిపాదిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భోజన విరామం తర్వాత సభ మంగళవారం సా.4.25 గంటలకు ప్రారంభమైనప్పుడు మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ‘నేను రైతు పక్షపాతిని, నాది రైతు ప్రభుత్వం’ అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటలను’ ఉటంకిస్తూ మొదలైన ప్రసంగం సుమారు అరగంటసేపు సాగింది. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఇప్పటికే చేపట్టిన అన్ని పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని పథకాలను మంత్రి ప్రతిపాదించారు.
► మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేసి కమీషన్ వ్యాపారులను కట్టడి చేసేలా ఈ ఏడాది కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు.
► రైతు పండించే పంటల్ని ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్ జనతా బజార్లను ప్రారంభిస్తామన్నారు.
► ప్రతి గ్రామంలో గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు.
► రాయలసీమలో ప్రకృతి వ్యవసాయ పరిశోధన, శిక్షణ, విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామన్నారు.
► ఆహార శుద్ధికి కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు కన్నబాబు వివరించారు.
ముఖ్యాంశాలు ఇలా..
► చెప్పిన దానికంటే ఎక్కువగా వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయాన్ని ఇస్తున్నాం. ఇప్పటికే రూ.10,209.32 కోట్లను జమ చేశాం
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కౌలు రైతులు లబ్ధిపొందేలా చర్యలు చేపట్టాం. కౌలు రైతులకిచ్చే పెట్టుబడి సాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే
ఇస్తున్నాం.
► వ్యవసాయ మార్కెటింగ్‌కు పెద్దపీట వేసేలా రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేశాం. లాక్‌డౌన్ సమయంలో రూ.2,215 కోట్లతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాం.
► వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు నూతన విధానాన్ని తీసుకువచ్చాం.
► దళారుల నియంత్రణకు త్వరలో కొత్తచట్టాన్ని తీసుకువస్తాం.
► వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం, ఏఎంసీల అధ్యక్షులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాదే.
► రైతుభరోసా కేంద్రాలతో అన్నదాతలకు సమగ్ర సేవలు.
► వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలుకు ఈ ఏడాది ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
► విత్తనాలు, ఎరువుల నాణ్యత నిర్ధారణకు వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటు.
► చిన్న, సన్నకారు, కౌలు రైతులకు మేలు చేసేలా వైఎస్సార్ వడ్డీలేని పంట రుణాలు.
► రైతు సంక్షేమం కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లు
► విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్–155251 ఏర్పాటు
► శీఘ్రగతిన వ్యవసాయ మండళ్ల ఏర్పాటు
► త్వరలో విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ల నియామకం
► రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి రైతు ఆదాయం పెంపు.
► ఉద్యాన వర్శిటీ నుంచి కొత్త వంగడాల రూపకల్పన
► బైవోల్టిన్ పట్టు పరిశ్రమ ప్రోత్సాహానికి చర్యలు.. ‘ఉపాధి’ పథకం కింద మల్బరీ తోటల పెంపకం
► 147 నియోజకవర్గస్థాయి పశువ్యాధి నిర్ధారణా కేంద్రాల ఏర్పాటు
► మత్స్యకారుల ప్రమాద బీమా హెచ్చింపు, డీజిల్ ఆయిల్‌పై సబ్సిడీ పెంపు
► జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీఎస్‌పీసీ నుంచి రూ.70.53 కోట్ల చెల్లింపు
► సహకార రంగ సంస్కరణకు చర్యలు, త్వరలో కంప్యూటరీకరణ
► పగటి పూట ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
► వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేసి బంజరు భూములను వ్యవసాయ భూములుగా మారుస్తాం.
► ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా వచ్చే ప్యాకేజీలన్నింటినీ ఉపయోగించుకుంటాం. పెద్దఎత్తున నిధులు వచ్చేలా ఏర్పాట్లుచేస్తున్నాం.
► 2019–20లో రికార్డ్ స్థాయిలో 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి
రాజన్న బిడ్డ వచ్చిన వేళ..
‘బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ’.. అనే జన సామాన్య సామెతను నిజం చేసేలా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ వచ్చిన వేళ రాష్ట్రంలో వ్యవసాయం కళకళలాడుతోందని మంత్రి కన్నబాబు చెప్పినప్పుడు సభ చప్పట్లతో మార్మోగింది. జగన్ వచ్చిన వేళ రాష్ట్రం అత్యధిక ఆహార ఉత్పత్తులను సాధించిందని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన పాలకుడు ఎప్పటికీ రాజనీతిజ్ఞుడు కాలేడని ఏనాడో సోక్రటీస్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. ఒత్తిడి లేని వ్యవసాయమనేది సీఎం సంకల్పమన్నారు.
సీఎం సంకల్ప బలం.. ప్రకృతి సహకారం
సీఎం వైఎస్ జగన్ సంకల్పం, ప్రకృతి సహకారంతో రాష్ట్ర వ్యవసాయ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. దానికి నిదర్శనమే మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్. 2019–20లో రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ.2,27,974.99 కోట్లయితే వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు రూ.28,866.23 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్‌లో అది 12.66 శాతం. 2020–21లో ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం వల్ల మొత్తం బడ్జెట్‌ను గత ఏడాది కంటే 1.4 శాతం తగ్గించారు. దీంతో ఈ ఏడాది దానిని రూ.2,24,789.18 కోట్లకు కుదించినా వ్యవసాయానికి మాత్రం ప్రాధాన్యత కల్పించారు. ఈ ఏడాది వ్యవసాయానికి రూ.29,159.97 కోట్లు ప్రతిపాదించారు. అంటే మొత్తం బడ్జెట్‌లో ఇది 12.97 శాతం. వరుసగా రెండో ఏడాది కూడా రెండంకెల శాతం నిధులు వ్యవసాయానికి కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, అగ్రి మిషన్ వైస్ చైర్మన్
ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించని పక్షంలో ప్రభుత్వమే రంగంలోకి దిగి ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో భారీగా రూ.3 వేల కోట్లను కేటాయించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణాలకు సైతం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. లాక్‌డౌన్ కాలంలో పంటల సేకరణకు ధరల స్థిరీకరణ నిధి ఎంతగానో ఉపయోగపడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌లో రూ.3,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
► ప్రస్తుతం 22 ఈ–నామ్ మార్కెట్లు రైతులకు సేవలందిస్తున్నాయి. వీటికి తోడు మరో 12 ఈ–నామ్ మార్కెట్లను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంటలకు మంచి ధర కల్పించేలా ఈ–నామ్‌లో ఎక్కువ మంది రైతుల పేర్లను నమోదు చేయించాలని భావిస్తోంది.
► ప్రస్తుతం 130 రైతు బజార్లు ఉండగా.. ఈ ఏడాది 29 రైతు బజార్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
► మొత్తంగా ధరల స్థిరీకరణ నిధి, ఇతర ఖర్చుల నిమిత్తం మార్కెటింగ్ శాఖకు రూ.3,110 కోట్లను కేటాయించారు.
సహకార శాఖకు చేయూత
► సహకార శాఖకు రూ.248.38 కోట్ల మేర బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
► రాష్ట్రంలో 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేయనున్నారు.
► సహకార సంఘాల పరిధిలోని గోదాములకు మరమ్మతులు చేయడంతోపాటు కొత్తగా 70 గోదాములు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
► తూర్పు గోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఐసీడీపీ ప్రాజెక్టులను అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.
► తద్వారా 1,761 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 5 లక్షల మంది రైతులు, కౌలుదారులకు ప్రయోజనం కలగనుంది.
► సహకార పరపతి సంఘాలకు ఆర్థిక సాయం కింద రూ.1.25 కోట్లు, ఐసీడీపీ ప్రాజెక్టులకు ఆర్థిక సాయంగా రూ.11.65 కోట్లు, కో–ఆపరేటివ్ ట్రైనింగ్‌కు రూ.5.66 కోట్లు కేటాయించారు.
► ఎన్‌సీడీసీ ప్రాజెక్ట్ స్కీమ్‌ల అమలుకు రూ.74.74 కోట్లు, ఎన్‌సీడీసీ ప్రాజెక్టులకు రుణం కింద రూ.12.84 కోట్లు, ఇతర ఖర్చులు, జీతాల నిమిత్తం రూ.142.24 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.
రైతు సంక్షేమానికి ఊతం
వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి సర్కారు తగినన్ని నిధులు కేటాయించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సేవలు అందించడానికి బడ్జెట్ ఊతమిచ్చింది. రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అందుకనుగుణంగానే బడ్జెట్ సాగింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచడానికి అనేక ప్రతిపాదనలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయి. గిట్టుబాటు ధరలు దక్కడానికి సమపాళ్లలో ప్రాధాన్యత కల్పించిందీ బడ్జెట్.
– అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్
విద్యుత్తుకు పవర్!
విద్యుత్ రంగానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.6,949.65 కోట్లు కేటాయించింది. 2018–19తో పోలిస్తే ఇది రూ.4,811.43 కోట్లు ఎక్కువ. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట విద్యుత్‌కు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేసేందుకు వీలుగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రధానంగా ప్రస్తావించారు.
► అత్యధిక ఓల్టేజీ పంపిణీ విధానం (హెచ్‌వీడీఎస్) ద్వారా లో వోల్టేజీ లేకుండా విద్యుత్ సరఫరా కోసం పంపిణీ, సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తారు. కడప, అనంతపురంలో పవన విద్యుత్ విస్తరణ చేపడతారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలను విద్యుదీకరిస్తారు.
► బడ్జెట్ కేటాయింపులే కాకుండా ట్రాన్స్‌కో చేపట్టే పలు ప్రాజెక్టులకు రుణాలు పొందేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఇందులో విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ కూడా ఉంది. విద్యుత్ సరఫరా బలోపేతానికి 132, 220, 33 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల ఏర్పాటు చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి వివిధ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇప్పిస్తారు.
► 9 గంటల ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం రూ.4,500 కోట్లు కేటాయించింది. రబీ నాటికి వంద శాతం ఫీడర్ల ద్వారా సరఫరా కోసం ప్రత్యేకంగా లైన్లు, సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పశు సంవర్థక, మత్స్యశాఖకు.. రూ. 1,280 కోట్లు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే పశు సంవర్థక, మత్స్య శాఖలకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,280.11 కోట్లు కేటాయించింది. పశు సంవర్థక శాఖకు రూ.980.48 కోట్లు.. మత్స్యశాఖకు 299.63 కోట్లు ప్రతిపాదించింది. వ్యవసాయం తరువాత పశుపోషణ ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశు నష్టపరిహారం, రాజన్న పశువైద్యం, పశు విజ్ఞానబడి వంటి పథకాలను అమల్లోకి తెచ్చింది. అలాగే, రైతుభరోసా కేంద్రాల్లో పశువులకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి గత ఏడాది పశు సహాయకులను నియమించింది.
పాల ఉత్పత్తిని పెంచేందుకు పలు పథకాలు.. పాల ఉత్పత్తి సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది. అంతేకాక.. 3.50 కోట్ల పశువులకు వాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. పాలు, కోడిగుడ్లు, మాంసం ఉత్పత్తులను గత ఏడాది కంటే 20 శాతం అధికంగా పెంచాలని లక్ష్యంగా తీసుకుంది. ఇక తీర ప్రాంతాన్ని ఉపాధికి నెలవుగా మార్చేందుకు ఒకవైపున ఆక్వాసాగు ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా వారి ఉపాధి కోసం హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నిర్మించాలని నిర్ణయించింది. శాశ్వత ప్రాతిపదకన వీటిని నిర్మించనుంది. ఇందుకు బడ్జెట్‌లో అవసరమైన కేటాయింపులు చేసింది.
కేటాయింపులు ఇలా..
నవరత్నాల్లో భాగంగా ఆవులు, గేదెలు,గొర్రెలు చనిపోయినప్పుడు పోషకులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వైఎస్సార్ పశు నష్టపరిహారం పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకానికి రూ.50 కోట్లను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment