
సాక్షి, అమరావతి: ఆయా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో శుక్రవారం నైపుణ్య శిక్షణకు సంబంధించిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. స్థానికంగా ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అవసరాలకు సరిపోయేలా ఈ కార్యక్రమాలు రూపొందించినట్లు చెప్పారు. వివిధ రంగాల నిపుణులు, విద్యా సంస్థలు పేరుగాంచిన శిక్షణా భాగస్వాముల ద్వారా యువతలో నైపుణ్యాలు, నైపుణ్యాల స్థాయిని పెంచుతున్నట్లు తెలిపారు. అత్యాధునిక నైపుణ్య కోర్సులను అందించడానికి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కళాశాలలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. తిరుపతి వద్ద స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు.
విజ్ఞాన కేంద్రాలుగా ఆర్బీకేలు
మరో ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 10,778 రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయన్నారు. ఆ కేంద్రాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటుచేస్తున్నామని, శాస్త్రవేత్తల సూచనలు అక్కడి నుంచే అందించే ఏర్పాటు చేశామన్నారు. పొలం బడుల్ని వాటికి అనుసంధానం చేశామన్నారు. అంతేకాక.. రైతులకు సంబంధించిన అన్ని సేవల్ని ఈ కేంద్రాల ద్వారా అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇవి అన్ని రకాల పంటలకు సేకరణ కేంద్రాలుగా కూడా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment