కృష్ణా జిల్లా కంకిపాడులో అగ్రి ల్యాబ్‌ను పరిశీలిస్తున్న ఎఫ్‌ఏఓ బృందం
సాక్షి, అమరావతి/కంకిపాడు/ఉయ్యూరు: సుస్థిర వ్యవసాయ–ఆహార వ్యవస్థలను ఏర్పర్చుకోవడంతోపాటు రాష్ట్రంలోని రైతుల్లో సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టనున్న టెక్నికల్ కోఆపరేషన్ ప్రాజెక్టు (టీసీపీ) కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టులో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) భాగస్వామిగా వ్యవహరించనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఎంఓయూ కార్యక్రమంలో ఎఫ్‌ఏఓ కంట్రీ హెడ్ టోమియో షిచిరీ, ఐసీఏఆర్ డెప్యుటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్‌కుమార్ సింగ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్యలు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కింద వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే)ను మరింత బలోపేతం చేయడానికి రానున్న రెండేళ్లపాటు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించనున్నారు. అంతర్జాతీయంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వచ్చే నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు..శాస్త్రవేత్తలకు శిక్షణనివ్వనున్నారు.
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు : సీఎం జగన్
గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు, చర్యలతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు వస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గతంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల వాడకంతో రైతులు తీవ్రంగా నష్టపోయే వారన్నారు. నాణ్యమైన.. ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్ తీసుకొచ్చామన్నారు. ప్రతీ పంటకు, ప్రతీ రైతుకు మద్దతు ధర లభించేలా కృషిచేస్తున్నామని.. పగడ్బందీగా అమలుచేస్తున్న ఈ–క్రాపింగ్ ద్వారా వాస్తవ సాగుదారులకు మేలు జరుగుతుందన్నారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలకు అంతర్జాతీయ ప్రశంసలు దక్కడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో సేంద్రీయ పాలసీనీ తీసుకొస్తున్నామని తెలిపారు.
ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియో సందర్శన
అంతకుముందు.. కృష్ణాజిల్లా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియో, పెనమలూరు మండలం వణుకూరు ఆర్బీకే కేంద్రాన్ని ఎఫ్‌పీఓ కంట్రీ హెడ్ టోమియో షిచిరీ తమ బృందంతో సందర్శించారు. ఆర్బీకేలోని డిజిటల్ లైబ్రరీ, సీడ్ టెస్టింగ్ కిట్, కియోస్క్ తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలను ఆరా తీశారు. ధాన్యం సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించి ఉయ్యూరు మండలం బోళ్లపాడులో రైతులతో ముచ్చటించారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లతో మాట్లాడి ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఆర్బీకేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయంటూ వారంతా కితాబిచ్చారు. అనంతరం నగరంలోని ఓ హోట్‌ల్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆర్బీకే సేవలను వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖ కమిషనర్లు హెచ్ అరుణ్‌కుమార్, డాక్టర్ ఎస్‌ఎస్ శ్రీధర్, కే. కన్నబాబు, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్‌లు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎఫ్‌పీఓ–ఐసీఏఆర్ బృందానికి వివరించారు. శాఖల వారీగా అందిస్తున్న సేవలపై ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను వారంతా తిలకించారు.
ఆర్బీకేలు ప్రపంచానికే రోల్‌మోడల్
ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదని ఎఫ్‌పీఓ కంట్రీ హెడ్ టోమియో షిచిరీ అన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో రైతులకు సేవలందించేందుకు ఏర్పాటుచేసిన ఆర్బీకే వ్యవస్థను విప్లవాత్మక మార్పులకు రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్స్ సరఫరా చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటేడెట్ అగ్రి ల్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియోల ఏర్పాటు వినూత్న ఆలోచన అన్నారు. వీటి ద్వారా రైతులకు మరింత చేరువయ్యేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయన్నారు.
ఆర్బీకేల బలోపేతానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిన ఆర్బీకే వ్యవస్థను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలుచేసేలా సిఫార్సు చేస్తామని ఐసీఎఆర్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏకే సింగ్ అన్నారు. ఆర్బీకేలతో పాటు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియోలను ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. జాతీయ స్థాయిలో అమలుచేయాల్సిన కార్యక్రమాలెన్నో ఇక్కడ అమలుచేస్తున్నారని చెప్పారు. బృందం వెంట ఎఫ్‌ఏఓ ప్రతినిధి డాక్టర్ సి కొండారెడ్డి, సీనియర్ ఫుడ్ సేప్టీ అండ్ న్యూట్రిషన్ ఆఫీసర్ ధర్మపురి శ్రీధర్, జాతీయ వ్యవసాయ ధ్రువీకరణ నిపుణుడు నచికేత్ ఉడుప, ఐïసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ జేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment