సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారింది. మరీ ముఖ్యంగా ముగింపు దశలోని ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు భారీగా తగ్గాయి. మరో రూ.వెయ్యికోట్లు కేటాయించినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కానీ, ప్రభుత్వం కేవలం రూ.87 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు. కోయిల్‌సాగర్‌ల కింద మొత్తంగా 8.78 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 6.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తిచేయగా, మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన పనుల పూర్తికి, 12 శాతం మేర మిగిలిన భూసేకరణకు రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి ప్రాజెక్టుకు కనిష్టంగా రూ.400 కోట్లు కేటాయించాలని కోరినా కేవలం రూ.4 కోట్లతో సరిపెట్టారు.
ఈ ప్రాజెక్టు కింద పనులకు సంబంధించి రూ.70 కోట్లు, భూసేకరణకు సంబంధించి రూ.17 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ ప్రాజెక్టు కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే 3 లక్షల ఎక రాల కు నీరిచ్చే అవకాశాలుండగా, మిగతా ఆయకట్టు ను వచ్చే ఏడాదికి సిద్ధం చేయాల్సి ఉంది. ఈ నిధులతో అధి సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక భీమా, నెట్టెంపాడుల పరిధిలోనూ పెండింగ్ బిల్లులు రూ.33 కోట్ల మేర ఉన్నాయి. భూసేకరణకు మరో రూ.17 కోట్లు అవసరం. వీటి కింద నిర్ణయించిన చెరో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే కనిష్టంగా రూ.400 కోట్లు అవసరంకాగా కేవలం రూ.50 కోట్లు కేటాయించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్.. ప్రాణహిత మూలకే..
ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ)లోని టన్నెల్ పనులు గాడిన పడే అవకాశం కనబడటం లేదు. పనుల పూర్తికి నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడమే దీనికి కారణం. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా, మరో 10 కి.మీ లకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది.
రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కి.మీ. టన్నెల్ పూర్తవగా తర్వాత ఐదేళ్లలో 9 కి.మీ. మేర తవ్వారు. కన్వేయర్ బెల్ట్, ఇతర యంత్రాలను మార్చాల్సి రావడంతో వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ఏజెన్సీకి రూ.80 కోట్లను అడ్వాన్సు కింద చెల్లించాలని ప్రతిపాదన వచ్చినా తుది రూపం తీసుకోలేదు. పనులకు సంబంధించి రూ.80 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులకు రూ.22 కోట్లు, భూసేకరణకు రూ.270 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దృష్ట్యా ప్రాజెక్టుకు రూ.300 కోట్ల మేర కేటాయింపులు కోరినా రూ. 17.31 కోట్లను మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ్మిడిహెట్టి కాకుండా దానికి ఎగువన వార్ధా నదిపై దీన్ని నిర్మించాలని భావిస్తుండ టంతో ప్రభుత్వం కేటాయింపులు తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment