ప్రతిపక్షాలు లేకుండానే ‘పుర’ బడ్జెట్
► రూ. 2404.13లక్షల బడ్జెట్‌కు ఆమోదం
► బడ్జెట్‌ను తిరస్కరించిన ప్రతిపక్షాలు
► ఎస్సీ, ఎస్టీ నిధులు ఖర్చు చేయడం లేదని అధికార పార్టీ సభ్యుడి వాకౌట్
వనపర్తిటౌన్ : పుర ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏర్పాటు చేసిన వనపర్తి పుర బడ్జెట్ ప్రతిపక్షాల వాకౌట్‌కు వేదికయింది. శుక్రవారం పుర చైర్మన్ పలుస రమేష్‌గౌడ్ అధ్యక్షతన మునిసిపల్ కౌన్సిల్‌హాల్‌లో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలోనే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎన్. జ్యోతి మాట్లాడుతూ బడ్జెట్ తప్పులతడకగా రూపొందించారని, బడ్టెట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఎన్.
భువనేశ్వరి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశం ఎప్పుడో జరగాల్సి ఉన్న ఇప్పుడు ఏర్పాటు చేయడం సిగ్గుచేటని బడ్జెట్‌ను ఆమోదించామన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ ఉంగ్లం తిరుమల్ మాట్లాడుతూ అవినీతికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉందని, వార్షిక బడ్జెట్‌ను కేవలం ఆరు నెలలకు కుదించి రూపొందించారని ఆరోపించారు. బడ్జెట్‌లో సమగ్రత లోపించినందున ప్రతిపక్ష సభ్యులమంతా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. చైర్మన్ రమేష్‌గౌడ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సభ్యులు వాకౌట్ చేశారు. ప్రతిపక్షాల వాకౌట్‌ను టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ గట్టుయాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంకెల తప్పును ప్రతిపక్షాలు బడ్జెట్‌ను తప్పు అనడం సరికాదని హితవు పలికారు.
అధికార సభ్యుడి వాకౌట్‌పై విస్మయం
ఎస్సీ, ఎస్టీ సభ్యులకు కేటాయిస్తున్న సబ్‌ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన సభ్యుడు వెంకటేష్ సభ నుంచి దళిత ప్రజాప్రతినిధులం వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనను అనుసరించాలనుకున్న సభ్యులు కమలమ్మ. ప్రమీలను మిగతా సభ్యులు వారించారు.
వైస్ చైర్మన్ వాకౌట్
వైస్ చైర్మన్ బి.కృష్ణ మాట్లాడుతూ అధికారుల లావాదేవీలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ఆరోపిస్తున్న తరుణంలో కలుగజేసుకున్న టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ గట్టుయాదవ్ మీ పార్టీ వాళ్లు(బీజేపీ) వ్యతిరేకించారు. మీరు వ్యతిరేకిస్తున్నారా.. సమర్థిస్తున్నారా.. అని అడగడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటల రగడ జరిగినా చివరకు వైస్ చైర్మన్ సభ నుంచి వాకౌట్ చేశారు.
బడ్జెట్ చదవకుండానే అమోదం
అధికార పార్టీ సభ్యుడు వాకిటి శ్రీధర్ బడ్జెట్ ప్రతిని చదవాల్సిన అవసరం లేదని చెప్పడంతో 1/3పైగా మెజార్టీ గల అధికార పార్టీ సభ్యులు బడ్జెట్‌కు ఏకగ్రీవకంగా అమోదం తెలపడంతో రూ. 2404.13 లక్షల బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు చైర్మన్ రమేష్‌గౌడ్ ప్రకటించారు. సభ ముగిసిన తర్వాత మినిట్స్‌లో వ్యతిరేకించిన సభ్యుల పేర్లు రాయాలని ప్రతిపక్షాలు అడగడంతో కమిషనర్ రాత పూర్వకంగా ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో సభ్యులకు, కమిషనర్‌కు మధ్య నిబంధనలపై చిన్నపాటిగా మాటమాట పెరిగినప్పటికీ చివరకు ప్రతిపక్ష సభ్యులు దగ్గరుండి మినిట్స్‌లో పేర్లు నమోదు చేయించారు.