సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ఎప్పటిలాగే అగ్రపీఠం దక్కింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసేలా, చిన్న నీటి వనరులకు పునరుత్తేజం ఇచ్చేలా బడ్జెట్‌లో రూ.22,500 కోట్ల మేర కేటాయించింది. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.20,120.34 కోట్లు, మైనర్‌కు రూ.2,379.66కోట్లు కేటాయించింది. అయితే.. గత మూడేళ్ల బడ్జెట్‌తో పోలిస్తే సాగునీటిపారుదల రంగానికి ఈ ఏడాది రూ.2,250 కోట్లమేర కేటాయింపులు తగ్గాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తుండటం, దీనికి ఇదివరకే ఏర్పాటు చేసిన కార్పోరేషన్ ద్వారా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌ను తగ్గించినట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి.
తగ్గిన కేటాయింపు: గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో భారీ ప్రాజెక్టులకు రూ.21,890 కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది దాన్ని రూ.20.120.34కోట్లకు కుదించారు. సుమారు ఇక్కడే రూ.1,770కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. మైనర్ ఇరిగేషన్ కింద గతేడాది రూ.2,743కోట్లు కేటయింపులు జరపగా, ఈ ఏడాది అవి రూ.2,371కోట్లకు తగ్గింది. ఇక్కడ రూ.364కోట్ల మేర తగ్గింది. ఇక గతేడాది 2018–19 ఏడాదిలో సాగునీటికి రూ.25వేల కోట్లు కేటాయింపులు జరగ్గా, జనవరి 31 నాటికి రూ.21,489 కోట్లు ఖర్చు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ.12,739.67కోట్ల మేర రుణాలు తీసుకుని బిల్లులు చెల్లించారు. ఇక సీతారామ, దేవాదుల, ఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్సారెస్పీ–2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.13వేల కోట్లు రుణాల ద్వారానే ఖర్చు చేసింది.
ఈ ఏడాది సైతం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో రూ.10,430కోట్ల నిధులను కార్పోరేషన్ రుణాల ద్వారానే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌లో ప్రాజెక్టులవారీగా కేటాయింపుల వివరాలు వెల్లడించనప్పటికీ, భారీ ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకే ఎక్కువ నిధులు దక్కనున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.5,898 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, రూ.5,500 కోట్ల మేర ఆర్థికశాఖ కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తర్వాతి స్థానంలో పాలమూరు–రంగారెడ్డికి రూ.2,732 కోట్లతో ప్రతిపాదనలు చేయగా, రూ.2,500 కోట్లకు ఓకే చెప్పినట్లుగా సమాచారం. దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులకు సైతం వెయ్యి కోట్లకు పైగా కేటాయింపులు ఉంటాయని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక నిర్మాణ చివరి దశలో ఉన్న పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు రూ.1,085కోట్ల మేర బడ్జెట్ కోరగా, వీటికి పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో దేవాదుల, ఎస్సారెస్పీ–2, కాళేశ్వరం, వరదల కాల్వ, ఎల్లంపల్లి దిగువన మెజార్టీ ఆయకట్టుకు నీళ్లివ్వాలని ప్రభుత్వం ఇదివరకే లక్ష్యం నిర్ణయించినందున వాటికి అవసరాలకు తగ్గట్లే మొత్తం బడ్జెట్‌లో కేటాయింపులు జరుగనున్నాయి.
గొలుసుకట్టు చెరువులకు ఊతం
రాష్ట్రంలో ఇప్పటిరవకు మిషన్ కాకతీయ కింద 20,171 చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. అయితే ఈ ఏడాది నుంచి కొత్తగా గొలుసుకట్టు చెరువులను అభివృధ్ది చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గొలుసుకట్టు కింద 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువు నిండి, కింది చెరువు వరకు నీరు పారే విధంగా కాల్వలను బాగు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచే కాల్వల ద్వారా చెరువులు నింపే కార్యాచరణ సిద్ధమవుతోంది. దీనికోసం మైనర్ ఇరిగేషన్ కింద 2,377.66 కోట్లు కేటాయించారు. ఇందులో 1,200 కోట్ల వరకు గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికే కేటాయించనుండగా, మిగతా నిధులు చెక్‌డ్యామ్‌లు, ఐడీసీలోని ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment