Large projects
-
సాగునీటికి నిధుల వరద
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో సాగునీటి రంగానికి ఎప్పటిలాగే అగ్రపీఠం దక్కింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసేలా, చిన్న నీటి వనరులకు పునరుత్తేజం ఇచ్చేలా బడ్జెట్లో రూ.22,500 కోట్ల మేర కేటాయించింది. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.20,120.34 కోట్లు, మైనర్‌కు రూ.2,379.66కోట్లు కేటాయించింది. అయితే.. గత మూడేళ్ల బడ్జెట్‌తో పోలిస్తే సాగునీటిపారుదల రంగానికి ఈ ఏడాది రూ.2,250 కోట్లమేర కేటాయింపులు తగ్గాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తుండటం, దీనికి ఇదివరకే ఏర్పాటు చేసిన కార్పోరేషన్ ద్వారా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌ను తగ్గించినట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. తగ్గిన కేటాయింపు: గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో భారీ ప్రాజెక్టులకు రూ.21,890 కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది దాన్ని రూ.20.120.34కోట్లకు కుదించారు. సుమారు ఇక్కడే రూ.1,770కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. మైనర్ ఇరిగేషన్ కింద గతేడాది రూ.2,743కోట్లు కేటయింపులు జరపగా, ఈ ఏడాది అవి రూ.2,371కోట్లకు తగ్గింది. ఇక్కడ రూ.364కోట్ల మేర తగ్గింది. ఇక గతేడాది 2018–19 ఏడాదిలో సాగునీటికి రూ.25వేల కోట్లు కేటాయింపులు జరగ్గా, జనవరి 31 నాటికి రూ.21,489 కోట్లు ఖర్చు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ.12,739.67కోట్ల మేర రుణాలు తీసుకుని బిల్లులు చెల్లించారు. ఇక సీతారామ, దేవాదుల, ఎఫ్ఎఫ్సీ, ఎస్సారెస్పీ–2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.13వేల కోట్లు రుణాల ద్వారానే ఖర్చు చేసింది. ఈ ఏడాది సైతం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో రూ.10,430కోట్ల నిధులను కార్పోరేషన్ రుణాల ద్వారానే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్లో ప్రాజెక్టులవారీగా కేటాయింపుల వివరాలు వెల్లడించనప్పటికీ, భారీ ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకే ఎక్కువ నిధులు దక్కనున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.5,898 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, రూ.5,500 కోట్ల మేర ఆర్థికశాఖ కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తర్వాతి స్థానంలో పాలమూరు–రంగారెడ్డికి రూ.2,732 కోట్లతో ప్రతిపాదనలు చేయగా, రూ.2,500 కోట్లకు ఓకే చెప్పినట్లుగా సమాచారం. దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులకు సైతం వెయ్యి కోట్లకు పైగా కేటాయింపులు ఉంటాయని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక నిర్మాణ చివరి దశలో ఉన్న పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు రూ.1,085కోట్ల మేర బడ్జెట్ కోరగా, వీటికి పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో దేవాదుల, ఎస్సారెస్పీ–2, కాళేశ్వరం, వరదల కాల్వ, ఎల్లంపల్లి దిగువన మెజార్టీ ఆయకట్టుకు నీళ్లివ్వాలని ప్రభుత్వం ఇదివరకే లక్ష్యం నిర్ణయించినందున వాటికి అవసరాలకు తగ్గట్లే మొత్తం బడ్జెట్లో కేటాయింపులు జరుగనున్నాయి. గొలుసుకట్టు చెరువులకు ఊతం రాష్ట్రంలో ఇప్పటిరవకు మిషన్ కాకతీయ కింద 20,171 చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. అయితే ఈ ఏడాది నుంచి కొత్తగా గొలుసుకట్టు చెరువులను అభివృధ్ది చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గొలుసుకట్టు కింద 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువు నిండి, కింది చెరువు వరకు నీరు పారే విధంగా కాల్వలను బాగు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచే కాల్వల ద్వారా చెరువులు నింపే కార్యాచరణ సిద్ధమవుతోంది. దీనికోసం మైనర్ ఇరిగేషన్ కింద 2,377.66 కోట్లు కేటాయించారు. ఇందులో 1,200 కోట్ల వరకు గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికే కేటాయించనుండగా, మిగతా నిధులు చెక్‌డ్యామ్‌లు, ఐడీసీలోని ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. -
అప్పుల తిప్పలు!
♦ జీహెచ్ఎంసీ ముంగిట భారీ ప్రాజెక్టులు ♦ నిధుల పరిస్థితి అరకొరే...అప్పు చేయక తప్పదు ♦ ఆర్థిక సంస్థల నుంచి రుణం లేదా బాండ్ల జారీ ♦ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కోసం త్వరలో టెండర్లు సాక్షి, సిటీబ్యూరో: నిధుల కొరతతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీకీ ఇప్పుడు రెండు పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. భారీ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో నిధులు ఎక్కడ నుంచి తేవాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎస్సార్డీపీ), డబుల్ బెడ్రూమ్ ఇళ్లు (2బీహెచ్‌కే)...ఈ రెండు అతి పెద్ద ప్రాజెక్టులు. వీటి కోసం దాదాపు రూ. 2400 కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేయాల్సి ఉండగా...నిధుల విషయంలో మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందడం లేదా బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించడం తప్ప వేరే మార్గం లేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో సోమవారం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే వర్క్‌షాప్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని అధికారులు భావిస్తున్నారు. రెండు భారీ ప్రాజెక్టులు... జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టులు రెండున్నాయి. అవి స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎస్సార్డీపీ), డబుల్ బెడ్రూమ్ ఇళ్లు (2బీహెచ్‌కే). వీటి కోసం దాదాపు రూ. 2400 కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేయాల్సి ఉంది. ఖజానా చూస్తే రోజురోజుకూ దిగజారుతోంది. దీంతో ఖజానాభర్తీకి పంచ‘తంత్రం’ వంటి ప్రణాళికలు రూపొందించిన జీహెచ్ఎంసీ.. వాటి ద్వారా ఆదాయం పెరిగినా భారీ ప్రాజెక్టుల్ని చేపట్టడం మాత్రం సాధ్యంకాదు. సాధారణ పరిపాలనతోపాటు రహదారుల నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాలు, దోమల నివారణ వంటి రెగ్యులర్ పనులు, జీతభత్యాలకే వచ్చే ఆదాయం సరిపోతుంది. భారీ ప్రాజెక్టుల్ని ప్రకటించిన ప్రభుత్వం నిధుల సేకరణ భారం మాత్రం జేహెచ్ఎంసీ నెత్తిన మోపింది. ఇప్పటికే ఆర్టీసీకి రూ.198 కోట్లు చెల్లించాల్సిందిగా ఆదేశించడంతో చెల్లించక తప్పలేదు. ఈ నేపథ్యంలో ఎస్సార్డీపీ, 2బీహెచ్‌కే పనుల కోసం రెండు మార్గాలను జీహెచ్ఎంసీ ఆలోచిస్తోంది. ఒకటి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందడం. రెండోది జీహెచ్ఎంసీ బాండ్లు జారీ చేయడం. ఇందుకుగాను ఇప్పటికే క్రెడిట్ రేటింగ్ జరిపించాలని భావించింది. త్వరలోనే క్రెడింట్ రేటింగ్ జరిపే ఏజెన్సీ ఎంపిక కోసం టెండరు నోటిఫికేషన్ జారీ చేయనుంది. క్రెడిట్ రేటింగ్ పూర్తయ్యాక పై పనుల కోసం జీహెచ్ఎంసీ ఏటా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది.. ? ఆ మేరకు రుణం లేదా బాండ్ల జారీలో ఏది బెటర్? వంటి అంశాలను క్రెడిట్ రేటింగ్ జరిపే సంస్థ సూచిస్తుంది. అందుకనుగుణంగా ఎస్క్రో అకౌంట్లు తెరిచే షరతులతో ఆర్థిక సంస్థలనుంచి రుణం పొందడమో, లేక జీహెచ్ఎంసీ బాండ్లు జారీ చేయడమో చేయనున్నారు. మొత్తానికి ఏదో ఒక రూపేణా అప్పులు చేయక తప్పని పరిస్థితి జీహెచ్ఎంసీకి ఏర్పడింది. రేపు (సోమవారం) జీహెచ్ఎంసీ స్థితిగతులపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జరిగే వర్క్‌షాప్‌లో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గతంలోనూ గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ప్లాన్(జీహెచ్డీపీ) పనుల కోసం దాదాపు రూ. 700 కోట్లు ఆర్థికసంస్థల ద్వారా రుణం తీసుకోవాలని భావించారు. అనంతరం అప్పటి కమిషనర్ సమీర్‌శర్మ మారడంతో సదరు ప్లాన్‌ను అటకెక్కించారు. పి.కె మహంతి కమిషనర్‌గా ఉన్న సమయంలో దాదాపు రూ. 80 కోట్ల నిధుల కోసం ఎంసీహెచ్ బాండ్లు జారీ చేసి సత్ఫలితాలు సాధించారు. దాదాపు దశాబ్దంన్నర తర్వాత తిరిగి బాండ్ల జారీకి సన్నద్ధమవుతున్నారు. ఇందుకు ముందస్తుగా జరిపే క్రెడిట్ రేటింగ్‌కు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, వృత్తిపన్ను వాటా వంటివి రాలేదు. దాంతో జీహెచ్ఎంసీ ఖజానాకు లోటు ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తొలినాళ్లలో కేవలం రూ. 295 కోట్ల ఆస్తిపన్ను మాత్రమే వసూలు కాగా, గత సంవత్సరం రూ. 1025 కోట్లకు పెరగడం విశేషం. -
ఆలోచనలు ఘనం ... ఆచరణ శూన్యం
యడ్లపాడు: మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ప్రాజెక్టులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవి పూర్తయితే బోయపాలెం పారిశ్రామిక హబ్‌గా , కొండవీడుకోట పర్యాటక కేంద్రంగా, చెంఘీజ్‌ఖాన్‌పేట ఆధ్యాత్మిక క్షేత్రంగా మారతాయి. మైదవోలు-వంకాయలపాడు పరిధిలో స్పైసెస్‌పార్కు అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోనే రెండోదిగా నిలవనుంది. బోయపాలెంలో టెక్స్‌టైల్‌పార్కు, చెంఘీజ్‌ఖాన్‌పేటలో ఇస్కాన్ స్వర్ణమందిర నిర్మాణాలకు అప్పటి సీఎం కె. రోశయ్య శంకుస్థాపన చేశారు. ఇవి శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. ఇవిగాక మరికొన్ని ప్రాజెక్టులను ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పాలకులు ఉన్నారు. వివిధ దశల్లో పలు ప్రాజెక్టులు... స్పైసెస్ పార్కు కోసం 124.78 ఎకరాలు కేటాయించగా, టెక్స్టైల్ పార్కుకోసం 108 ఎకరాలను కేటాయించారు. చెంఘీజ్‌ఖాన్‌పేటలో స్వర్ణమందిరం ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘం (ఇస్కాన్)కు 26 ఎకరాల దేవాదాయ భూములను అప్పగించారు. మరో 124 ఎకరాలను దశల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీ భూములు తీసుకోవడం మినహా ఏ ఒక్క పని చేయలేదు. ఇక ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్కాన్ కొండవీడులో ఒక్క గోశాల నిర్మాణం తప్ప మరే పనులను ప్రారంభించలేదు. మూడేళ్ల కిందట కొండవీడు రెవెన్యూలోని చౌడవరం ప్రాంతంలో డంపింగ్‌యార్డు, ఫుడ్పార్కుకోసం ప్రభుత్వం భూములు చూడడం జరిగి ంది. స్థానికుల వ్యతిరేకతతో డంపింగ్‌యార్డు రూరల్ మండలానికి వెళ్లగా, పుడ్‌పార్క్ వ్యవహారం స్థలపరిశీలతోనే నిలిచిపోయింది. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు యోచన... దీర్ఘకాలం నుంచి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు చౌడవరం, ప్రత్తిపాడు రెవెన్యూ పరిధిలోని భూములను ఎంపిక చేశారు. తాజాగా మరో మూడు ప్రాజెక్టుల ఏర్పాటుకు కొండవీడు రెవెన్యూలో భూములను పరిశీలిస్తున్నారు. పుడ్‌ప్రాసెసింగ్ పార్కు కు 300 ఎకరాలు, జేఎన్టీయూ 70 ఎకరాలు, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు మరో ఐదు ఎకరాలు అవసరం అవుతాయని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఇవిగాక ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా శివుడి విగ్రహాన్ని, ధ్యాన మందిరాన్ని 100 ఎకరాలలో నిర్మించాలని భారత సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ ప్రయత్నం చేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 150 అడుగుల విగ్రహాన్ని, అంతర్జాతీయ స్థాయి దళిత యూనివర్సిటీని కొండవీడు ప్రాంతంలోనే స్థాపించాలని ఐడియల్దళిత ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వ దృష్టికి తీసుకువె ళ్లింది. కొండవీడు రెవెన్యూ పరిధిలో ఎమ్మెల్యే క్వార్టర్లు నిర్మించాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. 300 ఎకరాల అటవీ భూములు అవసరమవుతాయని అంచనా వేశారు. ఏపీ స్పిన్నింగ్‌మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టెక్స్‌టైల్‌పార్కు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం కేవలం రాజధాని ప్రాంతాన్నే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించేలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ముందు డిజిటల్ హైదరాబాద్
ఆ తర్వాత డిజిటల్ తెలంగాణ: ‘మెట్రోపొలిస్’ సదస్సులో మంత్రి కేటీఆర్ తెలంగాణ కోసం మావద్ద భారీ ప్రణాళికలున్నాయి గ్లోబల్ కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్ ‘సర్వే’ వివరాలను అవసరమైన మేర ఎన్జీవోలు, సంస్థలతో పంచుకుంటామని వెల్లడి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ల అభివృద్ధికి సంబంధించి తమ వద్ద భారీ ప్రణాళికలు ఉన్నాయని... ముందుగా డిజిటల్ హైదరాబాద్‌ను సాధించి, ఆ తర్వాత రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణగా మారుస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ప్రణాళికలు రూపొంది స్తున్నామని, దాదాపు 40 శాతం ప్రజలు నగరంలోనే ఉన్నందున మెరుగైన జీవనాన్ని అందించేలా చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. డిజిటల్ హైదరాబాద్‌లో భాగంగా శాస్త్ర సాంకేతిక అంశాలను జోడించి.. 360 డిగ్రీల్లో పట్టణ భౌగోళిక స్థితి, పర్యావరణ పటాన్ని ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆవిష్కరించనున్నామని ఆయన తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా అందిన వివరాలతో మెరుగైన రెవెన్యూ పరిపాలనను, ఆస్తిపన్ను వ్యవస్థను నెలకొల్పుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ‘మెట్రోపొలిస్’ సదస్సులో భాగంగా బుధవారం ‘రీ డిఫైనింగ్ అర్బన్ ఎజెండా-బిగ్డేట్, బిగ్ చాలెంజెస్, బిగ్ ఐడియాస్’ అంశంపై ఏర్పాటు చేసిన ప్లీనరీలో మంత్రి కె.తారక రామారావు ప్రసంగించారు. పట్టణ ప్రజలకు అత్యవసర, ఇతర సేవలను మెరుగ్గా అందించేందుకు, పట్టణ పేదలను ఆదుకునే విధంగా పారదర్శకత, కచ్చితత్వంతో ప్రభుత్వం తరఫున చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నగరమని, రాబోయే 20 ఏళ్లలో పట్టణ జీవనం మరింత కుదుపులకు గురవుతుందని, దానిని తట్టుకునే విధంగా విధానాలను రూపొందిస్తామని చెప్పారు. సామాజిక సర్వే ద్వారా అందిన వివరాలకు సాంకేతిక తను జోడించి... ఉద్యోగులు, ప్రజల సహకారంతో కొనసాగే విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందన్నారు. బార్సిలోనా, తదితర నగరాల అనుభవాలను అధ్యయనం చేసి గ్లోబల్ కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ విభిన్నం..! దేశంలోని ఇతర రాష్ట్రాల కంటె తెలంగాణ భిన్నమైనదని, ఇక్కడ 39 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అద్భుతమైన సమాచారం వచ్చిం దని, ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేందుకు దానిని ఉపయోగిస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీల గురించి ఒక్కో వ్యవస్థ ఒక్కో విధంగా విశ్లేషిస్తుందని... అందువల్ల ఏ నగరానికి అనుగుణంగా ఆ నగరం ప్రణాళికలు రూపొందించుకోవాలని వివరించారు. స్మార్ట్ సిటీ కోసం హైదరాబాద్ తన సొంత ఫార్ములాను సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. రాబో యే రోజుల్లో 70 శాతం ప్రజలు పట్టణాల్లో జీవించనున్నారని, అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా రక్షణ, పచ్చదనంతో కూడిన జీవనాన్ని అందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ప్లీనరీకి ఉడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ గ్లోబల్ ఫెలో డా.టిమ్ క్యాంప్‌బెల్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. వరల్డ్ బ్యాంక్ ఇన్స్టి ట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ వికాస్ కనుంగో, బార్సిలోనా మేయర్ జేవియర్ ట్రాయస్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్పెషల్ కమిషనర్ అహ్మద్‌బాబు ప్రసంగించారు. ఆస్తులు, క్రెడిట్‌కార్డుల వివరాలు గోప్యంగా ఉంచుతాం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన వివరాల్లోని ఆస్తులు, క్రెడిట్‌కార్డులు తదితర సమాచారాన్ని ఎవరికీ ఇవ్వబోమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతరత్రా సమాచారాన్ని మాత్రం మెరుగైన సేవల కల్పనకు, అవసరమైన మేర ఎన్జీవోలు, ఇతర సంస్థలతో కలిసి పంచుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. మెట్రో రైలు మార్గాన్ని రాబోయే 15 ఏళ్లలో 200 కిలోమీటర్లకు పెంచుతామని చెప్పారు. రక్షణతో కూడిన, మురికివాడలు లేని, ఫుట్‌పాత్‌లపై ఎవరూ నిద్రించే పరిస్థితి లేని ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. సౌర విద్యుత్‌తో పాటు చెత్త (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) ద్వారా విద్యుత్ ఉత్పాదనను చేపడతామని పేర్కొన్నారు. ఇంటింటి సర్వేలోని అంశాలు, ఎన్జీవోలతో వాటిని పంచుకోవడం, హైదరాబాద్‌లో మెరుగైన సదుపాయాల కల్పన అంశాలపై ప్లీనరీలో నయీం అనే యువకుడు, పద్మజ అనే గృహిణి తదితరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. -
తిరుపతిలో రూ.134 కోట్లతో మల్టీప్లెక్స్
- స్మార్ట్ సిటీ నేపథ్యంలో తెరపైకి వచ్చిన మల్టీప్లెక్స్ నిర్మాణం - పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన ఎస్బీపీఎల్ సంస్థ - కాంప్లెక్స్ పూర్తయితే 4 భారీ సినిమా స్క్రీన్ల్లు, ఫుడ్‌కోర్టు, మాల్స్ తిరుపతి కార్పొరేషన్ : తిరుపతిని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వాణి జ్యపరంగా భారీప్రాజెక్టులు చేపట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. హెదరాబాద్, విశాఖపట్నం తరహాలో తిరుపతిలో భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్టు రూపకల్పనకు తుడా శ్రీకారంచుట్టింది. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి 2 కిలోమీటర్ల లోపున్న తుడా స్థలం అనువైనదిగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు రూ.134 కోట్లతో.. తిరుపతిని స్మార్ట్‌సిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మల్టీకాంప్లెక్స్ నిర్మాణం పనులు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన ఎస్బీపీఎల్ సంస్థ తిరిగి పను లు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. 2009లో అప్పటి లీజు ప్రకారం రూ.114 కోట్లకు ఒప్పుకున్న తుడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అందులో భాగంగా రూ.134 కోట్లతో మెగా షాపింగ్‌మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఎస్బీపీఎల్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై వంద రోజుల్లో ఆసంస్థతో పూర్తిస్థాయిలో అగ్రిమెంట్ చేసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మల్టీప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తుడా అందిస్తుంది. ఈ స్థలంలో నిర్మాణం చేపట్టే సంస్థ 33 సంవత్సరాల వరకు లీజు పద్ధతిలో మల్టీప్లెక్స్ నిర్వహ ణ బాధ్యతలు చేపడుతుంది. వంద రోజుల్లో అగ్రిమెంట్ గతంలో రూ.114 కోట్లతో నిర్మించాలనుకున్న మల్టీప్లెక్స్ నిర్మాణం అనివార్య కారణాలతో ఆగిపోయింది. ప్రస్తుతం అదే సంస్థతో తిరిగి నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వంద రోజుల్లో ఆసంస్థతో అగ్రిమెంట్ చేసుకోనున్నాం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. - ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు,తుడా -
కలిసి చేద్దాం!
భారీ ప్రాజెక్టుల పూర్తికి ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో సంయుక్త కార్యాచరణ ముంబై : నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన భారీ ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ముంబై ట్రాన్స్- హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్), మల్టీ మోడల్ కారి డార్ ప్రాజెక్టులను సంయుక్తంగా పూర్తిచేసేందుకు ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో నిర్ణయించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. సుమారు రూ.12,975 కోట్ల అంచనా వ్యయంతో 126 కి.మీ.ల మేర విస్తరించిన విరార్-అలీబాగ్ మల్టీ-మోడల్ కారిడార్ అభివృద్ధికి, రూ.9,630 కోట్ల అంచనావ్యయంతో 22 కి.మీ. మేర విస్తరించిన ఎంటీహెచ్ఎల్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాగా, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ భారీ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఎమ్మెమ్మార్డీయే తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) వైస్‌చైర్మన్, ఎండీ అయిన సం జయ్ భాటియా తెలిపారు. ఎంటీహెచ్ఎల్లో భాగస్వాములయ్యేందుకు తమ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) నుంచి నిధుల అనుమతుల కోసం ఆ ప్రాజెక్టు ఎదురుచూస్తోందన్నారు. జేఐసీఏ నుంచి ఆ ప్రాజెక్టుకు అనుమతులు లభించడం ఆలస్యమవుతున్న దరిమిలా తాము నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చామన్నా రు. ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్టు కోసం 70 శాతం నిధులను జేఐసీఏ నుంచి పొందేందుకు, మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సాయంతో సమకూర్చుకునేందుకు ఎమ్మెమ్మార్డీయే నిర్ణయించిందని ఆయన తెలిపారు. అయితే జేఐ సీఏ నుంచి నిధుల అనుమతులు అందేందుకు ఏడాదికిపైగానే సమయం పట్టే అవకాశముండటంతో దాన్ని నివారించేందుకు తాము 50 శాతం వాటా నిధులను స్థానికంగానే సమకూర్చేందుకు ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సైతం భాగస్వామి కానున్నదని భాటియా తెలిపా రు. ప్రస్తుత ప్రతిపాదిత నవీముంబై ఎయిర్పోర్ట్ వరకు మల్టీ మోడల్ కారిడార్‌ను అనుసంధానం చేసేం దుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించా రు. దీనిపై ఎమ్మెమ్మార్డీయేతో ఇప్పటికే చర్చించామని, సంబంధిత పనులను ఆ సంస్థ ప్రారంభిస్తే తాము దానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చామన్నారు. ఇదిలా ఉండగా, ఈ రెండు భారీ ప్రాజెక్టుల కోసం ఎమ్మెమ్మార్డీయే ఒక్కొక్కదానికి రూ.25 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఇదే సమయంలో ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో సంస్థల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18వ తేదీన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెమ్మార్డీయే అదనపు మెట్రోపాలిటన్ కమిషనర్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులున్న ఈ కమిటీ పనిచేస్తుంది. ఆయా రీజియన్లలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల అమ లు, ప్రణాళిక రూపకల్పన విషయంలో ఈ రెండు సంస్థలకు సదరు కమిటీ సహాయపడుతుందని భాటియా తెలిపారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టేందుకు ఈ రెండు సంస్థలు ఐక్యంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు గత కొంతకాలంగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో అభివృద్ధి కుం టుపడుతోందని, ఫలితంగా ఉపాధి అవకా శాలు కూడా దెబ్బతింటున్నాయని, తాజాగా తీసు కున్న నిర్ణయంతో అభివృద్ధి పనుల వేగం పెరు గుతుం దని, ఉపాధి అకాశాలు కూడా మెరుగుపడ తాయని నగరవాసులు భావిస్తున్నారు.