అప్పుల తిప్పలు!
♦ జీహెచ్‌ఎంసీ ముంగిట భారీ ప్రాజెక్టులు
♦ నిధుల పరిస్థితి అరకొరే...అప్పు చేయక తప్పదు
♦ ఆర్థిక సంస్థల నుంచి రుణం లేదా బాండ్ల జారీ
♦ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కోసం త్వరలో టెండర్లు
సాక్షి, సిటీబ్యూరో: నిధుల కొరతతో సతమతమవుతున్న జీహెచ్‌ఎంసీకీ ఇప్పుడు రెండు పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. భారీ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో నిధులు ఎక్కడ నుంచి తేవాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎస్సార్‌డీపీ), డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు (2బీహెచ్‌కే)...ఈ రెండు అతి పెద్ద ప్రాజెక్టులు. వీటి కోసం దాదాపు రూ. 2400 కోట్లు జీహెచ్‌ఎంసీ ఖర్చు చేయాల్సి ఉండగా...నిధుల విషయంలో మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందడం లేదా బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించడం తప్ప వేరే మార్గం లేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో సోమవారం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే వర్క్‌షాప్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని అధికారులు భావిస్తున్నారు.
రెండు భారీ ప్రాజెక్టులు...
జీహెచ్‌ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టులు రెండున్నాయి. అవి స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎస్సార్‌డీపీ), డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు (2బీహెచ్‌కే). వీటి కోసం దాదాపు రూ. 2400 కోట్లు జీహెచ్‌ఎంసీ ఖర్చు చేయాల్సి ఉంది. ఖజానా చూస్తే రోజురోజుకూ దిగజారుతోంది. దీంతో ఖజానాభర్తీకి పంచ‘తంత్రం’ వంటి ప్రణాళికలు రూపొందించిన జీహెచ్‌ఎంసీ.. వాటి ద్వారా ఆదాయం పెరిగినా భారీ ప్రాజెక్టుల్ని చేపట్టడం మాత్రం సాధ్యంకాదు. సాధారణ పరిపాలనతోపాటు రహదారుల నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాలు, దోమల నివారణ వంటి రెగ్యులర్ పనులు, జీతభత్యాలకే వచ్చే ఆదాయం సరిపోతుంది. భారీ ప్రాజెక్టుల్ని ప్రకటించిన ప్రభుత్వం నిధుల సేకరణ భారం మాత్రం జేహెచ్‌ఎంసీ నెత్తిన మోపింది.
ఇప్పటికే ఆర్టీసీకి రూ.198 కోట్లు చెల్లించాల్సిందిగా ఆదేశించడంతో చెల్లించక తప్పలేదు. ఈ నేపథ్యంలో ఎస్సార్డీపీ, 2బీహెచ్‌కే పనుల కోసం రెండు మార్గాలను జీహెచ్‌ఎంసీ ఆలోచిస్తోంది. ఒకటి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందడం. రెండోది జీహెచ్‌ఎంసీ బాండ్లు జారీ చేయడం. ఇందుకుగాను ఇప్పటికే క్రెడిట్ రేటింగ్ జరిపించాలని భావించింది.
త్వరలోనే క్రెడింట్ రేటింగ్ జరిపే ఏజెన్సీ ఎంపిక కోసం టెండరు నోటిఫికేషన్ జారీ చేయనుంది. క్రెడిట్ రేటింగ్ పూర్తయ్యాక పై పనుల కోసం జీహెచ్‌ఎంసీ ఏటా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది.. ? ఆ మేరకు రుణం లేదా బాండ్ల జారీలో ఏది బెటర్? వంటి అంశాలను క్రెడిట్ రేటింగ్ జరిపే సంస్థ సూచిస్తుంది. అందుకనుగుణంగా ఎస్క్రో అకౌంట్లు తెరిచే షరతులతో ఆర్థిక సంస్థలనుంచి రుణం పొందడమో, లేక జీహెచ్‌ఎంసీ బాండ్లు జారీ చేయడమో చేయనున్నారు. మొత్తానికి ఏదో ఒక రూపేణా అప్పులు చేయక తప్పని పరిస్థితి జీహెచ్‌ఎంసీకి ఏర్పడింది.
రేపు (సోమవారం) జీహెచ్‌ఎంసీ స్థితిగతులపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జరిగే వర్క్‌షాప్‌లో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గతంలోనూ గ్రేటర్ హైదరాబాద్ డెవలప్‌మెంట్ ప్లాన్(జీహెచ్‌డీపీ) పనుల కోసం దాదాపు రూ. 700 కోట్లు ఆర్థికసంస్థల ద్వారా రుణం తీసుకోవాలని భావించారు. అనంతరం అప్పటి కమిషనర్ సమీర్‌శర్మ మారడంతో సదరు ప్లాన్‌ను అటకెక్కించారు. పి.కె మహంతి కమిషనర్‌గా ఉన్న సమయంలో దాదాపు రూ. 80 కోట్ల నిధుల కోసం ఎంసీహెచ్ బాండ్లు జారీ చేసి సత్ఫలితాలు సాధించారు. దాదాపు దశాబ్దంన్నర తర్వాత తిరిగి బాండ్ల జారీకి సన్నద్ధమవుతున్నారు. ఇందుకు ముందస్తుగా జరిపే క్రెడిట్ రేటింగ్‌కు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
14వ ఆర్థిక సంఘం నిధులు, వృత్తిపన్ను వాటా వంటివి రాలేదు. దాంతో జీహెచ్‌ఎంసీ ఖజానాకు లోటు ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తొలినాళ్లలో కేవలం రూ. 295 కోట్ల ఆస్తిపన్ను మాత్రమే వసూలు కాగా, గత సంవత్సరం రూ. 1025 కోట్లకు పెరగడం విశేషం.