యడ్లపాడు: మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ప్రాజెక్టులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవి పూర్తయితే బోయపాలెం పారిశ్రామిక హబ్‌గా , కొండవీడుకోట పర్యాటక కేంద్రంగా, చెంఘీజ్‌ఖాన్‌పేట ఆధ్యాత్మిక క్షేత్రంగా మారతాయి. మైదవోలు-వంకాయలపాడు పరిధిలో స్పైసెస్‌పార్కు అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోనే రెండోదిగా నిలవనుంది. బోయపాలెంలో టెక్స్‌టైల్‌పార్కు, చెంఘీజ్‌ఖాన్‌పేటలో ఇస్కాన్ స్వర్ణమందిర నిర్మాణాలకు అప్పటి సీఎం కె. రోశయ్య శంకుస్థాపన చేశారు. ఇవి శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. ఇవిగాక మరికొన్ని ప్రాజెక్టులను ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పాలకులు ఉన్నారు.
వివిధ దశల్లో పలు ప్రాజెక్టులు...
స్పైసెస్ పార్కు కోసం 124.78 ఎకరాలు కేటాయించగా, టెక్స్‌టైల్ పార్కుకోసం 108 ఎకరాలను కేటాయించారు. చెంఘీజ్‌ఖాన్‌పేటలో స్వర్ణమందిరం ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘం (ఇస్కాన్)కు 26 ఎకరాల దేవాదాయ భూములను అప్పగించారు.
మరో 124 ఎకరాలను దశల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీ భూములు తీసుకోవడం మినహా ఏ ఒక్క పని చేయలేదు. ఇక ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్కాన్ కొండవీడులో ఒక్క గోశాల నిర్మాణం తప్ప మరే పనులను ప్రారంభించలేదు. మూడేళ్ల కిందట కొండవీడు రెవెన్యూలోని చౌడవరం ప్రాంతంలో డంపింగ్‌యార్డు, ఫుడ్‌పార్కుకోసం ప్రభుత్వం భూములు చూడడం జరిగి ంది. స్థానికుల వ్యతిరేకతతో డంపింగ్‌యార్డు రూరల్ మండలానికి వెళ్లగా, పుడ్‌పార్క్ వ్యవహారం స్థలపరిశీలతోనే నిలిచిపోయింది.
కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు యోచన...
దీర్ఘకాలం నుంచి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు చౌడవరం, ప్రత్తిపాడు రెవెన్యూ పరిధిలోని భూములను ఎంపిక చేశారు. తాజాగా మరో మూడు ప్రాజెక్టుల ఏర్పాటుకు కొండవీడు రెవెన్యూలో భూములను పరిశీలిస్తున్నారు. పుడ్‌ప్రాసెసింగ్ పార్కు కు 300 ఎకరాలు, జేఎన్‌టీయూ 70 ఎకరాలు, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు మరో ఐదు ఎకరాలు అవసరం అవుతాయని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఇవిగాక ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా శివుడి విగ్రహాన్ని, ధ్యాన మందిరాన్ని 100 ఎకరాలలో నిర్మించాలని భారత సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ ప్రయత్నం చేస్తోంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 150 అడుగుల విగ్రహాన్ని, అంతర్జాతీయ స్థాయి దళిత యూనివర్సిటీని కొండవీడు ప్రాంతంలోనే స్థాపించాలని ఐడియల్‌దళిత ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వ దృష్టికి తీసుకువె ళ్లింది. కొండవీడు రెవెన్యూ పరిధిలో ఎమ్మెల్యే క్వార్టర్లు నిర్మించాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. 300 ఎకరాల అటవీ భూములు అవసరమవుతాయని అంచనా వేశారు. ఏపీ స్పిన్నింగ్‌మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టెక్స్‌టైల్‌పార్కు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం కేవలం రాజధాని ప్రాంతాన్నే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించేలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.