సాక్షి, పల్నాడు: దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్‌కి ఏపీ నెలవు కాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని యడ్లపాడు మండలం వంకాయల పాడు గ్రామంలో శుక్రవారం గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
ఈ స్పైసెస్ ఫెసిలిటీ.. పద్నాలుగు వేల మంది రైతులకు గొప్ప వరంగా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు. సుమారు 200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. దాదాపు 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. ఇది మొదటి దశ మాత్రమే. రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ఘనత మనకు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
నవంబర్ 2020లో మొదలుపెట్టి.. ఇప్పుడు కమిషన్ చేయడం దాకా కేవలం 24 నెలల్లోనే అడుగులు పడడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని సీఎం జగన్ ప్రస్తావించారు. రెండో దశ పనుల కోసం ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు సీఎం జగన్. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్‌కు ఇదొక నిదర్శనం. ఈ ఏడాది పారిశ్రామికవేత్తలను అడిగి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడు సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం తీసుకోవడం గొప్ప మార్పుగా సీఎం జగన్ అభివర్ణించారు.
రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశంతో.. రాష్ట్రవ్యాప్తంగా 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 3,450 కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం ప్లాన్ చేసిందని, దీనివల్ల ప్రతీ జిల్లాలో ఉన్న రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని తెలిపారు. ఇవి రైతుల పాలిట వరంగా మారనున్నాయన్నారు. ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుందని తెలిపారు సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment