Yadlapadu
-
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇదొక నిదర్శనం
సాక్షి, పల్నాడు: దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్‌కి ఏపీ నెలవు కాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జిల్లాలోని యడ్లపాడు మండలం వంకాయల పాడు గ్రామంలో శుక్రవారం గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ స్పైసెస్ ఫెసిలిటీ.. పద్నాలుగు వేల మంది రైతులకు గొప్ప వరంగా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు. సుమారు 200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. దాదాపు 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. ఇది మొదటి దశ మాత్రమే. రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ఘనత మనకు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 2020లో మొదలుపెట్టి.. ఇప్పుడు కమిషన్ చేయడం దాకా కేవలం 24 నెలల్లోనే అడుగులు పడడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని సీఎం జగన్ ప్రస్తావించారు. రెండో దశ పనుల కోసం ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు సీఎం జగన్. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్‌కు ఇదొక నిదర్శనం. ఈ ఏడాది పారిశ్రామికవేత్తలను అడిగి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడు సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం తీసుకోవడం గొప్ప మార్పుగా సీఎం జగన్ అభివర్ణించారు. రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశంతో.. రాష్ట్రవ్యాప్తంగా 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 3,450 కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం ప్లాన్ చేసిందని, దీనివల్ల ప్రతీ జిల్లాలో ఉన్న రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని తెలిపారు. ఇవి రైతుల పాలిట వరంగా మారనున్నాయన్నారు. ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుందని తెలిపారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్
Updates 12:35PM మైనార్టీ దినోత్సవంలో సీఎం జగన్ స్పీచ్ ►నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి ►మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు మరువలేనివి ►ముస్లింల్లో పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్ ►పదవుల నుంచి సంక్షేమం వరకూ అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం ►ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాం ►నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చాం ►శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవిని మైనార్టీకి కేటాయించాం ►మూడేళ్లలో మైనార్టీలకు డీబీటీ ద్వారా రూ. 10,309 కోట్లు అందించాం ►నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 10 వేల కోట్లు అందించాం ►చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు రూ. 2,665 కోట్లు ఇస్తే..మూడేళ్లలోనే మేము రూ. 20 వేల కోట్లకు పైగా ఇచ్చాం ►వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం ►ఇప్పటికే అన్యాక్రంతమైన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాం ►ఈ ప్రభుత్వం మీది అని మర్చిపోవద్దు 12:17PM గుంటూరు: మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ 11:06AM గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ ►ఐటీసీ సంస్థకు అభినందనలు ►ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ వల్ల వేలాది మంది రైతులకు మేలు కలుగుతుంది ►ఇదొక వండర్ ఫుల్ మూమెంట్ ►సుమారు 200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు ►15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు ►రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గరే ఉంటుంది ►ఈ యూనిట్ 14 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నా ►24 నెలల్లోనే యూనిట్ ను పూర్తి చేశారు ►ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇదొక నిదర్శనం ►మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది ►3450 కోట్లతో ప్రతీ జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాం ►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ►మొదటి దశ కింద 1250 కోట్లతో 10 యూనిట్లకు డిసెంబర్ , జనవరి నెలల్లో శంకుస్థాపన ►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయి ►రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ప్రాసెసింగ్ చేసే విధానం చాలా బాగుంది ►ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుంది ►ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుంది ►ఏ చిన్న సమస్య ఉన్నా... ఒక్క ఫోన్ చేసినా చాలు వెంటనే స్పందిస్తాం 10:37AM ►వంకాయలపాడు సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ►గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌కు ప్రారంభోత్సవం 10:01AM ►వంకాయలపాడు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ►పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ► ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఐటీసీ.. రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అందుబాటులోకి తేనుంది. ► సుమారు 6.2 ఎకరాల్లో ఈ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేయనుంది. ► సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఈ గ్లోబల్ స్పైసెస్ పార్క్‌కు. పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ► గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి, వేగంగా విస్తరించింది. ► సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభ కార్యక్రమ అనంతరం.. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. ఆపై గుంటూరు మెడికల్ కళాశాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..
సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రమాదవశాత్తు చెరువులో బైక్‌తో సహా పడి.. రాత్రంతా నిస్సాహాయంగా అక్కడే ఉండిపోయిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీ చెందిన రాజుపాలెం ప్రసాద్ (22) రాడ్‌బెండింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. ఈనెల 20వ తేదీన ఉన్నవకు వచ్చిన తన స్నేహితుడిని బైక్‌పై కొప్పర్రు గ్రామంలో విడిచి రాత్రి 11.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. కొప్పర్రు దాటి అరకిలోమీటరు దూరంలోకి రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. సమీపంలోని చెరువులోకి నేరుగా దూసుకెళ్లింది. చెరువులో పడ్డ ప్రసాద్ మీద బైక్ పడటంతో తిరిగి లేవలేకపోయాడు. ప్రమాదం నుంచి రక్షించమని కోరేందుకు ఇరువురుకి ఫోన్ చేయగా అర్థరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ ఎత్తలేదు. చెరువు నీటిలో తడవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ప్రసాద్ రాత్రంతా చెరువులోనే బైక్ కింద నిస్సహాయంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ వైపుగా పొలం పనులకు వెళ్తున్న రైతులు గమనించి చెరువు నుంచి బయటకు తీశారు. వివరాలను అడిగి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించి, 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పెదనందిపాడు పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో ఉన్నవకు తీసుకువచ్చారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') ఆ తండ్రి బాధ తీర్చలేనిది.. మృతుడి తండ్రి రమణయ్యకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పదేళ్ల కిందట భార్య రాగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాటి నుంచి ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ త్వరలోనే పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వేగం రూపంలో మృత్యువు ముంచుకొచ్చి పెళ్లీడుకొచ్చిన కొడుకుని మింగేసింది. తనకు ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇలా అకాల మృత్యువు బారిన పడడంతో ప్రసాద్ మృతదేహాన్ని చూసిన తండ్రి రమణయ్య విలవిల్లాడి పోయాడు. ఆ తండ్రి ఆవేదనను చూసి చూపరుల హృదయాలు సైతం ద్రవించాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగించారు. -
జామరైతు ఆలోచన అదుర్స్
సాక్షి, యడ్లపాడు: జామతోట సాగు చేసే రైతులకు పండుఈగతో బాధలెన్నో.. అందులోనూ థైవాన్రకం జామతోటలకు ఈ పండుఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. మొక్కకు ఉన్న కాయలు బాగా సైజు పెరిగి పండుదశకు చేరుకునే సమయంలో ఈగలు కాయ ల్లోకి జొరబడి పూర్తిగా పాడు చేస్తాయి. దీంతో థైవాన్ రకాన్ని సాగు చేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. మూడేళ్లగా పండుఈగతో ఇబ్బందులు.. మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటకు చెందిన కౌలు రైతు గడ్డం రామసుబ్బారావు 8 ఎకరాల్లో మూడేళ్ల నుంచి థైవాన్లోని రెడ్, వైట్ జామ రకాలను సాగు చేస్తున్నాడు. అయితే కాయ పక్వానికి వచ్చే సమయంలో ఆశిస్తున్న పండుఈగ నివారణకు తొలుత మలాథిన్ ద్రావణాన్ని వినియోగించాడు. అది కేవలం 24 గంటలు మాత్రమే పనిచేయడంతో రోజు మార్చి రోజు వీటిని చల్లడం పెట్టుబడి పెరిగిపోతుందని గ్రహించాడు. లింగాకర్షణ బుట్టల్ని తెచ్చి ఏర్పాటు చేశాడు. వీటి వల్ల 75శాతం పంటను కాపాడు కోగలిగానని తెలిపాడు. ఇవి 40 రోజులు మాత్రమే పని చేయడం, వర్షం కురిస్తే పనిచేయక ఒక్కసారిగా ఈగ ధాటి అధికమవ్వడంతో విసుగెత్తిపోయింది. ఆలోచన బాగుంది ఖర్చు తగ్గింది! ఆ అనుభవంలోంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది. ప్లాస్టిక్ పాలిథిన్ పలుచటి కవర్లను తీసుకువచ్చి పిందెలను అందులో ఉంచి పిన్నులు కొట్టాడు. అంతే ఇప్పుడు జామకాయలకు పండుఈగ నుంచి పూర్తిగా రక్షణ కల్పించగలిగినట్లు వెల్లడించాడు. ఇలా కవర్లు తొడిగినపుడు కాయపై అధికంగా అంటుకున్న కవర్లలోని కొన్ని కాయలు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా పెద్దగా పెట్టుబడి లేని ఈ నివారణ వల్ల మనశ్శాంతిగా ఉంటున్నట్టు చెబుతున్నారు. -
భార్యను కడతేర్చిన భర్త
సాక్షి, గుంటూరు : ప్రమాదవశాత్తు కాళ్లూ చేతులు విరిగి మంచానపడ్డ భర్తకు ఎన్నో సపర్యలు చేసి తిరిగి మామూలు మనిషిగా మార్చిన భార్యను భర్తే హతమార్చిన ఘటన కలకలం రేపింది. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీలో గురువారం సాయంత్ర ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నవ ఎస్సీ కాలనీకు చెందిన కాకర్లమూడి నాగేశ్వరరావుకు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన అనురాధ (23)తో 9 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. రాడ్‌బెండింగ్ పనులు నిర్వహించుకుని కుటుంబాన్ని పోషించుకునే నాగేశ్వరరావుకు కొంతకాలంగా మతిస్థిమితం ఉండటం లేదు. మొదట రాడ్‌బెండింగ్ పనుల్లో సంపాదించిన డబ్బులతో ఆటోను కొనుగోలు చేసి డ్రైవర్‌గా తిరిగాడు. ఫైనాన్స్‌లో తెచ్చిన ఆటోకు వాయిదాలు సక్రమంగా చెల్లించనందున ఫైనాన్స్ వారు దాన్ని తీసుకెళ్లారు. మళ్లీ ఫైనాన్స్‌తో మరోఆటోను తీసుకున్నాడు. అయితే దాని పరిస్థితి కూడా అదేవిధంగా మారడంతో తిరిగి రాడ్‌బెండింగ్ పనుల్లోకి వెళ్లడం మొదలెట్టాడు. పనులకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండటంతో ఫైనాన్స్లోనే బైక్‌ను కొనుగోలు చేశాడు. ఆదాయం అంతమాత్రంగానే ఉండటంతో కిస్తీలు చెల్లించక బైక్ ఫైనాన్స్ ఆఫీసుకే చేరింది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలోకి వచ్చి 2018లో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తిసాగు చేపట్టాడు. అందులోనూ నష్టాన్నే చవిచూశాడు. ఇలా జీవితంలో అప్పులు, నష్టాలనే కూడగట్టుకున్న నాగేశ్వరరావు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. ఆలోచనలు ఎక్కువై మతిస్థిమితం లేకుండా పోయింది. వింతగా ప్రవర్తించడంతో బంధువులు చేతబడి చేశారని భావించి భూతవైద్యుడిని పిలిపించి రూ.25వేల వరకు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. డాబాపై నుంచి ఒక్కసారిగా దూకేశాడు. కాళ్లు చేతులు తీవ్రంగా గాయపడిన భర్తను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. భార్య అనురాధ భర్త మామూలు మనిషి అయ్యేంత వరకు సేవలు చేసింది. హత్య జరిగిందిలా... గత 3, 4 రోజుల నుంచి దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పిల్లల్ని సైతం చంపేస్తానంటూ బెదిరించడంతో అనురాధ ఇద్దరు పిల్లల్ని బుధవారం తన పుట్టింటికి పంపించింది. గురువారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరూ కలిసి భోజనం చేసి మామూలుగానే ఉన్నారు. అయితే సాయంత్రం 3.30 గంటల మధ్యలో ఇంట్లో ఉన్న భార్యను మంచంపై పడేసి గుండెలపై కూర్చొని నోట్లో గుడ్డల్ని కుక్కి గొంతునులిమి చంపేశాడు. అనంతరం ఇంటి బయటకు వచ్చి నా భార్యను చంపేశానంటూ చెప్పడంతో అవాక్కైన స్థానికులు పరుగున వెళ్లి ఇంట్లో చూడగా అప్పటికే అనురాధ విగత జీవిగా పడిఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై జె.శ్రీనివాస్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. -
గుండె చెరువాయే..
సాక్షి, యడ్లపాడు: మండలంలోని బోయపాలెంలో 16 సుగాలీ కుటుంబాలతోపాటు వాల్మీకి బోయ, కాటిపాపలు, ముస్లింలకు చెందిన మరో 14 కుటుంబాలకు 1969లో గ్రామ సమీపంలోని వంకాయలపాడులో ఉన్న 28/ఎ ఇరిగేషన్ చెరువులో 30 ఎకరాలను సాగు నిమిత్తం ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పట్లో ఒక్కొక్కరికీ ఒక ఎకరం చొప్పున ఇవ్వడంతో వరి, పత్తి, వివిధ రకాల కూరగాయలు, చిరుధాన్యాలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. జన్మభూమి గద్దలు వాలాయి 2015 మే 16న రాత్రికి రాత్రే పచ్చని పొలాల్లో అక్రమంగా జన్మభూమి కమిటీ సభ్యులు మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇదేమని ప్రశ్నించేందుకు వచ్చిన వారిని మండలస్థాయి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. నీరు –చెట్టు పథకం కింద తవ్వకాలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. నేల తల్లితో తెగిపోతున్న బంధాన్ని తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్న వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. తమ జీవనాధారం పోయిందని, న్యాయం చేయాలని నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా ఉన్నతాధికారులను సైతం పలుమార్లు కలిసి వేడుకున్నారు. వారెవ్వరూ కనికరం చూపలేదు. నోటికాడ కూడు తీసేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏ నేరం చేశామని తమకు ఇంతటి శిక్ష విధించారో సమాధానం చెప్పాలంటూ ఎన్నికల వేళ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి కూడా అన్యాయం చేశారు పొలాన్ని తవ్వి మట్టి తీస్తుంటే ఆదుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబాన్ని వేడుకున్నాం. తప్పక న్యాయం చేస్తామన్నారు. ఇష్టానుసారంగా మట్టి తవ్వుకున్న వారికి మద్దతు ఇచ్చారుకానీ, వీధినపడ్డ మమ్మల్ని నేటికీ పట్టించుకోలేదు. ఉన్నపొలం పోయి ఇప్పుడు ఉన్నవ, బోయపాలెం రైతుల వద్ద 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. గులాబి పురుగుల దెబ్బతో పెట్టిన పెట్టుబడి రాకుండా పోయింది. పాలకులు, ప్రకృతి పేదలపై పగబడితే జీవించగలమా..!– దగ్గు కృష్ణమూర్తి, బాధితుడు వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులనే.. వైఎస్సార్ సీపీకి సానుభూతిదారులు కావడంతో కాలనీలోని 60 సుగాలీ కుటుంబాల్లో ఒక్కరికి కూడా సబ్సీడీ రుణాలు మంజూరు చేయలేదు. ఒక్కో ఇంట్లో నాలుగైదు కుటుంబాలున్నా సెంటు నివేశన స్థలం ఇవ్వలేదు. దశాబ్దాల కిందట ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇళ్లు కూలిపోతే కనీసం హౌసింగ్ లోన్ మంజూరు చేయలేదు. మరుగుదొడ్లు నిర్మించుకుంటే బిల్లులు రానివ్వరు. ప్రశ్నించే వారు లేరని ఎస్టీలపై ఇంతటి వివక్ష చూపుతారు? – వీ శ్రీనివాసనాయక్, వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం మండల కన్వీనర్ నోటికాడ కూడు లాక్కున్నారు ఎస్టీలకు సాగు చేసుకుని జీవించమంటూ ప్రభుత్వం 50 ఏళ్ల కిందట ఎకరం చొప్పున భూమిని పంపిణీ చేసింది. అప్పటి నుంచి దానిపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నాం. అప్పట్లో ఒక్క కుటుంబానికే ఇచ్చినా.. ఒక్కొక్క ఇంటిలో మూడేసి కుటుంబాలు ఉండేవి. వీరందరికీ ఆ ఎకరం భూమే ఆధారమైంది. ఆ భూముల్లో మట్టిదందా చేసి మా నోటికాడ కూడు తీసేశారు. ఇప్పుడు మేమెట్టా బతకాలో చెప్పండి. – వంకాడవత్ సాలమ్మబాయి, వృద్ధురాలు బతిమిలాడినా వదల్లేదయ్యా మా నాన్న బింజు నాగయ్య నుంచి పొలం హక్కు పొందాను. పొలం లేకపోతే దాదాపు అన్ని కుటుంబాలు రోడ్డున పడతాయంటూ అధికారులకు ఎంతగానో వేడుకున్నా వినలేదు. తవ్వకాలు ఆపాలని చూస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు. రాత్రికిరాత్రే తవ్వి పెద్ద పెద్ద గుంతలు చేశారు. మాపొలంలో పండించిన కూరగాయలు ఊళ్లో అమ్ముకునే వాళ్లం. ఇప్పుడు గుంటూరు నుంచి తెచ్చి అమ్మితే లాభాలేమీ రావడం లేదు. – గింజు బుల్లయ్య, బోయపాలెం పొలం లేక కూలీకి వెళ్లి గోతాలు కుడుతున్న సుగాలీ కాలనీ వాసి -
స్త్రీవాద ఉద్యమ పతాక ఓల్గా
ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెనాలి : ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. 1950 నవంబరు 27న గుంటూరు జిల్లాలోని యడ్లపాడులో జన్మించారు. ఆంధ్రా యూని వర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. 1973 నుంచి 86 వరకు, ఆ తర్వాత కొంతకాలం తెనాలి లోని వీఎస్ఆర్ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. మార్క్సిస్టు భావజాలం, రష్యన్ సాహిత్యం, ఫెమినిస్టు రచయితలు కొడవటిగంటి కుటుంబరావు, చలం రచనలు అధ్యయనం చేశారు. వారి ప్రభావంతో ఫెమినిస్టు దృక్పథంతో స్త్రీవాదం, సాహిత్యం అంశాలపై ఓల్గా కలం పేరుతో పత్రికలకు వ్యాసాలు రాయటం ఆరంభించారు. చర్చా వేదికల్లో పాల్గొంటూ వచ్చారు. చలం రచనలు చదవటమే కాదు, చివరి రోజుల్లో అన్నామలైలో ఉంటున్న చలంను ఆమె స్వయంగా కలుసుకున్నారు. అధ్యాపక వృత్తి తర్వాత హైదరాబాద్ వెళ్లి, ఉషాకిరణ్ మూవీస్‌లో స్క్రిప్టు విభాగంలో చేరారు. విమర్శల ప్రశంసలు, అవార్డులు పొందిన పలు సినిమాలకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. తర్వాత ‘తోడు’, ‘పాతనగరంలో పసివాడు’ సినిమాలకు సహాయ దర్శకత్వం వహించారు. కదంతొక్కిన కలం ... అనంతరం ఆమె పూర్తిస్థాయి రచయిత్రిగా, హక్కుల కార్యకర్తగా ఉద్యమస్థాయిలో పనిచేయడం ఆరంభించారు. ఈ క్రమంలో ప్రముఖ ఫెమినిస్టు వాలంటరీ ఆర్గనైజేషన్ ‘అస్మిత ’లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. మరోవైపు ఆమె కలం కదం తొక్కింది. ‘స్వేచ్ఛ’, ‘సహజ’, ‘మానవి’, ‘కన్నీటి కెరటాల వెన్నెల’, ‘గులాబీలు’ నవలలు రాశారు. చలం రచనల్లోని ఆరు స్త్రీ పాత్రలతో ‘వాళ్లు ఆరుగురు’ నాటకం రచించారు. ఆమె రాసిన కథలతో ‘రాజకీయ కథలు’, ‘ప్రయోగం’ వచ్చాయి. స్త్రీ దేహాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచించటం, రాజకీయం చేయడాన్ని ఈ కథలు ఎండగట్టాయి. ‘ఎవరైనా పురుష రచయిత ఒక ప్రేమకథ రాస్తే, ఎవరూ రంధ్రాన్వేషణ చేయరు...అదే ఒక రచయిత్రి రాస్తే, అది ఆమె సొంత ప్రేమకథేనా...? అందులో హీరో, ఆమె చుట్టూవున్న వ్యక్తుల్లో ఎవరయి ఉంటారు...అనుకుంటూ రచయిత్రి సొంత వ్యక్తిత్వాన్ని కించపరచేలా వ్యవహరిస్తారు’ అని ఓల్గా కుండబద్దలు కొడతారు. స్త్రీవాదం అంటే పురుష వ్యతిరేకం కాదనీ, పురుషుల మైండ్‌సెట్ మారాలనేదిగా చెబుతారు. ఓల్గా రచించిన దాదాపు అన్ని రచనలు, అనువాదాలను ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సేకరించింది. ప్రస్తుతం ఆమె నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు సలహామండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ‘కేవలం ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు...చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయకర్తలు అయినపుడే అది సాధ్యపడుతుంది’ అని రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి ఓల్గా స్పష్టంగా చెబుతారు. ఆమె రచించిన కథల సంపుటి ‘విముక్త’కు గురువారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. విద్యార్థి ఉద్యమాల నుంచి మార్క్సిస్టు భావజాలం, విప్లవ రచనా ఉద్యమం ప్రభావం ఉన్నా, ఆయా ఉద్యమాల్లోని లింగ వివక్ష ధోరణిపై మౌనంగా ఉండలేదు. సమాజంలోని ద్వంద్వ నీతి, ఫెమినిస్టు ఉద్యమంపై విదేశీ ప్రభావాన్ని చూసి, తానే స్వతంత్రంగా మహిళల హక్కుల కోసం పోరాడాలన్న భావనతో కృషిచేస్తున్నారు. ఫెమినిస్టు రచయిత్రిగా, మహిళా హక్కుల కార్యకర్తగా ఎదిగారు. -
బుల్లెట్.. ఫేవరేట్..
యడ్లపాడు, న్యూస్‌లైన్ :ఆ సౌండే వేరు.. ఆ లుక్కే వేరు.. దాన్ని నడుపుతుంటే వచ్చే కిక్కేవేరు.. అంటారు బుల్లెట్ నడిపేవారు. ద్విచక్రవాహనాల్లో రారాజు లాంటిదే ఈ బుల్లెట్ అని కితాబిచ్చేస్తారు. మూడు దశాబ్దాల కిందట బుల్లెట్ కొనడం గొప్పగా భావించేవారు. అది హుందాతనానికి ప్రతీక గా ఉండేది. తరం మారినా ఈ వాహనంపై మోజు తగ్గలేదు. పైగా నేటి యువత రాన్ని మరింత ఆకర్షిస్తోంది. ద్విచక్రవాహన కంపెనీలు ఈ వాహనాల ఉత్పత్తులను కూడా పెంచాయి. అదలా ఉంచితే.. సుమారు నాలుగు దశాబ్దాల కిందట తయారు చేసిన బుల్లెట్ ఎక్కడైనా కనిపిస్తే ఎంతో ఆసక్తిగా చూస్తాం. అప్పుడు కొన్న రాయల్ బుల్లెట్ ఓ వ్యక్తి ఇప్పటివరకు వాడుతున్నారు. తాను బుల్లెట్ అభిమానిని అని గర్వంగా చెప్పుకొంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నాపేరు లావు నర్శింహారావు. నాకు 72 సంవత్సరాలు. మాది యడ్లపాడు మండలంలోని జాలాది గ్రామం. భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నా యుక్తవయస్సులో అంతా మార్చురేస్ వాహనాలు ఎక్కువగా మార్కెట్లో లభించేవి. ఇవి ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి దిగుమతి అయ్యేవి. 1950 తర్వాత స్వదేశంలోనే బుల్లెట్ తయారీ ప్రారంభమైంది. ఆంధ్ర, మద్రాసు సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న సమయంలో మద్రాసులో ఎన్ఫీల్డ్ కంపెనీ ఆవిర్భావించింది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్, ఎజ్డీ జావాలను ఉత్పత్తి చేసేవారు. ఎజ్డీ జావా అయితే కేవలం 2.5 హార్స్పవర్, అదే రాయల్ బుల్టెట్ అయితే 3.5 హార్స్పవర్ ఉండేది. నా ఇరవైఏడేళ్ల వయసులో 1968 నవ ంబర్ 22న విజయవాడ పద్మజ కమర్షియల్ కార్పొరేషన్లో రాయల్ బుల్లెట్ కొన్నాను. అప్పటినుంచి ఇదే వాహనాన్ని నడుపుతున్నాను. ఇది వేగంతో పాటుగా ఎంతో సౌకర్యవంతంగా, హుందాతనంగా ఉంటుంది. అందుకే బుల్లెట్ ఫేవరేట్‌గా మారిపోయాను. వాహనం కొన్న మొదట్లో లీటరు పెట్రోలు కేవలం ముప్పావలా. ప్రస్తుతం రూ.82కు పెరిగింది. అందుకే కొంతకాలం క్రితం పెట్రోలు నుంచి డీజిల్ వాహనంగా మార్పు చేయించాను. ఎగుడుదిగుడు గ్రామీణ రోడ్లలో ఈ బుల్లెట్ ఎటువైపు వాలకుండా నిటారుగా ఉంటుంది. చిన్నచిన్న రాళ్లు టైరు కిందపడినా, బురదలో నడిపినా త్వరగా స్కిడ్ కాదు. ఎంతదూరం ప్రయాణించినా ప్రయాణ బడలిక, అలసట కన్పించదు. అందుకే రాయల్ బుల్లెట్.. నా ఫేవరేట్..! -
మద్యంపై సమరభేరి
ఉన్నవ (యడ్లపాడు), న్యూస్‌లైన్ :స్వాతంత్య్ర సమరంలోనూ ఉన్నవ గ్రామం స్ఫూర్తిదాయక పాత్ర పోషించింది. ఉన్నవ వెంకటప్పయ్య, వంకాయలపాటి శేషావతారం వంటివారు స్వరాజ్యం కోసం ఉద్యమించి జైలుశిక్షను అనుభవించారు. పల్నాటి పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి మహానుభావులను కన్న నేల ఇది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గ్రామ ప్రస్తుత జనాభా సుమారు ఏడు వేల మంది. ఐదేళ్లుగా గ్రామాన్ని మద్యం రక్కసి పీక్కుతింటోంది. దీంతో యువత మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. అందుకు చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ అండగా నిలిచారు. ఆ వీధిలోకి వెళ్లాలంటేనే హడల్... ఉన్నవ బస్టాండ్ సెంటర్లోని ప్రధాన రోడ్డు పక్కన మూడు బెల్టుషాపులు ఉన్నాయి. రద్దీగా ఉండే ఈ వీధిలో సాయంత్రమైతే మందుబాబులు చేరతారు. పొలం పనులు, మిల్లుల నుంచి వచ్చే మహిళా కూలీలు, పాల కేంద్రానికి వెళ్లేవారు, విద్యార్థినులు మందుబాబుల వికృత చేష్టలతో ఆ వీధిలో వెళ్లాలంటేనే హడలిపోయే పరిస్థితి. గ్రామంలో మరో రెండు బెల్టుషాపులు ఉన్నాయి. మద్యానికి బానిసలైన కొందరి వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మానసికంగా, ఆర్థికంగా చితికిపోతున్నాయి. గతంలో రచ్చబండ, ప్రజాపథం, రెవెన్యూ గ్రామ సదస్సుల్లో బెల్టుషాపులను తొలగించాలని మహిళలు కోరినా ఫలితం కనిపించలేదు. యువత నిరాహారదీక్ష.. మూడు నెలల కిందట గ్రామానికి చెందిన యువకులు బెల్టుషాపుల నిలిపివేతకు ఉద్యమం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. సంక్రాంతి పండగను ఎంచుకుని ఈ నెల 12 నుంచి 14 వరకు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ముందుగానే ఫేస్బుక్ వంటి సామాజిక వెబ్సైట్లో పెట్టి సలహాలు, సూచనలు స్వీకరించారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉన్నవ వాసులు మద్దతు పలకడంతో దీక్షకు శ్రీకారం చుట్టారు. గ్రామ యువకులు కుర్రా ప్రతాప్‌కుమార్, కాకుమాను విజయ్‌కాంత్, కుంచనపల్లి కుమార్‌బాబులు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టగా.. స్థానిక మహిళలకు మనోధైర్యాన్ని ఇచ్చారు. యువత ఉద్యమంతోనే తీర్మానాలు.. యువకుల పట్టుదలకు మెచ్చి మద్యం అమ్మకాలను గ్రామపరిధిలో చేయరాదంటూ పంచాయతీ పాలకమండలి, మర్రిపాలెం ప్రాథమిక సహకార సంఘం డెరైక్టర్, సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి మద్యరహిత గ్రామంగా చేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంతకాలను తీసుకుని శాశ్వతంగా తొలగించేలా చూడాలంటూ తీర్మానం చేశారు. దీంతో బెల్టుషాపులు మూతపడ్డాయి. పార్టీలకు, వర్గాలకతీతంగా తీసుకున్న తీర్మానంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను దగ్గరగా చూశాను.. మద్యానికి బానిసైనవారి కుటుంబాలను చాలా దగ్గరగా చూశాను. యువకులు మద్యనిషేధం కోసం దీక్షచేస్తుంటే పంచాయతీ మెంబర్లను అడిగాను. పార్టీలకతీతంగా మద్దతు పలికి తీర్మానం చేసేందుకు సహ కరించారు. తోటి మహిళల బాధలను అర్థం చేసుకోవడం గ్రామ ప్రథమ పౌరురాలిగా నాబాధ్యత అనిపించింది. - పత్తిపాటి బసవమ్మ, సర్పంచి