గుండె చెరువాయే.. | TDP Government Land Grabbed From The Farmers Under The Scheme oF Neeru- Chettu In Yadlapadu | Sakshi
Sakshi News home page

గుండె చెరువాయే..

Published Sat, Mar 16 2019 8:52 AM | Last Updated on Sat, Mar 16 2019 8:52 AM

TDP Government Land Grabbed From The Farmers Under The Scheme oF Neeru- Chettu In Yadlapadu - Sakshi

ప్రభుత్వం బోయపాలెం వాసులకు ఇచ్చిన పట్టాలను చూపుతున్న జనం (ఫైల్‌)

సాక్షి, యడ్లపాడు: మండలంలోని బోయపాలెంలో 16 సుగాలీ కుటుంబాలతోపాటు వాల్మీకి బోయ, కాటిపాపలు, ముస్లింలకు చెందిన మరో 14 కుటుంబాలకు 1969లో గ్రామ సమీపంలోని వంకాయలపాడులో ఉన్న 28/ఎ ఇరిగేషన్‌ చెరువులో 30 ఎకరాలను సాగు నిమిత్తం ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పట్లో ఒక్కొక్కరికీ ఒక ఎకరం చొప్పున ఇవ్వడంతో వరి, పత్తి, వివిధ రకాల కూరగాయలు, చిరుధాన్యాలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. 

జన్మభూమి గద్దలు వాలాయి
2015 మే 16న రాత్రికి రాత్రే పచ్చని పొలాల్లో అక్రమంగా జన్మభూమి కమిటీ సభ్యులు మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇదేమని ప్రశ్నించేందుకు వచ్చిన వారిని మండలస్థాయి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. నీరు –చెట్టు పథకం కింద తవ్వకాలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. నేల  తల్లితో తెగిపోతున్న బంధాన్ని తట్టుకోలేక కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్న వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. తమ జీవనాధారం పోయిందని, న్యాయం చేయాలని నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా ఉన్నతాధికారులను సైతం పలుమార్లు కలిసి వేడుకున్నారు. వారెవ్వరూ కనికరం చూపలేదు. నోటికాడ కూడు తీసేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏ నేరం చేశామని తమకు ఇంతటి శిక్ష విధించారో సమాధానం చెప్పాలంటూ ఎన్నికల వేళ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.

మంత్రి కూడా అన్యాయం చేశారు

పొలాన్ని తవ్వి మట్టి తీస్తుంటే ఆదుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబాన్ని వేడుకున్నాం. తప్పక న్యాయం చేస్తామన్నారు. ఇష్టానుసారంగా మట్టి తవ్వుకున్న వారికి మద్దతు ఇచ్చారుకానీ, వీధినపడ్డ మమ్మల్ని నేటికీ పట్టించుకోలేదు. ఉన్నపొలం పోయి ఇప్పుడు ఉన్నవ, బోయపాలెం రైతుల వద్ద 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. గులాబి పురుగుల దెబ్బతో పెట్టిన పెట్టుబడి రాకుండా పోయింది. పాలకులు, ప్రకృతి పేదలపై పగబడితే జీవించగలమా..!– దగ్గు కృష్ణమూర్తి, బాధితుడు

వైఎస్సార్‌ సీపీకి సానుభూతిపరులనే..

వైఎస్సార్‌ సీపీకి సానుభూతిదారులు కావడంతో కాలనీలోని 60 సుగాలీ కుటుంబాల్లో ఒక్కరికి కూడా సబ్సీడీ రుణాలు మంజూరు చేయలేదు. ఒక్కో ఇంట్లో నాలుగైదు కుటుంబాలున్నా సెంటు నివేశన స్థలం ఇవ్వలేదు. దశాబ్దాల కిందట ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇళ్లు కూలిపోతే కనీసం హౌసింగ్‌ లోన్‌ మంజూరు చేయలేదు. మరుగుదొడ్లు నిర్మించుకుంటే బిల్లులు రానివ్వరు. ప్రశ్నించే వారు లేరని ఎస్టీలపై ఇంతటి వివక్ష చూపుతారు? – వీ శ్రీనివాసనాయక్, వైఎస్సార్‌ సీపీ ఎస్టీ విభాగం మండల కన్వీనర్‌

నోటికాడ కూడు లాక్కున్నారు

ఎస్టీలకు సాగు చేసుకుని జీవించమంటూ ప్రభుత్వం 50 ఏళ్ల కిందట ఎకరం చొప్పున భూమిని పంపిణీ చేసింది. అప్పటి నుంచి దానిపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నాం. అప్పట్లో ఒక్క కుటుంబానికే ఇచ్చినా.. ఒక్కొక్క ఇంటిలో మూడేసి కుటుంబాలు ఉండేవి. వీరందరికీ ఆ ఎకరం భూమే ఆధారమైంది. ఆ భూముల్లో మట్టిదందా చేసి మా నోటికాడ కూడు తీసేశారు. ఇప్పుడు మేమెట్టా బతకాలో చెప్పండి. – వంకాడవత్‌ సాలమ్మబాయి, వృద్ధురాలు 

బతిమిలాడినా వదల్లేదయ్యా

మా నాన్న బింజు నాగయ్య నుంచి పొలం హక్కు పొందాను. పొలం లేకపోతే దాదాపు అన్ని కుటుంబాలు రోడ్డున పడతాయంటూ అధికారులకు ఎంతగానో వేడుకున్నా వినలేదు. తవ్వకాలు ఆపాలని చూస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు. రాత్రికిరాత్రే తవ్వి పెద్ద పెద్ద గుంతలు చేశారు. మాపొలంలో పండించిన కూరగాయలు ఊళ్లో అమ్ముకునే వాళ్లం. ఇప్పుడు గుంటూరు నుంచి తెచ్చి అమ్మితే లాభాలేమీ రావడం లేదు. – గింజు బుల్లయ్య, బోయపాలెం

పొలం లేక కూలీకి వెళ్లి గోతాలు కుడుతున్న 
సుగాలీ కాలనీ వాసి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement