సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రమాదవశాత్తు చెరువులో బైక్‌తో సహా పడి.. రాత్రంతా నిస్సాహాయంగా అక్కడే ఉండిపోయిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీ చెందిన రాజుపాలెం ప్రసాద్ (22) రాడ్‌బెండింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. ఈనెల 20వ తేదీన ఉన్నవకు వచ్చిన తన స్నేహితుడిని బైక్‌పై కొప్పర్రు గ్రామంలో విడిచి రాత్రి 11.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. కొప్పర్రు దాటి అరకిలోమీటరు దూరంలోకి రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. సమీపంలోని చెరువులోకి నేరుగా దూసుకెళ్లింది. చెరువులో పడ్డ ప్రసాద్ మీద బైక్ పడటంతో తిరిగి లేవలేకపోయాడు.
ప్రమాదం నుంచి రక్షించమని కోరేందుకు ఇరువురుకి ఫోన్ చేయగా అర్థరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ ఎత్తలేదు. చెరువు నీటిలో తడవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ప్రసాద్ రాత్రంతా చెరువులోనే బైక్ కింద నిస్సహాయంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ వైపుగా పొలం పనులకు వెళ్తున్న రైతులు గమనించి చెరువు నుంచి బయటకు తీశారు. వివరాలను అడిగి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించి, 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పెదనందిపాడు పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో ఉన్నవకు తీసుకువచ్చారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు')
ఆ తండ్రి బాధ తీర్చలేనిది..
మృతుడి తండ్రి రమణయ్యకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పదేళ్ల కిందట భార్య రాగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాటి నుంచి ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ త్వరలోనే పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వేగం రూపంలో మృత్యువు ముంచుకొచ్చి పెళ్లీడుకొచ్చిన కొడుకుని మింగేసింది. తనకు ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇలా అకాల మృత్యువు బారిన పడడంతో ప్రసాద్ మృతదేహాన్ని చూసిన తండ్రి రమణయ్య విలవిల్లాడి పోయాడు. ఆ తండ్రి ఆవేదనను చూసి చూపరుల హృదయాలు సైతం ద్రవించాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగించారు.
Comments
Please login to add a commentAdd a comment