మసాలా.. అదిరింది | CM YS Jagan To Launch ITC Global Spices Park In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మసాలా.. అదిరింది

Published Thu, Nov 10 2022 3:20 AM | Last Updated on Fri, Nov 11 2022 8:02 AM

CM YS Jagan To Launch ITC Global Spices Park In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రముఖ మల్టీ నేషనల్‌ కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్‌కమ్‌ పేరుతో గుంటూరులో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ఏర్పాటు చేసిన ఈ కంపెనీ.. తాజాగా రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌ను అందుబాటులోకి తేనుంది.

పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేసి, ఎగుమతి చేసే విధంగా గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌ను అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేసి ఎగుమతి చేయనుంది.

సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్‌ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి, వేగంగా విస్తరించింది.

సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్‌ బ్రాండ్‌ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. 
 
పల్నాడు, గుంటూరు జిల్లాల్లో రేపు సీఎం పర్యటన  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను ఉదయం 9.40 – 10.35 గంటల మధ్య ప్రారంభిస్తారు.

అనంతరం 11 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు మెడికల్‌ కళాశాలకు చేరుకుంటారు. ఈ కళాశాల ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం 1.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement