రాజకీయాల్లో రాజర్షి! | YSR Is The Rajarshi In Politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో రాజర్షి!

Published Mon, Jul 8 2019 9:27 AM | Last Updated on Mon, Jul 8 2019 9:44 AM

YSR Is The  Rajarshi In Politics - Sakshi

సాక్షి, గుంటూరు: నిస్వార్థం ఎంత గొప్పదో నిరూపించాడు.. నిశీధి మాటున వెలుగులు పంచాడు.. దాహార్తిని తీర్చగా జలసిరులను పొంగించాడు.. బీడు భూముల్లో పసిడి కాంతుల కోసం జలయజ్ఞం సంకల్పించాడు.. పేదవాడి గోడువిని గూడు నిర్మించాడు.. అనారోగ్యానికి ఆరోగ్యశ్రీతో వైద్యం చేశాడు..  కార్పొరేట్‌ విద్యను పేదలకు దాసోహమనిపించాడు.. ముగింపు లేని కథలా.. భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా.. మనుష్యులందు మహర్షిలా.. రాజకీయాల్లో రాజర్షిలా.. కీర్తిగడించాడు. చెరగని జ్ఞాపకాలను పంచి.. ప్రవేశపెట్టిన పథకాలకు వందేళ్ల ఆయుష్షునిచ్చి.. జనహృదయాల్లో నిలిచాడు. నేడు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి  సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

 వైఎస్సార్‌ జిల్లాపై చెరగని ముద్ర వేశారు. తొలి ఐదేళ్ల కాలంలో ఏకంగా 57 సార్లు జిల్లాలో పర్యటించారు. ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 2.26 లక్షల ఇళ్లు నిర్మించి గూడు లేని నిరుపేదకు ఆశ్రయం కల్పించారు. పులిచింతలతో డెల్టాను సస్యశామలం చేశారు. సాగర్‌ చివరి ఆయకట్టు వరకూ నీళ్లందించి పల్నాట ఫ్యాక్షన్‌ రక్కసిని రూపుమాపారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆ పార్టీ అడ్రస్‌ గల్లంతు చేసిన ఘణత వైఎస్‌కే దక్కింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 18 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రభుత్వ కూర్పులోనూ వైఎస్‌ జిల్లాకు పెద్ద పీట వేశారు. నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి జిల్లాను మిని కేబినెట్‌గా మార్చారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. 

12 మున్సిపాల్టీల్లో  వైఎస్సార్‌ మార్క్‌..

పొన్నూరు పట్టణంలో మున్సిపాల్టీ నూతన భవన నిర్మాణానికి దివంగత మహానేత వైఎస్సార్‌ రూ.1 కోటి నిధులను మంజూరు చేశారు. రూ.1 కోటి వ్యయంతో హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేశారు.

తెనాలి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.100 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకానికి 2009లో మహానేత శంకుస్థాపన చేశారు.  

మంగళగిరి పట్టణంలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ సీమాంధ్రలో ఎక్కడా లేని విధంగా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి వైఎస్సార్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఆయన మరణానంతరం పట్టించుకున్న నాథుడే కరువయ్యారు.

రాజీవ్‌ గృహకల్ప ద్వారా వెయ్యి మంది నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించేందుకు వైఎస్సార్‌ ప్రణాళిక రూపొందించి తొలి విడతలో 504 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఆయన అకాల మరణంతో రెండో విడత రాజీవ్‌ గృహకల్ప నిలిచిపోవడంతో 500 మంది నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది.

తాడేపల్లి పట్టణాన్ని కూడా మున్సిపాల్టీగా మార్చేందుకు వైఎస్సార్‌ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.40 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు.

గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మున్సిపాల్టీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత హయాంలో అప్పటి ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు గోవిందాపురం వద్ద కృష్ణానది నుంచి పిడుగురాళ్లకు రూ. 36 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. 

మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు బుగ్గవాగు రిజర్వాయర్‌ నుంచి మాచర్ల పట్టణానికి మంచినీటినందించే పథకానికి రూ.16 కోట్లతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే వైఎస్సార్‌ అకాల మరణంతో ఆ పథకం అంశం మురుగున పడింది. వైఎస్సార్‌ నగరబాట కార్యక్రమంలో మాచర్ల పట్టణానికి వచ్చి అడగకుండానే సిమెంట్‌రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశారు. 

సత్తెనపల్లి పట్టణంలో వైఎస్సార్‌ హయాంలో రూ.14.5 కోట్ల వ్యయంతో 120 ఎకరాలను కొనుగోలు చేసి మంచినీటి చెరువును తవ్వించారు. అంతేకాకుండా రూ. 20 కోట్ల నిధులతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు, ఓవర్‌హె డ్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశారు. 60 కి.మీ మేర పైప్‌లైన్‌ నిర్మాణం పట్టారు. మురికివాడల అభివృద్ధి కోసం రూ. 15.38 కోట్ల నిధులను అందించారు. 

చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్‌ హయా ంలో మురికివాడల అభివృద్ధి కోసం రూ. 16.74 కోట్ల నిధులను మంజూరు చేశారు. 2005లో మున్సిపల్‌ నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు, నిరుపేదలకు నివాస గృహాలు నిర్మించుకునేందుకు, ఇల్ల పట్టాలు ఇచ్చేందుకు రూ.8 కోట్లతో 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశారు.

నరసరావుపేట మున్సిపాల్టీలో మురుగు రోడ్లపైకి చేరకుండా శాశ్వత పరిష్కారం కోసం 2008లో మహానేత రూ.44 కోట్ల వ్యయంతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పథకానికి శంకుస్థాపన చేశారు. అంతే కాకుండా రూ.22 కోట్లతో చిలకలూరిపేట రోడ్డులో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, నిరుపేదలకు సొంతింటి కళ సాకరం అయ్యేందుకు రాజీవ్‌ గృహకల్ప వంటి కార్యక్రమాలు చేపట్టారు.

బాపట్ల పట్టణంలో వైఎస్సార్‌ హయాంలో మురుగునీరు సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ. 49 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి పథకాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా రూ. 2 కోట్ల వ్యయంతో నిరుపేదలకు రాజీవ్‌ గృహకల్ప పేరుతో గృహ సముదాయాలు నిర్మించారు.

దివంగత మహానేత వైఎస్సార్‌ వినుకొండ పట్టణాన్ని 2005లో మున్సిపాల్టీగా మార్చి రూ.30 కోట్లతో పట్టణంలో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టారు. పట్టణ ప్రజల దామార్తిని తీర్చేందుకు రూ.15 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. 

రేపల్లె పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.13 కోట్ల వ్యయంతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నిర్మించారు.

చివరి సంతకం కూడా రైతుల కోసమే
2009లో రెండో సారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌.. మరణానికి ముందు రోజు మిర్చి రైతులకు బీమా పరిహారం ఫైల్‌ పైనే సంతకం చేశారు. 2009 సెప్టెంబరు 1న వాతావరణ ఆధారిత బీమా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. వైఎస్‌ హెలికాఫ్టర్‌ ఎక్కే ముందు వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డికి ఈ విషయాన్ని గుర్తు చేయడంతో ఆ సమయంలో ప్రభాకరరెడ్డి గుంటూరు జిల్లా వ్యవసాయాధికారులతో వాతావరణ ఆధారిత భీమాతో రైతులకు రూ.22 కోట్లు పరిహారం అందించాలని సూచించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించేందుకు ముఖ్యమంత్రిగా ఆయన సంతకం చేశారు. 15వేల మంది రైతులకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఎకరాకు పరిహారం అందింది.

ఆరోగ్య శ్రీ ఇక్కడి నుంచే
నిరుపేదల పాలిటి అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే ఆయన ప్రారంభించారు. రాజీవ్‌ పల్లెబాట, ఇందిరమ్మ ఇళ్లు,  ఇందిర ప్రభ వంటి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఇక్కడే జరిగాయి.    

దేశంలో రెండో స్పైసెస్‌ పార్క్‌
భారతదేశంలోనే రెండో స్పైసెస్‌ (సుగంధ ద్రవ్యాల)పార్క్‌ను యడ్లపాడు మండలంలో ఏర్పాటు చేసిన ఘనత మహానేత వైఎస్‌కే దక్కుతుంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా కేంద్రం మూడు స్పైసెస్‌ పార్క్‌లను మంజూరు చేసింది. అందులో ఒక స్పైసెస్‌ పార్క్‌ను యడ్లపాడు మండలంలో ఏర్పాటు చేయడానికి వైఎస్‌ విశేష కృషి చేశారు. సుమారు రూ.1.5 కోట్లతో 124.79 ఎకరాల్లో ఈ పార్క్‌ను నిర్మించారు. కొండవీడు కోట అభివృద్ధికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. సుమారు రూ.100కోట్ల నిధులతో ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. అందులో భాగంగా 2007లో జులైలో రూ.5కోట్లతో కొండవీడుకోట పైకి ఘాట్‌రోడ్డు ఏర్పాటు కోసం నిధులను మంజూరు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement