
సెలవులకు సెలవ్ !
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అవలంబిస్తున్న విధానాలకు విద్యార్థులు బలవుతున్నారు. విద్యా సంవత్సరం పొడవునా తరగతి గదులకే పరిమితమవుతున్నారు. వారాంతపు సెలవులు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన సెలవులు సైతం ఇవ్వకుండా యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తున్నాయి. పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులను సైతం వదలడం లేదు. వేసవి సెలవుల అనంతరం నిర్వహించాల్సిన తరగతులను ఇప్పుడే ప్రారంభించేసి విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు.
ఇంటర్ తరగతులు ప్రారంభం
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం సీనియర్, జూనియర్ ఇంటర్ తరగతులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మార్చిలో పరీక్షలు రాసిన ప్రథమ సంవత్సర విద్యార్థులకు సీనియర్ ఇంటర్ తరగతులను ప్రారంభించేశారు. టెన్త్ ప్యాసైన విద్యార్థులను అప్పుడే కళాశాలల్లో చేర్చుకోవడం మొదలు జూనియర్ ఇంటర్ తరగతులను కూడా ప్రారంభించేశారు.
తీవ్ర ఆందోళనలో విద్యార్థులు
ఏడాది పొడవునా మార్కులు, ర్యాంకుల పేరుతో సెలవుల ఊసే లేకుండా కళాశాలకే పరిమితమైన విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వడం లేదు. రెగ్యులర్‌గా తరగతులను నిర్వహించడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు జేఈఈ అడ్వాన్స్‌డ్, ఏపీ ఈఏపీసెట్, తదితర ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు తరగతులు నిర్వహిస్తున్నాయి. బైపీసీ విద్యార్థులను నీట్‌కు సన్నద్ధం చేస్తూ జూనియర్, సీనియర్ ఇంటర్ తరగతులను సైతం నిర్వహిస్తున్నాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం 2025–26 విద్యాసంవత్సరానికి జూన్ ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన తరగతులను వేసవి సెలవుల్లోనే నిర్వహించేస్తున్నాయి. వేసవిలో తీవ్రమైన ఎండల నడుమ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా తరగతుల నిర్వహణతో విద్యార్థులు అల్లాడుతున్నారు. జైళ్లలో ఖైదీలుగా మగ్గుతున్నారు.
విద్యార్థులపై చదువుల ఒత్తిడి వేసవి సెలవులకు ఎగనామం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యం టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు జూనియర్ ఇంటర్ తరగతుల నిర్వహణ జూనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సీనియర్ ఇంటర్ తరగతులు వేసవి ఎండల తీవ్రతతో క్లాస్ రూముల్లో అల్లాడుతున్న విద్యార్థులు ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు
సప్లిమెంటరీ పరీక్షల పేరుతో తరగతుల నిర్వహణ
ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు మే 12 నుంచి 20 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల పరిధిలో పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులను ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తరగతుల పేరుతో మిగిలిన విద్యార్థులకు సైతం రెగ్యులర్ గా తరగతులను నిర్వహిస్తున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు మినహా మిగిలిన వారికి సెలవులు నిర్వహించేందుకు వీల్లేదని బోర్డు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు సెలవులుగా పరిగణించాల్సి ఉందని ఇంటర్మీడియెట్ విద్య ఆర్‌ఐవో జీకే జుబేర్ స్పష్టం చేశారు. సప్లిమెంటరీకి హాజరయ్యే విద్యార్థులు మినహా మిగిలిన వారికి రెగ్యులర్ తరగతులు నిర్వహించేందుకు వీల్లేదని, ఆ విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వ పర్యవేక్షణలోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.