
ఇద్దరు చిన్నారులకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం
తాడికొండ / తెనాలి : జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామానికి చెందిన 12 ఏళ్ల తోకల సంవేద్ బాబు విజయవాడలోని హల్లేల్ మ్యూజిక్ స్కూల్‌లో కీబోర్డ్ ప్లేలో శిక్షణ పొందాడు. 2024లో డిసెంబర్ 1న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు నిర్వహించిన కీబోర్డ్ ప్లేయింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. 50 సెకన్ల వ్యవధిలో సరళీ స్వరాలను స్పష్టంగా, అత్యంత వేగంగా పలికించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు యాజమాన్యం అవార్డు ప్రకటించి మెడల్, సర్టిఫికెట్ అందజేసింది. గత ఏడాది మే 31న ఇన్ జీనియస్ చాంప్స్ వరల్డ్ రికార్డ్‌లో కూడా సంవేద్ బాబు స్థానం సంపాదించడం విశేషం.
● తెనాలి పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల నిశ్శంకరరావు అభిషేక్ గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. గతేడాది డిసెంబరు ఒకటిన హల్లేల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా ప్రపంచస్థాయిలో 18 దేశాల నుంచి 1100 మంది విద్యార్థులు సంగీత ప్రదర్శనలో పాల్గొన్నారు. కీ బోర్డు వాయిద్యంలో అభిషేక్‌తోపాటు మొత్తం 1046 మందిని ఎంపికచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ చర్చిలో శుక్రవారం జరిగిన అభినందన సభలో మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుడు అగస్టీన్ దండింగ నుంచి అభిషేక్ గిన్నిస్ సర్టిఫికెట్, జ్ఞాపికను అందుకున్నాడు. స్థానిక కేకేఆర్ గౌతమ్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు.

ఇద్దరు చిన్నారులకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం